సంకలనాలు
Telugu

ఆలుగడ్డలు అమ్మి కోట్లు సంపాదించాడు..!

RAKESH
22nd Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

బ‌త‌క‌డానికి ఇంకేమీ అక్క‌ర్లేదు నాలుగు ఆలుగ‌డ్డ‌లు ఉంటే చాలు! ఈ మ‌ధ్య వ‌చ్చిన ఓ సినిమా డైలాగ్ ఇది! బ‌త‌క‌డ‌మే కాదు, ఆలుగ‌డ్డ‌ల‌తో కోట్లు కూడా సంపాదించ‌వ‌చ్చ‌ని నిరూపించాడో వ్య‌క్తి. కార్పొరేట్ జాబ్ కాద‌ని, చిన్న వ్యాపారం మొద‌లు పెట్టి ఇప్పుడు కరోడ్ ప‌తి అయ్యాడు! పుణె ఆంట్ర‌ప్రెన్యూర్ హేమంత్ గౌర్ విజ‌యగాథ ఇది..

image


కిచెన్ కింగ్ ఆలూ

ఆలూ! ఈ పేరు చెప్ప‌గానే చాలా వంట‌కాలు గుర్తొస్తాయి! లొట్ట‌లు వేసుకుంటూ తినే వేపుడు, క‌ర‌క‌ర‌లాడే చిప్స్, నోరూరించే కుర్మా- ఇలా చెప్పుకుంటూ పోతే ఆలూతో చాలా వెరైటీలే వండొచ్చు! పిల్ల‌ల‌కు త్వ‌ర‌గా లంచ్ బాక్స్ రెడీ చేయ‌డానికి గృహిణులు ముందుగా చూసేది పొటాటో వైపే! మీకో విష‌యం తెలుసా? ఇండియ‌న్లు రోజుకు ల‌క్ష ట‌న్నుల ఆలుగ‌డ్డ‌లు తింటార‌ట! ఆలుగ‌డ్డ‌ల దిగుబ‌డిలో చైనా త‌ర్వాతి స్థానం మ‌న‌దే! గత ఏడాది ఇండియా 4.75 కోట్ల ట‌న్నుల ఆలుగ‌డ్డ‌ల‌ను పండించింది. గోధుమ‌లు, బియ్యం, మొక్క‌జొన్నల త‌ర్వాత మ‌నం ఎక్కువ‌గా తీసుకునే ఆహార ప‌దార్థం ఆలూనే!

శ‌తాబ్దాల చ‌రిత్ర‌..

17వ శ‌తాబ్దంలో యూరోపియ‌న్లు మ‌న దేశానికి పొటాటోల‌ను ప‌రిచ‌యం చేశారు. ఆలూ రుచేంటో చూపించారు. భూమిలో పండే ఈ ఆలుగ‌డ్డ‌ల్లో పోషకాలు పుష్క‌లం. కార్పొహైడ్రేట్లు, ప్రోటీన్స్, మిన‌ర‌ల్స్, విట‌మిన్స్, హై క్వాలిటీ ఫైబ‌ర్- ఇలా చాలానే ఉంటాయి. పైగా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. ప‌ప్పుధాన్యాలు, కూర‌గాయ‌ల క‌న్నా ఆలుగ‌డ్డ‌ల్లోనే పోష‌క ప‌దార్థాలు ఎక్కువ‌ని సెంట్ర‌ల్ పొటాటో రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సీపీఆర్ఐ) ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

కాసుల పంట‌..!

పోష‌కాలు, రుచి సంగతి స‌రే! మ‌రి ఈ ఆలుగ‌డ్డ‌తో కోట్లు ఎలా సంపాదించ‌వ‌చ్చు? అది తెల‌సుకోవాలంటే ముందు హేమంత్ గౌర్ కథలోకి వెళ్లాలి. హేమంత్ వ‌య‌సు 45. ఢిల్లీ ద‌గ్గ‌ర్లోని ప‌త్ప‌ర్ గంజ్ అనే కుగ్రామంలో సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. ఉత్త‌రాఖండ్ జీబీ పంత్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. ఐఆర్ఎంఏ యూనివ‌ర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ పూర్తయింది.

చదువ‌య్యాక 16 ఏళ్ల పాటు మారికో, ఐటీసీ, వాల్మార్ట్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో ప‌నిచేశారు. ఉద్యోగ అనుభ‌వంలో నుంచే ఆయ‌న‌కు పొటాటో బిజినెస్ ఐడియా వ‌చ్చింది. పొలం నుంచి పళ్లెం లోకి చేరే దాకా పొటాటో స‌ప్లై చెయిన్ అస్త‌వ్య‌స్తంగా ఉంద‌ని గుర్తించారు. ఈ అంత‌రాల వ‌ల్లే ఆలూ విలువ త‌గ్గిపోతోంద‌ని తెలుసుకున్నారు. స‌ప్లై చైన్ ను ఒక ఆర్డ‌ర్ లోకి తెచ్చి, క్ర‌మ‌బ‌ద్ధం చేస్తే ఆలుగడ్డకు ఒక అర్ధం పరమార్ధం క‌ల్పించ‌వ‌చ్చని గుర్తించారు. కార్పొరేట్ జాబ్ కు గుడ్ బై చెప్పి, ఆంట్ర‌ప్రెన్యూర్ అయిపోవాలని డిసైడయ్యారు. కానీ త‌న‌కు ఎవ‌రు సాయం చేస్తారు? కుటుంబంలో అంద‌రూ ఇంజ‌నీర్లే. కానీ ఎవ‌రికీ బిజినెస్ అనుభవం లేదు. ఐడియా అంతకన్నా లేదు. 35 ఏళ్లు నిండేలోపు ఏదో ఒక‌టి చేసేయాల‌న్న‌దే హేమంత్ ఆలోచ‌న‌. మంచి జాబ్. వ‌దిలేయ‌డం రిస్కే. బిజినెస్ బెడిసి కొడితే అప్పులే మిగులుతాయి. కానీ త‌న మీద త‌న‌కో న‌మ్మ‌కం. సాధించ‌గ‌ల‌న‌న్నధీమా. దానికి కొంద‌రు రైతులు ఇచ్చిన ధైర్య‌మూ తోడైంది. ఇంకేం ఆలోచించ‌కుండా ధైర్యంగా వ్యాపారంలోకి దిగారు హేమంత్.

కంపెనీ నేప‌థ్య‌మిదీ..

2008లో సిద్ధి వినాయ‌క ఆగ్రి ప్రాసెసింగ్ (ఎస్వీ ఆగ్రి) పేరుతో పుణెలో కంపెనీ ప్రారంభించారు హేమంత్. కంపెనీకి డైరెక్ట‌ర్ ఆయ‌నే. గ‌ణేష్ ప‌వార్ అనే వ్య‌క్తి కో-ఫౌండ‌ర్. ఇదొక స‌ప్లై చైన్ కంపెనీ. ఆలూ రైతుల‌కు ప్రీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ సొల్యూష‌న్స్ ఇవ్వ‌డ‌మే కంపెనీ ఉద్దేశం. సిరీస్ బి ఫండింగ్ కింద‌ కంపెనీ ఈ మధ్యే రూ.25 కోట్ల నిధులు సేక‌రించింది. లోక్ క్యాపిట‌ల్ రూ.15 కోట్లు, ఆస్పాదా కంపెనీ రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. 2011లో సోరోస్ ఎక‌నామిక్ డెవ‌ల‌ప్ మెంట్ ఫండ్, ఓమిడ్యార్ నెట్ వ‌ర్క్, గూగుల్ కంపెనీల నుంచి రూ.5 కోట్ల ఫండ్ సేక‌రించారు. కంపెనీ ప్ర‌స్తుత ఆదాయం రూ.60 కోట్లు! వ‌చ్చే మూడేళ్ల‌లో దాన్ని రూ.500 కోట్ల‌కు పెంచాల‌న్న‌దే హేమంత్ టార్గెట్.

