నెలలు నిండకుండా పుట్టిన ఆ చిన్నారే..ఇప్పుడు అందరిలో స్ఫూర్తిని నింపుతోంది

20th Oct 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఆ పాప పుట్టినప్పుడు డాక్టర్లు వంద గంటలు కూడా బతకడం కష్టమన్నారు. కానీ ఆ పాప వయసు ఇప్పుడు 16 ఏళ్లు. ఈ చిన్నివయసులోనే ప్రపంచంలో గొప్ప వక్తగా ఎదిగింది. 13 ఏళ్లకే రచయిత్రిగా మారి ప్రసిద్ధ రచనలు చేసింది. భారత్ నుంచి న్యూజిలాండ్ వలస వెళ్లి న్యూజిలాండ్ ప్రైడ్‌గా మారింది. ఆ చిన్నారే ముస్కాన్ దేవ్త. ఆ చిన్నారి ఆత్మవిశ్వాసం ముందు విధి కూడా చిన్నబోయింది.

త‌ల్లి గర్భసంచిలో నీరుపోవ‌డంతో 32 వారాల‌కే నెలలు నిండకుండా పుట్టిన ముస్కాన్ దేవ్త బ‌రువు అప్పుడు కేవ‌లం 1.2 కేజీలు మాత్ర‌మే. అక్టోబ‌ర్ 6, 1999లో ఉద‌యం 11.10 గంట‌ల‌కు ఆ పసిగుడ్డు క‌ళ్లు తెరిచిన‌ప్పుడు అది బతుకుతుందనే ఆశ‌లు పెద్దగా ఎవరికీ లేవు. పూర్తిగా ఎద‌గ‌ని ఊపిరితిత్తులు, గుండెలో రంద్రాలు.. ఇది అప్పుడా బాలిక ప‌రిస్థితి. వంద గంటల తర్వాతే ఏదైనా చెప్పగలమని వైద్యులు చేతులెత్తేశారు. అహ్మదాబాద్‌లో ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు ఆ ముక్కుపచ్చలారని పసిదాన్ని చూసి చ‌లించిపోయారు. త‌క్కువ బ‌రువుతో పుట్టిన కార‌ణంగా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తేల్చేశారు. పార్శియ‌ల్ హెమిప్లేగియాగా తేల్చారు. అంటే పాప కుడివైపు శ‌రీర‌మంతా పార‌లైజ్ అయిపోయింది.

image


క‌ళ్ల‌నిండా ఆశ‌లు..

‘‘పుట్టిన‌ప్పుడు ముస్కాన్ ఎంతో అందంగా ఉంది. ఆ చిన్నారి క‌ళ్ల‌లో బ‌త‌కాల‌న్న ఆశ క‌నిపించింది. క్లిష్ట‌త‌ర‌మ‌యైన వంద‌గంట‌లు ఎలాగోలా ముగిశాయి’’ అని ముస్కాన్ త‌ల్లి జైమిని దేవ‌్తా ఆ రోజులను గుర్తుచేసుకుంటారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఇప్పుడు వీరు నివాసముంటున్నారు.

‘‘ పాప‌ పుట్టిన తర్వాత నా ఒడిలోకి కూడా తీసుకోలేక‌పోయాను. పుట్టిన వెంట‌నే ఇంక్యూబేట‌ర్‌లోకి తీసుకుపోయారు. అప్పుడ‌ప్పుడే వివాహ‌మైన మాకు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో బ‌త‌కాల‌ని ఆశ ఉండేది. ఎన్నో దేవుళ్ల‌ను మొక్కుకున్నాం. చివ‌ర‌కు మా ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి’’ అని జైమిని పాత జ్ఞాపకాలను తలుచుకుంటారు.

అది శీతాకాలం కావ‌డంతో ఆ పాపను మరింత జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని, ప్ర‌త్యేక‌మైన గ‌దిలో ఉంచాల‌ని వైద్యులు సూచించారు. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ పాప ఆరోగ్యం కూడా కుదుట‌ప‌డింది. ఆరునెల‌లు వ‌చ్చేస‌రికి కాస్త మెరుగైంది. అయితే ఎడ‌వ‌వైపు శరీరభాగంతో పోలిస్తే కుడివైపు భాగం కాస్త బ‌ల‌హీనంగానే ఉండేది. ఆ వ‌య‌సులో మిగ‌తా పాప‌ల్లాగే ఉన్న‌ప్ప‌టికీ న‌డ‌వ‌డంలో కాస్త ఇబ్బందుల‌ను ఎదుర్కొనేది ముస్కాన్‌.

న్యూజిలాండ్‌కు షిఫ్ట్

పాప ఆరోగ్యం రీత్యా వైద్యుల స‌ల‌హామేర‌కు ముస్కాన్ త‌ల్లిదండ్రులు భారత్ నుంచి న్యూజిలాండ్‌కు తరలివెళ్లారు. ‘‘అక్కడ మంచి వైద్యం ల‌భిస్తున్న‌ది. అంతేకాదు సంస్కృతి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది’’ అని జైమిని అంటారు. తమ చిన్నారి ఆరోగ్యం కోసం 2004లో వారు తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ముస్కాన్ దేవ్త

ముస్కాన్ దేవ్త


నాలుగున్న‌రేళ్ల వ‌య‌సులో ముస్కాన్‌ను స్కూల్‌లో చేర్పించారు. అయితే మిగ‌తా పిల్ల‌ల‌తో కలిసిపోవడం ముస్కాన్‌కు కాస్త ఇబ్బందైంది. ఎందుకంటే తను కాస్త నెమ్మ‌దిగా ఉండేది. ఆ ప‌రిస్థితుల‌ను ఆరంభంలో ఆక‌లింపు చేసుకోలేక‌పోయింది. అయితే తొంద‌ర‌లోనే సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. ‘‘ ఇబ్బందంతా కొద్దికాలమే. ఆ త‌ర్వాత త‌న ప‌రిస్థితి తనకు అర్థ‌మైంది’’ అని జైమిని వివ‌రించారు.

ఇప్పుడు ముస్కాన్ ఓ ర‌చ‌యిత్రి, రేడియో జాకీ, ఓ స్ఫూర్తిదాయక వ‌క్త‌. అన్ని స‌వాళ్ల‌ను, అడ్డంకుల‌ను ఆమె అధిగ‌మించింది. న్యూజిలాండ్‌లో ముస్కాన్‌కు మ‌రో స‌ర్జ‌రీ కూడా జ‌ర‌ిగింది. అక్కడి ప‌బ్లిక్ హాస్పిట‌ల్‌లో కుడిపాదానికి శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించారు. ఆప‌రేష‌న్ అయిన‌ప్ప‌టికీ తను కాస్త నెమ్మ‌దిగానే నడుస్తుంది. నెల‌లు నిండ‌క‌ముందే పుట్టిన కార‌ణంగా గుండెలో ఏర్ప‌డిన రంధ్రాలు కూడా వ‌య‌సుతోపాటు మూసుకుపోయాయి.

చిన్ని త‌మ్ముడి ఆల‌నాపాల‌న‌..

ముస్కాన్ ఆరేళ్ల వ‌య‌సులో ఆమెకు అమన్ అనే తమ్ముడు పుట్టాడు. ఆ చిన్నారి జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైంది. స్వ‌తంత్రంగా నిల‌బ‌డేందుకు ఆమెకు అవకాశం ల‌భించింది. త‌న వైక‌ల్యాల‌ను ప‌క్క‌న‌పెట్టి త‌మ్ముడి బాధ్య‌త‌ల‌ను కూడా ప‌ర్య‌వేక్షించ సాగింది. స్కూల్ నుంచి త్వ‌ర‌గా వ‌చ్చి త‌మ్ముడి అవ‌స‌రాల‌ను చూసేది ముస్కాన్‌. అనారోగ్యాన్ని గురించి ఆలోచించకపోవడంతో ఆరోగ్యం కూడా మెరుగైంది. తొమ్మిదేళ్ల వ‌య‌సులో తనే ఓ ర‌చ‌యిత్రిగా మారింది. ఆమె తొలి స్టోరీ ‘‘ మై ఫ్రెండ్ గ‌ణేశా ’’ ఓ చిన్ని క‌థ‌. వినాయ‌కుడి జ‌న్మ‌ వృత్తాంతాన్ని త‌న తొలి క‌థ‌లో త‌న‌కు తెలిసిన‌విధంగా వివ‌రించింది. వినాయ‌కుడికి ఏనుగు త‌ల ఎలా వ‌చ్చిందో చెప్పింది. ఈ క‌థను న్యూజిలాండ్ ప్ర‌భుత్వం మంచి కథగా ఎంపిక‌ చేసింది. ఇక 2014లో ‘‘ ఐ డ్రీమ్‌ ’’ పేరుతో త‌న ఆత్మ‌క‌థ‌ను రాసింది. తాను చదివే వెస్లీ గ‌ర్ల్స్ హైస్కూల్ ఎథిక్స్ క‌రిక్యుల‌మ్‌లో ఈ ఆత్మ‌క‌థ‌ను కూడా పొందుప‌ర్చడం ఆశ్చర్యం.

‘‘ నాకు ఎక్క‌వ‌ మంది స్నేహితులు లేరు. అందుకే ర‌చ‌న‌ల‌పై దృష్టిపెట్టాను ’’ అని ముస్కాన్ చెబ్తుంది. అవసరాలను బట్టి పరిస్థితులకు అనుకూలంగా మనిషి తనను తాను ఎలా మలుచుకోవాలో తన టెడ్ టాక్ ‘‘బారోయింగ్ కరేజ్’’లో వివరిస్తుంది.

‘‘ నాకు వచ్చిన కష్టాల వల్ల మంచే జరిగింది. నాకు చాలామంది కష్టాలు సృష్టించే మిత్రులే ఉన్నారు. అందు వల్లే రీడింగ్‌పై దృష్టి సారించాను. నా భావాలను మరో విధంగా వ్యక్తీకరించాలనుకున్నాను. అందుకే రచనలపై దృష్టిసారించాను. ఇదే అత్యుత్తమ మార్గమని అనిపిస్తుంది ’’ అని తను చెబ్తుంది. వాస్తవానికి ముస్కాన్‌లో భావోద్వేగాలు అధికం. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అందుకే తనలోని భావాలను రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిందా చిన్నారి.

‘‘నేను రచనలు ప్రారంభించిన్పటి నుంచి కొనసాగిస్తూనే ఉన్నాను. మధ్యలో ఆపేందుకు ఇష్టపడలేదు. రచనల ద్వారా నా భావోద్వేగాలను ప్రపంచానికి చాటి చెపితే నా మనసు తేలిక అయినట్టు అనిపిస్తుంది’’ అని స్పష్టమైన హిందీలో వివరించింది.

రేడియో జాకీగా..

అనర్గళంగా హిందీ మాట్లాడగలిగే నైపుణ్యమే ఆమెను రేడియో జాకీని చేసింది. న్యూజిలాండ్‌లోని ప్రముఖ రేడియో స్టేషన్ రేడియో తరానాలో ఆర్జేగా పనిచేసింది. ఓ చిన్నపిల్లల కార్యక్రమానికి యాంకర్‌గా కూడా ఓ టెలివిజన్ షో చేసింది.

12 ఏళ్లవయసులోనే ఆర్జేగా మారిన ముస్కాన్, స్కూల్ న్యూస్‌లెటర్స్‌కు ఆర్టికల్స్ కూడా రాసేది. టీవీల్లో వచ్చే క్రిమినల్ సిరీస్‌లంటే ఆమెకు తెగ ఇష్టం. పెద్దయ్యాక ఫొరెన్సిక్ సైంటిస్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ఓ టాక్ షోలో ప్రసంగిస్తున్న దేవ్త ముస్కాన్

ఓ టాక్ షోలో ప్రసంగిస్తున్న దేవ్త ముస్కాన్


ముస్కాన్‌కు బేకింగ్ చేయడమన్నా చాలా ఆసక్తి. త్వరలో ఇంటికి రాబోయే తన స్నేహితుల కోసం బ్రౌనీస్‌ను తొలిసారి బేక్ చేసిందామె. తనకు ముగ్గురు సన్నిహిత మిత్రులున్నారని, తాను స్కూల్‌లో ఉన్నప్పుడు వారు తనకెంతో సాయంగా నిలిచారని ముస్కాన్ చెప్పింది. ప్రస్తుతం ముస్కాన్ లెవన్త్ స్టాండర్డ్ చదువుతోంది. ఇంగ్లీష్, స్పానిష్, కెమిస్ట్రీ ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్స్.


ముస్కాన్.. నీ మొహంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలని.. నువ్వు మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని యువర్ స్టోరీ కూడా కోరుకుంటోంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India