విదేశీ స్కాలర్‌షిప్ పొందడాన్ని ఈజీ చేసిన హైదరాబాదీ సంస్థ

విదేశీ స్కాలర్‌షిప్ పొందడాన్ని ఈజీ చేసిన హైదరాబాదీ సంస్థ

Friday September 04, 2015,

3 min Read

విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించాలి. అయితే అంత స్థోమత మాత్రం ఉండదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతో కొంతైతే సర్దుబాటు చేయగలరు. మరి అలాంటి వాళ్లు విదేశాల్లో చదువుకోలేరా.. ? మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందలేమా.. ? అని బాధపడే వాళ్లకు హైదరాబాదీ సంస్థ వి మేక్ స్కాలర్స్.. అద్భుతమైన పరిష్కార మార్గాన్ని సూచిస్తోంది.

ఏ ఏ దేశాల్లోని యూనివర్సిటీలు ఏ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాయి ? ప్రభుత్వ సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు, ఎన్జీఓ సంస్థలు... ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి అనే అంశాలన్నింటనీ స్పష్టంగా ఒకే వేదికపైకి తెచ్చింది వి మేక్ స్కాలర్స్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల వివరాలు, స్కాలర్‌షిప్ పొందేందుకు ఉండే అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌ డీటైల్స్ సహా మరిన్ని వివరాలను అందిస్తోంది.

ఎలా వచ్చిందీ ఆలోచన ?

దామినీ మహాజన్, అర్జున్ క్రిష్ణ.. ఇద్దరూ సంస్థ వ్యవస్థాపకులు. వాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎలాగోలా వివరాలు సేకరించి బ్రిటన్ వెళ్లి చదువుకున్నారు. దామినీ మహాజన్.. జమ్మూకాశ్మీర్ అమ్మాయి. యూకెలో షిఫ్పీల్డ్ యూనివర్సిటీలో బయోప్రాసెస్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తను ఇక్కడే స్కాలర్‌షిప్ కూడా పొందింది. అర్జున్ క్రిష్ణ కేరళలో పుట్టినా పెరిగింది, చదివిందీ అంతా హైదరాబాద్‌లోనే. తను కూడా షిఫ్పీల్డ్ యూనివర్సిటీ అలుమ్ని. యూకె ప్రభుత్వం నుంచి క్వీన్స్ స్కాలర్‌షిప్ గ్రహీత. ఇద్దరూ వాస్తవంగా బయోటెక్నాలజీ ఫీల్డ్‌కు చెందినవారు. టెక్నాలజీతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు. కానీ తమలా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వీరిద్దరూ 2013లో ఓ స్కాలర్స్ పేరుతో కమ్యూనిటీని మొదలుపెట్టారు. ఆరునెలల్లో 50 వేల మందికిపైగా కమ్యూనిటీ సందర్శించారు. విద్యార్థుల ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు. మెల్లిగా జోరు పెరగడంతో దీన్ని ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ప్లాట్‌ఫాంగా మార్చి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో లాంఛ్ చేశారు. హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నడిపిస్తున్నారు.

దామినీ మాహాజన్, వి మేక్ స్కాలర్స్ సహ వ్యవస్థాపకురాలు

దామినీ మాహాజన్, వి మేక్ స్కాలర్స్ సహ వ్యవస్థాపకురాలు


లాభాపేక్షలేని సంస్థగా దీన్ని మొదలుపెట్టడంతో నాలుగు నెలల్లోనే అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పటి వరకూ 198 దేశాల నుంచి 2 లక్షల మంది యూజర్స్‌గా చేరారు. 20 లక్షల పేజ్ వ్యూయ్స్ వచ్చాయి. తక్కువ కాలంలోనే 30 వేల సైనప్స్ కూడా అయినట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు అర్జున్ వివరించారు.

ఒకే చోట విదేశీ యూనివర్సిటీల సమాచారం

ప్రస్తుతం వి మేక్ స్కాలర్స్ సైట్లో 800 మంది ప్రొవైడర్ల సమాచారం ఉంది. ఈ జాబితాలో యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, ట్రస్టుల వివరాలు ఉన్నాయి. అయితే వీటిల్లో అధిక శాతం మంది విశ్వవిద్యాలయాల సమాచారమే ఉంది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల విద్యార్థులు సైట్‌ను ఎక్కువగా చూస్తున్నట్టు వి మేక్ స్కాలర్స్ చెబ్తోంది.

'' ఇప్పటికీ చాలా యూనివర్సిటీలు ఆఫర్ చేసే ప్రోత్సాహకాల గురించి సరైన విద్యార్థులకు తెలియక.. అవన్నీ వృధాగా పోతున్నాయి. వాటన్నింటినీ సరైన విద్యార్థికి, సరైన సమయంలో తెలపడమే మా లక్ష్యం '' - దామినీ మహాజన్

బయోటెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ అయినప్పటికీ..తామే అన్నీ తెలుసుకుని ఇద్దరు డెవలపర్ల సాయంతో సైట్ బిల్డ్ చేసినట్టు సంస్థ వ్యవస్థాపకులు - సిఈఓ దామినీ మహాజన్ చెప్తారు. ప్రస్తుతం వి మేక్ స్కాలర్స్‌ దగ్గర ఇద్దరు డెవలపర్లతో పాటు ఐదుగురు సభ్యుల టీం ఉంది. ఈ వ్యవస్థను రెండేళ్ల నుంచి సొంత నిధులతోనే ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. 

అర్జున్ క్రిష్ణ, వి మేక్ స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు

అర్జున్ క్రిష్ణ, వి మేక్ స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు



'' మా ఆలోచన నచ్చి బిట్స్ పిలానీ సీడ్ ఫండింగ్ కోసం 15 లక్షల రూపాయలు కేటాయించేందుకు మమ్మల్ని ఎంపిక చేసినట్టు మాకు సమాచారం అందింది. మాకు ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ నిధులు వస్తే ఏడాదిపాటు కంపెనీని ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు'' - అర్జున్ .

ఎలా వస్తుంది స్కాలర్‌షిప్ ?

సాధారణంగా యూనివర్సిటీలు.. తమ కాలేజీలను ప్రమోట్ చేసుకోవడానికో.. లేక చిన్న దేశాలు తమ గుర్తింపు కోసం విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను ప్రకటిస్తూ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల స్టూడెంట్స్‌కు మొదటి ప్రయారిటీ ఇస్తాయి. అయితే సాధారణంగా ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు రౌండ్ల పాటు ఇంటర్వ్యూలు మెరిట్, ఫైనాన్షియల్ నీడ్.. కుటుంబం బ్యాక్ గ్రౌండ్ వంటి వివరాలు చెక్ చేసుకున్నాక మంజూరు చేస్తాయి. ఈ విషయం తెలియక విద్యార్థులు అక్కడికి వెళ్లాకో.. లేక డిగ్రీ పూర్తైన తర్వాత అప్లై చేసుకోవడం వల్ల ఆ ప్రయోజనాన్ని పొందడం లేదని అర్జున్ చెబ్తారు.

డిగ్రీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా.. రిజిస్టర్ చేసుకుని.. వివరాలు తెలుసుకుంటే సులువుగా స్కాలర్‌షిప్ పొందే వీలుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఏడాదికి మన దేశం నుంచి 4 లక్షల మంది వరకూ విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్తారు. వీళ్లలో యాభై శాతం మంది అమెరికా బాటపట్టే వారే ఉంటారు. అయితే వీళ్లలో స్కాలర్‌షిప్ మీద చదువుకునే వాళ్ల సంఖ్య కేవలం రెండు, మూడు శాతమే ఉంటుందని వి మేక్ స్కాలర్స్ చెబ్తోంది. అందుకే తమకు పుష్కలమైన అవకాశం ఉందని వివరిస్తున్నారు.

image


ప్రస్తుతానికి ఫండింగ్ కోసం చూసి ఈక్విటీని డైల్యూట్ చేయడం కంటే.. పూర్తిస్థాయి వేల్యూ, రెవెన్యూ మోడల్ క్రియేట్ చేశాక ఆలోచిస్తామని వ్యవస్థాపకులు ధీమాగా చెబ్తున్నారు. విదేశీ విద్యకు సంబంధించి వి మేక్ స్కాలర్స్ ఓ వన్ స్టాప్ సొల్యూషన్‌లా మార్చడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. యూజర్ బేస్ పెంచుకోవడమే ఇప్పుడు వీళ్ల టార్గెట్.

website