మా వెండికొండ..! మా బంగారు తల్లి..!!

మా వెండికొండ..! మా బంగారు తల్లి..!!

Friday August 19, 2016,

3 min Read

ఎవరన్నారు సింధు ఓడిపోయిందని..? 

ఎవరన్నారు సింధు స్వర్ణం తేలేదని..? 

ఎవరూ అనలేదు... 

అనే సాహసమూ చేయలేదు... 

ఎందుకంటే..

సింధు ఫైనల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రీడాకారిణితో పోటీ పడింది. 

సింధు శక్తికి మించి పోరాటపటిమ కనబరిచింది. 

సింధు 123 కోట్ల మంది గుండెల్లో విజేతగా నిలిచింది.

సాధారణంగా ఆటగాళ్లు గెలిస్తే ఆకాశానికెత్తుతాం. ఓడిపోతే అంతే వేగంగా నేలకేసి కొడతాం. కానీ సింధు విషయంలో అలా అనుకోలేదు. ఒక తెలుగింటి ఆడబిడ్డ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త శకాన్ని లిఖించిందని మురిసిపోయాం. స్వర్ణమయ మకుటాలను, వజ్ర ఖచిత కిరిటాలను కలగనొచ్చు గాక. కానీ సింధు ఆడిన తీరును చూసి, ఆమె వజ్ర సంకల్పాన్ని కళ్లారా తిలకించి.. మా వెండికొండ.. మా బంగారు తల్లి అని జేజేలు పలికాం. దటీజ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. దటీజ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా.

ఒత్తిడి. ప్రెజర్. అంతకు మించిన దశాబ్దాల స్వప్నం. చరిత్ర తిరగరాసే సమయం. ఆ ఒత్తిడి ఆడేవాళ్లకు తప్ప మరెవరికీ తెలియదు. సునామీ ఎదురుగా వస్తే ఢీ కొట్టేంత దమ్ముండాలి. ఆకలిగొన్న సింహానికి గుండెలు అడ్డుపెట్టే ధైర్యముండాలి. అలాంటి గట్స్ ఉన్న క్రీడాకారిణి సింధు. దేశమాత మెడలో స్వర్ణపతకం అలంకరించేందుకు మైదానం బయటా లోపలా ఆమె పడ్డ సంఘర్షణ మాటల్లో వర్ణించలేం. కోట్ల క్యూసెక్కుల ప్రవాహాన్ని అరచేత్తో అడ్డుపెట్టి ఆపడం ఎంత కష్టమో.. టన్నుల కొద్దీ ప్రజెర్ ను గుండెల మీద నిలుపుకుని ఆడటం కూడా అంతే కష్టం. అయినా ఓడిపోయిందని ఎవరూ నిట్టూర్ఛలేదు. అయ్యో అలా ఎందుకు ఆడిందని ఎవరూ నిరాశచెందలేదు. గెలవడానికి ఆమె చేసిన పోరాటం 130 కోట్ల మంది భారతీయుల మనసులు గెలుచుకునేలా చేసింది. మువ్వన్నెల పతాకం అలవోకగా లేచి ఆడింది. లెట్స్‌ గో ఇండియా.. లెట్స్‌ గో ఇండియా అంటూ చేసిన నినాదాలు ఆమెను కొండంత బలాన్నిచ్చాయి.

ఇండియాలో క్రికెట్‌ అనేది ఒక మతం లాంటిదే. అది తప్ప మరే ఆటా రుచించదు ఎవరికీ. కానీ విచిత్రం జరిగింది. ప్రపంచకప్‌ ఫైనల్‌ కోసం ఎంత హడావుడి జరిగిందో.. సింధు విజయం కోసం యావత్ దేశం అలాగే సిద్ధమయింది. సింధు ఎలాగైనా స్వర్ణ పతకం తెస్తుందని జాతిమొత్తం లేచి కూర్చుంది.

అనుకున్నట్టుగానే ఆట మొదలైంది. తొలి సెట్లో వేట మొదలైంది. కోర్టు షాట్లు, స్మాష్‌ లు, ర్యాలీలతో 21-19తో ప్రత్యర్థిని ఓడించింది. హోరాహోరీగా సాగిన తొలిసెట్ సింధు వశమైంది. తర్వాత సెట్లో మారిన్‌ పుంజుకొంది. ఈసారి సింధు పూర్తిగా తడబడింది. మారిన్ తెలివిగా ఆడుతూ వరుస పాయింట్లు సాధించింది. సింధు క్రమంగా ఒత్తిడిలోకి జారిపోయింది. మారిన్ రెండో సెట్ ను 21-12 తేడాతో గెలుచుకొంది. అంచనాలు గురితప్పి, అనవసర షాట్లకు ప్రయత్నించి సింధు ప్రత్యర్థికి గెలుపు సులవు చేసింది. ఇక మూడో సెట్. నరాలు తెగేంత టెన్షన్. అ సెట్లో కూడా మారిన్‌ చెలరేగింది. సింధు అప్పటికే అలసిపోయినట్టుగా కనిపించింది. చూస్తుండగానే మారిన్ 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌ 4-9తో ఉన్న టైంలో సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 8-9తో నిలిచింది. తర్వాత 10-10తో స్కోర్‌ సమమైంది. ఇక్కడ మారిన్‌ నాలుగు వరుస పాయింట్లు సాధించింది. ఈసారి స్కోరు 14-10. మళ్లీ సింధు రెండు పాయింట్లు సాధించింది. స్కోరు 12-15. సరిగ్గా ఇక్కడే మారిన్‌ చాకచక్యంగా సింధుని కట్టడి చేసింది. తెలివిగా సింధును కోర్టుకు నలువైపులా తిప్పింది. అలసిపోయేలా చేసింది. ఫలితంగా మారిన్ నిలకడగా పాయింట్లు సాధించింది. మ్యాచ్‌ 14-16తో ఉన్నప్పుడు మారిన్‌ వరుసగా నాలుగు పాయింట్లు కొట్టి మారిన్.. 20-14తో గేమ్‌ పాయింట్‌ ను సమీపించింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్‌ సాధించి 15-20తో ముందుకెళ్లినా.. ఓటమి తప్పలేదు.

ఒక్క పతకం తేవడానికి చేతకాదు... సెల్ఫీలు తప్ప మరేమీ తెలియదు... అనే వెటకారపు కామెంట్లు వినిపించిన తరుణంలోనూ.. సాక్షి కసిగా ఆడి కాంస్య పతకాన్ని తెస్తే.. సింధు స్వర్ణం ముంగిట వాలి రజత పతకాన్ని గెలుచుకుని విమర్శకుల నోళ్లు మూయించింది.

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి రజతాన్ని అందించిన పీవీ సింధుకు ప్రధాని మోడీ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెను మనసారా అభినందించారు. సింధు యావత్ భారతదేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని ప్రశంసించారు. యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ లో కూడా క్రీడల్లో యువతను ప్రోత్సహించి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

పీవీ సింధుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో సింధుకు పెద్ద అభిమానిని అయిపోయానని రజనీకాంత్ ట్వీట్ చేసి మురిసిపోయారు.

ఇంకో విశేషం ఏంటంటే పీవీ సింధుపై లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి కరుణా కటాక్షాలు మెండుగా ఉన్నాయి. మొన్న సింధు బోనాల పండుగ సందర్భంగా అమ్మకు బంగారు బోనం సమర్పిస్తే.. సింధుకు దేవత రజత పతకం కానుకగా ఇచ్చింది. రియో ఒలింపిక్స్‌ లో ఎలాగైనా పతకం సాధించాలని వేడుకున్న సింధు కోరికను అమ్మవారు నెరవేర్చారన్నమాట.

మొత్తానికి మన సింధు స్వర్ణ సింధూరం కాకపోయినా, మా వెండికొండ.. మా బంగారు తల్లి అయింది.