సంకలనాలు
Telugu

ఆర్థిక సరళీకరణే దేశానికి ఆయువు పట్టు

ఆర్థికరంగంలో భారత్ దూసుకుపోతున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది- అశుతోష్

team ys telugu
22nd Jul 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


వామపక్ష సిద్ధాంతాలకు నెలవైన యూనివర్సిటీలో చదువుతున్న రోజులవి. క్యాంపస్‌ అడుగుపెట్టే సమయానికి మార్క్సిజం, లెనినిజం ఊపు మీదుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఉన్న సోవియట్‌ యూనియన్‌ ప్రాభవం తగ్గిపోతున్న సమయమది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ సోవియట్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ మైకేల్‌ గోర్బచేవ్ ఆర్థిక, రాజకీయ పునర్నిర్మాణం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తూర్పు యూరప్‌లోని కమ్యూనిస్టు దేశాలతో పాటు సోవియట్‌ యూనియన్‌ కూడా ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విషయాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. అప్పట్లో ప్రైవేటీ కరణ, మార్కెట్‌ వ్యవస్థలు దేశాన్ని తిరోగమన దిశగా నడిపిస్తాయని భారత్‌ సైతం గట్టిగా నమ్మేది. మూడో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ఉద్దేశంతో భారత్‌ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. అయితే 1994లో JNUలో చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చే సమయానికి దేశ ప్రజల ఆలోచనా విధానం, వైఖరిలో చాలా మార్పు వచ్చింది. మార్కెట్‌లపై నమ్మకం పెరిగింది. ప్రైవేటీకరణను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. లైసెన్స్‌ రాజ్‌ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి పారిశ్రామిక రంగం, ఆర్థిక వ్యవస్థలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ పురోగమన బాట పట్టింది.

1980వ దశకం చివరలో యూనివర్సిటీలో అడుగుపెట్టాను. అప్పడప్పుడే STD ఫోన్‌ బూత్‌లు వచ్చాయి. ఢిల్లీలోని ప్రతి వీధిలో అవి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. క్యాంపస్‌లో ఉండే వారంతా రాత్రి 11 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసేవారు. రాత్రి 11గంటల తర్వాత ఎస్టీడీ కాల్‌ రేట్స్‌ పావు వంతుకు తగ్గేవి. అందుకే ఆ సమయంలో ఎస్టీడీ బూత్ ల ముందు పెద్ద క్యూలు ఉండేవి.. అప్పటికి మొబైళ్లు, వాట్సాప్‌లు లేవు. ఇప్పట్లా స్మార్ట్ ఫోన్‌ టచ్‌తో ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ల్యాండ్‌లైన్‌లో ఒక సిటీలో ఉన్న వారు వేరే సిటీలోఉన్న వారితో మాట్లాడాలంటే రెండు మూడు గంటల సమయం వృథా అయ్యేది. ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేస్తే ఏ గంటకో రెండు గంటలకో ఆప్తులతో మాట్లాడే అవకాశం దక్కేది.

దేశంలో అప్పటికి వేళ్లపై లెక్కపెట్టగలిగినన్ని ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి. అవి కూడా బోసిపోయినట్లుండేవి. ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ - ఢిల్లీ రైల్వే స్టేషన్‌ కన్నా కాస్త మెరుగ్గా ఉండేది అంతే. మధ్య తరగతి వారు విమానంలో ప్రయాణించడం అత్యంత అరుదైన విషయం. అప్పట్లో విమానం ఎక్కడమంటే సంపన్న వర్గాల విలాసం మాత్రమే. ఆ సమయంలో ఇప్పుడున్నని ప్రైవేట్‌ ఎయిర్‌ లైన్స్ గానీ వాటి మధ్య పోటీ ఉండేది కాదు. ఎయిర్‌ కనెక్టివిటీ కూడా కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సింగిల్‌ స్క్రీన్‌ సినిమా హాల్లే తప్ప మల్టీ ప్లెక్స్‌ ల గురించి తెలియదు. సినిమా హాల్ లలో రోజూ నాలుగు ఆటలు ఉండేవి. 12 నుంచి 3, 3 నుంచి 6, 6 నుంచి 9, 9 నుంచి 12 వరకు షోలు నడిపేవారు. అప్పట్లో ఇంట్లో వారంతా కలిసి సినిమాకు వెళ్లడమే పెద్ద ఫ్యామిలీ ఔటింగ్‌. కేబుల్‌ టీవీలు లేవు. దూరదర్శన్‌ మాత్రమే ఉండేది. అందులో ఆదివారం రోజున సినిమాలు వచ్చేవి. దేశంలో ప్రపంచంలో ఏ జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే దూరదర్శన్‌ ఒక్కటే దిక్కు. ఇప్పటిలా ప్రైవేట్‌ న్యూస్‌ ఛానెల్స్ లేవు. ప్రైమ్‌ టైం డిబేట్లు, స్టూడియోల్లో కూర్చుని బండబూతులు తిట్టుకునే రేటింగ్ పెంచుకునే కార్యక్రమాల గురించి తెలియదు. యాంకర్స్ అనే జాతి అప్పటికి పుట్టలేదు. టీవీ స్క్రీన్ పై న్యూస్ రీడర్లు మాత్రమే కనిపించేవారు. TRPల గొడవ అస్సలు ఉండేది కాదు. మొదటి గల్ఫ్‌ యుద్ధం సమయంలో తొలిసారి కేబుల్‌ న్యూస్‌ ఛానెల్‌ సీఎన్‌ఎన్‌ గురించి విన్నాను. అప్పడే ఇండియాలో తొలిసారి లైవ్‌ కవరేజీ ప్రసారమైంది.

image


అప్పటికి భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశం కాదు. రోడ్లపై పాములు ఆడించే వారు, సాధువులు, ఆవులు కనిపించే పేద దేశం. సోవియట్‌ యూనియన్‌, యూఎస్‌ఏ మధ్య ప్రపంచ దేశాలన్నీ కమ్యూనిస్ట్‌, క్యాపిటలిస్ట్‌ సిద్ధాంతాలపై రెండుగా విడిపోయాయి. అప్పడు కూడా అవినీతి ఇదే స్థాయిలో ఉండేది. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన బోఫోర్స్‌ కుంభకోణం అందుకు నిదర్శనం. అయితే 1991 నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. పీవీ నరసింహా రావ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశం దివాళా తీసే స్థితిలో ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయలేని దీనస్థితి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అప్పటికి కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాల ప్రభావం తగ్గిపోయింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో భారత్‌ చేసిన ప్రయోగం దారుణంగా విఫలమైంది. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ జీవం పోయాలి. లైసెన్స్‌ రాజ్‌ను స్వస్థి పలకాలి. మార్కెట్‌ లాజిక్‌ను అమలుచేయాలి. నరసింహా రావ్ అదేచేశారు. లాభాపేక్ష, పోటీతత్వం మొదలైంది. వాస్తవానికి ఏళ్ల తరబడి పాతుకుపోయిన విధానాలను విడిచిపెట్టడం అంత సులువైన విషయం కాదు. పీవీ నర్సింహారావ్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. టెక్నోక్రాట్‌ను ఫైనాన్స్‌ మినిస్టర్‌గా నియమించారు. దేశ ముఖ చిత్రాన్ని మార్చేందుకు స్వాతంత్ర్యం తర్వాత తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పీవీ నర్సింహారావు చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను ఆ సయంలోనే పాత్రికేయ వృత్తిలోకి వచ్చాను. కంప్యూటర్‌ వినియోగంపై జర్నలిస్టులు సహా దేశ ప్రజలంతా ఎంతగా నిరసన వ్యక్తం చేశారో ఇప్పటికీ గుర్తుంది. కంప్యూటర్ రాకతో ఉద్యోగాలు కోల్పోతామని జనం భావించేవారు. దాని వల్ల నిరుద్యోగం పెరుగుతుందన్నది వారి అభిప్రాయం. అప్పట్లో మార్కెట్లును ఓ భూతంగా భావించేవారు. సంపన్నులైన పారిశ్రామికవేత్తల కోసమే మార్కెట్‌ పనిచేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండేది. మల్టీ నేషన్ కంపెనీల రాకతో 300 ఏళ్ల నాటి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన మళ్లీ తిరిగొస్తుందని మెజార్టీ జనం భావించేవారు. అయినా నర్సింహారావు మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను పొలిటికల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టి మన్మోహన్‌ సింగ్‌కు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే బాధ్యత అప్పగించారు. ఈ ఇద్దరూ కలిసి అద్భుతాలు సృష్టించారు. నర్సింహారావు పదవి నుంచి వైదొలిగే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోతోంది

ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టు పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ HD దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ప్రభుత్వాలు సైతం పీవీ నర్సింహారావు హయాంలో రూపొందించిన విధానాలనే అనుసరించాయి. వాజ్‌పేయ్‌ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిస్తూ ఇదే ఒరవడి కొనసాగించింది. 2004లో వాజ్‌ పేయ్‌ సర్కారు గద్దె దిగే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ ఊపుమీదుంది. ఆ ఏడాది వృద్ధి రేటు 9 శాతంగా నమోదైంది. ఆర్థికమాంద్యం కారణంగా 2008లో తప్ప 2011 వరకు అదే స్థాయిలో వృద్ధి రేటు నమోదైంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌ వైపే చూస్తున్నాయి..

ఈ వ్యాసం రాసే సమయానికి ఆర్థిక సరళీకరణను అమలుచేయడం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా భారత్ సిల్వర్‌ జూబ్లీ వేడకలు జరుపుకుంటోంది. గత 25 ఏళ్లలో భారత్‌లో వచ్చిన మార్పులన్నింటినీ గమనించాను. ప్రస్తుతం భారత్‌ ఏమాత్రం పేద దేశం కాదు. ఇది ఫ్యూచర్‌ సూపర్‌ పవర్‌. మధ్య తరగతిలో కొత్త వర్గం పుట్టుకొచ్చింది. సగటు మనిషి కొనుగోలు శక్తి ఎన్నోరెట్లు పెరిగింది. రెస్టారెంట్లలో తినడం ఇప్పుడు విలాసం కాదు హాబీ. ప్రపంచంలోనే ఖరీదైన వస్తువుల్ని కొంటున్నారు. ప్రతి రోజు ఓ కొత్త షాపింగ్‌ మాల్‌కు పునాదులు పడుతున్నాయి. భారత్ ఇప్పుడు అతిపెద్ద కన్జ్యూమర్‌ హబ్‌. భారతీయ కంపెనీలు అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీ ఇచ్చే స్థాయికి చేరాయి. గూగుల్‌ , మైక్రోసాఫ్ట్‌, పెప్సీకో వంటి బడా కంపెనీలు భారతీయుల్నే సీఈఓలుగా నియమించుకుననాయి. సిలికాన్‌ వ్యాలీ రెవల్యూషన్‌లో భారత్ కీలక పాత్ర పోషించింది.

1991లో చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే కార్లు ఉండేవి. ఇప్పుడు దాదాపు అందరి దగ్గర ఫోర్‌ వీలర్‌లు కనిపిస్తున్నాయి. కొందరి దగ్గరైతే ఒకటికి మించి కార్లున్నాయి. భారత్‌ ఇప్పుడు నమ్మదగిన దేశం. పోటీ గురించి ఏ మాత్రం భయం లేదు. MNC కంపెనీలు ఇప్పడు భారత్‌ను ఏ మాత్రం బానిస దేశంగా భావించవు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గుర్తింపు లభిస్తోంది. ఫారిన్‌ ఇన్వెస్ట్‌ మెంట్స్‌కు ఇండియా మోస్ట్‌ ప్రిఫర్డ్‌ డెస్టినేషన్‌. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతున్నా ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. అవినీతి పెరిగింది. పేద, ధనిక తారతమ్యాలు పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలపై పైచేయి సాధించాలంటే విద్య, ఆరోగ్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఇంకా అస్తవ్యస్తంగా ఉంది. అయినా గత 25 ఏళ్ల కాలం భారత్ కు ఆశ, నమ్మకాన్ని కలిగించిన యుగమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితులు ఏమంతగా బాగాలేనప్పటికీ దేశ భవిష్యత్తు చాలా బాగుంటుందన్నది నా నమ్మకం.

రచయిత – ఆశుతోష్‌, మాజీ జర్నలిస్ట్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags