సంకలనాలు
Telugu

స్టార్టప్ సంస్థలకు ఇదో జస్ట్ డయల్ లాంటి సర్వీస్

వ్యాపారరంగంలో అడుగుపెట్టాలని భావిస్తున్నారా? కానీ, ఎలా అని సంశయిస్తున్నారా? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి ? ఎంత పెట్టుబడి పెట్టాలి అన్న సందేహాలు వేధిస్తున్నాయా ? అయితే... వెంటనే జంప్ స్టార్ట్ హాట్ లైన్ (1 (800) 200-2114 ) కు కాల్ చేయండి. మీ సందేహాలు, సమస్యలే కాదు.... మీ వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయన్న వివరాల దగ్గర నుంచి, మీ ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేసుకోవాలి అన్న అంశాలపై కూడా మీకు సమగ్ర సమాచారం అందుతుంది. సోమవారం నుంచి శుక్రవారం (ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకూ) ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఎవరైనా కాల్ చేయవచ్చు.

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఈ జంప్ స్టార్ట్ హాట్ లైన్ ను మైక్రోసాఫ్ట్ వెంచర్స్ లాంచ్ చేసింది. ఇక్కడ పనిచేసేవారందరూ వివిధ వర్గాల వ్యాపార సందేహాలకు నిరంతరం పరిష్కార మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. తమ కాలర్లకు తగిన సలహాలు సూచనలు అందిస్తూనే ఉంటారు. ఈ జంప్ స్టార్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే... ఈ విభాగానికి మూల స్థంభమైన మైక్రోసాఫ్ట్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రజినీష్ మీనన్ గురించి కూడా తెలుసుకోవాల్సిందే..! దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ జంప్ స్టార్ట్ ను లాంచ్ చేసినట్లు చెబుతారు రజినీష్.

ఈ వ్యవస్థతో సుధీర్ఘమైన అనుబంధం ఉన్న రజినీష్.. ఎన్నో పరిశ్రమలను నెలకొల్పడంలో కొత్తవారికి చేయుతనందించారు. నూతన ఆవిష్కరణలపై ఎందరికో అవగాహన కల్పించారు. భారత్ లో పారిశ్రామిక రంగం వేగంగా విస్తరించడాన్ని గుర్తించిన రజినీష్... టైయర్ 2, టైయర్ 3 పట్టణాల్లోనూ ఈ రంగం అభివృద్ధిపై దృష్టిసారించారు.

"వ్యాపార రంగంలో అనుభవం ఉన్నా లేకపోయినా... వివిధ విభాగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, సహకార లోపాలు... కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలకు సవాళ్లుగా మారుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో... ఓ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు అసలు ఏ దిశగా ముందుకు వెళ్లాలో కూడా తెలీటం లేదు. అనవసరమైన వాటిపై ఎక్కువ సమయాన్ని, పెట్టుబడిని పెట్టి చేతులు కాల్చుకునే వారూ ఉంటారు. ఎక్కువ మంది సరైన సమాచారం లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్ల విఫలమవుతున్నారు. ముఖ్యంగా చిన్న నగరాల్లోని పారిశ్రామికవేత్తలను సమాచార లేమి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అయితే జంప్ స్టార్ట్ ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తుంది. 

image


వ్యాపార సంస్థను నెలకొల్పేందుకు సరైన సమాచారం అందించడమే కాకుండా తగిన సలహాలు, సూచనలు అందివ్వడంతోపాటూ... తమ నగరాల్లోనే సదరు విభాగంలో రాణిస్తున్న నిష్ణాతులను పరిచయం చేస్తుంది. దీంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తగిన సమాచారంతోపాటూ... శిక్షణ కూడా లభిస్తుంద"ని తన సుధీర్ఘమైన అనుభవంతో ఈ రంగంలోని లోటుపాట్ల గురించి విడమరచి చెబుతారు రజినీష్.

