సంకలనాలు
Telugu

హ‌స్త‌క‌ళ‌ల‌ను పోత్రహిస్తూ, క‌ళాకారుల‌ను ఆదుకుంటున్న ఎత్నిక్‌షాక్‌

హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ పెంచేందుకు ప్ర‌య‌త్నంగ్రామీణ క‌ళాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్న ఎత్నిక్‌ షాక్‌క‌ళాకారుల జీవితంలో మార్పులు తెచ్చేందుకు కృషిమ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా ఉత్ప‌త్తుల త‌యారీ

GOPAL
10th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఐదంకెల జీతం. సుఖ‌వంత‌మైన ఉద్యోగం.. ప్ర‌తి ఒక్కరు ఇలాంటి ఉద్యోగాన్నే కోరుకుంటారు. ఐతే ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీజ‌త భ‌ట్నాగ‌ర్ మాత్రం కాస్త డిఫ‌రెంట్‌. ఒక‌రి చేతి కింది ప‌నిచేసే త‌త్వం కాదు. స్వ‌తంత్రంగా సంస్థ‌ను ఏర్పాటు చేసి న‌లుగురిని ఆదుకోవాల‌న్న‌దే ఆమె అభిమ‌తం. అందుకే మంచి ఉద్యోగాన్ని కూడా వ‌దులుకుని ఎత్నిక్‌షాక్‌ను ఏర్పాటు చేసి హ‌స్త‌క‌ళ‌ల‌ను ప్రోత్స‌హిస్తూ, క‌ళాకారుల‌ను ఆదుకుంటున్నారు.

ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో యాజ‌మాన్యం నిర్వ‌హించే ఆన్‌లైన్ ప్రాడ‌క్ట్‌లో శ్రీజ‌త భ‌ట్నాగ‌ర్‌ది మంచి జాబ్‌. కానీ నిజజీవితంలో రెబ‌ల్‌గా ఉండే ఆమె హృద‌యంమూ, మ‌న‌సు ఎప్పుడూ కొత్తద‌నం కోరుకుంటుంది. ఏదో సాధించాల‌ని అన్వేషిస్తుంటుంది. ఈ అన్వేష‌ణ ఫ‌లితంగానే శ్రీజ‌త అడుగులు హ‌స్త‌క‌ళ‌ల‌వైపు న‌డిచాయి. హ‌స్త‌క‌ళ‌లను త‌యారుచేసే కుల వృత్తిదారుల‌కు/క‌ళాకారుల క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ల‌భించేలా చేయాల‌ని ఆమె సంక‌ల్పించారు. ఈ సంక‌ల్పంతోనే ఎథ్నిక్‌షాక్ పేరుతో ఓస్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. ఎథ్నిక్‌షాక్ అంటే తెలుగులో జాతుల కుటీరం. హ‌స్త‌క‌ళ‌ల‌ను ప్ర‌మోట్ చేసేందుకు సామాజిక వ్య‌వ‌స్థాక‌ప‌కుల బృందం ప్రారంభించిన ఆర్టెప్రెన్యూర్స్‌లో శ్రీజ‌త చేరారు. త‌న ల‌క్ష్యాన్ని, ప్ర‌యాణానికి సంబంధించిన విష‌యాల‌పై శ్రీజ‌త యువ‌ర్‌స్టోరీకి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. యువ ఎంట‌ర్‌ప్రెన్యూర్స్‌కు కొన్ని టిప్స్‌తోపాటు సూచ‌న‌లు అంద‌జేశారు. శ్రీజ‌త‌ చెప్పిన విష‌యాలు ఆమె మాట‌ల్లోనే..

ఎథ్నిక్‌షాక్ రూపొందించిన బ్యాగ్‌

ఎథ్నిక్‌షాక్ రూపొందించిన బ్యాగ్‌


బాల్యం అంతా ప్ర‌యాణాల మ‌యం..

మాది పశ్చిమ‌బెంగాల్ రాష్ట్రం. నాన్న‌కు త‌ర‌చూ ట్రాన్స్‌ఫ‌ర్లు అవుతుండేవి. త‌రుచుగా ప్ర‌యాణాలు చేయాల్సి రావ‌డంతో ఏ ప‌రిస‌రాలతోనూ కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండేలేక‌పోయాను. ఎప్పుడైతే ప‌రిస‌రాల‌కు అల‌వాటుప‌డుతున్న‌ట్టు అనిపిస్తుందో.. అప్పుడు మ‌రో ట్రాన్స్‌ఫ‌ర్‌. ఇలా బాల్యం మొత్తం ప్ర‌యాణాల‌తోనే సాగింది. ఇదే నా వ్య‌క్తిత్వాన్ని మ‌ల్చింది. న‌న్ను ఓ మ‌నిషిగా తీర్చిదిద్దింది. కొత్త కొత్త ప‌రిస‌రాల‌తో అల‌వాటుప‌డే త‌త్వాన్ని ఏర్ప‌ర్చింది. మ‌న‌కు ఇంకో అవ‌కాశం లేన‌ప్పుడు మార్పును ఆస్వాదించాల్సిందే. జీవితంలోని చిన్న చిన్న విష‌యాల‌నూ ప్ర‌శంసించాల్సిందే.

శ‌్రీజ‌త‌, ఎత్నిక్‌షాక్ వ్య‌వ‌స్థాప‌కురాలు

శ‌్రీజ‌త‌, ఎత్నిక్‌షాక్ వ్య‌వ‌స్థాప‌కురాలు


సంప్ర‌దాయాల‌కు, విలువ‌ల‌కు ప్రాణ‌మిచ్చే కుటుంబం మాది. నాన‌మ్మకు చ‌దువంటే పిచ్చి. కానీ ఓ వ‌య‌సు వ‌చ్చాకా స్కూల్‌కు వెళ్ల‌లేక‌పోయారు. అయినా చ‌దువుపై మ‌క్కువ‌పోలేదు. నా పుస్త‌కాలు తీసుకుని మ‌రీ చ‌దివేవారు. కొత్త కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించేవారు. ఇక తాత‌య్య మంచి డాక్ట‌ర్‌. మా ఊరిలో ఆయ‌న‌కు ఎంతో మంచి పేరు ఉండేది. ఇంత సంప్ర‌దాయ ఫ్యామీలి నుంచి వ‌చ్చిన నేను మాత్రం ఓ రెబ‌ల్‌. న‌న్ను ఫైట‌ర్‌గా అమ్మా నాన్నే తీర్చిదిద్దారు. స‌మ‌స్య‌ను ఆత్మ‌విశ్వాసంతో ఎదుర్కోవాల‌ని చిన్న‌ప్ప‌టినుంచే వారు నేర్పించారు. నాకు ఇంకా గుర్తుంది. చిన్న‌ప్పుడు నేను ఎక్కువ‌గా త‌గువులు ప‌డేదాన్ని. ముఖ్యంగా మ‌గపిల్ల‌ల‌తో. నేను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కూడా నాన్న న‌న్ను ర‌క్షించేందుకు వ‌చ్చేవారు కాదు. కానీ వారితో త‌ల‌ప‌డేందుకు న‌న్ను ప్రోత్స‌హించేవారు. నాన్న నాకు చిన్న‌ప్పుడు చెప్తుండేవారు. "నీకు 18 ఏళ్ల వ‌చ్చిన త‌ర్వాత నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. నీ భారాన్ని నీవే భ‌రించాల్సి ఉంటుందీ అని". అన్నంత‌ప‌ని చేశారాయ‌న‌. ట్వెల్త్ స్టాండ‌ర్డ్ పూర్త‌వ‌గానే న‌న్ను హాస్ట‌ల్‌లో చేర్పించారు. అప్ప‌టి నుంచి నేను ఒంట‌రిగానే జీవించాను. మొద‌ట కోల్‌క‌తా. ఆ త‌ర్వాత చెన్నై.. చివ‌ర‌కు బెంగ‌ళూరు.

బెంగ‌ళూరుకు రావాల‌ని నేన‌స‌లు అనుకోనేలేదు. ఆ ప్ర‌యాణం ఊహించ‌నిది. ఎంబీఏ పూర్త‌యిన త‌ర్వాత చెన్నైలో ఓ కంపెనీలో ప‌నిచేసేదాన్ని. అప్పుడే నాకు పెళ్ల‌యింది. నా భ‌ర్త మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తుండేవారు. అప్పుడే బెంగ‌ళూరులో మంచి జాబ్ దొరికింది. ఆయ‌న‌ను ఫాలో అవుతూ నేనూ బెంగ‌ళూరు వ‌చ్చేశాను. ఇక వ్యాపారం విష‌యానికొస్తే.. మా ఫ్యామిలీలోనే నేను తొలి వ్యాపార‌వేత్త‌ను. మా కుటుంబంలో అంద‌రూ ఉద్యోగ‌స్తులే. అయితే ప్ర‌భుత్వంలో లేదంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో సెటిల్ అయిన‌వారే. మా అమ్మ గృహిణి. అందుకే కార్పొరేట్ క‌ల్చ‌ర్‌ను అర్థం చేసుకోవ‌డం వారికి క‌ష్ట‌మైంది. వ్యాపారాన్ని ప్రారంభించే విష‌యంలో వారితో చాలారోజుల‌పాటు చ‌ర్చించాల్సి వ‌చ్చింది. మంచి ఉద్యోగాన్ని వ‌దులుకుని వ్యాపారం ప్రారంభిస్తాన‌న్న విష‌యం తెలియ‌గానే మా అమ్మా నాన్న అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. అయితే నా ప‌నితీరు, క‌ష్టించేత‌త్వం తెలిసి చివ‌ర‌కు ఒప్పుకున్నారు.

మోసం చేస్తున్న యంత్రాలు

ప్ర‌స్తుతం మ‌న సంప్ర‌దాయ‌, వార‌స‌త్వ కుటీర ప‌రిశ్ర‌మ చాలా క‌ష్టాల్లో ఉంది. చేతుల‌తో చేసిన అద్భుతాల‌ను యంత్రాలు కాపీ కొడుతూ త‌క్కువ ధ‌ర‌కే ఇమిటేష‌న్ డిజైన్ల‌ను త‌యారుచేస్తున్నాయి. చేతుల‌తో క‌ష్ట‌ప‌డి త‌యారుచేసిన డిజైన్లు, యంత్రాల‌తో త‌యారుచేసిన‌వి రెండూ కూడా ఒకేలా క‌నిపిస్తూ అంద‌రినీ మోసం చేస్తున్నాయి. యంత్రాల‌తో త‌యారుచేసిన చాలావాటిని హ్యాండ్‌మేడ్‌గా పేర్కొంటూ ద‌ళారులు విక్ర‌యిస్తున్నారు. అయితే నిజంగా చేతుల‌తో త‌యారుచేసిన ఏ ఉత్ప‌త్తిని యంత్రాల‌తో త‌యారుచేసిన‌వి రిప్లేస్ చేయ‌లేవు. హ్యాండ్ మేడ్ ఉత్ప‌త్తులు వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన‌వి. వాటిని ప్రేమ‌తో త‌యారుచేస్తారు. ఏ రెండు ఉత్ప‌త్తులు కూడా ఒకేలా ఉండ‌వు.

దుప‌ట్టాపై ప‌ట్ట‌చిత్రా ఆర్ట్‌వేసిన దృశ్యం

దుప‌ట్టాపై ప‌ట్ట‌చిత్రా ఆర్ట్‌వేసిన దృశ్యం


కొంత‌మంది వినియోగ‌దారులు కూడా నెమ్మ‌దిగా నిజ‌మైన హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తుల‌పై కూడా విశ్వాసం కోల్పోతున్నారు. మ‌రోవైపు కొన్ని హ్యాండ్‌మేడ్ ప్రాడ‌క్ట్స్ మూస‌పోసిన‌ట్టుగా ఉంటున్నాయి. ప్ర‌స్తుత స‌మాజానికి త‌గ్గ‌ట్టుగా ఫ్యాష‌న‌మ‌బుల్‌గా ఉండ‌టం లేదు. అలాగే రోజువారీ ధ‌రించేట‌ట్టుగా రూపొందించ‌డంలేదు. దీనికి భిన్నంగా కొన్ని హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తులు అద్భుతంగా ఉంటున్నాయి. నైపుణ్యం క‌లిగిన క‌ళాకారులు రూపొందిస్తున్న ఉత్ప‌త్తులు వేటిక‌వే ప్ర‌త్యేకంగా నిలుస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. చాలా హ్యాండ్‌మేడ్ ప్రాడ‌క్ట్స్‌కు స‌హ‌జ రంగుల‌ను వినియోగిస్తారు. అవి ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఎంతో న‌ప్పుతాయి కూడా. అంతేకాదు రోజువారీ కార్య‌క‌లాపాల‌కు ధ‌రించేందుకు కూడా ఈ భార‌త హ్యాండీక్రాఫ్ట్ ఉత్ప‌త్తులు స‌రిపోతాయ‌ని మేం గుర్తించాం. అందుకే ఈ ఉత్ప‌త్తుల‌కు గిరాకీ తెప్పించ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించాల‌ని నిర్ణ‌యించాం. ఈ ప్రాడ‌క్ట్‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్లే క‌లిగే లాభాల‌ను నేటిత‌రం యువ‌త అర్థం చేసుకోవాల‌న్న‌దే మా త‌ప‌న‌. ఈ హ్యాండీక్రాఫ్ట్ ఉత్ప‌త్తుల‌ను వారు ఆద‌రించి, మ‌ద్ద‌తు తెలుపాల‌ని మేం కోరుకున్నాం. ఇలా చేస్తే మ‌రికొంద‌రికి ఉపాధి ల‌భిస్తుంది. మా ఆలోచ‌న‌. అంతేకాదు కొంద‌రి జీవితాల్లో వెలుగులు కూడా నింపిన‌ట్ట‌వుతుంది.

ఈఎస్‌పీఎన్‌కు గుడ్‌బై

క్రికెట్ వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు అందించే దిగ్గ‌జ వెబ్‌సైట్ క్రిక్ ఇన్ఫో మేనేజ్‌మెంట్ నిర్వ‌హించే ఆన్‌లైన్ ప్రాడ‌క్ట్‌లో నేను జాబ్ చేసేదాన్ని. అయితే మ‌న‌సు మాట వినేందుకు మంచి ఉద్యోగాన్ని వ‌దులుకున్నాను. అంత‌కుముందు సులేఖా, క్లిక్‌జాబ్స్‌, భార‌త్ మాట్రిమోనీ, ఇండియా ప్రాప‌ర్టీల‌తోపాటు మ‌రికొన్ని స్టార్ట‌ప్ కంపెనీల్లో ప‌నిచేశాను. ప‌నిలో అసంతృప్తి కార‌ణంగా కొన్ని జాబ్‌ల‌ను మారాల్సి వ‌చ్చింది. సంస్థ‌లు మారినా అసంతృప్తి త‌గ్గ‌క‌పోవ‌డంతో రెండేళ్ల‌పాటు ఆలోచించి ఉద్యోగం వ‌దిలి, ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటున్న‌ట్టుగా నాకు ఇష్ట‌మైన రంగంలో సంస్థ‌ను నెల‌కొల్పాను. మొద‌టినుంచి కూడా నాకు స్వేచ్ఛ‌గా తిర‌గ‌డం అంటే ఎంతో ఇష్టం. క‌ట్టుబాట్లు అంటే అస్స‌లు ఇష్ట‌ముండేది కాదు. మ‌ల్టినేష‌న‌ల్ కంపెనీలో మంచి జీతం.. సుఖ‌వంత‌మైన ఉద్యోగం ఉన్న‌ప్ప‌టికీ నాకు సంతృప్తినివ్వ‌లేదు. నేనే ఏదైనా సొంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని క‌ల‌లు కంటూ వ‌చ్చాను.

ఎత్నిక్‌షాక్ రూపొందించిన బ్యాగ్‌లు

ఎత్నిక్‌షాక్ రూపొందించిన బ్యాగ్‌లు


ఎత్నిక్‌షాక్ ఏర్పాటు కూడా చాలా స‌హ‌జంగా జ‌రిగింది. హ్యాండ్‌మేడ్‌, హ్యాండ్ ఒవెన్‌, హ్యాండ్ పెయింటెడ్‌, హ్యాండీ క్రాఫ్టెడ్ ప్రాడ‌క్ట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. కుల వృత్తిదారుల‌కు/క‌ళాకారుల‌కు వారికి క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ల‌భించేలా చేయాల‌ని భావించాను. వారు మెరుగైన జీవితం పొందేందుకు సాయం చేయాల‌ని అనుకున్నాను. వీటికి జ‌వాబుగానే ఎత్నిక్‌షాక్‌ను స్థాపించాను. 2013 సెప్టెంబ‌ర్‌లో ethnicshack.comను ప్రారంభించాను. ఇక అప్ప‌టినుంచి వెనుదిరిగి చూసుకోలేదు.

మూడు ల‌క్ష్యాలు

సంస్థ ప్రారంభానికి ముందు హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తుల‌పై ఆస‌క్తివున్న ప్ర‌జ‌ల‌తో మేం చ‌ర్చించాం. హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తుల‌ను కొనాల‌న్న ఆస‌క్తి ఉన్న వారికి స‌ర‌స‌మైన ధ‌ర‌కే వాటిని విక్ర‌యించాం. అలాగే 2013 ఆగ‌స్టు 15న‌ తొలిసారి హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తుల‌తో ఎగ్జిబిష‌న్ కూడా నిర్వ‌హించాం. ఆ ఎగ్జిబిష‌న్‌కు వ‌చ్చిన స్పంద‌న అంతా ఇంతా కాదు. ఈ విశ్వాసంతో సెప్టెంబ‌ర్‌లో ethnicshack.comను ప్రారంభించాం. చేనేత‌, హ‌స్త‌క‌ళా రంగాల‌ను ఆదుకోవ‌డానికి మేం మూడు ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్నాం. 1. మూస‌ప‌ద్ధ‌తిలో త‌యారుచేసే ఉత్ప‌త్తుల‌కు స్వ‌స్తీ ప‌ల‌క‌డం 2. హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తులు ఫ్యాష‌న‌బుల్‌గా ఉండేలా చూడ‌టం, ప్ర‌తిరోజు ధ‌రించేందుకు వీలుగా త‌యారుచేయ‌డం 3. కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌కు చేయూత అందించి హ‌స్త‌ క‌ళ‌ల‌కు, హ్యాండ్‌మేడ్ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ధాన ఫ్యాష‌న్‌, లైఫ్‌స్ట‌యిల్‌లో భాగం చేయ‌డం.

మేం మా సంస్థ‌ను బెంగ‌ళూరులో ప్రారంభించేందుకు కొన్ని కార‌ణాలున్నాయి. ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూల‌మైన న‌గ‌రమిది. అంతేకాదు ఈ-కామ‌ర్స్ రంగంలో మంచి అవ‌కాశాలున్నాయి. ఈ సంస్థ‌కు ఎత్నిక్‌షాక్ అని పేరుపెట్టే ముందు చాలా ఆలోచించాం. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ చేయాల‌నుకున్నందువ‌ల‌న ఎత్నిక్ అనే పేరు ఖ‌రారుచేశాం. మంచి విలువైన దాన్ని మేం క‌స్ట‌మ‌ర్ల‌కు అంద‌జేయాల‌నుకున్నాం. అంతేకాదు సంప్ర‌దాయానికి ఆధునిక‌త‌ను కూడా క‌ల‌బోత‌ను ఇవ్వాల‌నుకున్నాం. అలాగే చాలావ‌ర‌కు హస్త‌క‌ళ‌లు చిన్న గుడిసెల్లో, కుటీర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌యార‌వుతాయి. అందుకే మా సంస్థ‌కు ఎత్నిక్‌షాక్ అనే పేరు ఖ‌రారుచేశాం. మా సంస్థ‌పేరు మా బ్రాండ్‌కు ప‌ర్ఫెక్ట్‌గా సూట‌యింది. మాస్ మార్కెట్‌ను చేరుకోవాల‌న్న ఉద్దేశంతో స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు మా ఉత్ప‌త్తుల‌ను అమ్మాల‌ని నిర్ణ‌యించాం. అలాగే లోగో త‌యారు చేసేట‌ప్పుడు కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. మా ఆలోచ‌న‌లు, విశ్వాసాల‌ను అందులో ప్ర‌తిబింబించేలా రూపొందించాం. 

ఎత్నిక్‌షాక్ విక్ర‌యించిన చీర‌లు

ఎత్నిక్‌షాక్ విక్ర‌యించిన చీర‌లు


లోగోలో ఎత్నిక్‌షాక్ పేరు కోసం ఉప‌యోగించిన ఫాంట్ కూడా మా ఆలోచ‌న‌ల‌ను గుర్తుచేస్తుంది. ఆ అక్ష‌రాలు ఎంతో మృదువుగా, కొంచెం క‌ర్వీగా, బ్రైట్‌గా ఉంటాయి. లోగోలో ముందుండే ఎస్ సింబ‌ల్ తెల్ల‌టి గ్రేట్‌ రాయ‌ల్ స్వాన్ (హంస‌)ను గుర్తుకు తెస్తుంది. హంస అందానికి స‌రైన నిర్వ‌చ‌నం. స్వ‌చ్ఛ‌త‌కు మారుపేరు. ప్ర‌శాంత‌త‌, దైవ రూపం అన్ని దాంట్లోనే క‌నిపిస్తుంది. అలాగే భార‌త పురాణాల ప్ర‌కారం స‌ర‌స్వ‌తి దేవీ వాహ‌నం కూడా తెల్ల‌టి హంసే. ర‌ష్యా, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌లాంటి చాలాదేశాల‌కు జాతీయ ప‌క్షి కూడా. అలాగే పురాణాల ప్ర‌కారం నీళ్ల‌ను వేరు చేసి పాల‌ను మాత్ర‌మే హంస తాగుతుంద‌ని ప్ర‌తీతి. ఈ గ్రేట్ వైట్ స్వాన్ మాదిరిగానే మా సంస్థ కూడా హ్యాండ్‌మేడ్‌ల‌లో న‌కిలీల‌ను ప‌క్క‌కు త‌ప్పించి అస‌లైన ఉత్ప‌త్తుల‌ను మాత్ర‌మే అంద‌జేస్తామ‌ని సింబాలిక్‌గా లోగోలో చెప్పించాం. ఇక ఎస్ చుట్టూ ఉన్న వృత్తం ప్ర‌పంచానికి ప్ర‌తిరూపం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎత్నిక్ క‌ల్చ‌ర్‌, ట్రెడిష‌న్‌లో క‌నిపించే రిచ్‌నెస్‌, వైబ్రంట్‌, ట్రెడిష‌న‌ల్‌, సింపుల్‌, రాయ‌ల్‌, నాచుర‌ల్‌, క్లాసీ, మోడ్ర‌న్‌, డైన‌మిక్ క‌ల‌ర్స్‌ను స‌ర్కిల్‌లో వ‌చ్చేలా చూసుకున్నాం. అలాగే ఆ లోగోలోనే ఇంగ్లిష్ లెట‌ర్ E (E-Ethnic) కూడా ఉంటుంది. లోగోలో స్వాన్ కింది భాగాన్ని ప‌రిశీలిస్తే క‌నిపిస్తుంది. ఇక S-Shackను ప్ర‌తిబింబిస్తుంటుంది.

