ఆడపిల్లల చదువు కోసం స్టార్టప్ 5K రన్! పెద్ద మనసుతో ముందుకొచ్చిన హైదరాబాద్ స్టార్టప్స్ !!

ఆడపిల్లల చదువు కోసం స్టార్టప్ 5K రన్! పెద్ద మనసుతో ముందుకొచ్చిన హైదరాబాద్ స్టార్టప్స్ !!

Friday January 29, 2016,

2 min Read

ఏదో ఒక సండేరోజు 5K రన్..10K రన్‌ పెట్టడమంటే-అదేం పెద్ద సమస్య కాదు. పెట్టొచ్చు. ఎవరో ఒక సెలబ్రిటీని పిలిచి సందేశం ఇప్పించొచ్చు. కానీ అలాకాదు. ఈవెంట్ పెడితే దానికో సార్ధకత ఉండాలి. నలుగురికి నచ్చాలి. పదిమందికీ ఉపయోగపడాలి.

సంకల్ప బలం ఉండాలేగానీ సక్సెస్ దానంతటే అదే వస్తుంది! ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసింది స్టార్టప్ లీడర్‌షిప్ హైదరాబాద్ చాప్టర్. కార్పొరేట్ సంస్థలు కేవలం మద్దతివ్వడమేకాదు ఫండ్స్ కూడ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. వచ్చిన డబ్బంతా గర్ల్‌ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతామని అంటున్నారు ప్రోగ్రాం ఆర్గనైజర్ సుబ్బరాజు.

స్టార్టప్ 5K రన్‌ పేరుతో ఈ ఆదివారమే ఈవెంట్ జరగనుంది. 100కు పైగా స్టార్టప్ ఫౌండర్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయంటున్న సుబ్బరాజు- యువర్ స్టోరీతో స్టార్టప్ 5కే రన్‌ గురించి చాలా విషయాలు చెప్పారు.

“ఈ ఆలోచన గతేడాది మొదలైంది. ఇప్పటికి ఇంప్లిమెంట్ చేయగలిగాం. చాలా సంతోషంగా ఉంది,” సుబ్బరాజు


image


అనూహ్య స్పందన

5 కే రన్ చేద్దాం అనుకున్నప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహం వెంటాడింది. కానీ రెండు నెలల క్రితం- అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషాన్నించింది. ఫండ్స్ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.

“ఈ ఏడాది గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ ని వినియోగిస్తున్నాం,” సుబ్బరాజు

ప్రతి ఏడాది ఒక్కో ఇనిషియేషన్ తీసుకుంటామని అంటున్నారాయన. ఈ ఏడాది చిన్నారులు స్కూల్ ఫీజులు చెల్లించాలని నిర్ణయించామంటున్నారు.

image


5 కే రన్ భాగస్వామ్యం

హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలన్నీ దాదాపుగా దీంట్లో పాల్గొంటున్నాయి. రాహ్‌గిరీ జరిగే దగ్గరే ఈవెంట్ జరగనుంది. కిషోరీ వికాస్, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, అమన్ బిరాదరీ లాంటి ఎన్జీవో సంస్థలు 5కే రన్ కు మద్దతు తెలుపుతున్నాయి. ఈ సంస్థలు విద్యార్థులను గుర్తించడం లాంటి ప్రక్రియల్ని చూస్తున్నాయి. వీడెలివర్, క్రియేటివ్ స్టుడియోస్, డిజైన్ అవేర్, స్టార్టప్ హైదరాబాద్ రన్ కు మద్దతిస్తున్నాయి. వీటితోపాటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్నో స్టార్టప్ కంపెనీలు రన్ లో పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు 125 మంది దాకా ఫౌండర్లు ఎన్‌రోల్ చేశారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనీసం రెండువేల మంది రన్‌ లో పాల్గొంటారని అంచనా.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఆన్ లైన్ లో చేస్తున్న ప్రచారం స్టార్టప్ 5కే రన్‌కు ప్లస్ పాయింట్ గా చెప్పాలి. మొదటిసారి స్టార్టప్ 5కే రన్ ని హైదరాబాద్ లోనే చేయడం మరో విశేషం. వచ్చే ఏడాది నుంచి స్టార్టప్ లీడర్‌ షిప్ కార్యక్రమం నుంచి ఇతర నగరాల్లో ఉన్న చాప్టర్లకు విస్తరిస్తారు.

“ఫస్ట్ 5కే రన్ సక్సెస్ అయితే మరిన్ని కార్యక్రమాలు చేస్తాం,” సుబ్బరాజు

స్టార్టప్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం పొందిన 5కే రన్ సక్సెస్ అయిన తర్వాత మరిన్ని కార్యక్రమాలను చేపడతామని సుబ్బరాజు అన్నారు. మొదలు పెట్టిన కార్యక్రమానికి భాగ్యనగరం నుంచి ఎక్కువ స్టార్టప్ లు మద్దతివ్వడం మంచి పరిణామం అని సుబ్బరాజు ముగించారు.