సంకలనాలు
Telugu

అంధత్వమూ ఆయుధమే.. ! క్యాండిళ్ల వ్యాపారంలో కోట్లకు ఎదిగిన వైనం

team ys telugu
27th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఈ ప్రపంచాన్ని నువ్వు చూడలేకపోతే ఏం ? ఈ ప్రపంచం నిన్ను చూసేలా ఏదైనా చేయి ! ఇదీ ఓ అమ్మ మాట. ఇప్పుడా అమ్మ లేదు. కానీ ఆ అమ్మ చెప్పిన మాటలు ఉన్నాయి. అమ్మ ఇచ్చిన స్ఫూర్తి ఉంది. అదే స్ఫూర్తి భవేష్ భాటియాను వ్యాపారవేత్తను చేసింది. కష్టాల కడలిని ఎదురీదిన ఈ అంధుడు ‘సన్‌రైస్ క్యాండిల్స్’ కంపెనీ ఏర్పాటు చేసి వందలాది కుటుంబాలకు వెలుగులను నింపేలా మలిచింది.

image


కష్టాల వెంటా కష్టాలే..

భవేష్ పుట్టుకతో గుడ్డివాడు కాదు. రెటీనా సమస్య కారణంగా 23 ఏళ్ల వయసుకే పూర్తిగా చూపును కోల్పోయాడు. ఒక హోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన భవేష్ సంపాదనంతా క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి చికిత్స కోసమే. ఆమే అతని పెద్ద ఆధారం. గుడ్డివాడైన ఆయనను నడిపించాల్సింది అమ్మే. చూపు కోల్పోవడంతో ఉద్యోగమూ పోయింది. నాన్న సంపాదనతోపాటు ఆయన దాచిన డబ్బూ ఖర్చయింది. పూర్తి స్థాయి చికిత్సకు నోచుకోక తల్లి కన్ను మూసింది. దీంతో పెద్ద ఆధారమే కోల్పోయాడు. గంటల తరబడి అమ్మ చదివి వినిపిస్తేనే భవేష్‌కు పాఠాలు బుర్రకెక్కేది. పీజీ పూర్తి అయ్యేవరకు అమ్మ మాటే ఆయనకు ఆధారం.


తొలి అడుగు పడింది..

భవేష్‌కు చిన్నప్పటి నుంచి పతంగులు, మట్టితో బొమ్మలు చేయడం, అలంకరణ వస్తువుల వంటివి చేసే అలవాటుంది. అదే అనుభవంతో క్యాండిల్స్ తయారు చేయాలని నిర్ణయించారు. వెలుగు అంటే ఆకర్షణ ఉండడం కూడా మరో కారణమని అంటారాయన. ఆలోచన వచ్చిందే తడవుగా ముంబైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్‌లో 1999లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ సాధారణ క్యాండిళ్ల తయారీ మాత్రమే నేర్పారు. రంగు రంగుల, వివిధ రూపాల్లో, సువాసన కలిగిన క్యాండిళ్లను చేయాలని భావించినప్పటికీ వాటి తయారీకి అవసరమయ్యే డై ఖరీదు ఎక్కువ. దీంతో రాత్రంతా క్యాండిళ్లను తయారు చేసేవాడు. మహాబలేశ్వర్‌లోని మార్కెట్లో ఒకచోట బండిపై పెట్టుకుని వాటిని విక్రయించేవాడు. ఒక స్నేహితుని వద్ద నుంచి బండిని తెచ్చి రోజుకు రూ.50 అద్దె చెల్లించేవాడు. వచ్చిన డబ్బుల్లో తర్వాతి రోజుకోసం రూ.25 దాచుకుని ముడి సరుకులను కొనేవాడు. తన కాళ్ల మీద తాను బతుకుతున్న విషయం చూపున్న కొందరికి కన్ను కుట్టింది. కొందరు వ్యక్తులు బండి వద్దకు వచ్చి క్యాండిళ్లను కింద పడేశారు. క్యాండిళ్లను దుకాణాలకు సరఫరా చేస్తే ఈ సమస్యలు ఉండవని భావించాడు భవేష్. క్యాండిల్ తయారీదారులను, సంస్థలను సంప్రదించాడు. వారి నుంచి ఎటువంటి స్పందనా లేదు. రుణ సహాయం కోసం వెళ్లినా అక్కడా తిరస్కరణే.

image


మలుపు తిప్పిన పరిచయం

ఒకరోజు క్యాండిళ్లు కొనేందుకు ఒక యువతి వచ్చింది. ఆమె ప్రవర్తన, నవ్వు భవేష్‌ను కట్టిపడేసింది. కంటితో చూడలేకపోతే ఏం.. ఇద్దరూ మనసుతో మాట్లాడుకున్నారు. పరిచయం స్నేహంగా మారింది. గంటల తరబడి మాట్లాడుకునేవారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు భవేష్. ఆమె పేరు నీత. పెళ్లి చే సుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆయన గుడ్డివాడు, చిన్న వ్యాపారి కావడంతో సహజంగానే నీత ఇంట్లో వ్యతిరేతక వచ్చింది. అయినా వారి నిర్ణయం మారలేదు. ఇద్దరూ ఒక్కటయ్యారు. మహాబలేశ్వర్‌లోని అందమైన కొండ ప్రాంతంలో ఉన్న భవేష్‌కు చెందిన చిన్న ఇంట్లో వారి కాపురం.


జీవితంలో వెలుగు

పేదవాడు కావడంతో క్యాండిళ్లు చేసిన పాత్రల్లోనే వంట చేసేవాడు. ఈ విషయంలో ఆమె నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన ఆందోళన చెందారు. కానీ ఆమె మాత్రం నవ్వి ఊరుకుంది. కొత్త పాత్రలు తీసుకొచ్చింది. అంతే కాదు ద్విచక్ర వాహనాన్ని కూడా కొన్నారు. ఇద్దరూ ఈ వాహనంపై ఊర్లో తిరిగి క్యాండిళ్లను విక్రయించేవారు. ఆ తర్వాత చిన్న వ్యాన్ వచ్చి చేరింది. పెద్ద మొత్తంలో విక్రయాలు సాగాయి. ఆమే నా జీవితానికి వెలుగు అంటాడు భవేష్.

image


కొత్తగా చేయాలని..

సాధారణ క్యాండిళ్లతోపాటు విభిన్న రూపాల్లో క్యాండిళ్లను తయారు చేయాలన్నది లక్ష్యం. నీతాతో కలిసి మాల్స్‌కు వెళ్లి అక్కడి వెరైటీల గురించి తెలుసుకున్నాడు. అధిక ధరల్లో విక్రయిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. అదే సమయంలో సతారా బ్యాంకు ఇచ్చిన రూ.15,000 రుణం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ డబ్బులతో 15 కిలోల మైనం, రెండు డైలు, చిన్నపాటి తోపుడు బండి కొన్నారు. ఇంకేముంది వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. మెల్లిగా వేలు, లక్షలు.. ఆ తర్వాత కోట్ల రూపాయల వ్యాపారానికి ఎదిగారు. భారత్‌తోపాటు విదేశాలకు చెందిన పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు ఆయన క్లయింట్లు. అంతేకాదు 200 మందికిపైగా సిబ్బంది. వీరంతా చూపు సమస్యతో ఉన్నవాళ్లే.

image


హృదయంతో చూస్తేనే..

వ్యాపారం అంటే క్రూరమైనదని భావించడం వల్లే ఎవరూ తనకు ఆర్థిక సహాయం చేయలేదని అంటాడు భవేష్. మనసుతో ఆలోచిస్తారు అందరూ. హృదయంతో కాదు. విజయవంతమైన వ్యాపారం నడపాలంటే హృదయంతో ఆలోచిస్తేనే సాధ్యమన్నది తన విశ్వాసమని అంటాడు. ఇందుకు చాలా సమయం తీసుకుంటుందని, ఎన్నో త్యాగాలు చేయాల్సిందేనని చెప్పారాయన. మనసు చెప్పినట్టు నడుచుకుంటే ఏదైనా సాధ్యమేనని గర్వంగా చెబుతారాయన. ఒకప్పుడు తర్వాతి రోజుకోసం రూ.25 దాచిన భవేష్.. ఇప్పుడు ఆయన పెట్టిన సన్‌రైస్ క్యాండిల్స్ కంపెనీ రోజుకు 25 టన్నుల మైనం వినియోగిస్తోంది. 9,000లకుపైగా విభిన్న రకాల క్యాండిళ్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మైనాన్ని యూకే నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ర్యాన్‌బాక్సీ, బిగ్ బజార్, నరోడ ఇండస్ట్రీస్, రోటరీ క్లబ్ వంటి ప్రముఖ సంస్థలు క్లయింట్ల జాబితాలో కొన్ని. కంపెనీ నుంచి బయటికి వెళ్లి సొంత కాళ్ల మీద నిలబడేలా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. కంపెనీ పాలనా వ్యవహారాలను నీతా చూసుకుంటున్నారు. అంధ బాలికలకు శిక్షణ కార్యక్రమాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు.


క్రీడాకారుడు కూడా..

చిన్న నాటి నుంచి భవేష్‌లో మంచి క్రీడాకారుడు కూడా ఉన్నాడు. మధ్యలో కొంత విరామం వచ్చినా తిరిగి తనకిష్టమైన క్రీడలను కొనసాగిస్తున్నారు. షార్ట్ పుట్, డిస్కస్, జావెలిన్ త్రో క్రీడల్లో ఆయన ప్రతిభ కనబరుస్తున్నారు. పారా ఒలింపిక్ క్రీడల్లో 109 మెడల్స్ ఆయనకు సొంతమయ్యాయి. 500 పుష్ అప్స్, 8 కిలోమీటర్ల పరుగు, జిమ్‌లో వ్యాయామం ఆయన దైనందిన చర్యలు. వ్యాన్‌కు తాడుకట్టి ఒకవైపు పట్టుకుని ఆయన పరుగెడుతుంటే నీత వాహనాన్ని నడుపుతుంది. ఎప్పుడైనా గట్టిగా మాట్లాడానో తెల్లారి వాహనాన్ని వేగంగా నడుపుతుందని అంటాడు నవ్వుతూ.


ఎవరెస్టు అంత లక్ష్యంతో..

బ్రెజిల్‌లో జరగబోయే 2016 పారాలింపిక్స్‌కు భవేష్ సన్నద్ధమవుతున్నాడు. భారత్‌కు బంగారు పతకం తెచ్చిపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 21 మీటర్ల క్యాండిల్ తయారు చేసిన రికార్డు జర్మనీ పేరున ఉంది. అంత కంటే పొడవైంది చేయాలని మనవాడి లక్ష్యం. అంతేకాదు గతేడాది నుంచే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నరేంద్ర మోడి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ తదితర 25 మంది ప్రముఖుల మైనం శిల్పాల తయారు చేశారు. ఎవరెస్టును అధిరోహించి ప్రపంచంలో తొలి అంధుడిగా రికార్డు నమోదు చేయాలన్నది మరో భారీ లక్ష్యం కూడా భవేష్ ముందుంది. భారత్‌లో ఉన్న అంధులందరూ వారివారి కాళ్ల మీద నిలబడాలన్నదే తన అభిమతమని వినమ్రంగా చెబుతారాయన.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags