సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మీ కలా ? అయితే మీరు తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే !

సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అంత ఈజీ కాదు ప్రపంచానికి మేలు చేయాలనే ధృక్పథం ఒక్కటే సరిపోదుఓపిక, సహనం, టీమ్ తయారీ... ఇవే కీ పాయింట్స్ఓవర్ నైట్ కోట్లు కావాలంటే ఇటువైపు అసలు రావద్దు

సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మీ కలా ? అయితే మీరు తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే !

Thursday June 18, 2015,

4 min Read

ప్రస్తుతం ఏ మేగజైన్స్ చూసినా అందులో ఏదో ఒక మూల ఓ స్టార్టప్‌కు సంబంధించిన వార్త, వారి విజయాలు చదువుతున్నప్పుడు మనలో ఏదో తెలియని ఫీల్ వస్తుంది. మనమూ ఓ చూపు చూద్దామా. మనకూ ఆ మాత్రం టాలెంట్ లేదా ? వాళ్లు చేయగా లేనిది మనం చేయలేమా ? అని అనిపించడం సహజం. ప్రపంచంలో అంతా ముందుకు వెళ్తుంటే మనం మాత్రం వెనకబడ్డామేమో ఆనే ఆలోచనా వస్తుంది. అప్పుడే మెదడులో ఓ ఆలోచన బయల్దేరుతుంది. సొసైటీకి మంచి చేసే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తే సక్సెస అవడం ఖాయం అన్పిస్తుంది. ఓ సారి మెదడులో ఆలోచన అనే పురుగు రానే కూడదు... వచ్చిందంటే ఓ పట్టాన వదలదు చాలామందికి. చేస్తున్న పనిని, ఉద్యోగాన్ని, లేదంటే వ్యాపారాన్నీ వదిలేయడం చిటికెలో పని. కానీ ఆ సాహసోపేతమైన అడుగువేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యువర్ స్టోరీ రీడర్స్ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది.

అంత ఎత్తుకు ఎదగడమే మీ కలా ?

అంత ఎత్తుకు ఎదగడమే మీ కలా ?


ఓ మంచి కారణంతో...ప్రపంచానికి మేలు చేయాలని వస్తున్నారా...ఐతే మీకు ఓ బిగ్ నో..!

ప్రపంచం నాకు చాలా చేసింది. మరి నేను ఈ ప్రపంచంలో మనుషులకు మంచి చేయాలి. నాకు చేతనైనంత సాయం చేయాలి. నేను చేసే పనులతో సొసైటీలో మనిషి జీవనం మరింత ఆనంద దాయకం కావాలి. సౌఖ్యవంతమైన జీవితం గడపాలి... అనే ఆలోచనలతో ఏదైనా స్టార్టప్ మొదలు పెట్టాలనుకునే వారికి ఓ సలహా. కేవలం సమాజహిత ఆలోచనే ఉంటే వెంటనే మానుకోండి. ప్రపంచానికి, ప్రకృతికి ఓ సేవకుడు, రక్షకుడు అవసరం లేదు. సహజంగానే వాటినవి బ్యాలెన్స్ చేసుకోగలవు. నిస్వార్ధంగా జనం కోసం పని చేయడమనేది దాన ధర్మాల విషయంలో ఓకేగానీ.. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌కి ఉండాల్సిన లక్షణాల్లో అవి అవసరం లేదు. దీనికి ఇంకొంచెం ఎక్కువ కావాలి. రకరకాల ఎమోషన్స్, ఆశయాలతో ప్రారంభించే పనికి పట్టుదల, ఆసక్తి ఉండాలే కానీ ఇతరుల ఆసక్తి కోసం పని చేయకూడదు. మీరే ఓ సమస్యను కనిపెట్టారు..దానికి పరిష్కారమూ కనిపెట్టాలి.

చాలామంది తాము చేస్తున్న పనిని వదిలిపెట్టి..ఎంతోకాలంగా తమలో నిద్రాణంగా ఉన్న ఓ ఆలోచనను ఆచరణలో పెట్టాలనకుంటారు. అప్పటిదాకా చేసిన పనిపై బోర్ కొట్టికానీ..లేదంటే ఇంకా ఏదో చేయాలనే జిజ్ఞాసతో హడావుడిగా తమ ఆలోచనకు కార్యరూపం ఇస్తారు. విపరీతంగా ఆలోచించీ..చించీ.. తామే ఓ సమస్యకు పరిష్కారం కనుగొనగలమనే భ్రమలో కూడా ఉంటారు. అయితే కొంతమంది కనుక్కుంటారు కూడా. ఇలా ఎవరేం చెప్పినా వినకుండా, తాము అనుకున్నదే కరెక్టనుకునే వాళ్లు ఏ ఒక్కరో ఇద్దరో తప్ప అంతా ఫెయిలవుతారు. దీనికి కారణమేంటంటే ఊహలు వేరు..వాస్తవాలు వేరు కాబట్టి.

రిస్క్ తెలుసుకోండి

ఏ ఐడియా అనుకున్నా..ఆ కాన్సెప్ట్‌లోని రిస్క్‌ను అర్ధం చేసుకోండి. భేషజాలు లేకుండా... ప్రాజెక్టు ఫెయిల్ అవడానికి ఎన్ని మార్గాలున్నాయో ముందే రాసి పెట్టుకోండి. ఎదురయ్యే అవాంతరాలను ఊహించడానికి ప్రయత్నించండి. అలా అని ప్రతీ పనిని అంతా ప్లాన్ చేసి కానీ కార్యరంగంలోకి దిగాలనుకోవడం, అసలు పనిలోకి దిగకపోవడమే అవుతుంది. పాజిబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆలోచించగలగాలి. ఉదాహరణకు పెట్టుబడికి డబ్బు సమకూరకపోయినా లేద చాలకపోయినా, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, ఓ వేళ అనుకున్నది సాధించలేకపోతే ఎదురయ్యే అవహేళన, అనుకున్నట్లుగా బిజినెస్‌ను లాంఛ్ చేయలేకపోవడం, స్టార్టప్‌ను పూర్తి చేయలేకపోవడం... ఇవన్నీ రిస్క్ కిందే వస్తాయి.

సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అనేది ఎవర్నీ ఓవర్ నైట్ కోటీశ్వరులుగా చేయదు. కనీసం రెండు మూడేళ్లకు కూడా అది జరగదు. దీంతో ప్రాజెక్టుకు ఖర్చుపెడుతున్న డబ్బు అయిపోతూ ఉంటుంది. అది మన ఆర్ధిక స్థితిని దెబ్బతీయకుండా ప్లానింగ్ చేసుకోవాలి. అనుకోకుండా పెట్టుబడి అంతా లాస్ అయితే తట్టుకోగలిగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలానే మనపై ఆధారపడిన వాళ్లు మనతో ప్రయాణించే విధంగా మసలుకోవాలి. మీరు చేసే పని మీకు నచ్చవచ్చు.. కోట్లు వస్తాయని నమ్మొచ్చు. కానీ అదే నమ్మకం కుటుంబసభ్యులు,స్నేహితుల్లో కూడా కలగజేయాలి. ఎందుకంటే వారిచ్చే ప్రోత్సాహం, అండాదండలే మీకు రక్షగా ఉంటాయి. ఓ వేళ స్టార్టప్ ఫెయిలైనా అది ఆ కాన్సెఫ్ట్, నిర్వాహణాలోపమే కానీ మీ వ్యక్తిగత పరాజయం కింద తీసుకోవద్దు. ఇలా అన్ని రకాలుగా కీడెంచడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవించినా తట్టుకోగలగుతారు

మీలో అన్ని ఆంట్రప్రెన్యూర్‌కి కావాల్సిన దినుసులన్నీ ఉన్నాయా ? సాధించాలనే ప్యాషన్, అంతర్‌దృష్టి, సమస్యను మొదట్లోనే గుర్తించి పరిష్కరించే సామర్థ్యం... ఉన్నాయో లేవో సరి చూసుకోవాలి. చాలామంది పారిశ్రామికవేత్తలకు అందులోనూ కొత్తగా మొదలుపెట్టే ఫస్ట్ టైమర్లకు తమ స్టార్టప్‌పై ప్రేమ నమ్మకం ఉంటాయి కానీ..వారు ఊహించుకున్న స్వప్నాన్ని అదే స్థాయిలో సాకారం చేసే సామర్ధ్యం కొరవడుతుంది. పైన చెప్పిన దినుసులన్నీ (సామర్ధ్యాలు) మీలో లేకపోతే ఎదుటివాడు తుపాకీతో ఫైట్ చేస్తుంటే..మీరు కత్తితో పోరాడినట్లు అవుతుంది.

సోషల్ ఆంట్రప్రెన్యూర్‌కు వ్యాపారదక్ష ఉండాలి. అలానే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు వేగంగా ప్లానింగ్ చేయడం, సమయస్ఫూర్తితో దాన్ని అమలు చేయగలిగి ఉండాలి. ఓ వేళ మీలో అవి లోపించాయని అనిపిస్తే.. గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు చదవండి. ఏ సందర్భంలో వాళ్లు ఎలా స్పందించాలో తెలుసుకోండి. వాళ్లు మీకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సాయపడ్తారు. అలానే మీలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. మీరేం చేయగలరో..ఏం చేయలేరో తెలుసుకుంటే చాలు..సగం విజయం సాధించినట్లే..

టీమ్‌ను బిల్డ్ చేసుకోండి

పెద్ద పెద్ద స్వఛ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఎందుకు వాటి సత్తాకు తగ్గట్లు రాణించలేకపోతున్నాయో తెలుసా...? వాటిలో అగ్రనాయకత్వం తప్ప..మిగిలిన టీమ్‌ను (సెకండ్ లైన్ సిబ్బంది) సమర్ధులుగా తయారు చేసుకోలేకపోవడం. మరోలా చెప్పాలంటే ఓ మంచి టీమ్‌‌ను ఎంపిక చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం. ఎవరో ఓ వ్యక్తి తాలూకూ ఆలోచన, ఆశయాల ఫలితంగా ఓ స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవిస్తుంది. లక్ష్యాలు ఉన్నతంగా ఉండటం వరకూ ఇది పనికి వస్తుంది. కానీ అదే స్థాయి ఆలోచనాసరళి కంపెనీలో చిట్టచివరి స్థాయి ఉద్యోగి వరకూ నడుస్తుంటేనే విజయవంతం అవుతుంది. కనీసం పెట్టుబడి పెట్టిన ఇతర వ్యక్తులకైనా ఆ విజన్ ఉండాలి. అప్పుడే సంస్థలో వ్యక్తులు మారినా..విజన్,వ్యవస్థ మారదు..

ఇతరులతో కలిసి టీమ్‌గా పని చేసే తత్వం ఆంట్రప్రెన్యూర్‌కు అవసరం. ఓ పనిని ఇంకొకరితో పంచుకుంటున్నామంటే అది మనకు చేతకాక కాదు అని తెలుసుకోవడం ముఖ్యం. మిగిలిన వారితో కలిసి పని చేస్తున్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇలా చేస్తేనే కంపెనీ లక్ష్యాల్లో తామూ ఓ చేయి వేస్తున్నామని వారిలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రతీ మనిషీ తన ఉనికి చాలా ముఖ్యం అనుకుంటాడు. తనకు గుర్తింపు ఉందీ అనే చోట వాళ్లు పని చేసే తీరే వేరుగా ఉంటుంది.

సహనంతో సహవాసం

సహనం, లక్ష్యాలను చేరుకోవడానికి వేచి ఉండే సామర్ధ్యం ఈ రెండూ సోషల్ ఆంట్రప్రెన్యూర్‌కు చాలా ముఖ్యం. ప్రతీ ఉదయానికి ముందు చీకటి ఖచ్చితంగా ఉన్నట్లే.. సోషల్ ఆంట్రప్రెన్యూర్ రంగంలో విజయం సాధించడానికి పట్టే సమయమంతా చీకటిగానే పోల్చవచ్చు. కారణం సింపుల్... ! మిగిలిన స్టార్టప్స్ ఏదో ప్రొడక్ట్ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్ రాబడి తెలుస్తుంది. కానీ ఓ సోషల్ కాజ్ కోసం చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రతిభావంతులు లేకపోవడం, అవసరమైన డబ్బు అందుబాటులో లేకపోవడంతో సామాజిక పారిశ్రామికవేత్తలు ఫెయిల్ అవుతుంటారు. జనశ్రేయస్సు - ఆదాయం ఈ రెండూ అంత త్వరగా జతకావు మరి..

మొదట్లో చెప్పుకున్నట్లే..రాత్రికి రాత్రే సక్సెస్ సాధించడమనేది సోషల్ ఆంట్రప్రెన్యూర్లకు సాధ్యం కాదు. ఓ మొబైల్ యాప్ తయారు చేయడం. అది జనంలోకి వెళ్లడం..ఆ తర్వాత ఫేస్ బుక్, గూగులో మీ స్టార్టప్‌ను కొనడం కాదు సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ అంటే... ! ఇది ఇంకొంచెం ఎక్కువ శ్రమ..ఎక్కువ రిస్క్. ఇది చాలా ఏళ్లు పట్టొచ్చు...అప్పుడైనా మీకు కనకవర్షం కురుస్తుందని గ్యారెంటీ ఏమీ లేదు.

కానీ..ఎవరికైతే ఓర్పు, సహనం, అనుకున్న పనిని అనుకున్నట్లుగా అమలుచేయగల సామర్ధ్యం ఉంటాయో వారికి మాత్రం సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అంతులేని తృప్తిని ఖచ్చితంగా ఇస్తుంది.