ఎత్నిక్‌షాక్ లోగోతో కూడిన చేనేత ఉత్ప‌త్తులు

ఎత్నిక్‌షాక్ లోగోతో కూడిన చేనేత ఉత్ప‌త్తులు


సేవ కార్య‌క్ర‌మాల‌ను ఇంటినుంచే మొదలుపెట్టాల‌న్నది నానుడి. బ‌య‌ట‌వ్య‌క్తుల పెట్టుబ‌డుల‌కు బ‌దులుగా, నా ఆశ‌యాన్ని, ఆలోచ‌న‌ను నా జీవిత భాగ‌స్వామి అనీశ్‌తో పంచుకున్నాను. నా ఆలోచ‌న విన్న వెంట‌నే ఆయ‌న‌ ఉద్వేగానికి లోన‌య్యారు. క‌ళ‌లంటే ఎంతో ఇష్ట‌ప‌డే వ్య‌క్తి అనీశ్‌. ఇంజినీర్ అయిన‌ప్ప‌టికీ బ్రాండ్ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌లో మంచి అవ‌గాహ‌న ఉంది. టెక్నాల‌జీ కంపెనీల‌తోపాటు అడ్వ‌ర్ట‌యిజింగ్‌, మీడియా కంపెనీల‌లో కూడా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం మ‌రో ఇద్ద‌రి స‌హ‌కారంతో మేమిద్ద‌రం.. ఈ సంస్థ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్నాం. మాలాగే ఆలోచించే వ్య‌క్తుల‌ను సంస్థ‌లోకి తీసుకోవాల‌ని కూడా ప్ర‌య‌త్నిస్తున్నాం. సంస్థ ఏర్పాటు చేసిన ల‌క్ష్యాల‌కు అనుగుణంగా, సంస్థ ప్ర‌యోజ‌నాల కోసం త‌మ ఇష్టాన్ని ప‌నికోసం ఉప‌యోగించే వారికోసం అన్వేషిస్తున్నాం.

ఆరంభంలో చేతితో త‌యారుచేసిన చీర‌ల‌నే మేం విక్ర‌యించాం. మ‌హిళ‌ల రోజువారీ జీవితంలో చీర ఓ భాగం అయ్యేందుకు మ‌రి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని గ్ర‌హించి, ఇత‌ర ఉత్ప‌త్తుల‌పై దృష్టిపెట్టాం. దుప‌ట్టాలు, స‌ల్వార్ క‌మీజ్ సెట్స్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌, విగ్ర‌హాలు, హోమ్ డోర్స్‌, వాల్ హ్యాంగింగ్స్‌, బ్లాంకెట్స్‌.. ఇలాంటి ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తున్నాం. ఆరంభంలో డ‌బ్బుల స‌మ‌స్య కార‌ణంగా ఎక్కువ‌గా రిస్క్ తీసుకోలేక‌పోయాం. సాధార‌ణంగా అంద‌రూ వాడే సైజ్‌ల‌నే రూపొందించాం. ఐతే ఇప్పుడు అన్ని ర‌కాల సైజ్‌ల‌లో ఉత్ప‌త్తుల‌ను అందిస్తున్నాం. చిన్న‌పిల్ల‌ల ఉత్ప‌త్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. పురుషుల క్లోతింగ్ రేంజ్‌లోకి కూడా త్వ‌ర‌లో అడుగుపెట్ట‌బోతున్నాం.

ప‌ట్ట‌ణ ప్రాంత మ‌హిళ‌లే టార్గెట్‌

వివిధ రంగాల్లో స‌త్తా చాటుతున్న ప్ర‌స్తుత త‌రం జ‌న‌రేష‌నే మా టార్గెట్ ఆడియ‌న్స్‌. ఇంట‌ర్నెట్ యాక్సెస్ క‌లిగిన టైర్ 1 లేదా టైర్ 2 సిటీస్‌లో నివ‌సించే ప‌ట్ట‌ణ‌ప్రాంత మ‌హిళ‌లే ల‌క్ష్యంగా ఉత్ప‌త్తుల‌ను సిద్ధం చేస్తున్నాం. అమెరికా, ఖ‌తార్‌, యూఏఈలాంటి దేశాల్లో కూడా మాకు క‌స్ట‌మ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ విదేశీ మార్కెట్‌పై అంత‌గా దృష్టిపెట్ట‌లేదు. చాలామంది విదేశీ క‌స్ట‌మ‌ర్లు వారి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల ద్వారా మా ప్రాడ‌క్ట్స్‌ను తెప్పించుకుంటున్నారు.

గ్రామీణ‌ప్రాంత క‌ళాకారుల‌కు చేయూత‌

ఆంధ్ర‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, బీహార్‌, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కిందిస్థాయి క‌ళాకారుల‌కు మేం చేయూత అందిస్తున్నాం. వారికి డిజైన్ ఇన్‌పుట్స్ అందించి, అంత‌ర్జాతీయ‌, జాతీయ మార్కెట్ ట్రెండ్స్‌, అవ‌స‌రాల‌ను వివ‌రిస్తున్నాం. అలాగే ప్ర‌స్తుత కాలంలో డిమాండ్ ఉన్న ప్రాడ‌క్ట్స్ గురించి వివ‌రిస్తూ వాటిని త‌యారుచేసేలా ప్రోత్స‌హిస్తున్నాం. గ్రామీణ ప్రాంత క‌ళాక‌రులు మా వ్యాపార కుటుంబంలో ఒక భాగం. ఇక ఈ ఏడాది వ్యాపారం మ‌రింత వృద్ధి చెందుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంది. ఈశాన్య‌రాష్ట్రాలు, రాజ‌స్థాన్‌, కేర‌ళ వంటి రాష్ట్రాల్లోని కిందిస్థాయి క‌ళాకారుల‌ను మా వ్యాపార కుటుంబంలోకి తీసుకొస్తాం. అయితే మాలాంటి ఆలోచ‌న‌క‌లిగిన వ్య‌క్తుల ఆర్థిక‌, నిర్వ‌హ‌ణ‌ప‌ర‌మైన చేయూత ఉంటేనే ఇది సాధ్య‌మ‌వుతుంది.

ద‌ళారుల‌కు దూరం

మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ప‌ట్టించుకోకుండా ఆర్టిస్టులు, క్రాఫ్ట్ర్‌మెన్‌ల‌తోనే నేరుగా సంబంధాలు పెట్టుకుంటాం. స్వేచ్ఛా వ్యాపారంపై మాకు ఎంతో న‌మ్మ‌కం. ఆర్టిస్టుల‌కు ఇవ్వాల్సింది ఇచ్చిన త‌ర్వాతే మేం తీసుకుంటాం. ఆర్టిస్టుల‌తో మ‌మేక‌మై, వారి పూర్తి స‌హ‌కారంతో ప‌నిచేస్తాం. త‌ద్వారా క‌స్ట‌మ‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే మార్గాల‌ను అన్వేషిస్తాం. క‌ళాకారుల‌ల‌కు ల‌బ్ధి చేకూర్చే మోడ‌ల్‌నే మేం అనుక‌రిస్తాం.

గ‌ట్టి పోటీ

మేం వెళ్తున్న‌దారి పూల‌పాన్పేమీకాదు. ఈ రంగంలో ఇండియ‌న్ రూట్స్‌, ఫ్యాబ్ ఇండియా వంటి దిగ్గ‌జాల‌తోపాటు జైపోర్‌, ఐటోక్రీ వంటి స్టార్ట‌ప్‌ల నుంచి కూడా గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న‌ది. అంద‌రూ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ అంద‌రి వ్యాపారం ఆరోగ్య‌క‌రంగానే కొన‌సాగుతున్న‌ది. ఈ రంగంలో మెచ్చుకోద‌గిన ప‌రిణామ‌మేంటే.. అంద‌రూ ఇత‌రుల‌కు సాయం చేసేందుకే ప్ర‌య‌త్నిస్తున్నారు త‌ప్ప‌.. మిగ‌తా వారిని తొక్కేయాల‌ని చూడ‌టం లేదు. సిస‌లైన హ్యాండ్‌మేడ్‌, హ్యాండ్ క్రాఫ్టెడ్‌, హ్యాండ్ ఒవెన్‌ల‌కు అసలైన‌ బ్రాండ్‌గా ఉండాల‌ని మేం పాల‌సీగా పెట్టుకున్నాం. అలాగే ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో నివ‌సించే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా మా ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తున్నాం. క‌స్ట‌మ‌ర్లు కోర‌కున్న‌ట్టుగానే నాణ్య‌త విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌టం లేదు. అలాగే క‌ళాకారులు త‌యారుచేస్తున్న ఉత్ప‌త్తులు మంచి గుర్తింపు, ప్ర‌శంస‌లు ద‌క్కేలా చూస్తున్నాం. ఓవ‌రాల్‌గా క‌ళాకారులు జీవ‌న ప్ర‌మాణాల్లో మార్పు తేవాల‌న్న‌దే మా సంస్థ ల‌క్ష్యం. ఆ దిశ‌గానే ప‌య‌నిస్తున్నాం.

పెట్టుబ‌డిదారుల కోసం అన్వేష‌ణ‌

ఇప్ప‌టివ‌ర‌కైతే ఈ ఎత్నిక్‌షాక్ మా వ్య‌క్తిగ‌త సేవింగ్స్‌తోనే న‌డుస్తున్న‌ది. ఐతే భ‌విష్య‌త్‌లో పెట్టుబ‌డిదారుల కోసం అన్వేషించాలి. సంస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే మ‌రిన్ని పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌న్న‌ది మా ఉద్దేశం. ఇప్ప‌టివ‌ర‌కైతే ఎలాంటి లాభాలు రాక‌పోయిన‌ప్ప‌టికీ, త్వ‌ర‌లోనే లాభాల‌బాట‌లో ప‌య‌నిస్తామ‌న్న న‌మ్మ‌క‌ముంది. ఇప్పుడిప్పుడే ఈ ఎత్నిక్ షాక్ గురించి మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. "ప్లాన్ యువ‌ర్ వెడ్డింగ్‌" మ్యాగ‌జైన్ ఎప్రిల్ సంచిక‌లో మా గురించి రాశారు. అలాగే కార్ట్ రాకెట్ మ‌హిళా దినోత్స‌వ ప్ర‌త్యేక బ్లాగ్‌లో "లీడింగ్ విమెన్ ఇన్ ఇండియ‌న్ ఈకామ‌ర్స్" టైటిల్‌తో ఓ క‌థ‌నం వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కైతే మీడియా క‌వ‌రేజ్‌కు దూరంగా ఉన్నాం. మా సంస్థ‌ను నిర్మించ‌డంపైనే దృష్టిపెట్టాం.

ఫ్యామిలీ స‌హ‌కారం

ఈ సంస్థ కార‌ణంగా కొంత‌వ‌ర‌కు ఫ్యామిలీ లైఫ్‌కు దూర‌మ‌య్యాను. ఇంట్లో ఐదేళ్ల కూతురు ఉన్న‌ప్ప‌టికీ సంస్థ‌ను విజ‌య‌వంతంగా న‌డుపుతున్నానంటే అందుకు మా త‌ల్లిదండ్రులు, నా జీవిత భాగ‌స్వామి స‌హ‌కార‌మే కార‌ణం. నా భ‌ర్తే నాకు మంచి స్నేహితుడు. మా ఇద్ద‌రి అభిప్రాయాలు దాదాపుగా ఒక‌టే. మా ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటూ మేం క‌ష్ట‌న‌ష్టాల‌ను స‌మానంగా భ‌రిస్తున్నాం. ఇక అనీశ్‌తోపాటు ఐదేళ్ల మా పాప కూడా మంచి విమర్శ‌కురాలు. వారి ఫీడ్‌బ్యాక్‌, విమ‌ర్శ‌లు, విశ్లేష‌ణ‌ల ఆధారంగానే డిజైన్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటుంటాను. మాలాగే మా పాప‌కు కూడా హ‌స్త‌క‌ళ‌ల‌న్నా, శిల్పుల‌న్నా ఎంతో ఇష్టం.

ఆస‌క్తి, ప్రేమ ఉంటేనే రండి

సంస్థ‌ను ప్రారంభించాలంటే కావాల్సినంత మూల‌ధ‌నం ఉండాలి. మ‌న‌ద‌గ్గ‌రున్న మూల‌ధ‌నంతోనే సంస్థ‌ను ప్రారంభించాల‌నుకుంటే ముందుగా వ‌న‌రులు స‌మృద్ధిగా ఉన్నాయో లేవో చూసుకోండి. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌తో సంస్థ‌ను ప్రారంభిస్తే వెనుక‌కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌ర‌ముండ‌దు. లేదంటే సంస్థ‌ను న‌డిపేందుకే పోరాడాల్సి ఉంటుంది. ఇక సంస్థ‌ను ప్రారంభించ‌డం డిమాండ్‌, స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. స‌వాళ్లంటే ఇష్ట‌ప‌డి, ప్రేమించి, పోరాడే త‌త్వం ఉన్న వారు మాత్ర‌మే ఈ రంగాన్ని ఎంచుకోవాలి. లేదంటే ఇందులోకి రావొద్దు. ప్ర‌శాంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛాయుత జీవితం గ‌డ‌పాల‌ని కోరుకునే వారికి ఈ రంగం ఏవిధంగానూ సరిపోదు. వ్యాపారం అంటేనే స‌వాళ్లు. ఆటుపోట్లు. ఇక మా వ‌ర‌కైతే మోడ్ర‌నైజేష‌న్‌, అర్బ‌నైజేష‌న్ల‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకుని, మ‌నం వ‌చ్చిన రూట్స్‌ను మర్చిపోకుండా వ్యాపారం చేస్తున్నాం. వెస్ట్ర‌న్ వ‌ర‌ల్డ్‌ను కాపీ కొట్టాల‌న్న తొంద‌ర‌లో వ‌స్తువుల‌న్నీ కృత‌కంగా మారిపోతున్నాయి. ప్ర‌కృతి, సంప్ర‌దాయాలు ప్ర‌సాదించిన మంచిని గుర్తించ‌లేక‌పోతున్నాం. మేలుకొనేందుకు ఇదే మంచి స‌మ‌యం. మ‌నుష్యుల జీవ‌నానికి ప్ర‌ధాన ఆధార‌మైన ప్ర‌కృతిని ర‌క్షించుకుందాం. ఎలాంటి అశాంతి లేకుండా జీవిద్దాం. లేక‌పోతే మ‌న పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు స‌మాజ ర‌క్ష‌ణ లేకుండా పోతుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags