సంకలనాలు
Telugu

60 లక్షల నష్టం నుంచి 60 కోట్ల పార్క్ ఏర్పాటు స్థాయికి...!

team ys telugu
19th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


అనుభవం లేకుండా భారీగా పెట్టుబడులు..

చివరకు కోలుకోలేనంతగా నష్టం..

మళ్లీ పోయిన చోటే వెతుక్కున్న వైనం..

పాత కాంట్రాక్ట్ వ్యాపారంలో మళ్లీ లాభాలు..

ఇప్పుడు మరింత మందికి చేయూత..

ఫెడరేషన్ ద్వారా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం..

అతనిది నెల్లూరు జిల్లా. కుటుంబ నేపధ్యమంతా వ్యవసాయమే. తాతలు, తండ్రులందరికీ అదే ఆధారం. తోడబుట్టిన వాళ్లు కూడా అదే బాటలో నడిచారు. కానీ డిగ్రీ పూర్తి చేసిన ఇతడికి మాత్రం ఎందుకనో అది ఒంటబట్టలేదు. దశాబ్దాల తరబడి అదే వృత్తిగా చేస్తున్నా ఎదుగూబొదుగూ లేదనే అసంతృప్తి. మూడు పదుల వయస్సు మీదపడ్తోందనే ఆందోళన చెలరేగడంతో ఓ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. సివిల్ కాంట్రాక్టర్ అవతారమెత్తాడు. ఇతర ప్రాంతాల నుంచి పంపుసెట్లు తెప్పించి ఇక్కడి రైతులకు అమ్మే బిజినెస్. పెద్దగా రిస్క్ లేదు. అక్కడి నుంచి తీసుకురావాలి. ఇక్కడ అమ్మాలి. చేతులో నాలుగు డబ్బులు ఆడుతుండేవి. అంతా సాఫీగా సాగిపోతోంది. ఇక సెటిల్ అయ్యాం అనుకునేలోపు ప్రభుత్వం చేసిన ప్రకటనే ఇతడిని ఊరకోనీయలేదు. ఉన్న వ్యాపారం చాల్లే.. ఇక ఎందుకు రిస్క్ అనుకుంటే మనం ఈ రోజు ఎపికె రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన పని ఉండేది కాదు.

ఏపికె రెడ్డి

ఏపికె రెడ్డి


ఏపికె రెడ్డి... ప్రశాంత్ కుమార్ రెడ్డి సుమంత్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకులు - ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక అధ్యక్షుల స్థాయికి ఎదిగారంటే.. అది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. పరిశ్రమ ఏర్పాటు చేసిన దగ్గరి నుంచి దాన్ని గౌరవప్రద స్థాయికి తీసుకువచ్చేంత వరకూ పడిన పాట్లు... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో నేర్పిస్తుంది. ఇండస్ట్రీ స్థాపించాలనుకోవడంలో తప్పులేదు కానీ.. ఎక్కడ పప్పులో కాలేయొద్దో ఆయన చెప్పే సంగతులు తెలుసుకోవాల్సిందే. యువర్ స్టోరీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.

ప్రోత్సాహకాలు చూసే పడిపోయా !

'' నాకు పెద్దగా అనుభవం లేదు. కాంట్రాక్ట్ వర్క్స్ మాత్రమే చేసేవాడిని. కానీ అంతా తెలుసని, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యాపారంలోకి దిగాను. దానికి తోడు అప్పటి ప్రభుత్వం కంపెనీలు ఏర్పాటు చేయాలనుకున్న వాళ్లకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చింది. స్థానిక రైతులకు అవసరమైన పంపుసెట్లను స్థానిక సంస్థల దగ్గరే కొనేలా చేస్తామని ప్రకటించింది. దీంతో మనకు ఇక తిరుగులేదనుకున్నాను. నా దగ్గర అప్పటికే సంపాదించి దాచిన రూ.40 లక్షలతో పాటు బ్యాంకుల నుంచి లోన్లు కూడా తీసుకుని రూ.1.5 కోట్లతో 1989లో కంపెనీ ఏర్పాటు చేశాను. మోటార్ పంపుల తయారీ, ఫ్యాబ్రికేషన్ పనులు చేసే వాళ్లం. జీఓ అయితే ప్రభుత్వం ఇచ్చింది కానీ.. అందులో చిన్న మెలిక పెట్టింది. రైతులు తమకు ఇష్టమైన సంస్థల నుంచి పంపుసెట్లు కొనుగోలు చేసినా సబ్సిడీ మొత్తాన్ని ఇస్తామంది. దీంతో రైతులంతా మళ్లీ పెద్ద కంపెనీకే మొగ్గుచూపారు. ఆ నిర్ణయంతో నాకు దిమ్మతిరిగిపోయింది. అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా అని కుమిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. వేరే సంస్థలకు సప్లై చేద్దామంటే నాకు అసలు అవగాహనే లేదు. మార్కెటింగ్ తెలీదు, ఫైనాన్స్ వ్యవహారాలపై అవగాహనే లేదు. ఈఎస్ఐ,పిఎఫ్.. ఇలా ఒకటేమిటి దేని గురించి తెలుసుకోకుండా వ్యాపారంలోకి దిగాను. వ్యాపారం చేయాలంటే ఒక దశలో 28 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని.. దిగిన తర్వాత కానీ తెలియలేదు. ఈ దెబ్బలన్నింటితో ఆరోగ్య పాడై.. హెపటైటిస్ రావడం... వ్యాపారానికి దూరం కావడంతో షట్టర్లు దించేశాను. బ్యాంకులను బతిమాలి, బామాలి చివరకు ఒన్ టైం సెటిల్మెంట్ కింద రుణమంతా తీర్చేశాను. ఆ ఖరీదైన అనుభవం విలువ రూ.60 లక్షలని అప్పుడు అర్థమైంది.

ఏం తెలుసుకున్నారు ?

  • ప్రభుత్వ ప్రోత్సాహకాల మాయలో పడి వ్యాపారం మొదలుపెట్టొద్దు
  • మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్ అనుభవం ఖచ్చితంగా ఉండాల్సిందే
  • దూకుడు పనికిరాదు
  • ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలంటే కనీసం ఏడాది,ఏడాదిన్నర అందుకు సంబంధించిన కంపెనీలో ఉచితంగా అయినా పనిచేయాలి
  • అక్కడ లోటుపాట్లన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే వ్యాపారంలోకి దిగాలి
  • కార్మిక చట్టాలపై కూడా ఎంతో కొంత అవగాహన ఉండాల్సిందే
  • మార్కెటింగ్ స్కిల్స్ , లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ (ఎన్‌పిఏ మేనేజ్‌మెంట్) ముఖ్యం.
  • ప్రొడక్షన్ స్కిల్స్‌తో పాటు క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి.

ఆ తర్వాత ఇక సొంత ఉత్పత్తి వ్యాపారంలో నిండా మునగడంతో మళ్లీ తెలిసిన పాత విద్యవైపే ఏపికె రెడ్డి మొగ్గుచూపారు. తనకు అనుభవం ఉన్న కాంట్రాక్ట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి.. పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం చేశారు. గతంలో పడిన దెబ్బలతో ఈ సారి వ్యాపారంపై చాలా స్పష్టత వచ్చింది. మెల్లిగా అడుగూ అడుగూ వేసుకుంటూ నిలదొక్కున్నారు. ఇప్పుడు రూ.60 కోట్లతో విస్తరణ.

తనలా తను కొడుకులూ చదువు, అవగాహనా రాహిత్యంతో ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో పెద్ద చదువులు చదివించి.. తన కంపెనీలోనే పనులన్నీ దగ్గరుండి నేర్పించారు. దీంతో ఇప్పుడు వాళ్లు కూడా వాళ్ల కాళ్లపై నిలబడే స్థాయికి చేరుకున్నారు.

ఏసీ రూమ్‌ నుంచి ధర్నా చౌక్‌కు

ఈ వ్యాపార పయనం ఇలా కొనసాగుతుండగానే ఏపికె రెడ్డి ఏపి ఇన్సిపియంట్ సిక్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఫ్యాప్సియాలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు సహ పారిశ్రామికవేత్తలు, కార్మికులతో కలిసి హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేశారు. పరిశ్రమ పడ్తున్న ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి తన వంతు బాధ్యతను పోషించారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న,మధ్యతరగతి తరహా పరిశ్రమల బాగు కోసం ఏర్పాటు చేసిన సంఘాల్లో నిపుణుడిగా హాజరయ్యారు. విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమచారాన్ని ఇచ్చి కీలకపాత్ర పోషించారు.

చిన్న కంపెనీల మాయలో చిక్కుకోవద్దు -

ఐదు లక్షలు, పది లక్షలే కదా అని చిన్న, మధ్యతరహా కంపెనీల మాయలో చిక్కుకోవద్దనేది ఎపికె రెడ్డి సలహా. ప్రధానంగా ఉత్పత్తి రంగంలో ఈ పరిస్థితుల్లో కాలుపెట్టడం సరికాదని సూచిస్తున్నారు. చదువుకున్న తర్వాత ఏ రంగంలో అయినా స్థిరపడి, కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చెప్తారు. ఆ రంగంలో ఉన్న కంపెనీలో ఉచితంగా కనీసం ఏడాదిపాటైనా పనిచేసి సాధించిన వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ ముఖ్యమనేది ఆయన భావన.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags