తెల్లమచ్చలకు తిరుగులేని వైద్యం.. యునానీలో అద్భుతాలు చేసిన డాక్టర్ వహీద్

వైద్య రంగ దిగ్గజానికి పద్మశ్రీ పురస్కారం

తెల్లమచ్చలకు తిరుగులేని వైద్యం.. యునానీలో అద్భుతాలు చేసిన డాక్టర్ వహీద్

Monday January 30, 2017,

2 min Read

హోమియోపతి, ఆయుర్వేదం. ఇలాంటివేవీ నయం చేయలేని వ్యాధికి ఒకే ఒక మందు చెక్ పెట్టింది. అది 35 ఏళ్ల పరిశోధనల ఫలితం. ఆయన హస్తవాసి పుణ్యాన రెండు లక్షల మందికి వ్యాధి నయమైంది. యునానీ చికిత్సలో అద్భుతాలు చేసిన వైద్య రంగ దిగ్గజమే డాక్టర్ అబ్దుల్ వహీద్.

తెల్లమచ్చలు. చాలా మందిని వేధిస్తున్న వ్యాధి. ఒంటి మీద తెల్ల మచ్చలు కనిపిస్తే చాలు మానసికంగా సగం చచ్చిపోతారు. ముఖ్యంగా ఈ వ్యాధితో యువతులు పడుతున్న క్షోభ అంతా ఇంతా కాదు. అలాంటి తెల్లమచ్చల మహమ్మారిని నివారించడానికి 35 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు యునాని డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్. సెంట్రల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ యునాని మెడిసిన్లో డాక్టర్గా విధుల్లో చేరిన వహీద్.. అంచెలంచెలుగా డైరెక్టర్ వరకు ఎదిగారు. యునాని మెడిసిన్ ను కనిపెట్టి తెల్లమచ్చలకు చెక్ పెట్టారు. తెల్లమచ్చల నివారణ చికిత్సలో అనేక మైలురాళ్లు దాటారు. ఈ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు సత్ఫలితాలిచ్చాయి. తెల్లమచ్చలను 85 శాతం మేర తగ్గించి రోగుల్లో నమ్మకాన్ని కలిగించారు. 2015లో డైరెక్టర్గా పదవీ విరమణ చేసినప్పటికీ.. ఇంకా తెల్లమచ్చల మూలాల గురించి అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు.

image


1978లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యునాని మెడిసిన్ అండ్ సర్జరీలో అబ్దుల్ వహీద్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా, ఢిల్లీ ఎయిమ్స్, కేఈఎం మెడికల్ కాలేజ్లో క్లినికల్ రీసర్చ్లో శిక్షణ పొందారు. అనంతరం చర్మ వ్యాధులకు వైద్యం అందించండం ప్రారంభించారు. 1980 నుంచి తెల్లమచ్చలపై పరిశోధనలు మొదలుపెట్టారు. అవి రావడానికి గల కారణాలు, చికిత్స విధానాలపై రీసెర్చ్ చేశారు. ఆయన చేసిన 33 పరిశోధనల వివరాలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. 64 సదస్సుల్లో డాక్టర్ వహీద్ పేర్కొన్న తెల్లమచ్చల చికిత్స గురించి వివరించారు.

వివిధ రోగాలకు యునానీలో మందులు కనిపెట్టడానికి వహీద్ చేయని ప్రయత్నమంటూ లేదు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, బొల్లి, హెపటైటిస్ తదితర రోగాలపై పరిశోధనలు జరిపారు. తెల్లమచ్చల చికిత్స కోసం యునానిలో 17ఫార్ములాలను అభివృద్ధి చేశారు. మందులు, శరీరంపై పూత వ్యాధులకు చికిత్సామార్గాలను కనిపెట్టి వైద్యం అందించారు. డాక్టర్ వహీద్ పుణ్యమా అని రెండు లక్షల మంది తెల్లమచ్చల బారి నుంచి విముక్తులయ్యారు.

యునాని ఫార్మాకోపియా కమిటీ, యునాని ఫార్మాలేషన్స్ సబ్ కమిటీ, మహావీర్ ఆస్పత్రుల రీసర్చ్ సెంటర్లో డాక్టర్ వహీద్ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ మెడిసిన్, సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా నాలుగు సార్లు బెస్ట్ సైంటిస్ట్ అవార్డు దక్కింది. 35 ఏళ్లుగా మెడిసిన్ లో అందించిన సేవలకు గాను కేంద్రం డాక్టర్ వహీద్ ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.