సంకలనాలు
Telugu

మొక్కల పెంపకానికీ స్మార్ట్ టెక్నాలజీ వాడుతున్న గ్రీనోపియా

ఇంటి పెర‌ట్లో మొక్క‌ల‌ను పెంచాల‌నుకుంటున్నారా ?ఎలాంటి మొక్క‌లు పెంచాల‌తో తెలియ‌డం లేదా ?వాటి సంర‌క్ష‌ణ ఎలాగో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారా ?ఐతే మీ స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌పెట్టండి.. వెంట‌నే గ్రీనోపియాలో స‌భ్యులుగా చేరండి..స్మార్ట్ తొట్ల ద్వారా ఈ-వ్య‌వ‌సాయం చేస్తున్న‌దీ సంస్థ‌..

GOPAL
6th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

గార్డెనింగ్ అంటే మ‌న‌లో చాలామందికి ఇష్టం. కానీ హోమ్ గార్డెన్స్‌, ప్లాంట్ల‌ను ఎలా కాపాడుకోవాలో మొక్క‌ల‌ను తొలిసారి పెంచుతున్న‌ వారిలో చాలామందికి తెలియ‌దు. ఇక ఎప్పుడైనా ఇంటిని విడిచి ఎక్క‌డికైనా వెళ్లాలంటే మొక్క‌లు పాడ‌వుతాయేమోన‌న్న భ‌యం వెంటాడుతుంటుంది. ఇలాంటి స‌మ‌యాల్లో పొరుగువారు, స్నేహితుల‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుంటాం. మ‌న‌ం వచ్చే వ‌ర‌కూ మొక్క‌ల‌ బాగోగులు చూడ‌మ‌ని చెప్తాం. అయినా మ‌న‌సంతా మొక్క‌ల‌పైనే ఉంటుంది. ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చెప్పేందుకొచ్చిందో సంస్థ‌. టెక్నాల‌జీ ఆధారంగా ఈ-తొట్లలో స్మార్ట్ వ్య‌వ‌సాయాన్ని చేస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ఎన్ఐడి, ఐఐఎం మాజీ విద్యార్థులు. త‌మ గ్రీనోపియా ప్రాడ‌క్ట్‌ల‌తో గార్డెన్‌ల‌ను స్మార్ట‌్ ఫామ్స్‌గా మార్చిపారేశారు.

స్మార్ట్ తొట్లలో కొలువుదీరన మొక్కలు

స్మార్ట్ తొట్లలో కొలువుదీరన మొక్కలు


స్మార్ట‌ర్ గ్రీనోపియా

గ్రీనోపియా అనేది టెక్నాల‌జీ ఆధారంగా మొక్క‌ల‌ పెంప‌కం. కొన్ని స్మార్ట్ తొట్లు (పాట్స్‌), ఓ మొబైల్ అప్లికేష‌న్స్ సాయంతో ఆఫీస్‌లో కూర్చునే రిమోట్ సాయంతో మొక్క‌ల పెంప‌కాన్ని ప‌ర్య‌వేక్షిస్తుంది గ్రీనోపియా. ఈ స్మార్ట్ తొట్ల‌లో సెన్సార్ల‌ను అమ‌రుస్తారు. వాటి సాయంతో మొక్క‌ల ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటారు. స‌రైనంత నీరు మొక్క‌ల‌కు ల‌భిస్తుందా? సూర్య‌కాంతి అందుతోందా? ఆ మ‌ట్టిలో ఎలాంటి మొక్క‌ల‌ను పెంచాలి ? అనే విష‌యాల‌ను వారు టెక్నాల‌జీ ద్వారా తెలుసుకుంటూ.. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు సూచ‌న‌లందిస్తుంటారు. అలాగే ఈ-ప్లాంట్ల‌ను పెంచుతున్న‌వారంద‌రితో క‌లిపి ఓ ఆన్‌లైన్ క‌మ్యునిటీని ఏర్పాటు చేసి పెర‌టి వ్య‌వ‌సాయంలో తీసుకోవాల‌సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చ‌లు కూడా నిర్వ‌హిస్తున్న‌దీ సంస్థ‌. ఈ క‌మ్యునిటీలోని వ్య‌క్తులు త‌మ మొక్క‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను చ‌ర్చించ‌డంతోపాటు వారి అనుభ‌వాలను, మొక్క‌ల ఫొటోల‌ను ఇత‌రుల‌తో పంచుకుంటారు.

ఆఫీస్‌నుంచే మొక్క‌ల‌కు నీళ్లు..

టెక్నాల‌జీ సాయంతో త‌యారు చేసిన ఈ- తొట్ల‌లో ఓ మోట‌ర్‌తోపాటు నీటితో నిండిన ఓ రిజ‌ర్వాయ‌ర్ (చిన్న వాట‌ర్ ట్యాంక్‌లాంటింది) కూడా ఉంటుంది. మొబైల్ యాప్‌లోని వాట‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేసిన వెంట‌నే ఇళ్ల‌లో ఉన్న ఈ-తొట్ల‌లో ఉన్న సెన్సార్ల‌కు సిగ్న‌ల్స్ అందుతాయి. దీంతో తొట్ల‌లో ఉన్న మోటార్ ప్రారంభ‌మై మొక్క‌ల‌కు నీరు అంద‌జేస్తుంది.

image


మొక్క‌ల లైబ్ర‌రీ

ఈ- తొట్ల‌లో పెంచిన మొక్క‌ల‌కు సంబంధించిన డాటాను కూడా ఈ సంస్థ భ‌ద్ర‌ప‌రుస్తుంది. ఈ- తొట్ల‌లో ఎలాంటి మొక్క‌ల‌ను పెంచారు, అవి ఎంత‌కాలానికి చేతికందాయి, వాటిని సంర‌క్షించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు వంటి వివ‌రాల‌ను సేక‌రిస్తారు. భ‌విష్య‌త్‌లో ఎవ‌రైనా మ‌ళ్లీ అలాంటి మొక్క‌ల‌ను పెంచాల‌నుకుంటే వారికి ఈ స‌మాచారం గ్రీనోపియా లైబ్ర‌రీలో ల‌భిస్తుంది.

అర్బ‌న్ ప్రొఫెష‌న‌ల్సే టార్గెట్‌..

ప‌ట్ట‌ణాల్లో త‌మ ఇళ్ల‌లో గార్డ‌నింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపే 20 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య‌ వ‌య‌సున్న వృత్తినిపుణుల‌నే గ్రీనోపియా టార్గెట్‌గా పెట్టుకుంది. మొక్క‌ల‌ను మొద‌టిసారి పెంచుతున్న‌వారు, గార్డెనింగ్‌లో ఎంతో అనుభ‌వ‌మున్న‌వారికి ఉప‌యోగ‌ప‌డేలా టెక్నాల‌జీని రూపొందించింది. తొలిసారిగా మొక్క‌ల‌ను పెంచుతున్న‌వారు ఈ-వ్య‌వ‌సాయం ద్వారా కొత్త కొత్త విష‌యాలు తెలుసుకుంటే, గార్డెనింగ్‌లో విశేష అనుభ‌వ‌మున్న‌వారు త‌మ అనుభ‌వాల‌ను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇత‌రుల‌తో పంచుకుంటారు.

నిపుణుల టీమ్‌..

ఈ గ్రీనోపియా టెక్నాల‌జీ వెనుక‌ ఎంతో మంది నిపుణుల కృషి ఉంది. టెక్నాల‌జిస్టులు, ఆంట్రప్రెన్యూర్స్‌, గార్డెనింగ్ ఎక్స్‌ప‌ర్ట్స్‌, రీసెర్చ‌ర్స్‌, ప్రాడ‌క్ట్ డిజైన‌ర్స్, యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ డిజైన‌ర్స్ (యూఈడీ), ఎన్ ఐడీ, ఎన్ ఐటీ, ఐఐఎం-అహ్మ‌దాబాద్‌కు చెందిన మేనేజ‌ర్లు ఈ-వ్య‌వ‌సాయాన్ని ప‌ట్ట‌ణ‌వాసుల పెర‌ట్లోకి తెచ్చేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. 

గ్రీనోపియా రీసెర్చ్ టీమ్‌కు హెడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మయూఖిని పాండే, యూఎక్స్ డిజైన్‌ను లీడ్ చేస్తున్న దేవ్‌యాని జైన్‌, సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌ణి హెచ్‌కే, విజువ‌ల్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వీతికా మిశ్రా ఈ గ్రీనోప్రియా వ్య‌వ‌స్థాప‌క స‌భ్యులు. ఇన్ఫోసిస్ డిజైన్ యూనిట్‌లో ఇన్నోవేష‌న్ టీమ్‌కు నాయ‌క‌త్వం వ‌హించిన సుధాక‌ర్ ద‌మోద‌ర‌న్ ఇప్పుడు పూర్తిస్థాయి రైతు. అంతేకాదు గ్రీనోపియాకు చీఫ్ ఫార్మింగ్ ఎక్స్‌ప‌ర్ట్ కూడా.

డిజైన్ థింకింగ్‌కు కేరాఫ్ గ్రీనోపియా..

ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తున్న చాలామంది చిన్న గ్రామాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌వారే. త‌మ చిన్న‌త‌నంలో పెర‌ట్లో కొత్తిమీర‌, క‌రివేపాకు వంటి వాటిని పెంచిన విష‌యం చాల‌మందికి తెలుసు. ఐతే న‌గ‌రాల్లో ఈ మొక్క‌ల‌ను పెంచ‌డం సాధ్యం కాదు. ఇళ్ల‌లో మొక్క‌ల‌ను పెంచాల‌ని ప్ర‌య‌త్నించి కొంద‌రు విఫ‌లం చెందారు కూడా. ఇంట‌ర్నెట్‌ల‌లో ల‌భించే స‌మాచారం స్థానిక వాతావ‌ర‌ణానికి అనుకూలంగా ఉండ‌దు. స‌రైన స‌ల‌హాలు ఇచ్చేందుకు గార్డెనింగ్ నిపుణులు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే కార్యాల‌యాల్లో ఉంటూనే ఈ-వ్య‌వ‌సాయం చేసేందుకు ముందుకొచ్చింది. గ్రీనోపియా. న‌గ‌రాల్లో నాణ్య‌మైన జీవితాన్ని ఎలా పొందాలి? త‌మ ఇళ్ల‌లో సొంత పంట‌ల‌ను పండించుకుని ఆరోగ్య‌క‌ర‌మైన భోజ‌నాన్ని ఎలా ఆస్వాదించాలి? అన్న ఆలోచ‌న‌తోనే గ్రీనోపియాకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం వారు నాలుగు ర‌కాల ఆలోచ‌న‌లు యూజ‌ర్ సెంట్రిక్‌సిటీ, మ‌ల్టిపుల్ ఆల్ట‌ర్నేటివ్స్, క్విక్ ఇట‌రేటివ్ ప్రొటోటైప్ , థింకింగ్ సిస్ట‌మ్ వంటివాటితో ఈ-వ్య‌వ‌సాయంలోకి అడుగుపెట్టారు. వీటి ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ఈ-వ్య‌వ‌సాయం గురించి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుంటూ.. త‌మ సేవ‌ల‌ను విస్త‌రిస్తున్నారు.


అవార్డులు, రివార్డులు

ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఇండో ర‌ష్య‌న్ ఎంటీఎస్ ఇన్నోవాట్సీ-2015 అవార్డును గ్రీనోపియా గెలుచుకుంది. వివిధ ర‌కాల ఇండ‌స్ట్రీల నుంచి ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకున్న‌ది.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌..

గ‌త కొన్నేళ్లుగా ఈ న‌మూనాల‌పై గ్రీనోపియా టీమ్‌ ప‌రీక్ష‌లు జ‌రిపింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల ఆలోచ‌న‌ల‌కు అనుగూణంగా, అక్క‌డి వాతావార‌ణానికి త‌గ్గ‌ట్టుగా మొక్క‌ల‌ను పెంచుతూ మంచి ఫ‌లితాల‌ను రాబడుతున్నారు. ఐతే ఇప్పుడు గ్రీనోపియా వ్య‌వ‌స్థాప‌కులు దృష్టంతా భ‌విష్య‌త్ కోసం నిధుల సేక‌ర‌ణపైనే. స‌రిపోయినంత నిధుల‌ను క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సేక‌రించాల‌నుకుంటున్న‌ది. మరి వీరి కొత్త ఆలోచ‌న‌ విజ‌య‌వంతం కావాల‌ని ఆశిద్దాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags