సంకలనాలు
Telugu

చింతపిక్కలు ఏరుకున్న ఆ బీడీ కార్మికుల కూతురే.. ఇప్పుడు వందల మందికి మార్గదర్శి

GOPAL
25th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మంచి చదువు, ఐదంకెల జీతం. చాలామంది యువతీ, యువకులు కోరుకునేది ఇదే. ఎలాంటి టెన్షన్లు లేకుండా జీవితం సాగిపోతే చాలనేది అందరి ఆలోచన. కానీ అశ్వేతా షెట్టి అలా ఆలోచించలేదు. చదువుకునేందుకు తాను పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఎంత శ్రమపడ్డది మర్చిపోలేదు. అలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రాకుండా ఉండేందుకు బోధి ట్రీ ఫౌండేషన్‌ను స్థాపించారు. గ్రామీణ ప్రాంత గ్రాడ్యుయేట్లు, విద్యార్థులకు ఇంగ్లీష్, కమ్యూనికేషన్లలో శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

image


‘‘ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ చిన్న గ్రామంలో నేను పెరిగాను. నా బాల్యం ఎంతో ఆనందంగా సాగింది. గ్రామాల్లో పిల్లలందరూ చేసినట్టుగానే బురదలో ఆడుతూ జామపండ్ల కోసం రాళ్లను విసురుతూ చింతపండును తెంపుతూ, శాలువాతో చేపలను పడుతూ ఆనందంగా గడిపాను. పెరిగి పెద్ద అయినప్పటి నుంచి ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. పెద్దల సమక్షంలో పురుషుల గురించి నేను మాట్లాడింది చాలా తక్కువ ’’ అని అశ్వేత షెట్టి ఆవేదన చెందుతారు.

13 ఏళ్ల వయసులో అశ్వేతా షెట్టికి ఎవరికీ రాని అద్భుత అవకాశం వచ్చింది. హెలెన్ కెల్లెర్ ఆటోబయోగ్రఫీలో నటించే అవకాశం దక్కింది. ఆ క్షణాలు ఆమె జీవితంలో మరిచిపోలేనివి. ఆ సందర్భంగా ఆమె జీవితంలో మార్పులను స్పష్టంగా గుర్తించింది. చిన్నప్పటి నుంచి చదువులో అశ్వేత ముందే ఉండేది. అలాగే టీచింగ్ అంటే ఆమె ఎంతో ఇష్టం. పొరుగున ఉండే ఫ్రెండ్స్‌కు చాలాసార్లు ఆమె చదువులో సాయం చేశారు. ఆ తర్వాత 15-20 ఏళ్ల చిన్నారులకు ట్యూషన్ చెప్పేవారు. ఆమె పెరిగి పెద్దదవుతున్నా కొద్దీ ఆమెలోని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ వచ్చింది.

అశ్వేత తల్లిదండ్రులు బీడీ కార్మికులు. నిరక్షరాస్యులు. చదువంటే ఏమిటో తెలియదు. దీంతో పెద్ద తరగతులను చదివేందుకు ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. పరిస్థితులు అడ్డం పడ్డా ఆమె ప్రయత్నాలకు తల్లిదండ్రులెప్పుడూ అడ్డు చెప్పలేదు. ఏదీ కావాలన్న చదివించారు.

కాలేజీలో చదివే రోజుల్లో అశ్వేత

కాలేజీలో చదివే రోజుల్లో అశ్వేత


కాలేజీ వెళ్లడం ఓ అతిపెద్ద డ్రీమ్...

మొదటి నుంచి ఇంగ్లీష్ పై ఆమెకు అంత పట్టుండేది కాదు. ‘‘తిరునల్వేలి లోని ఓ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. కానీ నేను చదివిన ఏ సబ్జెక్టుపైనా పెద్దగా పట్టు సంపాదించలేకపోయాను. అందుకు కారణం ఆ సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్‌లో ఉండటమే. వాటిని కేవలం గుర్తుంచుకునేందుకు ప్రయత్నించేదాన్ని తప్ప అర్థం చేసుకున్న సందర్భాలు తక్కువే. బట్టీపట్టడం.. హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉన్న కారణంగా మార్కులు భారీగా వచ్చేవి ’’ అని అశ్వేత తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు.

బయట ప్రపంచం గురించి అశ్వేత ఎప్పుడూ కలలు కనేది. ఏదో ఒక రోజు మంచి కాలేజీలో చేరి, మంచి ప్రొఫెసర్ల వద్ద మంచి విద్యను అభ్యసించాలని కోరుకునేది. చిన్నప్పటి నుంచి ఆమె తల్లితో అనేది. ‘ ఏదో ఒకరోజు నేను కాలేజీకి వెళ్తాను’ అని. ఆమె తల్లి కూడా అశ్వేత కోరికను కొట్టిపారేయకుండా ‘మొదట హై స్కూల్ పూర్తి చెయ్యి’ అని సూచించేది. ‘మా అమ్మ ఎప్పుడూ నన్ను నిరుత్సాహపర్చలేదు. కానీ మహిళగా నాది చాలా పెద్ద కోరిక అని నాకు తెలియచెప్పేందుకు ప్రయత్నించింది’’ అని అశ్వేత చెబుతారు.

గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా యంగ్ ఇండియా ఫెల్లోషిప్ గురించి ఓ తమిళ మ్యాగజైన్‌లో చదివింది. ఆమె కోరికలకు తగ్గట్టు పరిస్థితులూ అప్పుడు కలిసొచ్చాయి. ఓ లైబ్రేరియన్ ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు సాయం చేశారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కోసం ఆమె స్నేహితురాలు ఒకరు తన మొబైల్‌ను ఇచ్చేవారు. ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూకు వెళ్లేందుకు కనీసం ఆమె వద్ద టికెట్‌కు కూడా డబ్బులు లేవు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకుని ఇంటర్వ్యూ బోర్డే .. స్కైప్‌లో ఇంటర్వ్యూ నిర్వహించింది.

యంగ్ ఇండియా ఫెల్లోషిప్ సదస్సులో మాట్లాడుతున్న అశ్వేత

యంగ్ ఇండియా ఫెల్లోషిప్ సదస్సులో మాట్లాడుతున్న అశ్వేత


భాష కష్టాలు అన్నీ ఇన్నీ కావు

ఆమె తొలిసారిగా ఇంగ్లీష్ మాట్లాడింది టెలిఫోనిక్ ఇంటర్వ్యూలోనే. అప్పుడామె వయసు 20 ఏళ్లు. అశ్వేత ఆ ప్రోగ్రామ్‌కు ఎంపికై ఢిల్లీ వెళ్లింది. కానీ జీవితంలో జరిగే పెనుమార్పులను ఆమె ఊహించలేకపోయింది. జీవితంలో అన్ని కోణాల్లోనూ ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో ఆమె షాక్‌కు గురైంది.

‘‘ఆరంభంలో నేను కాస్త ఉద్వేగానికి గురయ్యాను. నగర జీవితాన్ని చూసి విభ్రాంతి చెందాను. కొంత మంది ప్రొఫెసర్లు తరుచుగా అమెరికన్ యాక్సెంట్‌తో క్లాసులు చెప్తుండటంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. నా ఆలోచనలను ఇంగ్లీష్‌‌లోకి తర్జుమా చేసుకుని.. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇది చాలా కష్టంగా ఉండేది ’’ అని అశ్వేత వివరించారు.

కమ్యూనికేషన్ కష్టాలు ఎదురైనప్పటికీ పట్టుదలను మాత్రం వీడలేదు. లెక్చర్స్ అర్థం కాకపోవడంతో మరోసారి చెప్పించుకునేందుకు ప్రొఫెసర్లతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించారు అశ్వేత. అలా సబ్జెక్టుపై పట్టు సంపాదించారు. కేవలం ఇంగ్లిష్ పదాలను ఉచ్చరించడమే కాదు. లోతుగా అవగాహన చేసుకుని గుర్తుంచుకునేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. యంగ్ ఇండియా ఫెలోషిప్ ఆమె కోరికలను నెరవేర్చేందుకు ఎంతో ఉపయోగపడింది.

‘‘ఆ అనుభవం నాకు ఎంతో నేర్పింది. ఇంగ్లీష్‌లో నా రైటింగ్, స్పీకింగ్ నైపుణ్యాలు మెరుగయ్యాయి. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంతో నా తోటి విద్యార్థులు నన్ను గౌరవించడం ప్రారంభించారు. నాతో స్నేహం చేసేందుకు ముందుకొచ్చారు’’ అని అశ్వేత తెలిపారు.

తలుపు తట్టిన అదృష్టం..

ఫెలోషిప్ పూర్తయిన తర్వాత సుఘవాఝవు (ఎస్ వీ) హెల్త్ కేర్ కమ్యునిటీలో ఎంగేజ్మెంట్ మేనేజర్‌గా అశ్వేత పనిచేశారు. గ్రామీణ భారతంలో తక్కువ ఖర్చుకే వైద్యాన్ని ఈ సంస్థ అందించేది. తన ఉద్యోగంలో భాగంగా ఆమె కంటెంట్‌ను డెవలప్ చేయడంతోపాటు అనీమియా, కార్డియో-వాస్క్యూలర్ వ్యాధుల గురించి స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కల్పించేది. మంచి చదువు, గౌరవప్రదమైన ఉద్యోగం. ఎవరికైనా ఇంతకు మించి ఏం కోరుకుంటారు. కానీ అశ్వేత మాత్రం ఏదో వెలితిగా ఫీలయ్యారు.

‘‘ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు నా మదిని తొలిచేసేవి. నేను అంత కష్టపడి చదివింది ఇందుకేనా? అనిపించేది. ఇందులో ప్రపంచాన్ని మార్చేందుకు ఏముంది ? గ్రామాల్లో పెద్దగా చదువుకోకుండా ఉండిపోయిన నా స్నేహితులకూ.. నాకూ ఉన్న తేడా ఏంటి ? అని అనిపించేది ’’ అని అశ్వేత వివరించారు.

రెండు అంశాల కారణంగా తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె భావిస్తారు. ఒకటి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, రెండు సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడం.

బోధి ట్రీ ఫౌండేషన్ ఆవిర్భావం

ఆలోచనల పరంపర కారణంగా అశ్వేత ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయింది. తిరునల్వేలి వెళ్లిపోయి బోధి ట్రీ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చారు.

‘‘ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నవారు సైతం ఇతరులతో చక్కగా మాట్లాడగలరని మేం గాఢంగా విశ్వసించాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని తమపై పెట్టిన బాధ్యతలను కార్యరూపంలోకి తీసుకురావడం నేర్చుకోవాలి. అలాగే తమ గ్రామాలను బాగు చేసుకోవలనుకునే వారికి కూడా మా శిక్షణ ఉపయోగపడుతుందని మేం భావించాం’’ అని ఆమె వివరిస్తారు.

గ్రామీణ ప్రాంత గ్రాడ్యుయేట్స్‌కు ఉన్న ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఆంట్రప్రెన్యూర్షిప్ వంటి అవకాశాల గురించి మూడు గంటల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు అశ్వేత. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం పాజిటివ్ యాటిట్యూడ్ కోర్సులను తీసుకుంటూ ఉంటారు.

బోధిట్రీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సదస్సులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న అశ్వేత

బోధిట్రీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సదస్సులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న అశ్వేత


తమ టీంలోని ముగ్గురు సభ్యులైన బాలాజీ, సెబాస్టియన్, పద్మల కారణంగానే తమ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అశ్వేత చెప్తుంటారు. తొలి ఏడాదిలోనే ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల వెనుక వీరి కృషి ఎంతో ఉంది. 2500 మందికి అవగాహనా కార్యక్రమాలు, 600 మందికిపైగా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్ అంశాలపై శిక్షణ, 20కి పైగా కాలేజీల్లో శిక్షణ వంటి కార్యక్రమాలను వీరు నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం తమ కార్యాలయంలోనే ఓ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలే నిర్వహిస్తున్న లీప్ ఫార్వర్డ్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నదీ సంస్థ. మొత్తానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై ఉన్నభయాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అశ్వేత.

image


అశ్వేత మంచి మాటకారి కూడా. ఆమె తన అనుభవాన్ని ఇలా వివరించారు. ‘‘ నా మాటకారి తనమే నన్ను ఈ ప్రపంచంలో నిలబెట్టగలిగింది. ప్రపంచానికి నా గొంతును వినిపించేలా చేసింది. ఇతరులు నాకు కేవలం అండగా నిలబడ్డారు. నేను చెప్పిన మాటలను, నా సమస్యలను వారు అర్థం చేసుకున్నారు ’’.

తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్లస్ ట్రస్ట్ అశ్వేతకు ఎంతో సపోర్టుగా నిలిచింది. బోధి ట్రీ ఫౌండేషన్ పెట్టిన కొత్తలో ఆర్థికంగా ఆదుకుంది. మదర్ థెరిసా వైఐఎఫ్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ స్కాలర్షిప్ కూడా సంస్థను కొనసాగించేందుకు సాయపడింది. కొంతమంది ఉదారవాదుల నుంచి కూడా ఆమె నిధులు సమీకరించారు. తన గమ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు మరిన్ని నిధులను సమీకరించాలని అశ్వేత భావిస్తున్నారు.

అశ్వేతకు ఒక కల ఉంది. జ్ఞానం, నైపుణ్యం, వనరులు, అవకాశాల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడాలేకుండా చూపాలన్నదే ఆమె లక్ష్యం. ఈ కలను సాకారం చేసేందుకు బోధి ట్రీ ముందుకు సాగుతోంది.

‘‘ గ్రామీణ ప్రాంతాల్లో నాతోటి సహచరులకు దక్కని అవకాశం నాకు దక్కడం ఎంత అదృష్టమో నేను రోజు గుర్తుచేసుకుంటూ ఉంటాను. కొద్దిపాటి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ నా ఆశయాలను విస్తరించుకునేందుకు, స్వప్నాలను సాకారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటాను’’ అని అశ్వేత ముగించారు.

image


ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టి.. మరింత మంది గ్రామీణ విద్యార్థులను మెరికల్లా తయారు చేయాలని మనమూ కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అశ్వేతా.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags