సంకలనాలు
Telugu

అనంత విశ్వంపై పట్టుసాధించి ఆకాశానికే లాయర్ అయ్యాడు!

team ys telugu
11th Jul 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అందరూ సాఫ్ట్ వేర్ వెంట పరుగులు తీస్తుంటే.. అతను డిఫరెంట్ గా ఆలోచించాడు. అనంతమైన విశ్వాన్నే తన కెరీర్ గా మార్చుకున్నాడు. ఆకాశం మీద పట్టు సాధించాడు. ఖగోళ చట్టాన్ని ఔపోసన పట్టాడు. ఇప్పుడతను స్పేస్ లాయర్. అంతకుమించి హైదరాబాదీ.

image


దేశాలకు దేశాలకు మధ్య చట్టాలున్నట్టే , ఈ అనంత విశ్వానికి కూడా ఒక చట్టముంది. అదే స్పేస్ లా! ప్రస్తుతం డిమాండ్ ఉన్న డిఫరెంట్ ఫీల్డ్ ఇది. అతి తక్కువగా ఉన్న స్పేస్ లా నిపుణుల్లో శిరీష్ పల్లికొండ ఒకరు. హైదరాబాదులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు. అనంతరం హెచ్ఏఎల్ లో డిజైన్ ఇంజినీర్ గా కెరీర్ మొదలైంది. ఆరేళ్లు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ పైలట్ (యూఏవీపీ)గా ఉన్నాడు. ఇదే రంగానికి సంబంధించి కొన్నాళ్లు మార్కెటింగ్ డిపార్టుమెంటులో పనిచేశాడు. ఆ టైంలోనే సొంతంగా ఒక యూఏవీని తయారు చేయాలనుకున్నాడు. అంతా ప్లాన్ చేసుకున్నాక ఆ టెక్నాలజీ మన దగ్గర లేదని తెలిసింది. ఇంపోర్ట్ చేసుకుందామంటే దానికి ఒక చిక్కుంది. అందుకోసం ఇతర దేశాలతో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది.

అయితే 2004-05 సమయంలో ఇండియాకు సభ్యత్వం లేదు. దాంతో యూఏవీ టెక్నాలజీ దిగుమతి కష్టమైంది. చట్టం అడ్డుగోడగా మారింది. లా మీద అవగాహన ఉంటేగానీ పని జరగదు అనుకున్నాడు శిరీష్. సమస్యలో నుంచే పరిష్కారం వెతుకున్నాడు. ఫ్రాన్స్ వెళ్లి స్పేస్ లా చదివాడు. ఆ రంగం మీద గట్టి పట్టు సాధించాడు. ఇప్పుడతను ఇస్రోకు స్పేస్ లాయర్. ఒకసారి లీగల్ ఎంటిటీని అర్థం చేసుకుంటే సాధ్యంకానిదంటూ ఉండదంటాడు శిరీశ్ పల్లికొండ. అదృష్టం కొద్దీ ఇండియా కూడా గతేడాదే ఎంటీసీఆర్ అగ్రిమెంట్ పై సంతకం చేసింది కాబట్టి.. ఇక మనమే సొంతంగా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ తయారు చేసుకోవచ్చంటున్నాడు.

ఇంతకూ స్పేస్ లా అంటే ఏంటి?

ఉదాహరణకు బీహార్ లో మద్యనిషేధం ఉంది. ఆ పక్క రాష్ట్రంలో బ్యాన్ లేదు. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టం ఉన్నట్టే కదా. అలాగే ఆకాశానికి కూడా ఒక చట్టం ఉంటుంది. ఎగ్జాంపుల్ మూన్ రాక్స్ కేసునే తీసుకుంటే.. 1969లో చంద్రుడి మీద అడుగు పెట్టిన మనిషి.. అక్కడి నుంచి కొన్ని రాళ్లు తీసుకొచ్చాడు. ఇక్కడ ఆ రాళ్లను ఎవరో దొంగిలించారు. దానిపై కేసు పెట్టారు. అయితే విచిత్రంగా దొంగతనం చేసిన వ్యక్తికే అనుకూలంగా తీర్పొచ్చింది. అంతర్జాతీయ న్యాయ శాస్త్రం ప్రకారం విశ్వానికి సంబంధించిన వస్తువులపై హక్కు అందరికీ వుంటుంది. అవి ఏ ఒక్కరి సొత్తూ కాదు. కాబట్టే రాళ్లు చోరీ చేసిన వ్యక్తి కేసు గెలిచాడు.

ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆకాశంలో రెండు దేశాల శాటిలైట్లు ఢీకొన్నాయి అనుకుందాం. దాంతో పెను విధ్వంసం జరిగింది. దీనివల్ల మిగతా దేశాల శాటిలైట్లు కూడా దెబ్బతిన్నాయి. దానికి నష్టపరిహారం, వగైరా వగైరా ఎవరు నిర్ణయించాలి. కాబట్టి ఇక్కడా న్యాయశాస్త్రం అవసరమవుతుంది. ఇలా ఎవరు పడితే వాళ్లు విశ్వాన్ని శాసించకుండా స్పేస్ లా అనేది నిరోధిస్తుంది.

తెలంగాణలో స్పేస్ లాకు మంచి స్కోప్ ఉందంటున్నాడు శిరీష్ పల్లికొండ. ఎందుకంటే, ఎరోనాటికల్ కాలేజీలు హైదరాబాదులోనే ఎక్కువ. పైగా ఇక్కడ డీఆర్డీవో, ఎన్‌ఆర్ఎస్ఏ కూడా ఉన్నాయి. కాకపోతే స్పేస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఒక్కటి మనకు లేదు. దానికితోడు స్పేస్ లా మీద జనాలకు కూడా పెద్దగా అవగాహన లేదు. స్పేస్ ఇండస్ట్రీలో ఆంట్రప్రెన్యూర్ షిప్ కు వాల్యూ కల్పిస్తే.. హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలుస్తుందంటున్నాడు శిరీష్.

స్పేస్ లా చదవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాడు శిరీష్. కోర్సు పూర్తి చేసిన వారికి బోలెడు అవకాశాలున్నాయని చెప్తున్నాడు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఇందులో వర్క్ ప్రెజర్ తక్కువ, ఆదాయం ఎక్కువ. ఈ ఫీల్డ్ లో ప్రొఫెషనల్స్ కూడా తక్కువ కాబట్టి, ఇండస్ట్రీ బాగా రన్ అవుతుందని చెప్తున్నాడు.

ఇకపోతే స్పేస్ లా చదవడానికి అమెరికా, ఫ్రాన్స్ దాకా పోవాల్సిన పనిలేదు. నల్సర్ యూనివర్సిటీ తాజాగా ఏవియేషన్ అండ్ స్పేస్ లా కోర్సులను ప్రారంభించింది. మొత్తం నాలుగు కోర్సులు ఉన్నాయి. ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఏవియేషన్ అండ్ స్పేస్ లాను కూడా ఏర్పాటు చేశారు. ఆధునిక ఖగోళ అవసరాలు తీర్చే నిపుణులను తయారు చేయడమే వీటి ఉద్దేశం. శిరీష్‌ పల్లికొండ స్ఫూర్తిగా యువత ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి ఎంటరవుతోంది. ముందు ముందు స్పేస్ లాకు మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags