36 గంటల్లో ఎడ్యుకేషనల్ యాప్..అమెరికాలో ఇండియా కుర్రాళ్ల సత్తా..

36 గంటల్లో ఎడ్యుకేషనల్ యాప్..అమెరికాలో ఇండియా కుర్రాళ్ల సత్తా..

Monday March 21, 2016,

2 min Read


టెక్నాలజీ రంగంలో భారత కీర్తిపతాక అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలకు మనోళ్లే నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఎంతోమంది ఇండియన్లు సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. వీరి బాటలోనే ఇద్దరు విద్యార్థులు అమెరికాలో ఓ ఎడ్యుకేషనల్ హాకథాన్ లో 36 గంటల్లోనే ఎడ్యుకేషనల్ యాప్ రూపొందించి చరిత్ర సృష్టించారు. తమ లొకాలిటీలోని ట్యూటర్స్ తో కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడే ఓ యాప్ ను రూపొందించారు. 

ఉబర్ ఫర్ ట్యూటర్ అనే ఈ యాప్ ను గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచింతంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ లో ట్యూటర్ల ప్రొఫైల్స్ చూడటమే కాదు.. మీటింగ్ పాయింట్స్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ తో చదువు రూపురేఖల్నే మార్చేసుకోవచ్చు. రివర్ సైడ్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సుల్తాన్ ఖాన్, హాసిత్ సంకా రూపొందించిన ఈ యాప్ ఎడ్యుకేషన్ హాకథాన్ లో విజేతగా నిలిచింది.

ట్యూటర్ యాప్ ను రూపొందించిన సుల్తాన్ ఖాన్, హాసిత్ 

ట్యూటర్ యాప్ ను రూపొందించిన సుల్తాన్ ఖాన్, హాసిత్ 


వర్కింగ్ మోడల్..

ఈ యాప్ పనిచేసే విధానం చాలా సింపుల్. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఇష్టపడే ట్యూటర్లు తమ ప్రొఫైల్స్ ను రెడీ చేసి ఆ యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఈ ప్రొఫైల్స్ విద్యార్థులందరూ వీక్షించొచ్చు. తమకు కావాల్సిన సబ్జెక్ట్ సంబంధించిన ట్యూటర్ ను ఎంపిక చేసుకుని డిస్కస్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారానే టైమ్ సెట్ చేసుకొని ఎక్కడో ఓచోట సమావేశం కావొచ్చు. ఈ యాప్ ద్వారా అటు ట్యూటర్లకు, ఇటు స్టూడెంట్ కు ఇద్దరికీ లాభం ఉంటుంది. ట్యూటర్లకు అదనపు ఆదాయంం. అలాగే విద్యార్థులు కాలేజీలో అర్థం కాని పాఠాలను ట్యూటర్లను అడిగి తెలుసుకోవచ్చు. ఈ యాప్ తమ లాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని సుల్తాన్, హాసిత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

స్కాలరీ..

యాండ్రాయిడ్ వెర్షన్ యాప్ కు ‘స్కాలరీ’ పేరు పెట్టారు. అక్టోబర్ లో జరిగిన ఎడ్యుకేషన్ హాకథాన్ లో ఈ యాప్ ను డెవలప్ చేశారు. ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన వెయ్యి మంది హ్యాకర్లు ఈ హాకథాన్ లో పాల్గొన్నారు. 36 గంటల సమయంలో విద్యార్థులు తమకు వచ్చిన ఐడియాను కార్యరూపంలోకి తీసుకురావాలి. అది కూడా విద్యావ్యవస్థను మెరుగుపర్చే విధంగా ఉండాలి అని కండిషన్స్ పెట్టారు. ‘స్కాలరీ’ పేరుతో ఖాన్, సంకా సృష్టించిన యాప్ కు జడ్జిలు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదు. ఈ యాప్ ను మరింత డెవలప్ చేసేందుకు, ఐఓఎస్ వెర్షన్ లో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు.

ప్రస్తుతానికైతే యూసీఆర్ విద్యార్థులకు మాత్రమే ఈ యాప్ ఉపయోగపడుతున్నది. భవిష్యత్ లో దీన్ని కిండర్ గార్టెన్ నుంచి క్లాస్ 12 విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా తయారుచేస్తామని విద్యార్థులు అంటున్నారు. చిన్న వయసులోనే యాప్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న హాసిత్, సుల్తాన్ ల ఆకాంక్ష నెరవేరాలని యువర్ స్టోరీ కోరుకుంటోంది.