డయల్ 1100 పెట్టిన తర్వాత లంచం డబ్బలు తిరిగి ఇచ్చేస్తున్నారు..

డయల్ 1100 పెట్టిన తర్వాత లంచం డబ్బలు తిరిగి ఇచ్చేస్తున్నారు..

Tuesday June 13, 2017,

2 min Read

చేయి తడిపితే గానీ పని జరగదు. మొదట్నుంచీ గవర్నమెంట్ ఆఫీసుల మీద జనాల్లో ఉన్న అభిప్రాయం ఇది. నిజాయితీగా పనిచేసేవాళ్లు ఉండవచ్చుగాక, ఎటొచ్చీ అవినీతిపరుల వల్లనే వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. వ్యవస్థాపరంగా ఉన్న లొసుగులను, అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని అధికారులు అమ్యామ్యాలకు అలవాటుపడిపోయారు. జనం కూడా పనికావాలంటే తప్పదు మరి అన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇలాంటి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించాంటే ప్రభుత్వ అధినేతలు ఏదో ఒక డేర్ స్టెప్ తీసుకోకతప్పదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కరప్షన్ నిర్మూలించడానికి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు.

image


కర్నాటక తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న రాష్ట్రంగా ఏపీ చెడ్డపేరు తెచ్చుకుంది. ఈ చెడు వ్యవస్థను రూపుమాపాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు డయల్ 1100 ప్రవేశపెట్టారు. ఎవరు లంచం అడిగినా 1100కి ఫోన్ చేయండి అని నిర్మొహమాటంగా చెప్పారు. అనుకున్నట్టే ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. లంచం పుచ్చుకున్న ఆఫీసర్ జాగ్రత్తగా డబ్బు తిరిగి ఇచ్చేసి వెళ్తున్నాడు. ఇప్పటిదాకా 12 మంది ఆఫీసర్లు లంచం ఇచ్చిన వ్యక్తుల ఇంటికి వచ్చి వాళ్లవి వాళ్లకు ముట్టజెప్పారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒక పంచాయతీ సెక్రటరీ పదిమంది దగ్గర వేర్వేరు కారణాలతో లంచం తీసుకున్నాడు. ఎప్పుడైతే డయల్ 1100 పెట్టారో.. వెంటనే పదిమంది ఇళ్లకూ వెళ్లి పైసలు వాపస్ ఇచ్చేశాడు. గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనూ కొందరు ఆఫీసర్లు లంచం డబ్బులు తిరిగి ఇచ్చేశారట.

డయల్ 1100కి ఊహించని స్పందన వస్తోంది. ఇప్పుడు అధికారులు లంచం అనే మాట ఎత్తుతేనే హడలిపోతున్నారు. తీసుకున్న డబ్బుని తిరిగి పువ్వుల్లో పెట్టి ఇస్తున్నారు. ఈ పరిణామం హర్షణీయం అని సీనియర్ బ్యూరోక్రాట్స్ అంటున్నారు.

క్షేత్రస్థాయిలో లంచాన్ని నిర్మూలించడానికి ఒక ఆయుధం దొరికింది ప్రభుత్వానికి. తర్వాత స్టెప్ ఏంటన్నది సర్కారు ఆలోచిస్తోంది. కంప్లయింట్ చేయకుండా మేనేజ్ చేసేవాళ్ల భరతం పట్టాలని, అలాంటి వారికోసం ఇంకో సాహసోపేత నిర్ణయం తీసుకోవాలని పలువురు సీనియర్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న డేరింగ్ స్టెప్ వ్యవస్థలోని చీడపురుగుల్ని ఏరివేస్తోందనడంలో సందేహం లేదు.