నిజానికి ఆలూది పెద్ద‌ మార్కెటే అయిన‌ప్ప‌టికీ.. వ్యాపారులంద‌రిదీ ఒకటే ఆందోళ‌న. స‌ప్ల‌య్ చైన్ లో అడ్డంకుల‌న్నీఅధిగ‌మించి నిల‌బ‌డ‌టం పెద్ద స‌వాల్. సీడ్స్ అమ్మేదొక‌రు, పంట పండించేది ఒక‌రు. స్టోర్ చేసేది మ‌రొక‌రు. చివ‌ర‌గా ఆ పంట‌ను కొనేది వేరొక‌రు. ఇలా స‌ప్లై చెయిన్ అతుకుల బొంత‌లా త‌యారైంది. దాన్ని స‌రిచేసి, పంట‌కు ఒక విలువ తీసుకురావాల‌ని హేమంత్ నిర్ణ‌యించుకున్నారు. ఈ చైన్ లో వీలైన ప్ర‌తి చోటా టెక్నాల‌జీ ఉప‌యోగించారు. చివ‌రికి అనుకున్న‌ది సాధించారు.

నిజంగా నేను చాలా ల‌క్కీ. ఆ రోజు రైతులిచ్చిన ధైర్య‌మే న‌న్ను ముందుకు న‌డిపించింది. ఆ భావోద్వేగ‌పూరిత పెట్టుబడికి వెల క‌ట్ట‌లేం. రైతులంద‌రికీ నా కంపెనీలో వాటాలిచ్చి వారి రుణం తీర్చుకున్నా. ఎంత లేద‌న్నా ఇంకో ప‌దేళ్లు పొటాటో మార్కెట్లో ఉంటా- హేమంత్
హేమంత్ గౌర్

హేమంత్ గౌర్


టెక్నాల‌జీ క్రాప్స్..

క‌మ్మ‌టి బంగాళాదుంప ఫ్రై వాసన రాని ఇల్లే ఉండ‌దంటే న‌మ్మండి. అంతేనా, ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు ఫ్రంట్ పేజీ న్యూస్ తో దేశాన్ని కుదిపేసి, ప్ర‌భుత్వాల్ని కూలదోసే శ‌క్తి కూడా ఆలుగ‌డ్డ‌కు ఉంది! అందుకే చాలా మంది రైతులు ఆలుగ‌డ్డ‌ను వాణిజ్య పంట కింద లెక్కేస్తారు. పెద్ద‌గా టెక్నాల‌జీ అవ‌స‌రం లేకుండా ఆలుగ‌డ్డ‌లు పండించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. నిజానికి మ‌నది బ‌యాలాజిక‌ల్ మార్కెట్. పొటాటో సీడ్ (ఆలుగ‌డ్డ‌ 90 రోజుల పంట‌) త‌యారు చేసి, అది రైతుల‌కు చేరాలంటే క‌నీసం నాలుగేళ్ల‌యినా ప‌డుతుంద‌ని హేమంత్ అంటున్నారు.

ఆలూ టిక్కీలు. ఇమేజ్ : గెట్టీ ఇమేజెస్

ఆలూ టిక్కీలు. ఇమేజ్ : గెట్టీ ఇమేజెస్


ఎస్వీ అగ్రి కంపెనీ ఆలూ పంట ఉత్ప‌త్తిలో ఏరోపోనిక్స్ అనే వినూత్న టెక్నాల‌జీని ఉప‌యోగిస్తోంది. అంటే, మ‌ట్టి అవ‌స‌రం లేకుండా గాలిలో లేదా పొగ‌మంచు వాతావ‌ర‌ణంలో మొక్క‌లు పెంచ‌డం అన్న మాట‌. దీనిద్వారా క్వాలిటీకి క్వాలిటీ, ఆదాయానికి ఆదాయం! అలా త‌యారు చేసిన విత్త‌నాల‌ను ల్యాబ్ లో వృద్ధి చేస్తారు. పొటాటో అనేది జిరాక్స్ మిష‌న్ లాంటిది. ఇందులో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రెండూ ఉంటాయి. సాఫ్ట్ వేర్ కోసం ర‌క‌ర‌కాల మొల‌క‌లను సేక‌రించాలి. ఇక హార్డ్ వేర్ కోసం ఏరోపోనిక్ ల్యాబ్స్ కావాలి. ప్ర‌స్తుతం ఎస్వీ కంపెనీలో సీపీఆర్ఐ, డ‌చ్ వెరైటీ సీడ్స్ ఉత్ప‌త్తి చేస్తున్నారు. త్వ‌ర‌లోనే కొత్త వెరైటీల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తామంటున్నారు హేమంత్.

ప్ర‌స్తుతం ఇండియాలో ప‌ది నుంచి ప‌న్నెండు ర‌కాల విత్త‌నాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. అదే నెద‌ర్లాండ్స్ లో అయితే 50 వెరైటీల సీడ్స్ దొరుకుతాయి. బీహార్ లాంటి మార్కెట్లో కిలో రెండు నుంచి మూడు రూపాయ‌ల‌కు దొరికే పొటాటో ర‌కాలు కూడా ఉన్నాయి. రైతుల కోసం నాణ్య‌మైన విత్త‌నాల‌ను త‌యారు చేసే అవ‌కాశాలు మ‌న‌కూ ఉన్నాయంటారు హేమంత్. దాని ద్వారా మార్కెట్లో పోటీ పెరుగుతుంది, రైతు కూడా మోస‌పోయే ఛాన్స్ ఉండ‌ద‌ని విశ్లేషిస్తారు.

రైతులకు వరం..

దేశ‌వ్యాప్తంగా మూడు వేల మంది రైతుల కోసం ఎస్వీ అగ్రి కంపెనీ విత్త‌నాలు ఉత్ప‌త్తి చేస్తోంది. తిరిగి వారి నుంచి కొంత‌ పంట కొనుగోలు చేస్తుంది. అలా కొన్న పంట‌ను మెక్ కెయిన్, ఆకాశ్ న‌మ్కీన్, యెల్లో డైమండ్, పెప్సికో, ఐటీసీ లాంటి 65 కంపెనీల‌కు విక్ర‌యిస్తుంది. ట్రెయినింగ్, స‌ప్లై మెష‌న‌రీ విష‌యంలో కంపెనీల‌కు స‌హ‌కారం కూడా అందిస్తుంది. చాలా సంద‌ర్భాల్లో కంపెనీల‌కు స్టాక్ అంతా ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలో తెలియ‌దు. పీలింగ్ ప్రాసెస్ (ఆలుగ‌డ్డ‌ల తొక్క తీయడం)లో ప‌ది శాతం ఆలుగ‌డ్డ‌లు పాడైపోతాయి. అలాంటి విష‌యాల్లో ఎస్వీ అగ్రి కంపెనీ వాళ్లు ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌హ‌క‌రిస్తుంటారు. ఇక‌పోతే మూయిజ్ అనే డ‌చ్ కంపెనీతో క‌లిసి ఎస్వీ అగ్రి కంపెనీ స్టోరేజీ రూములు ఏర్పాటు చేసుకుంది. గుజ‌రాత్, ఇండోర్, ఉత్త‌ర ప్ర‌దేశ్, బెంగాల్ లోని స్టోరేజీ రూముల్లో వెంటిలేష‌న్ కు టెక్నాల‌జీని వాడింది.

దిగుబ‌డిని పంట పొలం నుంచి వినియోగ‌దారుడికి చేర్చే దాకా ఎండ్ టు ఎండ్ స‌ప్లై చెయిన్ గా ఎస్వీ కంపెనీని తీర్చిదిద్దాం. ప్ర‌యోగ శాల ద్వారా రైతుల స‌మ‌స్యలకు ప‌రిష్కారాలు క‌నుగొంటున్నాం- ఆస్పాదా కంపెనీ కో ఫౌండ‌ర్ కార్తీక్ శ్రీవాస్త‌వ‌

పోటీని త‌ట్టుకొని..

దిగ్గ‌జ కంపెనీల‌తో పోటీ ఉంటుంద‌ని కంపెనీ పెట్టే ముందే హేమంత్ భావించారు. కానీ ఐటీసీ, పెప్సికో, కాడిలా (ఆగ్రో), మ‌హీంద్రా అగ్రి బిజినెస్ లాంటి కొన్నికంపెనీలు మాత్ర‌మే స్ట్రీమ్ లైన్డ్ స‌ప్ల‌య్ చైన్ ప‌ద్ధ‌తిలో వ్యాపారం చేస్తున్నాయ‌ని తెలుసుకున్నాడు. దాన్నే అస్త్రంగా మ‌లుచుకొని బిజినెస్ లోకి దిగాడు. ఇప్పుడా కంపెనీ పెప్సికో, ఐటీసీల‌కు పొటాటోల‌ను స‌ప్లై చేసే స్థాయికి ఎదిగింది. విత్త‌నాల ఉత్ప‌త్తి విష‌యంలో వాటితో పోటీ ప‌డుతోంది. మార్కెట్లో నాణ్య‌మైన సీడ్స్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు మూడు శాత‌మేన‌ని, మిగ‌తా 97 శాతం కంపెనీల‌తోనే త‌న పోటీ అంటున్నారు హేమంత్.

రైతుల నుంచి ఆలుగ‌డ్డ‌లు కొన‌డం కష్ట‌మైన ప‌నే. కానీ అలాంటి స‌మ‌యంలో నేను డ‌బ్బుకు బదులు డ్రీమ్స్ ఆఫ‌ర్ చేస్తా- హేమంత్

ఉద్యోగుల‌కు మార్గ‌దర్శి!

ప్ర‌స్తుతం ఎస్వీ అగ్రి కంపెనీలో 50 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్లు కూడా ఇక్క‌డ ప‌నిచేస్తున్నారు. ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ నుంచి తొలి ఉద్యోగిని నియ‌మించుకున్నారు. ఒక‌ప్పుడు హేమంత్ కూడా ఐటీసీ లాంటి కంపెనీలో ఉద్యోగే! కానీ ఇప్పుడు అదే కంపెనీలో ఐదు శాతం షేర్లు ఆయ‌న సొంతం. ఆ కార్య‌దీక్షే ఆయ‌న‌ను త‌న ఉద్యోగుల‌కూ మార్గ‌ద‌ర్శిగా మార్చింది. కార్పొరేట్ కంపెనీల్లో ప‌నిచేస్తున్న‌ప్పుడు త‌న‌కూ ఇగో ప్రాబ్స‌మ్స్ ఉండేవ‌ని హేమంత్ గుర్తు చేసుకుంటారు. ఆంట్ర‌ప్రెన్యూర్ అయ్యాక ఈగోను త‌గ్గించుకుని, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాన‌ని అంటున్నారు. ఇంకో యాభై ఏళ్ల‌యినా ఇలాగే సంతోషంగా బ‌తికేస్తాన‌న్న ఒక ధీమా ఆయ‌న క‌ళ్ల‌ల్లో మెరుస్తుంటుంది.

ఆలూ ఫ్రైకి ఫ్యాన్..!

పొటోటా వ్యాపారి అయిన హేమంత్ కు ఆలూ ఫ్రై ఫేవ‌రెట్ డిష్. స‌లాడ్ కూడా ఇష్టంగా తింటారు. ఆయ‌న‌ స‌క్సెస్ ఓవ‌ర్ నైట్ వ‌చ్చింది కాదు. వ్య‌వ‌సాయం భారంగా మారిన ఈ దేశంలో ఆయ‌న ఒక ఆధునిక రైతుగా లాభాల పంట పండిస్తున్నారు. ప‌ది మంది రైతుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇదంతా ఆలూ మ‌హిమ‌!

విన్నీ ద పూహ్ పుస్త‌క ర‌చ‌యిత ఏఏ మిల్నే లాగా నేనూ ఒక మాట చెప్తాను. ఆలూను ఇష్ట‌ప‌డే వారు కచ్చితంగా మంచి మ‌న‌సున్న మ‌నుషులే అయి ఉంటారు- హేమంత్
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags