సంకలనాలు
Telugu

ఈ స్టార్టప్ తయారు చేసే గిఫ్ట్‌లంటే అమితాబ్‌కూ ఇష్టమే !

ప్రత్యేక డిజైన్లతో బహుమతులుఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెట్ లో పాగా50కు పైగా నగరాల నుంచి, 15కు పైగా దేశాల నుంచి ఆర్డర్స్

kamaladevi nallapaneni
3rd Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

గిఫ్ట్ ఆర్టికల్ ! స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులపై మన ప్రేమ, అభిమానం, ఆప్యాయతను తెలియజేసే సాధనం. ఇష్టమైన వారికి బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు ఎన్నో షాపుల వెంట తిరిగి రకరకాల గిఫ్ట్‌లు పరిశీలించి చివరికి ఒకదాన్ని ఎంచుకుంటాం. పుట్టిన రోజు, పెళ్లిరోజు, ఫ్రెండ్ షిప్ డే వంటి సందర్భాల్లో ప్రత్యేక వ్యక్తులకు మనం ఇచ్చే ప్రత్యేక బహుమతులు...మన మనసులో వారికున్న స్థానాన్ని తెలియజేస్తాయి. మాటల్లో చెప్పలేని భావాన్ని ఓ బహుమతితో అవతలివారికి తెలియజేయవచ్చు. ఎంతో మంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించటానికి బహుమతులనే ఎంచుకుంటారు. ప్రత్యేక సందర్భాల్లోనే కాదు....స్కూలు, కాలేజీల నుంచి విడిపోయేటప్పుడు, ఆఫీసులు మారేటప్పుడు సన్నిహితులకు మన గుర్తుగా బహుమతులు ఇస్తుంటాం. వారి నుంచి స్వీకరిస్తుంటాం. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం మన సంస్కృతిలో ఓ భాగం.

అపార శక్తిమంతుడైన శ్రీకృష్ణుడు రాక రాక తన ఇంటికి వచ్చినప్పుడు...స్నేహితుడికి ఏమీ ఇవ్వలేని దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న కుచేలుడు గుప్పెడు అటుకులు అందించాడు. ఎంతో ఆప్యాయతతో వాటిని ఆరగించిన కృష్ణుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కుచేలుడిని అష్టైశ్వర్యాలతో ముంచెత్తాడు. పురాణాల కాలం నుంచి మన సంస్కృతిలో బహుమతులు భాగమయ్యాయి. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే అప్పటిలా రాజ్యాలు కాకుండా మనకు తోచినంతలో, చేతయిన విధంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు బహుమతులు అందిస్తూ మన ప్రేమను వ్యక్తీకరిస్తుంటాం. అందుకే గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్ ఎప్పుడూ దినదిన ప్రవర్థమానంగా ఉంటోంది. దేశంలో రీటైల్ రంగంలో గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మకాలు 58శాతం ఉన్నాయంటే....బహుమతులకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ మార్కెట్ ను పసిగట్టిన ఇద్దరు యువకులు, తమ స్నేహితురాలితో కలిసి గిఫ్ట్ ఆర్టికల్స్ రంగంలోకి ప్రవేశించి అద్వితీయ విజయాలు సాధిస్తున్నారు. వారు ప్రారంభించిన ఇండిబిని అనే స్టార్టప్ సామాన్యులతో పాటు అన్నా హజారే, బచ్చన్ కుటుంబం వంటి ప్రముఖులకూ గిఫ్ట్ ఆర్టికల్స్ అందిస్తోంది. ఈ స్టార్టప్‌ను నితిన్ జైన్, అంకిత్ జైన్, కుష్బు మాథూర్ కలిసి ప్రారంభించారు. ఇండిబిని అనే పదం చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే తమ స్టార్టప్ కు ఇండిబిని అనే పేరు పెట్టటానికి ఓ కారణం ఉందంటారు వ్యవస్థాపకులు. ఇండియాకు దగ్గరగా ఉండే టైటిల్ ను పెట్టాలని భావించి ఇండిబిని అనే పేరుపెట్టామని తెలిపారు. ఇండిబినిలోని మూడు ఐ లకు అర్ధం ఇండియా, ఇన్నోవేషన్, ఇండివిడ్యువాలిటీ. భారత్, నూతన ఆవిష్కరణలు, వ్యక్తిత్వం వంటివి ఇండిబినిలో ప్రతిబింబిస్తాయని వారు చెప్పారు. జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం అనే ఆలోచనను తెలియజేయటం కంపెనీ ఉద్దేశమని వివరించారు.

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే బహుమతులను ఇండిబిని తయారుచేస్తుంది. బహుమతి అంటే దాని ధర, పరిమాణం, ఆకారం, ఉపయోగం నిర్ణయించేది కాదనేది ఇండిబిని నిర్వాహకులు భావిస్తారు. కొనేవారికి, అది అందుకునే వారికి మధురమైన అనుభూతిని కలిగించటమే బహుమతి ఉద్దేశమన్నది వారి ఆలోచన. ఇండిబిని ఏర్పాటుకు తాము ఎంతో కష్టపడ్డామని నితిన్ జైన్ చెప్పారు. ఎన్నో రకాల అన్వేషణలు, అపజయాల నుంచి ఇండిబిని రూపుదిద్దుకుందని, అయితే ఈ ప్రయాణం జీవితకాలం గుర్తుండిపోతుందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

ఇండిబిని ఏర్పాటు గురించి నితిన్ ఇలా వివరించారు.

“రాజస్థాన్ బోర్డుకు చెందిన స్కూల్లో హిందీ మీడియంలో పాఠశాల చదువు పూర్తిచేశాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తో పాటు ఫైనార్ట్స్ కలిసిన అరుదైన కాంబినేషన్‌తో ఇంటర్ పూర్తిచేశాను. ఆ తరువాత నాకు సృజనాత్మక రంగంలో కెరీర్‌ను మలుచుకోవాలనిపించింది. జైపూర్ మెస్రాలోని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి యానిమేషన్, డిజైన్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశాను. ఎంతో సరదాగా ఉండటంతో పాటు మంచి వ్యక్తిత్వం కలిగిన అంకిత్ జైన్ నాకు కాలేజ్ లో పరిచయమయ్యాడు. ఓ సంస్థను స్థాపించాలని మేమిద్దరం భావించాం. కానీ ప్రొడక్ట్ డిజైన్ గురించి కానీ, అందుకు ఉపయోగించే వస్తువుల గురించి కానీ మాకు ప్రాథమిక అవగాహన సైతం లేదు. దీంతో స్కూల్లో నాకు జూనియర్, జైపూర్ ఐఐసీడీ నుంచి క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ లో డిగ్రీ పొందిన కుష్బూ మాథూర్ ను కలిశాం. ముగ్గురి భాగస్వామ్యంతో ఇండిబిని ప్రారంభించాం.”
ఇండిబిని వ్య‌వ‌స్థాప‌కులు

ఇండిబిని వ్య‌వ‌స్థాప‌కులు


భారతీయ సంస్కృతి, విభిన్న జాతుల సమ్మేళనం... ఇండిబిని ఏర్పాటుకు ప్రేరణ అని వ్యవస్థాపకులు చెప్పారు. రకరకాల కార్డులు, జ్ఞాపికలు తయారుచేసి చుట్టుపక్కల వారికి సంతోషం కలిగించే బహుమతులు అందించిన చిన్ననాటి జ్ఞాపకాలను వారు తలచుకున్నారు. అందమైన ఉత్పత్తులు తయారుచేసే వారి గురించి, వాటిని ఉపయోగించే వారి గురించి అందరికీ తెలియజేయాలని ఇండిబిని భావిస్తోంది.

బహుమతి కొనే అవసరమున్న ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని ఇండిబిని బహుమతులు రూపొందిస్తోంది. గిఫ్ట్ ఆర్టికల్స్ కు భారీ స్థాయి మార్కెట్ ఉంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రకరకాల కొత్త బహుమతులు ఇచ్చేందుకు, తమకు ఇష్టమైన వారికి గుర్తుండిపోయే బహుమతులు ఇచ్చేందుకు ప్రజలు వెతుకుతుంటారు. తమ దగ్గర రెండు రకాల ఉత్పత్తులు, రెండు రకాల వినియోగదారులు ఉన్నారని నితిన్ చెప్పారు.

అన్ని రకాల బహుమతులు

కంపెనీలో రూ.150 ధర నుంచి రూ. 1500 ధర వరకు ఉన్న రకరకాల బహుమతులు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. మెట్రోలు, పెద్ద నగరాల్లో నివసించే 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు ఎక్కువగా ఇండిబినిలో బహుమతులు కొంటారు. ఈ-కామర్స్ సైట్ల ద్వారా 50కు పైగా నగరాల నుంచి ఇండిబినికి ఆర్డర్లు అందుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ , ఈబే, స్నాప్ డీల్, ఫాబ్ ఫర్నిష్, పేటిఎం వంటి సైట్ల ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన బహుమతులను తెప్పించుకుంటున్నారు. క్రాస్ వర్డ్, పాపరాజీ, షాపర్స్ స్టాప్ వంటి రీటైల్ మార్కెట్లలోనూ ఇండిబిని ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ఇండిబిని బహుమతులను ఎన్‌ఆర్‌ఐలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. భారత్‌లో ఉన్న తమ ఆత్మీయులకు గిఫ్ట్ ఆర్టికల్స్ పంపించాలనుకునే ఎన్‌ఆర్‌ఐలు ఇండిబిని ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. 15కు పైగా దేశాల నుంచి ఇండిబినికి ఆర్డర్లు అందుతున్నాయి.

డిజైన్ స్టూడియో కూడా ఉండటంతో కార్పొరేట్ ఆర్డర్లు తీసుకుని ప్రత్యేకమైన డిజైన్లలో గిఫ్ట్ ఆర్టికల్స్ అందిస్తోంది ఇండిబిని. డిజైన్ గురించి అవగాహన ఉన్న వారు ప్రత్యేకత, సృజనాత్మకత ఉన్న డిజైన్ల కోసం ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్దంగా ఉంటున్నారు. 3ఎం ఇండియా, ఓన్స్ కార్నింగ్, ఎన్బీసీ, జెఐఎఫ్ఎఫ్ తో పాటు అనేక రకాల సంస్థలకు ఇండిబిని డిజైన్డ్ గిఫ్ట్స్ అందించింది. బచ్చన్ కుటుంబానికి, ఫిల్మ్ మేకర్, ఆస్కార్ విజేత అయిన మార్క్ బచెట్ కు, శ్వేతవిప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ కు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పాట ఇంకా అనేకమందికి ఇండిబిని ప్రత్యేక బహుమతులు తయారుచేసి అందించింది.

ప్రత్యేక డిజైన్లతో బహుమతులు

గిఫ్ట్ ఆర్టికల్స్ కోసం ఆర్చీస్, హాల్ మార్క్ వంటి ప్రత్యేక రిటైల్ స్టోర్స్ ఉన్నప్పటికీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రత్యేక డిజైన్లతో తయారుచేసే బహుమతులు కాకుండా...అందరికీ ఉపయోగపడే సాధారణ బహుమతులను ఈ రీటైల్ స్టోర్స్ అందుబాటులో ఉంచుతాయి. ఇండిబిని వీటికి చాలా భిన్నం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బహుమతులు అందించటానికి డిజైన్ విధానాన్ని ఇండిబిని అనునసరిస్తోంది. తయారుచేసిన ప్రతి బహుమతి దాని ఉపయోగాన్ని బట్టి, ప్రత్యేకతను బట్టి అమ్ముడవుతుంది.

వ్యాపారపరంగా ఇండిబినినిని మెరుగుపర్చడం గురించి నితిన్ ఇలా చెప్పారు. “ఏడాదికి మా టర్నోవర్ ఏడు అంకెల్లో ఉంటోంది. ప్రస్తుతం ఇండిబిని స్వయం నియంత్రిత వ్యాపార విధానం అవలంబిస్తోంది. గడచిన రెండేళ్లగా..మార్కెట్ లో మాకు తగిన స్థానాన్ని కల్పించుకోవటం లోనూ, వినియోగదారుల అవసరాలు గమనించటంలోనూ, వ్యాపారాన్ని మెరుగుపరిచే అవకాశాలు గమనించటంలోనూ గడిపాం. ప్రస్తుతం మేం ప్రారంభదశను దాటుతున్నాం. ఏడాది గడిచే కొద్దీ మా ఆదాయం కూడా పెరుగుతుండటం మంచి విషయం. మరింత ప్రభావవంతమైన వ్యాపార పద్ధతి మొదలుపెడతాం. ఆఫ్ లైన్ మార్కెట్ లోనూ, అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఉనికిని చాటుకుంటూ వేగంగా ఎదగాలన్నది ఇప్పటి నుంచి మా లక్ష్యం. అనుభవమున్న, మార్కెట్ షేర్ పెంచుకోగలిగేలా మాకు మార్గదర్శకత్వం వహించగల సరైన పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించాలని కూడా భావిస్తున్నాం.” అని భవిష్యత్ లక్ష్యాలు వివరించారు నితిన్ జైన్.

విభిన్నంగా కనిపిస్తున్న ఇండిబినీ లోగో

విభిన్నంగా కనిపిస్తున్న ఇండిబినీ లోగో


భవిష్యత్ ప్రణాళికలు

అనేక ఆన్ లైన్ సైట్లతో పాటు , పెద్ద పెద్ద రీటైల్ షాపుల్లోనూ ఇండిబిని తన ఉత్పత్తులను అమ్ముతోంది. సమీప భవిష్యత్తులో ఉత్పత్తి స్థాయిని పెంచటంపై ఇండిబిని దృష్టిపెడుతోంది. సొంతంగా యాప్‌ను, ఈ-స్టోర్ ను ప్రారంభించటంతో పాటు....టైర్ 1, టైర్ 2 నగరాల్లో మరిన్ని స్టోర్లలో తమ ఉత్పత్తులును అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. భారత్‌తో పాటు విదేశాల్లోని వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బహుమతులు రూపొందించనుంది. ఆన్ లైన్ మార్కెట్లో ప్రస్తుతం ఇండిబిని వృద్ధి సాధిస్తున్నప్పటికీ....భారత్‌లో గిఫ్ట్ ఆర్టికల్స్ వ్యాపారం ఎక్కువగా ఆఫ్ లైన్‌లోనే జరుగుతోంది. మొత్తం గిఫ్ట్‌ల వ్యాపారంలో 75శాతం ఆఫ్ లైన్ దే. క్రాస్ వర్డ్, షాపర్స్ స్టాప్ వంటి పెద్ద స్థాయి రీటైల్ మార్కెట్లతో ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్ లైన్ మార్కెట్‌లో ఎక్కువగా విస్తరించాలని ఇండిబిని భావిస్తోంది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్ పై దృష్టిపెట్టనుంది.

ఇండిబిని వ్యాపారవ్యస్థకు నూతనత్వమే ప్రదానం. పెద్ద స్థాయిలో ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకోటానికి, డిజైన్ రూపకల్పన, అమలు చేయటానికి మధ్య ఉన్న ఖాళీని పూరించటానికి ఇండిబిని డిజైన్ సొసైటీ ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా రకరకాల ఆలోచనలు, డిజైన్లు అందించే కళాకారులతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నది వారి ప్రణాళిక. ఈ ప్రత్యేకమయిన బహుమతులను ఉత్పత్తి చేసేది, అమ్మేది రెండూ ఇండిబినినే. కళాకారుల పేరుతో ఈ ప్రత్యేక బహుమతులను అమ్మనున్నారు.

బహుమతులకు మన సంస్కృతితో విడదీయరాని భాగం ఉంది. అందుకే భారత్ లో గిఫ్ట్ ఆర్టికల్స్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు రీతిలో సాగుతోంది. మార్కెట్ గతిని పసిగట్టిన ఇండిబిని వినూత్న డిజైన్లతో ముందుకొచ్చి రెండేళ్లలోనే అద్వితీయ విజయం సాధించింది. ముందు ముందు మరింతగా విస్తరించటంతో పాటు, అనుకున్న లక్ష్యాలను సాధించి గిఫ్ట్ ఆర్టికల్స్ రంగంపై ఇండిబిని తనదైన ముద్ర వేయనుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags