సంకలనాలు
Telugu

106 ఏళ్ల గుడివాడ మస్తానమ్మ వంటలకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఫ్యాన్స్

27th Apr 2017
Add to
Shares
22
Comments
Share This
Add to
Shares
22
Comments
Share

క్రిష్ణా జిల్లా గుడివాడలో శివారులో ఉంటుందా ఇల్లు. పూరిగుడిశె. కనీసం తలుపుకూడా లేదు. పొద్దున్నే పొయ్యిలో బూడిద ఎత్తుతూ కనిపించింది మస్తానమ్మ. అటుగా మేకల మంద వెళ్తోంది. డస్టంతా ఒక పేపర్లోకి ఎత్తేశాక, కొబ్బరి పీచుతో పొయ్యి వెలిగించి పాలగిన్నె దానిమీద పెట్టింది. పిల్లల కోడి స్నానాలగది తడికల సందులోంచి లోపలికి వెళ్తోంది. చక్కగా తోమిన గిన్నెలో పాలు మసులుతున్నాయి. ఈలోపు ఇంటిపక్కావిడ వచ్చి పలకరించింది. కుక్కపిల్ల తోక ఊపుకుంటూ సందులోంచి వస్తోంది. అప్పుడేం జరిగిందంటే.. అంటూ ఆవిడతో ఏదో ఆసక్తికరంగా చెప్తోందీ ముసలావిడ. ఎదురుగా బోరింగ్ దగ్గరికి ఎవరో వచ్చారు. ఆమె మాటల స్థాయిలో హెచ్చుతగ్గులు. ఆ కాలం మనుషులంతే. మాట్లాడుతూ మాట్లాడుతూ సైగల్లోకి వెళ్తారు. అంటే చెప్పేది రహస్యమని, వేరేవాళ్లు వినొద్దని అర్ధం చేసుకోవాలి.

image


106 ఏళ్ల మస్తానమ్మ ఒంటరిగానే ఉంటుంది. అలాగని నా అనేవాళ్లు ఎవరూ లేరని కాదు. కొడుకులు, కూతుళ్లు, మనువలు ఉన్నారు. వాళ్లతో ఉండటం, వాళ్లమీద ఆధారపడటం ఇష్టం లేదు తనకి. ఎవరైనా కూలీకి పిలిస్తే వెళ్తుంది. లేదంటే ఇంట్లోనే ఉంటుంది. వందకు పైబడిన వయసులో కాయకష్టం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఆ మాటకే నోరెళ్లబెడితే- ఇంకో విషయం చెప్తే అవాక్కయిపోతారు.

ఇంతకూ అసలు విషయం ఏంటంటే, ఈ శతాధిక వృద్ధురాలు దేశంలోనే పేరుగాంచిన ఓల్డెస్ట్ యూట్యూబ్ స్టార్. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ బామ్మకు ఫ్యాన్స్ ఉన్నారు. అమెరికన్లకు అందరికీ తెలుసు. ఆస్ట్రేలియాలో అభిమానులున్నారు. కరాచీలోనూ ఫేమస్. న్యూజిలాండ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. దేశవిదేశాల్లో మస్తానమ్మ అంటే తెలియనివాళ్లు లేరు. ఆమె చేతివంటని తినాలని ఆరాటపడని వాళ్లు లేరు.

మీరు ఒకసారి కంట్రీ ఫుడ్స్ అని యూ ట్యూబులో కొట్టండి. అద్భుతమైన వంట వీడియోలు పేజీ కనిపిస్తాయి. అందులో ఒక్క వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. వెంటనే మీకు అనిపిస్తుంది.. ఆమె చేతివంట తినే అదృష్టం కలుగుతుందా అని. మాడ్యులర్ కిచెన్ సెటప్ లేదు. ఖరీదైన వంటగిన్నెలు కనిపించదు. ఆప్రాన్ కోట్ హంగామా లేదు. వంటనూనెల బ్రాండ్ బిల్డర్లు పక్కన ఉండవు. ఆహాఓహో అనుకుంటూ వాయిస్ ఓవర్ హడావిడి లేదు. 

చాలా సింపుల్. దూరంగా ఒక చెరువు. గట్టు వెంబడి ఒక మర్రిచెట్టు. పచ్చటి పొలాలు. ఇటుపక్క సారకాయ పాదు. ఇటు పక్క ప్రేమతో అల్లుకుపోయిన రెండు తాటితోపులు. కాస్తంత దూరంలో హాయగా కూచొని నెమరువేస్తున్న రెండు గేదెలు. ఇదే యాంబియెన్స్. కర్రల పొయ్యిముందు చిన్న స్టూల్ మీద కూచుంటుంది. ఎడమచేతి వాటం. ఒకవైపు పొయ్యిలో కట్టెలు ఎగదోస్తూ, మరో చేత్తో వంటకు కావాల్సిన పదార్ధాలను కలుపుతుంది. చాలా తేలిగ్గా, ఏమాత్రం శ్రమ తెలియకుండా, ఉత్సాహంగా, ఉల్లాసంగా వండుతుంది. పదే పది నిమిషాల్లో వీడియో కంప్లీట్ అవుతుంది. చివరిదాకా చూసిగానీ వదిలిపెట్టరు. నోట్లో క్రిష్ణా నది లాలాజలమై పరుగులు పెడుతుంది.

మస్తానమ్మ చేత్తో ఏది చేసినా అమోఘం. చేపల ఫ్రై చేసిందంటే ముళ్లు కూడా మింగేయాలన్నంత ఇదిగా ఉంటుంది. తందూరీ చికెన్ రేంజిలో కాలిన చేపల్ని అరటి ఆకులో పెట్టుకుని, పక్కకు నిమ్మకాయ ఉల్లిగడ్డ నంజుకుంటే- స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉంటాం. ఇక టైగర్ రొయ్యల కూర.. అబ్బో అదుర్స్. నాటుకోడి వేపుడు.. నాసామిరంగా. కోడిగుడ్డు అట్టు.. చెప్పతరం కాదు. ఒక్క నాన్ వెజే కాదు.. వెజ్ లోనూ మస్తానమ్మ చేతికి తిరుగులేదు. బెండకాయ డీప్ ఫ్రై చేస్తే దిమ్మదిరిగిపోద్ది. వంకాయ నూనెలో వేయిస్తే నోరు లబలబలాడుతుంది. ఇలా ఒకటా రెండా బోలెడు వీడియోలు.

కేవలం విజువల్స్ మాత్రమే ఉంటాయి. వాయిస్ ఓవర్ ఉండదు. పదినిమిషాల నిడివి. చూసినా కొద్దీ చూడబుద్దవుతుంది. మధ్యమధ్యలో బోసి నవ్వులు.. వీడియో చూస్తున్నంత సేపు చాలా సహజంగా ఉంటుంది. ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండదు. చూస్తుంటేనే నేర్చుకున్నంత ఫీల్ వస్తుంది. ముసలమ్మ వండే వంటలకు 2,50,000 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే మీరు నమ్ముతారా?

ఈ ఐడియా మస్తానమ్మ మనవడు లక్ష్మణ్ ది. ఒకరోజు అనుకోకుండా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వంటల వీడియోలతో యూ ట్యూబ్ చానల్ రన్ చేస్తే ఎలావుంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పుడే వాళ్ల బామ్మ మస్తానమ్మ బుర్రలో చటుక్కున మెరిసింది. ఎందుకంటే ఆమె వండిన వంట టేస్టేంటో తెలుసుకాబట్టి. ఇంకేముంది ఐడియా క్షణాల్లో డెవలప్ అయింది. కిచెన్ సెటప్ హంగామా లేకుండా నాచురల్ గా, చెరువు వొడ్డున చెట్టుకింద స్వయాన ఆమె చేతులతోనే వండుతుంటే షూట్ చేయడం, అప్ లోడ్ చేయడం. ఫ్రెండ్స్ అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలా మొదలైంది కంట్రీ ఫుడ్స్ చానల్.

ఎంత నాగరికత పెరిగినా, ఎన్ని విదేశీ వంటలు కళ్లముందు కనిపించినా, ఊరివంటలకుండే ప్రాధాన్యతే వేరు. సాంప్రదాయ వంటకాలకు దేశంలో ఎప్పటికీ పెద్దపీటే. హోటల్లో ప్లేట్ మీద ఎంత స్టయిలిష్ గా గార్నిష్ చేసుకుని వచ్చినా, ఉప్పుచేప, పప్పుచారు ముందు దిగదుడుపే. సరిగ్గా ఈ లాజిక్ తోనే వంటల ప్రోగ్రాం మొదలుపెట్టాడు లక్ష్మణ్. మొదటి వీడియోనే చెప్పింది.. మస్తానమ్మ వంటకు ఎంత దమ్ముందో. అన్నిటికంటే హైలైట్- పుచ్చకాయలో చికెన్ కర్రీ. ఆ వీడియోకి బీభత్సమైన రెస్పాండ్. దాదాపు 70 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఇదంతా యూట్యూబ్ కోసం చేస్తున్నామని, దాన్ని ఇంటర్నెట్లో జనం చూస్తారని, దాంతో డబ్బులు సంపాదిస్తారని, ఇదంతా మస్తానమ్మకు తెలియదు. మనవడు అడిగాడు కాబట్టి వంట చేస్తోంది అంతే. మనవడి మీద ప్రేమతోనే ప్రపంచమంతా అభిమానుల్ని సంపాదించుకున్న వందేళ్ల మస్తానమ్మకు సాహో. ఆమె చేతి వంటలకు జయహో. 

Add to
Shares
22
Comments
Share This
Add to
Shares
22
Comments
Share
Report an issue
Authors

Related Tags