ఆంట్రప్రెన్యూర్, యాక్టర్, బుక్ రైటర్, ట్రాన్స్‌జెండర్...

తాను అబ్బాయినా.. అమ్మాయినా అని గంద‌ర‌గోళ ప‌డిన 16 ఏళ్ళ అబ్బాయి సుబ్ర‌హ్మ‌ణ్యానికీ, ఇప్ప‌టి క‌ల్కికి ఎక్క‌డా పోలిక లేదు. పాజిటివ్ దృక్ప‌థం, ఆత్మ‌విశ్వాసం.. ఆమెను జీవితంలో అనేక క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాయి. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాల‌ను తీసుకోగ‌లిగింది. త‌న గురించి తానే అయోమ‌యంలో వున్న ఓ కుర్రాడు.. హీరోయిన్‌గా ఎద‌గ‌గ‌లిగిన‌ప్పుడు ఈ ప్ర‌పంచంలో ఏదైనా ఎవ‌రికైనా సాధ్య‌మే. ఆత్మ‌విశ్వాసం, ధైర్యం ఈ రెండూ వుంటే దేన్నైనా సాధించొచ్చు.. అంటారామె.

ఆంట్రప్రెన్యూర్, యాక్టర్, బుక్ రైటర్,  ట్రాన్స్‌జెండర్...

Thursday July 23, 2015,

3 min Read

క‌ల్కి .. ప‌ద‌హారేళ్ళ‌కే అత‌ని నుంచి ఆమెగా మారింది. కుటుంబాన్ని ఒప్పించింది. స‌మాజాన్ని ఎదిరించింది. జీవితాన్ని గెలిచింది. క‌విగా, న‌టిగా, వ్యాపార‌వేత్త‌గా, స‌మాజంలో త‌న లాంటి వారి అభ్యున్న‌తికి కృషి చేస్తున్న ఉద్య‌మ‌కారిణిగా త‌న ఉనికిని ప‌రిపరివిధాలుగా ప‌రిమ‌ళింప‌జేసుకుంటోంది.

కల్కి సుబ్రహ్మణ్యం

కల్కి సుబ్రహ్మణ్యం


క‌ల్కి సుబ్ర‌హ్మ‌ణ్యం.. ఆమె ఎవ‌రు .. అంటే చాలా చెప్పాలి.. ఒక న‌టి, ర‌చ‌యిత‌, ట్రాన్స్‌జెండ‌ర్ ఉద్య‌మ‌క‌ర్త‌, ఆంట్ర‌ప్ర‌న్యూర్.. మనం చెప్ప‌డం స‌రే.. ! మీరేంటి ? అని ఆమెనే అడిగితే, .. ''క‌ల్కి అంటే లింగ‌వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా ట్రాన్స్‌జెండ‌ర్ హ‌క్కుల కోసం పోరాడే ఓ మ‌హిళ. అత్యాధునిక ఫ్యాష‌న‌బుల్ అమ్మాయిగా క‌న‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ, హృద‌యం మాత్రం ఓ ప‌ల్లెటూరి అమ్మాయిదే. మంచి ఆర్టిస్టు, కానీ స‌క్సెస్‌ఫుల్ ఆంట్ర‌ప్ర‌న్యూర్ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. వంట‌రాదు..కానీ మంచి క‌విత్వం చెప్తుంది. కోప‌మెక్కువ‌.. అంతలోనే ప‌ర‌ధ్యానం.. త‌ల‌పైపెట్టుకున్న క‌ళ్ళ‌ద్దాల కోసం ఇల్లంతా వెతుక్కుంటుంది''.. అంటూ తన గురించి తాను చెప్తుంది కల్కి.

ట్రాన్స్‌జెండ‌ర్స్ అంటే స‌మాజంలో వున్న స్థిర‌ప‌డిపోయిన అభిప్రాయాల‌ను చెరిపేసి , అస‌లు ట్రాన్స్‌జెండ‌ర్ గా వున్నందుకు సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నిరూపించ‌డ‌మే క‌ల్కి ఎదుర్కొన్న మొద‌టి స‌వాలు. మిగిలిన వాళ్ళ‌లాగే, మేం కూడా ఈ దేశానికి, స‌మాజానికి మా వంతు సేవ చేయ‌గ‌ల‌మ‌ని ఆమె అంటారు.

ఇదొక్క‌టే కాదు, ఈరోజు తానున్న‌ స్థానానికి చేరుకోడానికి క‌ల్కి చాలా అడ్డంకులే ఎదుర్కొన్నారు. ముందు త‌న స్థితిని తాను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప‌ద‌హారేళ్ళ‌కు ఆమె ఎదుర్కొన్న‌వైరుథ్యాలు అత్యంత క్లిష్ట‌మైన‌వి. ఒక‌వైపు శ‌రీరం మ‌గాడినంటుంది.. మ‌న‌సు స్త్రీత్వాన్ని కోరుకుంటుంది. స్కూల్లో చ‌దువుకుంటున్న ఆ రోజులు ఆమె జీవితంలోనే అత్యంత కీల‌క‌మైన రోజులు.

ఆ కౌమార ద‌శ నుంచి ప్ర‌పంచం కోరుకుంటున్న‌ట్టు తానో మ‌గాడిగా ఎద‌గ‌డం లేద‌న్న వాస్త‌వం జీర్ణించుకోవ‌డం అంత తేలికేం కాదు. త‌న వ్య‌క్తిత్వంలో వ‌స్తున్న మార్పుల‌ను కుటుంబం ఎలా అర్థం చేసుకుంటుందో తెలియ‌క చాలా సార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని కూడా అనుకుంది.

ఒక‌రోజు ధైర్యాన్ని కూడ‌దీసుకుని లైంగికంగా తానెదుర్కొంటున్న‌క‌ష్టాన్ని త‌ల్లిదండ్రుల ముందుంచింది. అంతే. వాళ్ళు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. త‌న భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో అని భ‌య‌ప‌డ్డారు. వాళ్ళ బాధ చూసి క‌ల్కి చ‌లించిపోయింది. త‌న‌ని తానుగా వ‌దిలేస్తే, కుటుంబ గౌర‌వం నిల‌బెడ‌తాన‌ని త‌ల్లిదండ్రుల‌కు మాటిచ్చింది. వాళ్ళు చివ‌రికి ఒప్పుకున్నారు. అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చుకుని క‌ల్కి కూడా త‌న మాట నిల‌బెట్టుకుంది.

image


క‌ల్కి సాధించిన విజ‌యాలు ఒక‌టి రెండు కావు. ఒకసారి ఓ ఫ్రెండు త‌న మ్యూజిక‌ల్ ఇన్స్‌ట్రూమెంట్స్ ని అమ్మి పెట్ట‌మ‌ని అడిగిన‌ప్పుడు క‌ల్కిలో వున్న ఆంట్ర‌ప్ర‌న్యూర్ బ‌య‌టికొచ్చింది. ఆ పరికరాలను ఆన్‌లైన్లో అమ్మ‌డం మొదలు పెట్టింది. అప్పుడే 'బ్రాండ్ క‌ల్కి ఎంట‌ర్ప్రైజ‌స్' పుట్టుకొచ్చింది. 

"నేను సంపాదించ‌డం మొద‌లు పెట్టాను. నాకు వస్తున్న లాభాలు చూసి చాలా ఎగ్సైట్ అయ్యాను. ఈ రోజు కూడా మా బిజిన‌స్ చాలా బావుంది. మా ఫ్రెండ్ ఈ బిజినెస్ ప‌ని మీద దేశ‌మంతా తిరుగుతున్నాడు.. అంటున్నారు క‌ల్కి.

అక్క‌డితో ఆగ‌లేదు తను. త్వ‌ర‌లో ఆమె స్వ‌చ్ఛ‌మైన‌, ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం క‌లిగించ‌ని ఆర్గానిక్ స‌బ్బులు, ఇత‌ర‌త్రా హెల్త్ కేర్ ఉత్పత్తుల‌తో క‌ల్కి ఆర్గానిక్స్ అనే కొత్త వెంచ‌ర్‌ను మొద‌లుపెడుతున్నారు.

క‌ల్కి ఇంగ్లిష్, త‌మిళ్‌లో బాగా రాస్తారు. గ‌త ప‌దేళ్లుగా ఆమె ట్రాన్స్ జెండ‌ర్స్ హ‌క్కుల కోసం అనేక ర‌చ‌న‌లు చేసారు. ఆమెకు క‌విత్వం అంటే కూడా ఇష్టం. ఈ మ‌ధ్యే ఆమె క‌విత‌ల సంక‌ల‌నం కురి అరితియ‌న్ (మ‌ర్మాంగాన్ని క‌త్తిరించుకున్నాను) ను ఆవిష్క‌రించారు.

నాలాంటి విభిన్న మ‌హిళ‌ల జీవితాల‌ను ఆవిష్క‌రించే బ‌ల‌మైన అభివ్య‌క్తి ఈ క‌విత‌ల్లో క‌నిపిస్తుంది. ఈ నా మొద‌టి క‌వితా సంక‌ల‌నానికి మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింది. త్వ‌రలో నా ఇంగ్లీష్ సంక‌ల‌నాన్ని, త‌మిళంలో రెండో క‌వితా సంక‌ల‌నాన్ని తీసుకురావాల‌నుకుంటున్నాను.. అని చెప్పారు క‌ల్కి.

భార‌త‌దేశంలో ఇలాంటి వాళ్లంతా క‌నీస గౌర‌వం కోసం, స‌మాజం ఆమోదం కోసం.. అన్నిటికీ మించి బ‌తుకుతెరువుకోసం పోరాడుతున్నారు. చాలా మందిని ఇంటి నుంచి త‌రిమేస్తారు. వారికి చ‌దువు వుండ‌దు. ఇల్లు, వాకిలి..వుండ‌వు. జ్వ‌ర‌మో జ‌బ్బో వ‌స్తే చూసే నాధుడు వుండ‌డు. అస‌లు రేప‌టి మీద న‌మ్మ‌కం లేకుండా బ‌తుకీడ్చాలి. అందుకే ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు చ‌ట్ట‌ప‌రంగా గుర్తింపు కోసం క‌ల్కి ప్ర‌స్తుతం పోరాడుతున్నారు. వారి హ‌క్కుల కోసం ఓ వైపు న్యాయ‌స్థానాల్లో పోరాడుతూనే, మ‌రో వైపు విద్యా సంస్థ‌ల్లో ట్రాన్స్‌జెండ‌ర్లు స్వేచ్ఛ‌గా ఎలాంటి వివ‌క్ష లేని వాతావ‌ర‌ణంలో చ‌దువుకునే ప‌రిస్థితుల‌కోసం ఉద్యమిస్తున్నారు. సామాజిక‌, న్యాయ‌, ఆర్ధిక రంగాల్లో వాళ్ల హ‌క్కుల కోసం పోరాడుతున్న స‌హోద‌రి ఫౌండేష‌న్ తో క‌లిసి క‌ల్కి ఇప్పుడు ప‌నిచేస్తున్నారు. 

''నేను అంద‌రిలాంటి దాన్ని కాను. అయినా.. ఎవ‌రికంటే త‌క్కువ కాను. ఎప్ప‌టిక‌ప్పుడు, అంద‌రికంటే మెరుగ్గా, మ‌రింత ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. జీవితంలో ప్ర‌తిక్ష‌ణం ఏదో ఒక‌టి నేర్చుకుంటాను'' అని త‌న జీవిత ల‌క్ష్యాన్ని చెప్తారు క‌ల్కి.

2009లో ఆమె ట్రాన్స్‌జెండ‌ర్ల కోసం ఒక మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2011 లో న‌ర్త‌కి అనే ఓ త‌మిళ సినిమాలో క‌ల్కి న‌ట‌న‌ ఇటు త‌మిళ నాడులోనే కాక‌, ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది.

జీవితంతో అనుక్ష‌ణం క‌ల్కి జ‌రుపుతున్న పోరాటంలో ఆమె కుటుంబం, స్నేహితులు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆమెకున్న అస‌మాన ధైర్యంతో విధిని తిట్టుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని గ్ర‌హించారు. క‌ష్టాలొచ్చిన‌ప్పుడు ఎదురొడ్డి నిలబ‌డాలి. వైఫ‌ల్యాల వ‌ల్ల నిరాశ రాదు. ప‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌డానికి భ‌య‌ప‌డ‌డం వ‌ల్ల నిస్పృహ వ‌స్తుంద‌ని క‌ల్కి అంటారు.

image


కుటుంబం ఇచ్చే ప్రేమానురాగాల‌తో పాటు, క‌ల్కి చ‌దివిన పుస్త‌కాలు కూడా ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. నేను చ‌దువుకున్న పుస్త‌కాల వల్ల వ‌చ్చిన విజ్ఞాన‌మే నా జీవితానికి పునాదిగా మారింద‌ని ఆమె గ‌ర్వంగా చెప్తారు.

క‌ల్కి రాసిన మ‌రో త‌మిళ క‌విత విధి యెళుత్తినేన్ ( నేను రాసిన విధి).. ఇప్పుడు బిష‌ప్ హెబెర్ కాలేజి లో పాఠ్యాంశంగా మారింది. ఇది ఆమె కీర్తికిరీటంలో ఓ క‌లికితురాయి. ఆమె మాత్రం విన‌మ్రంగా.. నేను నేనుగా వుండడ‌మే నాకు గ‌ర్వంగా వుంటుంద‌ని చెప్తారు.