సంకలనాలు
Telugu

నాడు ఇంటినుంచి పారిపోయిన కుర్రాడు.. నేడు 30 హోటళ్లకు ఓనర్ అయ్యాడు

సాగర్ రత్న హోటల్స్ అధినేత జయరామ్ సక్సెస్ స్టోరీ

30th Dec 2016
Add to
Shares
60
Comments
Share This
Add to
Shares
60
Comments
Share

కొన్ని కొన్ని సక్సెస్ స్టోరీలు కాల్పనిక కథల్లా, సినిమా కోసం రాసుకున్న స్క్రీన్ ప్లేల్లా ఉంటాయి. జయరామ్ కథ వింటే కూడా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ అతని జీవితం సినిమా కథ కాదు. అలాగని సినిమా కథకు ఏమాత్రమూ తీసిపోదు.

జయరాం జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎక్కడ ఉడిపి.. ఎక్కడ నార్త్ అమెరికా. ఎక్కడ కర్కాల ఎక్కడ కెనడా. పసిప్రాయంలోనే మొదలైంది ఒడిదొడుకుల ప్రయాణం. అదలా తిరుగుతూ తిరుగుతూ చివరికి అందనంత ఎత్తున ఆగింది. ఇవాళ రెస్టారెంట్ బిజినెస్ అంటే ఏంటో- అదెలా చేయాలో జయరామ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఉత్తర భారతదేశం కలుపుకుని, నార్త్ అమెరికా, కెనడా, బ్యాంకాక్, సింగపూర్ ఇలా 30 ఔట్ లెట్ల దాకా వెళ్లింది. సాగర్ రత్న హోటల్ అంటే సాంబారుకే అదొక బ్రాండ్ అంబాసిడర్.

కర్కాల. కర్నాటక ఉడిపి జిల్లాలోని ఒక కుగ్రామం. జయరామ్ పుట్టిన ఊరది. బాల్యం భయంకరంగా గడిచింది. తండ్రి మహా కర్కోటకుడు. ఎందుకు కొడతాడో, ఎప్పుడు కొడతాడో తెలియదు. కళ్లలో కారం పోసి మరీ దంచేవాడు. అప్పుడు జయరామ్ కు 13 ఏళ్లు. ఏదో పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇంటికి వెళ్తే జరిగే సీన్ ఏంటో తెలుసు. కారంపొడి డబ్బాలు.. దుడ్డు కర్రలు.. బాబోయ్ తలుచుకుంటేనే వళ్లు గగుర్పొడిచింది. ఆ దెబ్బలు తినే బదులు ఎక్కడికైనా తప్పించుకుని పారిపోతే బెటర్ అనిపించింది. తిన్నగా ఇంటికి వెళ్లాడు. లక్కీగా నాన్న లేడు. ఆయన చొక్కా జేబులు వెతికితే కొంత డబ్బు కనిపించింది. తీసుకుని బయటపడ్డాడు.

image


ముంబై బస్సు ఎక్కాడు. అక్కడికి వెళ్లి ఏం చేయాలి.. ఎక్కడ ఉండాలి.. బస్సెక్కేముందు ఇవేం ఆలోచించలేదు. నాన్న కొడతాడన్న ఒకే ఒక్క భయంతో మహానగరానికి బయల్దేరాడు. అక్కడొక వ్యక్తి తారసపడ్డాడు. అతనిదీ జయరామ్ గ్రామమే. కుర్రాడి పరిస్థితి విని చేరదీశాడు. తను పనిచేసే క్యాంటీన్ కు తీసుకెళ్లాడు. అక్కడ అంట్లు తోమే పనికి కుదిరాడు. అంతా కొత్త వ్యవహారం. సరిగా చేయడం లేదని యజమాని చెప్పుతో కొట్టేవాడు. ఆ దెబ్బలకు భయపడలేదు. సరికదా ఇంకా కష్టపడేలా రాటుదేలాడు. మెల్లిగా ప్యాంట్రీ నుంచి వెయిటర్ పోస్టుకి మారాడు. ఆ తర్వాత మేనేజర్ అయ్యాడు.

ఎప్పుడూ ఒకరి కింద పనిచేయడమేనా? సొంతంగా ఏమీ చేయలేమా..? ఈ ప్రశ్నలు జయరామ్ ను పదేపదే వెంటాడేవి. ఎప్పటికైనా ముంబైలో సౌతిండియన్ రెస్టారెంట్ ప్రారంభించాలనేది అతడి కల. కానీ అప్పటికే సిటీలో దక్షిణాది వంటకాల హోటల్స్ చాలా ఉన్నాయి. వర్కవుట్ అయ్యేలా కనిపించలేదు. అందుకే ఢిల్లీలో ఓపెన్ చేయాలని డిసైడయ్యాడు.

రోడ్డువారగా వేసినవి కాదుగానీ.. ఓ మోస్తరు హోటల్ చూసుకున్నా దోశె చాలా కాస్ట్. ఆ పాయింట్ మీద జయరామ్ తీవ్రంగా ఆలోచించాడు. క్వాలిటీని అలాగే ఉంచి రేటుని ఎందుకు మార్చకూడదు.

అది 1986. జయరామ్ మొదటి హోటల్ ప్రారంభమైంది. తొలిరోజు గల్లాపెట్టెలో రూ. 470 పడ్డాయి. అలా మొదలైన బిజినెస్ రోజురోజుకీ పరుగులు పెట్టింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా మెనూ మార్చాడు. జనం జయరామ్ హోటల్లో తినడానికి జనం ఎగబడ్డారు. హోటల్ పేరు సాగర్ అని పెట్టాడు. పేరు విషయంలో పెద్దగా ఆలోచించాలనుకోలేదు. ఎందుకంటే క్యాజువల్ గా ఉండే పేరునే వాడాలని అనుకున్నాడు.

నాలుగేళ్ల తర్వాత హై-ఫై రేంజిలో మరో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. కానీ మెనూ మాత్రం సేమ్. కాకపోతే రేటు 20 శాతం పెరిగింది. ఢిల్లీలో సాంబార్ అంటే జయరామ్ హోటలే. మరెక్కడా దానంత టేస్టీ రెసిపీ దొరకదు. ఇది కస్టమర్లు చేసిన ఏకగ్రీవ తీర్మానం.

కొంతకాలం తర్వాత మరో స్టోర్ ఓపెన్ చేశాడు. సాగర్ రెస్టారెంట్ పేరుకు రత్న అనే పదాన్ని జోడించాడు. సాగర్ రత్న రెస్టారెంట్ అలా అనతికాలంలోనే ఢిల్లీ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించింది.

హోటల్ అంటే జయరామ్ ఉద్దేశంలో కేవలం తినే ప్రదేశం కాదు. అదొక పవిత్రమైన స్థలం. పొద్దున్నే తొమ్మిదింటికి ఇంటి నుంచి బయల్దేరుతాడు. రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటాడు. ఆ మధ్యలో వివిధ బ్రాంచీలను సందర్శించి వస్తాడు. శుభ్రత విషయంలో అస్సలు రాజీపడడు. కిచెన్ లో ఒక్క ఈగ కనిపించినా సహించడు. అదొక్కటే కాదు.. ఫలానా టిఫిన్/ఫుడ్ బాగాలేదని ఎవరైనా ఫీడ్ బ్యాక్ ఇచ్చినా.. దాన్ని తయారుచేసిన వంటవాళ్లను టాలరేట్ చేయడు. స్వాగత్ పేరుతో మరో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. కోస్టల్ ఫుడ్ స్పెషాలిటీ. అది కూడా బ్రహ్మాండంగా క్లిక్కయింది.

గుండెనిండా దమ్మూ, ధైర్యం, చిత్తశుద్ధి, తపన.. వెరసి జయరామ్ ను విజయతీరాన నిలబెట్టాయి. కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు.. అని చెప్పడానికి అతనే పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏ క్యాంటీన్ లో అయితే ఎంగిలి ప్లేట్లు కడిగాడో- అలాంటి క్యాంటీన్లను, కాదు కాదు హోటళ్లనే స్థాపించి.. సౌతిండియా సాంబారు సత్తా ఏంటో చూపించిన మొనగాడు జయరామ్.

Add to
Shares
60
Comments
Share This
Add to
Shares
60
Comments
Share
Report an issue
Authors

Related Tags