మైక్రోసాఫ్ట్ అందించిన శిక్షణలో నిష్ణాతులైన నిపుణులు పారిశ్రామిక రంగంలోని వివిధ విభాగాలు, వాటికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్నీ అందిస్తారు. సరైన సాంకేతిక సమాచారం, సదరు సంస్థలకు అవసరమైన సేవలు అందించే వనరుల గురించి తెలియజేయడంతోపాటూ సరైన మార్గంలో ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం కూడా చేస్తారు. " కొన్ని సార్లు ... ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అన్నటువంటి చిన్ని చిన్ని సందేహాలు నివృత్తి చేయడం ద్వారా... ఎంతో విలువైన సమయాన్ని కాపాడుకోవడమే కాకుండా వృధా ఖర్చుల్ని సైతం నిలువరించవచ్చు. అయితే.. జంప్ స్టార్ట్ కొత్త వ్యాపార సూత్రాలను అందరికీ అందిస్తుందే తప్ప... ఖచ్చితమైన లాభాల గురించి హామీ మాత్రం ఇవ్వలేదు. పారిశ్రామిక రంగంలో అందుబాటులోకి వస్తున్న రకరకాల వనరులపై అవసరమైన వారికి సమాచారం అందించగలదే తప్ప నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను కూడా తీసుకోద" స్పష్టం చేశారు రజినీష్ మీనన్.

"నేను కాన్‌పూర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను. కానీ, ఎలా మొదలుపెట్టాలో అర్ధంకావడం లేదు" అనే చిన్న సందేహాలను సైతం జంప్ స్టార్ట్ నివృత్తి చేస్తుంది. బెంగాల్ లో ఓ పరిశ్రమను నెలకొల్పాలనుకునే వారికి ... అక్కడ అందుబాటులో ఉన్న వనరులపై అవగాహన కల్పిస్తూనే, సంస్థను ప్రారంభించడంలో మార్గనిర్దేశం అందిస్తుంది. దీనివల్ల సదరు వ్యక్తికి అవసరమైన సామాగ్రి కోసం దూర దూరాలు ప్రయాణించే బాధ తప్పుతుంది. దేశంలోని ప్రతి కోణంలో ఉన్న పారిశ్రామికవేత్తనీ చైతన్యపరచడమే జంప్ స్టార్ట్ లక్ష్యం. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే.. ఒక్క ఫోన్ కాల్ చేసి మా సహాయాన్ని కోరవచ్చు. ఇది చాలా సులభమైన మార్గం. జంప్ స్టార్ట్ అనేది... నూతన పారిశ్రామికవేత్తలకు జస్ట్ డయిల్ వంటిద"ని అంటారు మీనన్.

అయితే... ఏళ్లుగా స్టార్టప్స్ ను నెలకొల్పడంలో ఎంతో అనుభం సాధించిన జంప్ స్టార్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ వెంచర్స్... ప్రాథమిక స్థాయిలో ప్రతి పారిశ్రామిక వేత్త ఎదుర్కొనే ఓ సాధారణమైన సమస్యను గుర్తించింది. వారి పరిశోధన ప్రకారం నూతన వ్యాపారస్థులు తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా వినియోగించుకోవడంలో వెనుకబడుతున్నారని తేలింది. ప్రతిసారి కొత్త టెక్నాలజీపై ఆధారపడేకన్నా... తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై వారికి మరింత అవగాహన కలిగించాలి. ఈ అంశంపై స్టార్టప్స్ ను మరింత చైతన్య పరిచేందుకు జంప్ స్టార్ట్ కృషి చేస్తోంది. దీనికి తోడు పాన్ ఇండియా సహకారంతో మైక్రోసాఫ్ట్ వెంచర్స్.... స్టార్టప్స్ కు అవసరమైన సమాచారం అందించే లీగల్ అడ్వైజర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల జాబితాలనూ రూపొందించింది.

"నూతన పరిశ్రమలకు అవసరమైన సాధనాలు, వనరులతోపాటూ తగిన సలహాలు-సూచనలు అందిస్తూ... ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రతి అడుగులో తోడ్పాటు అందిస్తోంది మైక్రోసాఫ్ట్ వెంచర్స్. దీనికి తోడు స్టార్టప్స్‌కు మరింత సహకారం అందించేందుకు... బిజ్ స్పార్క్, ఆక్సలరేటర్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వంటి పలు కార్యక్రమాలను సైతం లాంచ్ చేశాము. జంప్ స్టార్ట్ ద్వారా పారిశ్రామికరంగంలోకి మరింత మంది ఔత్సాహికులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. అంతేకాదు.. నిరంతరం అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మా సేవలను మరింత మెరుగుపరచుకునేందూకూ ప్రయత్నిస్తున్నాం" అని చెబుతున్నారు రజినీష్ మీనన్.

ఏప్రిల్ లో జంప్ స్టార్ట్ ను లాంచ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహికులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రోజుకి సగటున 50కాల్స్ ఇక్కడికి వస్తుంటాయి. "2014 ఏప్రిల్, మే మాసాల్లో వివిధ నగరాల నుంచి సుమారు 1500 మంది అవసరమైన సమాచారం కోసం జంప్ స్టార్ట్ ను ఆశ్రయించారు. ఇది మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మధ్యప్రదేశ్, అస్సామ్, కర్ణాటకలోని హుబిలి వంటి ప్రదేశాలనుంచీ మాకు కాల్స్ వస్తుంటాయి". అంతేకాదు... ఐర్ ల్యాండ్ వంటి దేశాలు... ఈ రకమైన సేవలను తమ దేశంలోనూ లాంచ్ చేసేందుకు అవసరమైన సమాచారం కోసం జంప్ స్టార్ట్ కు కాల్ చేస్తున్నారు. NCR ప్రాంతం నుంచి జంప్ స్టార్ట్ కు ఎక్కువ కాల్స్ వస్తుండటం మరో విశేషం. భవిష్యత్తులో SMBల భాగస్వామ్యంతో స్టార్టప్స్ కు మరింత సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ప్రయత్నిస్తోంది.


రజినీష్ మీనన్, మైక్రోసాప్ట్ వెంచర్స్ ఇండియా డైరక్టర్

రజినీష్ మీనన్, మైక్రోసాప్ట్ వెంచర్స్ ఇండియా డైరక్టర్


"దేశవ్యాప్తంగా మా సేవలను విస్తరించడమే మా ప్రస్తుత లక్ష్యం. ముఖ్యంగా టైయర్ 2, టైయర్ 3 నగరాల్లో జంప్ స్టార్ట్ గురించి మరింత మందికి తెలియజేయాలి. దేశంలోని ప్రతి పారిశ్రామికవేత్తకు జంప్ స్టార్ట్ హాట్ లైన్ నంబర్ గురించి తెలియాలి, పారిశ్రామిక రంగం గురించి జనాల్లో చైతన్యం తీసుకురావాలి. తద్వారా దేశ ఆర్ధిక ప్రగతికి తోడ్పడాలి. స్టార్టప్స్ కు మరింత సహాకారం అందించే విధంగా జంప్ స్టార్ట్ ను తీర్చిదిద్దాల"ని అంటారు మీనన్.

"SMBలతో చేతులు కలిపేందుకు ఎదురుచూస్తున్నాం. వ్యక్తిగతంగా నూతన పారిశ్రామికవేత్తలకు మాకు చేతనైనంత సహకారం అందిస్తున్నాం. కానీ, ఈ వ్యవస్థ మరింత మెరుగ్గా సేవలు అందించాలంటే... ఇతరులు కూడా మాతో చేతులు కలిపేందుకు ముందుకు రావాలి. భారత్ స్వతహాగా పారిశ్రామిక దేశం. ఇక్కడ ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. అందుకే భారత పారిశ్రామిక విపణి ఎదుగుదలకు మరింతగా కృషి చేయవచ్చ"ని అంటారు రజినీష్ మీనన్.

యువ పారిశ్రామిక వేత్తలకు రజినీష్ మీనన్ ఇచ్చే సలహా ఒక్కటే...."ఎక్కువ సమయం ఆలోచనలకే వెచ్చించకండి. మీ ఆలోచనలను వెంటనే ఆరచణలో పెట్టండి. అపజయాలకు భయపడకండి. ఎందుకంటే.. వాటి నుంచే మీరు మరిన్ని పాఠాలు నేర్చుకుంటారు. ఇక మైక్రోసాఫ్ట్ వెంచర్స్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని మరచిపోకండి".
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags