సంకలనాలు
Telugu

10 వేల సర్జరీలు, ప్రత్యేకమైన ఆవిష్కరణలు.. ల్యాప్రోస్కోపీలో ఈ డాక్టర్ ఓ సెన్సేషన్

ల్యాప్రోస్కోపీలో 10 వేల సర్జరీల రికార్డ్...మూలకణాల ద్వారా వెజైనా, గర్భసంచి సృష్టించే టెక్నాలజీ....గైనకాలజీ, ల్యాప్రోస్కోపీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం...2015లో పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం....డా. మంజులా అనగానితో యువర్ స్టోరీ ప్రత్యేక ఇంటర్వ్యూ...

20th Jun 2015
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share


అప్పటి వరకూ కుటుంబంలో డాక్టర్ చదివిన వాళ్లు ఎవరూ లేరు. పెరిగిన ఊరూ.. వాతావరణమంతా వ్యవసాయమే. అయినా తండ్రి మాత్రం బాగా చదువుకున్నారు. పిల్లలను చదివించి ప్రయోజకురాలిని చేయాలని ఆ కాలంలోనే అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు.. ఇద్దరు అబ్బాయిల మధ్య అప్పుడే పుట్టిందో పద్మశ్రీ. చిన్నప్పటి నుంచి అన్నీ ప్రశ్నలే. ఓ తెలుగు సినిమాలో 'దేవుడా కూతురుని ఇవ్వమంటే క్వశ్చన్ బ్యాంక్‌ను ఇచ్చావ్' అనే డైలాగ్ ఉంది. ఇక్కడా సేమ్ టు సేమ్ సీన్. ఆమెకూ చిన్నప్పటి నుంచీ అన్నీ ప్రశ్నలే. అది అలా ఎందుకు జరిగింది.. ? ఇది ఇలా ఎందుకు అయింది ? సమాధానాలన్నీ చివరకు సైన్స్ దగ్గర వచ్చి ఆగేవి. అలా క్వశ్చన్లకు.. ఆన్సర్లు వెతుకుతూ.. వెతుకుతూ.. వచ్చిన ఆ చిన్న అమ్మాయే ఇప్పుడు ప్రఖ్యాత గైనకాలజిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మంజులా అనగాని. ఈ మధ్యే 'పద్మశ్రీ'తో ఆమెను భారత ప్రభుత్వం సత్కరించి.. తన బాధ్యతను మరింత పెంచింది.

రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న డా. మంజుల అనగాని

రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న డా. మంజుల అనగాని


47 ఏళ్ల డాక్టర్ మంజుల చిన్నప్పటి నుంచే బ్రిలియంట్ స్టూడెంట్. టామ్ బాయ్‌కు ఏం మాత్రం తక్కువ కాదు. చిన్నప్పుడు రోడ్లపై కంటే చెట్లు, డాబాలపైనే ఎక్కువ తిరిగేదని కొంత మంది సన్నిహితులు చెప్పేవారు. చదువులోనే కాదు ఆటల్లో కూడా ఆమెకు దూకుడు ఎక్కువే. ధైర్యమూ కూసింత అధికమే. కొన్నేళ్లపాటు స్కూలుకు స్పోర్ట్స్ కెప్టెన్ కూడా. రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహించిన రెండో ఏడాదిలో ఆమె టాప్ సెకెండ్ ర్యాంకర్. అక్కడే ఆమె వైద్య ప్రస్థానానికి బీజం పడింది. గాంధీ మెడికల్ కాలేజీ చేరి.. అన్ని తరగతుల్లో చురుకుగా కదులుతున్న మంజులను ప్రొఫెసర్లు కూడా ప్రోత్సహించేవారు.

''అప్పట్లో మాకు టివిలు లేవు. సినిమాలూ తక్కువే. అమ్మాయిలకు తెలిసింది ఒక్కటే.. చదవు.. చదువు.. చదువు. లేకపోతే ఆటలు. అందుకే ఆ రోజుల్లో చదవడం తప్ప నాకో వ్యాపకం లేదు. నా ప్రశ్నలన్నింటికీ సైన్స్ సమాధానం చెప్పడంతో చిన్నప్పటి నుంచీ నాకు తెలియకుండానే మెడిసిన్‌పై మమకారం ఏర్పడింది''

మెడిసిన్ అయిన తర్వాత సర్జరీలోకి రావాలని అప్పుడే డాక్టర్ మంజుల బలంగా నిశ్చయించుకున్నారు. కానీ జనరల్ మెడిసిన్‌లోకి వస్తే మన ప్రత్యేకత ఏముంటుంది ? అప్పుడు మన దగ్గరికి ఎవరు వస్తారు ? అనే ఆలోచన. అందుకే అప్పటి వరకూ మగవాళ్లకు కంచుకోటలా ఉన్న సర్జరీలోకి.. అది కూడా గైనకాలజీ రంగంలోకి కాలుమోపారు. ఆశ్చర్యం ఏంటంటే పిజి చేస్తున్న సమయంలోనే ఆమె దాదాపు 200 ఆపరేషన్లు చేశారు. మిగిలిన బ్యాచ్ మేట్స్ అవాక్కైనా ఆమె మాత్రం తన పని తాను చేసుకుపోయేది. ప్రొఫెసర్లకు కూడా డా. మంజులపై బలమైన గురికుదిరింది. అప్పుడప్పుడే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీపై విస్తృత చర్చ జరుగుతోంది. విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానం భారత్‌లో కాలుమోపేందుకు సిద్ధపడ్తున్న రోజులవి. ఎక్కువ కోతలు, కుట్లు, మచ్చలు లేకుండా ఒక చిన్న రంధ్రంలో ఆపరేషన్‌ పూర్తి చేసే ప్రక్రియకు అది దోహదపడేది. దీనిపై ఆసక్తి పెంచుకున్న డాక్టర్ మంజులకు అదే ఓ పెద్ద టర్నింగ్ పాయింట్.

గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ !

భారత దేశంలో అప్పుడే వచ్చిన మినిమిల్ ఇన్వేసివ్ సర్జరీలో ఆమె ప్రావీణ్యత సంపాదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ల్యాప్రోస్కోపిక్ సర్జరీల్లో వంద సెంచురీలు కొట్టారు. ఇలాంటి సర్జరీలో చేసే గైనకాలజిస్టులు ఎవరైనా ఉన్నారా అని అప్పట్లో ఎవరైనా అడిగితే.. డాక్టర్ మంజుల పేరే వినిపించేది. ఈ పరిజ్ఞానంలో మొదట ఎంట్రీ కాస్త కష్టంగా ఉన్నా ఆ తర్వాత ఆపరేషన్ సులువవుతుంది. పెనరోమిక్ వ్యూ ఉన్న కెమెరాలు కూడా రావడంతో.. లోపల అంతా క్లియర్‌గా కనిపిస్తూ చికిత్స ఈజీ అవుతుంది.

'దేశంలో అది కొత్త టెక్నాలజీ. జనాలకే కాదు.. మాకూ అవగాహన తక్కువే. రూల్ బుక్‌లో ఉన్నట్టు ఆపరేషన్లు జరగవు. ఒక్కో కేసు.. ఒక్కో విభిన్నమైన ప్రయోగమే. అంతేకాదు కొత్త పేషెంట్లు వస్తేనే మేం నేర్చుకున్న దానికి సార్థకత. పేషెంట్స్ మనల్ని నమ్మాలి. లేకపోతే అప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నా ఏ ప్రయోజనం లేదు. ఈ విషయంలో నేను గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ ' అని మురిసిపోతారు డాక్టర్ మంజుల.

మెల్లిగా వీటిని నేర్చుకుంటూ, పేషెంట్లకు దగ్గరవుతూ ప్రైవేట్ క్లినిక్స్‌లో పనిచేస్తూ కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. కేర్, యశోదా, బీమ్స్‌లో పనిచేసి ఇప్పుడు మ్యాక్స్ క్యూర్‌ హాస్పిటల్స్‌లో .. విమెన్ అండ్ చైల్డ్ క్యూర్ విభాగానికి డైరెక్టర్ అయ్యారు.

ఈ పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు, విపరీతంగా ఆనందించిన క్షణాలు, కుంగిపోయిన రోజులు.. ఎన్నో.

డాక్టర్ మంజుల ఇప్పటి వరకూ కేవలం ల్యాప్రోస్కోపీ విభాగంలోనే 10,000కు పైగా సర్జరీలు చేశారు. అయితే ఇంత మందికి ఎలా చేరువయ్యారు అని అడిగితే ఆమె చెప్పే మాట ఒకటే. 'పేషెంట్లు ఇది చెయ్.. అది చెయ్.. అని చెబితే వినరు. వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. నచ్చజెప్పాలి, కొన్నిసార్లు కోప్పడాల్సి ఉంటుంది. ఇంకొన్ని సార్లు కాస్త గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి రావొచ్చు. ఏది చేసినా మీ మంచి గురించే అనే నమ్మకం వాళ్లలో కలగాలి. అప్పుడే మీ మాట వింటారు' అని వివరిస్తారు. ఈ మధ్య చాలా మంది మహిళలు గర్భసంచి విషయంలో మరీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని తీయించేసుకుంటున్నారు. 40 ఏళ్ల లోపు మహిళలు తొందరపడి ఎప్పుడూ గర్భసంచి తొలగించుకోవడం మంచిది కానేకాదు. ఇక ఓవరీస్ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు డాక్టర్ మంజుల.

image


ప్రతిసృష్టి

ప్రైమరీ అమనోరియా అంటే అమ్మాయిల్లో అసలు రుతుక్రమమే జరగకపోవడం. ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. అలాంటి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఆ తల్లిదండ్రులు పడేబాధ వర్ణనాతీతం. మరికొంత మందిలో అసలు గర్భసంచి లైనింగ్ ఉండదు. అలాంటివాళ్లకు (స్టెమ్ సెల్ థెరపీ) మూలకణాల చికిత్స చేయడం, ఇంకొన్ని కేసుల్లో కొత్త వెజైనా క్రియేట్ చేయడం, చిన్న యూటిరస్ ఉన్నవాళ్లకు మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం వంటివి చేయడం డాక్టర్ మంజుల సిద్ధహస్తురాలు. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వైద్యం చేసిన మొదటి భారతీయ వైద్యురాలు కూడా తానేనని చెప్పుకొస్తారు. అసలు పెళ్లికే పనికిరాదనుకున్న వాళ్లను, గర్భదారణ చేయలేదని ఓ నిర్ణయానికి వచ్చినవాళ్లకు చికిత్స చేసి ఆమె ఎంతో పేరు సంపాదించారు.

కళ్ల ముందే తల్లీ,బిడ్డా...

పేద వారి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది డాక్టర్ మంజుల ట్రీట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్యంత క్రిటికల్ కేసులు కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని ఆపరేషన్లు చాలా చాలెంజింగ్ గా ఉంటాయి. ఇలా రోజంతా ఎంతో టెన్షన్ ఉంటుంది. నాకు మ్యూజిక్ డీస్ట్రెస్ మెడిసిన్. ఖాళీగా ఉన్నప్పుడే కాదు క్లినిక్‌లో పేషెంట్లను చూస్తున్నప్పుడు, ఆపరేషన్ థియేటర్‌లో కూడా నాకు మంద్రంగా మ్యూజిక్ వినిపిస్తూ ఉండాల్సిందే. అదే లేకపోతే నేను ఒత్తిడిని కంట్రోల్ చేసుకోలేనేమో అంటూ తన అంతరంగాన్ని పంచుకున్నారు.

కొన్ని సందర్భాల్లో తల్లా, బిడ్డా.. అనేంత క్రిటికల్ సిచ్యుయేషన్ వస్తుంది. అలాంటప్పుడు వాటిని సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తే ఆ తృప్తి, ఆనందమే వేరు. కొంత మంది బయటి పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. బయట ఇంక ఏమీ చేయలేమని చేతులెత్తేసి ఉంటారు. ఎంత కష్టపడినా చేసినా సేవ్ చేయలేనప్పుడు ఆ బాధను తట్టుకోవడం కాస్త కష్టమే. తప్పనిసరిగా ఆ బాధ మాలో ఉంటుంది. అది హ్యూమన్ లైఫ్. నేనైతే మొదట యంగర్ మదర్‌ను సేవ్ చేయాలనే చూస్తాను. తనే టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఒకసారి మా ఇంట్లో డాగీ చనిపోయినప్పుడు... నీకు ఏడుపు రాదా మమ్మీ అంటూ మా కూతురు అడిగింది. మాకు మాత్రం ఎందుకు బాధ ఉండదు. నేనూ ఓ తల్లినే కదా.. ? కాకపోతే అంత త్వరగా బయటకు అందరిలా ఏడ్వలేం.

ప్రైమరీ పల్పనరీ హైపర్ టెన్షన్. ఇది ఒకరకమైన హార్ట్ సమస్య. వాళ్లు ప్రెగ్నెన్సీకి పనికిరారు. అది చెప్పిన తర్వాత కూడా వాళ్లు వినరు. ఒక సారి నేను కేర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు అలాంటి పేషెంట్ వచ్చింది. ఆమెకు హార్ట్ వాల్వ్ మార్చారు. వద్దని వారించినా గర్భధారణ చేశారు. తొమ్మిది నెలల పాటు వాళ్లు బ్లడ్ థిన్నర్స్ వాడుతూనే వచ్చారు. 9 నెలలు నిండిన తర్వాత ఆ పేషెంట్ వచ్చింది. ముందు పిల్లవాడిని బయటకు తీస్తేనేమో.. వాల్వ్ల్‌తోపాటు ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అయిపోతుంది. లేకపోతే తల్లికి మెడిసిన్స్ ఇచ్చి బ్లీడింగ్ ఆపితే.. తల్లీబిడ్డా ఇద్దరికీ ప్రమాదం. అప్పటి నుంచి ఇలాంటి కేసులకు అదో ఎగ్జాంపుల్ అయింది. ఇటువంటి సిచ్యుయేషన్స్ లో ముందు బిడ్డను బయటకు తీసేసి ఆ తర్వాత తల్లికి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాం.

స్వచ్ఛంద సేవా నా బాధ్యతే

చిన్నప్పటి నుంచి మహిళా హక్కులు, స్త్రీలపై జరిగే అరాచకాలను నిలదీస్తూ వచ్చిన డాక్టర్ మంజులు ఇప్పుడు కూడా ఆ పంథాను వదల్లేదు. 'సుయోష - ఎ పర్ఫెక్ట్ విమెన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. స్కూళ్లకు వెళ్లి ఆడపిల్లలకు పీరియడ్స్, అనీమియాపై అవగాహన కల్పిస్తారు. అనవసర హిస్టరెక్టమీ ఆపరేషన్లపై కూడా ఆమె పెద్ద ఎత్తున పోరాటాన్నే చేశారు. మహిళా సాధికారికత కోసం ప్రత్యూష ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అనాధాశ్రమాల్లో హెల్త్ క్యాంపులు, వాళ్లకు అవసరమైన వ్యాక్సిన్లు ఇస్తూ తనవంతు సాయాన్ని ఆమె చేస్తున్నారు.

image


విరిసిన పద్మం

''డిసెంబర్ వరకూ నాకు తెలియనే తెలియదు. అయితే నామినేషన్స్‌లో మాత్రం నా పేరు ఉందని తెలిసింది. నేను చెన్నైలోని ఓ నేషనల్ కాన్ఫెరెన్స్‌లో ఉన్నప్పుడునాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. నాకు కొద్దిసేపు అర్థం కాలేదు. మరుసటి రోజు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించేంత వరకూ ఎవరికీ చెప్పొద్దని చెప్పడంతో.. ఆ ఆనందాన్ని నాలోనే దాచుకోలేక సతమతమైపోయాను'' అంటూ పద్మశ్రీ జ్ఞాపకాలను పంచుకుని మురిసిపోయారు. జనవరి 2015న డాక్టర్ మంజుల అనగానిని భారత ప్రభుత్వం పద్శశ్రీతో సత్కరించింది. అయితే గతానికీ ఇప్పటికీ తేడా ఏంటీ అని అడిగితే.. బాధ్యత మరింత పెరిగిందని చెప్తారు. ఇలాంటి గుర్తింపులు రెండువైపులా పదునున్న కత్తుల్లాంటివి. అందుకే జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉందంటారు. అయితే ఇప్పుడు తాను చెప్పే మాటలకు విలువ మరింత పెరిగిందని, పేషెంట్లకు కూడా గురి కుదిరి నమ్మకం ఇంకాస్త పెరిగిందని వివరిస్తారు.

డాక్టర్‌ప్రెన్యూర్లకు సలహా

''నేను, నా అనే వాటిని పక్కన పెట్టాలి. మనం ప్రతీ చోటా ఉండలేం. మీకోసం ప్రత్యేక టీమ్ ఉండాలి. మీ ఒక్కరి వల్లే ఏదీ కాదు. అందరూ కలిసి చేస్తేనే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. నాతో పనిచేసే టెక్నీషియన్లు, నర్సులు 1997 నుంచి నాతోనే ఉన్నారు. ఔట్‌సోర్సింగ్ ఎంత వరకూ చేయాలో నిర్ణయించుకోవాలి. అన్నీపనులూ అన్ని చోట్లా మీరే ఉండి చేయలేరు. అడ్మినిస్ట్రేషన్ సహా అన్నీ చూసుకుంటామంటే అది కష్టం. మీకు ఎందులో బలం ఉందో దానిపైనే దృష్టి సారించండి. ఎవరు ఏ పనిలో సమర్థులో వారిని అక్కడ నియమించండి. హార్ట్ వర్క్ చేస్తే తప్పకుండా విజయం మీదే. ఇక లక్ ఫ్యాక్టర్ అంటారా.. అది కేవలం మూడు శాతం మాత్రమే ఉంటుంది. ఎవరైతే మోసాలకు పాల్పడకుండా.. నైతికతకు కట్టుబడి ఉంటారో వాళ్లకే ఆ మూడు శాతం లక్ కలిసొస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కించొద్దు. పనిలోకి దూకండి. ఆ సమస్య వస్తే ఏం చేయాలి.. ఈ ఇబ్బంది వస్తే ఏం చేయచ్చో ముందే పక్కాగా ఆలోచించుకోండి. వచ్చినప్పుడు చూద్దాంలే అనే భావన పనికిరాదు''.

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags