సంకలనాలు
Telugu

సాహసమే నా ఊపిరి..!

ఓ దివ్యాంగన సాహస గాధ

Nagendra sai
25th Mar 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share


ధైర్యం ఆమె ఇంటి పేరు..! 

ఉరిమే ఉత్సాహం ఆమె ఆయుధం..!!

ఆమె గుండె నిబ్బరాన్ని చూస్తే మనం ఉబ్బితబ్బిబవుతాం..!!! 

ఆమెతో నాలుగు మాటలు మాట్లాడితే చాలు..!

ఈ అమ్మాయిలో ఇంత విషయం ఉందా అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం..!!

సూపర్ మోడల్‌లా అనిపిస్తూ.. 

గలగలా మాట్లాడడం వింటే నోరెళ్లబెడతాం..!

కానీ చివరకు అయ్యో.. దేవుడు ఇలా చేశాడేంటి అని భారంగా నిట్టూరుస్తాం..!?

image


ఎందుకంటే తనో దివ్యాంగన. దివ్యమైన రూపాన్ని, చురుకుదనాన్ని.. వీటన్నింటికీ మించి టన్నుల కొద్దీ ఎనర్జీని, కాన్ఫిడెన్సును ఇచ్చిన ఆ పైవాడు.. కాళ్ల దగ్గరికి వచ్చేసరికి.. తనను తాను మరిచిపోయి ఉంటాడు. అందుకే తనో దివ్యాంగనగా మారాల్సి వచ్చింది. దివ్యాంగన అనే పదం ఎందుకు వాడుతున్నానంటే.. ఇప్పుడు వికలాంగులు అనే పదాన్ని మన ప్రభుత్వం కూడా మారుస్తోంది. ఇలాంటి వాళ్లందరినీ ఇకపై అలానే పిలవాలంటూ ప్రధాని మోడీ కూడా కోరుతున్నారు. వసుంధర కొప్పుల లాంటి వాళ్లను చూస్తే.. దివ్యాంగన అనే పదం సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది.

image


ఇంతకీ ఎవరీ అమ్మాయి..? ఇన్ని ఉపమానాలతో పోలుస్తున్నారు, అంత గొప్ప పనులు ఏం చేసిందని..?! అంటూ ఈ స్టోరీ చదివే ప్రతీ ఒక్కరికీ.. లోలోపల అప్పుడే ఓ ఆలోచన మొలకెత్తి ఉంటుంది. అయితే ఆఖరి దాకా చదివితే.. పైన చెప్పినవన్నీ తక్కువే కాబోలు అనుకుంటారు. 

మనం మాట్లాడుకోబోయే అమ్మాయి పేరే వసుంధర కొప్పుల. ఊరు అనంతపురం జిల్లా.. చెట్టూరు మండలం. తనకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆ ఊళ్లోని డాక్టర్ చేసిన మూర్ఖత్వపు పని వల్ల పోలియో డ్రాప్స్ వికటించాయి. కాళ్లు చచ్చుబడ్డాయి. ఈ విషయం ఆ కుటుంబం తెలుసుకునేసరికి.. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ముద్దులొలికే ఆ పసిపాప అప్పటి నుంచి ఈ భూమిని కాళ్లతో ముద్దాడిన సందర్భమే లేదు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే తండ్రి కుటుంబాన్ని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. ఇక అమ్మా, నాన్నా అన్నీ తానే అయి.. వసుంధర తల్లి ప్రమీలమ్మే పెంచింది. పేరుకు గ్రామమే అయినా.. సువిశాల ఆలోచనలే వాళ్ల గురించి మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబమే అయినా మగ దిక్కులేని సంసారం కావడంతో ఊళ్లో ప్రతీ ఒక్కరూ ఉచిత సలహాలు ఇచ్చేవారే. కాళ్లు సరిగ్గాలేని ఆ పిల్లను ఇంట్లో ఓ మూలనపడేయమని, చదువూ-సంధ్యా అంటూ భారం మోయవద్దని చెప్పిన వాళ్లే ఎక్కువ. కానీ వసుంధర తల్లి మాత్రం అందుకు ససేమిరా అంది. చేసే టైలర్ పనితో, జీవితం అతుకులమయమని తెలిసినా.. ఆందోళనపడలేదు. పిల్ల ఎంత చదివినా చదివించాలని నిర్ణయించుకుంది. దీంతో మండలంలోనే పదో తరగతి వరకూ చదివింది. ఇంటర్ అనంతపురంతో, డిగ్రీ గుంటూరు ఎస్.కె. యూనివర్సిటీలో పీజీ చేసింది.

తమ్ముడు, తల్లితో వసుంధర

తమ్ముడు, తల్లితో వసుంధర


కాలు తీసి కాలు వేయలేని అమ్మాయి, మరో మనిషి సాయం లేనిదే ముందుకు ఒక్క అడుగూ వేయలేని అమ్మాయి.. పీజీ వరకూ చదివిందంటే అంత ఆషామాషీ విషయం కాదు. తమ్ముడు ఎప్పుడూ వెన్నంటే ఉంటూ అక్కకు ఆసరాగా నిలిచాడు. అవిటి దానికి అంతెందుకురా అని కొన్ని నోళ్లు అడ్డగోలుగా కూసినా.. ఆగిపోలేదు. తల్లి కష్టం, తమ్ముడి తోడుతో ఆమె మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది ''ఏం.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే బతికే హక్కు లేదా.. ? ఏం.. మేమూ మామూలు మనుషుల్లా బతకకూడదా ? మా చేతుల్లో లేని దానికి, దేవుడు ఇలా సృష్టించిన దానికి మమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నారు'' అంటూ వసుంధరకు చిన్నప్పటి నుంచే ఆక్రోషం.. ఆవేశం తన్నుకొచ్చేవి. కొన్ని సందర్భాల్లో తనలాంటి వాళ్లను అసలు మనుషులుగా కూడా చూడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. 'మాకేం తక్కువ' అని తనకు తాను పదే పదే ప్రశ్నించుకుంది. తనలాంటి వాళ్లు కూడా తలెత్తుకు జీవించేలా ఏదో ఒకటి చేయాలని అనుకుంది. ఎవరికైనా సాయం చేయాలంటే, ముందు తను సక్సెస్ కావాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఎన్నో మజిలీలు. ఒక్కో మలుపులో ఒక్కో పాఠం ఆమెను మరింత రాటుదేల్చింది.

అవి ఇంటర్ చదివే రోజులు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుంటూరు వస్తున్నారని తెలిసింది. వెంటనే వసుంధర ఓ లేఖను తయారు చేసింది. తనలాంటి వాళ్ల కోసం బరువు తక్కువగా ఉన్న ఆర్టిఫిషియల్ లెగ్స్ తయారు చేయాలని కోరింది. మామూలుగానే నడవలేని తమకు ఐరన్, స్టీల్‌లో తయారయ్యే వాటిని ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని సూచించింది. 'స్వయంగా శాస్త్రవేత్త అయిన మీరు మాలాంటి వాళ్ల కోసం వెయిట్ లెస్ లెగ్స్ తయారయ్యేలా సూచనలు చేయాలంటూ' ఆ వయస్సులోనే లేఖ రాసి, అబ్దుల్ కలాంకు అందజేసింది.

''తల్లిదండ్రులు తిండిపెడితే అలా బతికేస్తున్న వికలాంగులు 30 శాతానికి పైగా ఉన్నారు. వాళ్లలో కూడా ఎన్నో కళలున్నాయి. కానీ వాళ్లను పట్టించుకునే నాధుడు లేడు. ఏదో అలా బతికేస్తున్నారు. ఇంకొంత మంది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసమో, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే మూడు కాళ్ల చక్రాల బండికోసమో చూస్తున్నారు. వాళ్లలోని ఆత్మన్యూనతే వాళ్లను కుంగదీస్తుంది. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఇలాంటి వాళ్లు అసహాయలుగా మిగిలిపోతున్నారు. వాళ్లలో మార్పు తీసుకురావడమే నా లక్ష్యం'' - వసుంధర

దివ్యాంగుల్లో ఏదైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వసుంధర మీడియాలోకి రావాలని నిర్ణయించుకుంది. స్క్రిప్ట్ రైటర్‌గా, ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా కొన్ని మ్యాగజీన్లు, టీవీ ఛానళ్లలో పనిచేసింది. కానీ తను అనుకున్న లక్ష్యం ఈ రూ.10 వేల ఉద్యోగంతో కుదరదని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువ కాలం పట్టలేదు.

'' మేం అలాంటి అమ్మాయిని తీసుకుని, ఏదో ఉద్ధరిస్తున్నాం అని బయటి ప్రపంచానికి చెప్పుకోవడానికి కొంతమంది నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. నెలకు రూ.10-15 వేల జీతమేగా అనుకున్నారు. అయ్యో పాపమనో, పోనీలే అనే జాలి, కరుణతో వచ్చే ఉద్యోగాలు నేను చేయదలుచుకోలేదు. నాలో టాలెంట్ ఉంటే.. మామూలు వాళ్లతో పోటీపడగలిగే సత్తా ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకోండి'' అంటూ ధైర్యంగా బయటకు వచ్చేసింది వసుంధర.

ఈ క్రమంలో ఓ న్యూస్ ఛానల్‌ బీ ఏ స్టార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తనలాంటి వాళ్లు కూడా మోడల్ ఇండస్ట్రీలో ఎందుకు అడుగుపెట్టకూడదు అనే ధైర్యాన్ని నలుగురిలో నింపడానికి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. అమ్మాయిలో చలాకీతనాన్ని చూసి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. మిస్ వీల్ ఛైర్ కాంటెస్ట్ 2013లోనూ పాల్గొంది.

ఓ ఛానల్ నిర్వహించిన బి ఎ స్టార్ ప్రోగ్రాంలో వసుంధర

ఓ ఛానల్ నిర్వహించిన బి ఎ స్టార్ ప్రోగ్రాంలో వసుంధర


కొద్దికాలం క్రితం మనం సినిమా రివ్యూను అద్భుతంగా రాయడంతో స్వయంగా నాగార్జునే వచ్చి వసుంధరను మనసారా మెచ్చుకున్నారు. 

image


ఇదే క్రమంలో విజువల్లీ ఛాలెంజ్డ్ కోసం ఓ క్రికెట్ లీగ్‌ను తానే స్వయంగా ఏర్పాటు చేసింది. కొంతమంది అడ్వర్టైజర్ల సాయం, మీడియా సహకారంతో సెలబ్రిటీలను పిలిపించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తిచేసింది. అయితే ఇక్కడ ఆదాయం సంగతి దేవుడెరుగు, చేతినుంచి కొంత డబ్బు పడ్డా.. మొదటి అడుగువేశాననే సంతృప్తి ఆమెను మరింత ధృడంగా మార్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని అనుకుంటే కొంత మంది సెలబ్రిటీలు కూడా 'మాకేంటి ?' అని అడుగుతున్నారనేది వసుంధర ఆవేదన. ఇంకొంతమంది టాప్ హీరోయిన్లు.. తమ ఫౌండేషన్‌కు రూ.10 లక్షలు ఇవ్వమని ఓపెన్‌గానే అడగడం కూడా.. తనను ఆశ్చర్యపరిచినట్టు చెబ్తుంది వసుంధర.

image


ఇప్పుడు తన లక్ష్యం ఒక్కటే.. తనలాంటి దివ్యాంగుల కోసం ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయాలని. ఇందుకోసం స్పాన్సర్లను, అడ్వర్టైజర్లను, కార్పొరేట్లను కలిసే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల నాలుగు డబ్బులు సంపాదించాలనే కక్కుర్తి ఆలోచన కాదని, 'మేం కూడా మీ అందరిలా చేయగలము' అని సమాజానికి ప్రూవ్ చేయడానికే అంటారు.

పెళ్లి విషయంలోనూ వసుంధరకు స్పష్టమైన ఆలోచనే ఉంది. గంతకు తగ్గ బొంతలా.. మరో దివ్యాంగుడిని మాత్రం పెళ్లిచేసుకునేందుకు తాను సిద్ధంగా లేదు. ఇద్దరు నిస్సహాయులు జంటగా మారితే... ఇబ్బందులు రెట్టింపవుతాయే తప్ప ఏమీ ప్రయోజనం ఉండబోదనేది తన ఆలోచన. ఓసారి ఎవరితోనో పెళ్లి ప్రస్తావన వస్తే.. వాళ్లు చేసిన కామెంట్ ఆమెను ఇప్పటికీ కుంగిపోయేలా చేస్తోంది. 'నువ్వు బతకడమే ఎక్కువ, నీ బతుక్కి పెళ్లి కూడా అవసరమా ?' అనడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అయినా ఇలాంటి అసహనాలు, ఛీత్కారాలు, పైపై నవ్వులు, ఓదార్పులను ఆమె ఇప్పటికే ఎన్నో చూసింది.

ఇంతకీ వసుంధర ఇప్పటిదాకా ఏం చేసింది ? ఆమె ఎవరికో ఎందుకు స్ఫూర్తిగా మారింది ? ఏమెలో ఏమంత గొప్పదనం ఉంది ? ఇలాంటి వాళ్లు ఇంకా చాలానే చేశారు అని అనుకునేవాళ్లూ ఉంటారు. ఏమె ఏదో చేసిందని, ఇంకేదో చేస్తేనే సక్సెస్ సాధించింది అని చెప్పేందుకు కొలమానాలేవీ లేవు. కాళ్లూ, చేతులూ అన్నీ సక్రమంగా ఉన్నా ఏదో నిరాశతో, ఏదో అభద్రతతో, ఈసురోమని కాలం వెళ్లదీస్తున్న వాళ్లకు ఆమె నిజంగా ఓ స్ఫూర్తి ప్రదాత. సొంతంగా ఒక్క అడుగు కూడా వేయలేని ఆమె.. నిత్యం తనలో తాను పదుల కిలోమీటర్ల దూరం నడుస్తోంది. తనలాంటి వాళ్ల కోసం ఏదో చేయాలనే తాపత్రయం తనని అలా నడిపిస్తోంది. ఇప్పటివరకూ వసుంధర బ్రహ్మండాన్ని బద్దలుకొట్టిన విజయం సాధించి ఉండకపోవచ్చు. అలా అని వీల్ చైర్‌లో కూర్చుని కాలాన్ని అలా కరిగించేయడం లేదు. ప్రభుత్వం నుంచి పదిహేను వందల పెన్షనో.. ప్రభుత్వం పడేసే ఓ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికే పరిమితం కావాలనీ అనుకోవడం లేదు. చేతులూ, కాళ్లూ లేనంత మాత్రాన చేవచావలేదని నిరూపించాలనేదే ఆ అమ్మాయి తాపత్రయం. సాహసమే ఆమె ఊపిరి ! ఆ ఊపిరికి ఊతమిద్దాం. లెట్స్ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. 

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags