సంకలనాలు
Telugu

ఆరు నెలల్లో 14 వేల డెలివరీలు.. లాజిస్టిక్స్ లో దుమ్మురేపుతున్న పార్శిల్

Sri
3rd Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అన్ని రంగాల రూపురేఖల్ని మార్చేస్తోంది టెక్నాలజీ. డిజిటైజేషన్ విస్తృతమవుతున్నకొద్దీ మార్కెట్ పోకడలు మారిపోతున్నాయి. ఉన్న వ్యాపారాలు మరిన్ని మెరుగులు అద్దుకుంటే కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఇ-కామర్స్.

ప్రస్తుతం ఇ-కామర్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. దీన్ని బేస్ చేసుకొని చాలాచాలా వ్యాపారాలు మార్కెట్లో మాయాజాలం చేస్తున్నాయి. సొంతగా ఉత్పత్తుల్ని తయారు చేసి మార్కెట్లోకి అడుగుపెట్టడమే కాదు... ఇప్పటికే ఉన్న వ్యాపారాలకు సేవలందిస్తున్నాయి పలు సంస్థలు. 

అలాగే సప్లై చెయిన్ మేనేజ్ మెంట్(SCM) లోని లాజిస్టిక్స్ పలు వ్యాపారాలకు తోడ్పడుతోంది. పార్సిల్ కూడా అలాంటి కంపెనీ. లాజిస్టిక్స్ వ్యాపారంలో అవకాశాల్ని అంచనా వేసిన ఈ సంస్థ... టెక్నాలజీని అందిపుచ్చుకొని క్లైంట్లకు సేవలందించడంలో దూసుకెళ్తోంది.

image


ఎలా మొదలైదంటే...

నలుగురు కుర్రాళ్లు. అందరి వయస్సు 27 ఏళ్లు. బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్స్. హిమాన్షు మీనా, రాకేష్ కేఎస్. వీరిద్దరూ ఐఐఎం బెంగళూరులో బ్యాచ్ మేట్స్. ఇద్దరూ వేర్వేరు ఎమ్మెన్సీల్లో పలు రాష్ట్రాల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్స్ లీడ్ చేస్తున్నారు. హిమాన్షు చిన్ననాటి స్నేహితుడు అఖిల్ శర్మ. ఇంగ్లండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. అఖిల్ డిజైన్ చేసిన ఐఓఎస్ గేమ్స్ అన్నీ టాప్ లో ఉన్నాయి. ఇక ఇషాన్ మోడీ ముంబైలోని ఎన్ఎంఐఎన్ఎస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ లో తన కుటుంబ వ్యాపారంలో ఉన్నాడు. అమెరికా, యూరప్ దేశాల్లో టెక్నాలజీ స్టార్టప్స్ హడావుడి ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఊపందుకుంటోంది. వీరికి కూడా సొంతగా ఏదైనా ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది.

"మేమంతా చాలాసార్లు కూర్చొని మార్కెట్ పోకడలపై ఎన్నో చర్చలు జరిపాం. పలు స్టార్టప్ ల డాటా సేకరించి చాలా పరిశోధనలు చేశాం. పాతతరం స్టార్టప్ లు ఇన్వెంటరీ బేస్డ్ మోడల్ ను ఉపయోగించుకొని వచ్చినవే. అంటే అప్పటికే ఉన్న వ్యాపారాలను టెక్నాలజీ సాయంతో మెరుగుపర్చడం అన్నమాట. సప్లై చైన్ మేనేజ్ మెంట్ లోని లాజిస్టిక్స్ తమ వ్యాపారానికి కీలకం అని ఇ-కామర్స్ కంపెనీలు భావిస్తున్నాయన్న విషయం మాకు అర్థమైంది" అంటారు హిమాన్షు.

ఈ స్టోరీ కూడా చదవండి

మార్కెట్లో ఎలాంటి అవకాశాలున్నాయన్నదానిపై లోతుగా పరిశోధన చేశారు. వేడిగా ఉన్నప్పుడే ఇనుముపై దెబ్బ పడాలన్నట్టు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నారు. అఖిల్ వెంటనే ఇండియాకు చేరుకొని... ఈ నలుగురు కలిసి జూన్ 2015లో పార్సిల్ ను ప్రారంభించారు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో సప్లై చెయిన్ విలువ పది నుంచి పదిహేను శాతం ఉంది. అయితే లాజిస్టిక్స్ పరిశ్రమను నిర్లక్ష్యంగా చూస్తున్నారు. స్టార్టప్ వ్యవస్థలో కీలకమైన లాజిస్టిక్స్ ను తక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతీ స్టార్టప్ కు, నడుస్తున్న వ్యాపారాలకు వెన్నెముకలా నిలుస్తుంది లాజిస్టిక్స్. అయితే రవాణాను మెరుగు పర్చేందుకు పరిష్కారాలు చూపేలా సప్లై చెయిన్ ను తీర్చిదిద్దడం ఓ సవాల్. ఈ రంగంలో చాలావరకు స్టార్టప్స్ ఒకే పరిశ్రమపై దృష్టిపెడుతున్నాయి. అయితే పార్సిల్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. అన్ని రంగాలు, అన్ని పరిశ్రమలపై దృష్టిపెట్టింది. స్టార్టప్స్, కార్పొరేట్ సంస్థలు, రీటైల్ రంగాలు వేటినీ వదిలిపెట్టకుండా అవకాశాలను వెతుక్కుంటోంది.

"లాజిస్టిక్స్ లో ఎక్కువగా నైపుణ్యాల కంటే... భిన్న పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడం ముఖ్యం. ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో విధమైన అవసరాలుంటాయి. కాబట్టి మన సేవల్ని అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది. మేము చేస్తున్నది అలాంటిదే. అవసరాన్ని బట్టి బైకులు, టెంపోలు, లారీలను డెలివరీలకు ఉపయోగిస్తున్నాం. గూడ్స్ సైజును బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు." అని వివరిస్తున్నారు హిమాన్షు.
image


ప్రస్తుతం ఇ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పెప్పర్ ఫ్రై, కార్పొరేట్ క్లైంట్స్ అయిన సబ్ వే, ఫెడెక్స్, హోలా షెఫ్, ఐషెఫ్, రీటైల్ కంపెనీలైన ఐటీసీ, బిస్లరీ, మదర్ డైరీలకు సేవలందిస్తోంది పార్సిల్. ఆయా కంపెనీలు తమ వనరుల్ని సమగ్రంగా వాడుకునేందుకు పార్సిల్ తోడ్పడుతోంది. జూలై 2015లో చావ్రీ బజార్ లో, న్యూ ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన పార్సిల్ సెప్టెంబర్ లో ముంబైలో కార్యకలాపాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ముంబైలో రోజుకు ఆరువందల డెలివరీలు చేస్తున్నారు. ఈ స్టార్టప్ కు గత ఆగస్టులో సీఎల్ ఎస్ఏ సింగపూర్ ఆపరేషనల్ అడ్వైజర్ నిమిర్ మెహ్తా నుంచి నాలుగు కోట్ల సీడ్ రౌండ్ ఫండింగ్ వచ్చింది. డిసెంబర్ 2015 నాటికి రోజుకు 13 వేల డెలివరీలు చేస్తోందీ సంస్థ. ప్రతీ ట్రాన్సాక్షన్ సగటు విలువ రూ.100. ఒక్కో సంస్థకు భిన్నమైన అవసరాలు ఉండటంతో క్లైంట్లను పొందడంలో వీరికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

"రీటైల్ క్లైంట్లను కొన్ని రోజుల్లో ఒప్పించొచ్చు. స్టార్టప్ లను అయితే వారాల్లో ఒప్పించొచ్చు. కానీ కార్పొరేట్ కంపెనీలను ఒప్పించాలంటే నెలలు పడుతుంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలన్నీ అప్పటికే ఓ రూపుతో ఉంటాయి. వారి భాగస్వాములపై బలమైన విశ్వాసాలతో ఉంటాయి. వారితో దశాబ్దాలుగా మెరుగైన సంబంధాలుంటాయి. అలాంటివారిని మేము ఒప్పించాలంటే చాలా బలమైన కారణం ఉండాలి." అంటూ ఆ కష్టాలను వివరిస్తారు హిమాన్షు.
image


సాధారణంగా స్థానిక రీటైల్ క్లైంట్లు టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అందుకే వారి దగ్గరకు నేరుగా వెళ్లి మాట్లాడి ఒప్పించక తప్పదు. ఇక స్టార్టప్స్ అయితే... వారితో వ్యాపారం అంటే మొదట్లో అంతో ఇంతో ఇబ్బందులు, నష్టం ఉంటాయి. అయితే వాళ్లు కోలుకొని సక్సెస్ సాధించేంత వరకు ఎదురుచూడాల్సిందే. సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం, మెట్రోపాలిటన్ నగరాల్లో ఎస్ఎంఎస్ అనుసంధానం, బ్యాటరీ సేవర్ యాప్స్ తో బ్యాటరీ వినియోగం, డెలివరీ చేసే వ్యక్తులు టెక్నాలజీని పట్టించుకోకపోవడం లాంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది పార్సిల్. పార్సిల్ సేవలకు టెక్నాలజీ వెన్నెముకలా నిలిచిందని చెప్పాలి. పాన్ ఇండియా నెట్ వర్క్ తో భాగస్వామ్యం తర్వాత అకార్డ్ ఇకామ్ కొరియర్ కంపెనీని కొనేసింది పార్సిల్ సంస్థ. ఆ తర్వాత 10 టైర్-2 నగరాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టింది.

యువర్ స్టోరీ మాట

ఇ-కామర్స్ స్పేస్ నిరంతరం విస్తరిస్తున్న తరుణంలో లాజిస్టిక్ స్టార్టప్స్ కు చాలా అవకాశాలున్నాయి. అయితే క్లైంట్ ను ఒప్పించడంలో చూపించే నైపుణ్యమే సక్సెస్ ను అందిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం భవిష్యత్తులో రోజుకు నలభై నుంచి యాభై లక్షల డెలివరీలు జరుగుతాయి. అయితే అతిపెద్ద నెట్ వర్క్ ఉండటమే కాదు... సమర్థవంతంగా డెలివరీ అందించడంలో వినూత్న పద్ధతులు అనుసరించిన వారే టాప్ లో నిలుస్తారు. ఇప్పటికే ఇకామ్ ఎక్స్ ప్రెస్, వావ్ ఎక్స్ ప్రెస్, పార్సిల్, గోజావాస్ లాంటి కంపెనీలు తమ సేవల విషయంలో ఖచ్చితంగా ఉన్నాయి. సులభంగా డెలివరీలు అందిస్తూ ప్రస్తుతం లాజిస్టిక్ రంగాల్లో రాణిస్తున్నాయి.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags