సంకలనాలు
Telugu

ఊరి కోసం జీవితాన్నే త్యాగం చేసిన రాజస్థాన్‌ శ్రీమంతుడు

ఊరినుంచి ఎంతో తీసుకున్నాం.. తిరిగి ఎంతోకొంత ఇవ్వాలన్నదే ఫర్మాన్ లక్ష్యం

GOPAL
2nd Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆరంకెల జీతం.. సమస్యలు లేని జీవితం. ఎవరికైనా ఇంతకంటే కావాలి. కానీ డాక్టర్ ఫర్మాన్‌ అలీకి మాత్రం ఇవేవీ సంతృప్తినివ్వలేదు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన ఊరిని బాగుపర్చలనుకున్నారు. ఢిల్లీలో యూనివర్సిటీలో ఉద్యోగాన్ని వదిలి రాజస్థాన్‌లో అల్వార్ గ్రామంలో ఇన్‌స్టిట్యూట్ పెట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.. ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి ఇవ్వకపోతే లావవుతామన్న భావనతో ఊరి బాగు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో శ్రీమంతుడు.


image


ఊరికి ఎంతోకొంత ఇవ్వాలని..

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంఏ హిందీ పూర్తి చేశాడు ఫర్మాన్‌. ఆ తర్వాత జేఎన్‌యూలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం మోతిలాల్ నెహ్రూ కాలేజీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత రాజస్థాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఏ టెన్షన్ లేని ఉద్యోగం. కానీ ఫర్మాన్ లో ఏదో తెలియని అసంతృప్తి. జీవితం అంటే ఇది కాదనుకున్నాడు. లైఫ్‌లో కావాల్సినంత డబ్బుంది. అయినప్పటి ఏదో వెలితి. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన ఊరికి ఏదో చేయాలన్న తపన. మనసులో రోజు రోజుకు పెరిగిపోయింది. తాను బాగుపడటం కంటే తన గ్రామ ప్రజల జీవితాలు బాగుపడాలి. ఇక వేరే ఆలోచన చేయలేదు. జాబ్‌ను వదిలి తన సొంత గ్రామమైన అల్వార్‌కు వెళ్లిపోయారు.

ప్రస్థానం..

రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతం. చాలా వెనుకబడిన ఏరియా. ముఖ్యంగా చదువు. అది వారికి అందని ద్రాక్ష. ఏదో చదివామా అంటే చదివాం అన్నట్టు స్కూళ్లు. టీచర్లు రారు. ఉన్నా చెప్పరు. పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేక డీలా పడిపోయారు. చేసేదేం లేక స్థానికంగా చిన్న ఉద్యోగాలతోనే వారు సరిపెట్టుకునేవారు. ఫర్మాన్ మొదటి టార్గెట్ వాళ్లే. ముందు వారిని పైకి తీసుకురావాలని ఫర్మాన్ నిర్ణయించుకున్నారు.

కోచింగ్ సెంటర్ ప్రారంభం..

2009. అల్వార్‌లో రాజస్థాన్ ఇన్‌స్టిట్యూట్. పేరులోనే మన అన్న ఫీలింగ్. ఫ్యామిలీ ఎంతో సపోర్టు చేసింది. ముఖ్యంగా తండ్రి. చాలా ఎంకరేజ్ చేశారాయన. మనసుకి ఏదీ నచ్చితే అది చేయాలనేది తన సిద్ధాంతం. అందుకే ఫర్మాన్‌ ఉద్యోగం వదిలేసి ఊరికోసం పాటుపడతానంటే కాదనలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు .

అల్వార్‌లో చాలామంది పెద్దగా చదువుకోలేదు. ఎంతోకొంత చదివినవారు పట్టణాల్లో చిన్నాచితకా ఉద్యోగాల్లో సెటిలయ్యారు. వారంత ఎవరి స్వార్ధం కోసమే వారు బతుకుతున్నారు. ఫర్మాన్ మాత్రం సమాజాన్ని బాగుచేసేందుకు ఉద్యోగాన్ని వదులకున్నాడు. ఆ సమయంలో ఫర్మాన్‌ను చూసి చాలామంది ఎగతాళి చేశారు.

అల్వార్‌లోని విద్యార్థుల జీవితాన్ని బాగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఫర్మాన్. తన ప్రయాణాన్ని ఇద్దరు విద్యార్థులతో ప్రారంభించారు. ఆయన చేస్తున్న మంచి పనికి ఊరంతా స్పందించింది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆసక్తి ఉన్న యువతీయువకులంతా వచ్చి ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యారు. చెప్పే విధానంలో స్పష్టత, విద్యార్థులను ప్రోత్సహించే తీరు, అందరినీ ఆకట్టుకుంది. ఇన్‌స్టిట్యూట్ పాపులర్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు.

చిన్న కోచింగ్ సెంటర్‌లా ప్రారంభమైన ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడో వ్యవస్థ. 3500 మంది విద్యార్థులు, 20 మంది టీచర్లు, 32 మంది నాన్ టీచింగ్ స్టాఫ్. ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఇద్దరు విద్యార్థుల నుంచి ఈ స్థాయికి సంస్థ చేరడం వెనుక ఫర్మాన్ ఒంటరి పోరాటమే ఉంది. ఈ సంస్థలో శిక్షణ పొందిన చాలామంది విద్యార్థులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, అడ్మినిస్ట్రేటివ్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారు.

నామినల్ ఫీజు..

కోచింగ్ కోసం చేరేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ, ఫీజు మాత్రం నామినల్‌గా వసూలు చేస్తారు. చిన్నస్థాయి కుటుంబ సభ్యుల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని, వారికి అనుకూలంగా ఫీజును నిర్ణయిస్తారు. 

‘‘రాజస్థాన్‌లో చాలామంది ఆర్మీలో పనిచేస్తుంటారు. దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు కూడా. ఆర్మీలో పనిచేసేవారి పిల్లలకు మా కోచింగ్ సెంటర్‌లో ఉచితంగా కోచింగ్ ఇస్తాం. దేశానికి వారు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఇలా మేం మా వంతు సాయం చేస్తున్నాం. అలాగే తండ్రిని కోల్పోయిన పిల్లలకు, వికలాంగులను కూడా ఉచితంగా చేర్చుకుంటాం’’ -ఫర్మాన్

సోషల్ యాక్టివిస్ట్

అల్వార్‌లో నిర్వహించే ఆర్ట్, లిటరేచర్, కల్చరల్ ఈవెంట్స్‌కు కూడా ఫర్మాన్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తారు. ప్రతిఏటా అల్వార్‌లో నిర్వహించే రామ్‌లీలా ప్రదర్శనలో ఇతను కూడా సభ్యుడు. ఈ ప్రదర్శనకు ముందు తొలి ప్రార్థనలను కూడా నిర్వహిస్తారు. ఫర్మాన్ అప్పుడప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గైడ్ చేస్తూ ఉంటారు.

image


పండుగలు, హాలిడేస్ అన్ని ప్రజలతోనే. ఒకరకంగా చెప్పాలంటే జీవితమే వారికి కేటాయించారు. ఉన్నవారా లేనివారా అన్న తేడా లేదు. అందరికీ చదువు చెప్పాలన్నదే లక్ష్యం . రాజస్థాన్‌ లో ఇప్పటికీ చాలామందికి ఓ అపోహ ఉంది. చదువు అనేది డబ్బున్నవారికి మాత్రమే చెందిందని . ఆ అపోహ నుంచి వారందరినీ దూరం చేయగలిగాడు ఫర్మాన్‌. అవసరమైతే ఎన్జీవో సంస్థలతో కలిసి ప్రచారం చేస్తుంటారు.

వెన్నుదన్నుగా కుటుంబం

ఫర్మానే కాదు.. ఆయన భార్య కూడా భర్త అడుగుజాడల్లో కలిసి నడుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తుంది. అక్కడి మహిళలతో మాట్లాడుతుంది. వాళ్ల సమస్యలేంటో తెలుసుకుంటుంది. అవసరమైతే వాటిని తన స్వయంగా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా హెల్త్‌, పరిశుభ్రత అంశాల్లోఅవగాహన కల్పిస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్లలేనివారికి, వైద్య ఖర్చులు భరించే స్థోమత లేని వారికి ఫర్మాన్ కుటుంబం ఆసరాగా నిలుస్తుంది. ఏ రాత్రి వచ్చి అడిగినా ఫర్మాన్, ఆయన భార్య లేదు పొమ్మనరు.

అర్థవంతమైన జీవితం..

ఇంతవరకు ఫర్మాన్ ఎవరి దగ్గర విరాళాలు సేకరించలేదు. నిధులు సమీకరించలేదు. అన్ని అవసరాలు ఇన్‌స్టిట్యూట్ నడపడం ద్వారా వచ్చే డబ్బుతోనే. ఎలాంటి లాభాపేక్ష లేదుకాబట్టే ఫర్మాన్ జీవితం నలుగురికీ ఆదర్శవంతమైంది. ఉదయమే ఇంటి నుంచి బయల్దేరి వెళ్లడం. పిల్లలకు పాఠాలు చెప్పడం. 12 గంటలపాటు సుదీర్ఘంగా క్లాసులు. తర్వాత సాయంత్రం గ్రామస్తులతో సమావేశం. వాళ్ల సాధకబాధకాలు తెలుసుకోవడం. అవగాహన కల్పించడమో, అవసరాలు తీర్చడమో. ఏదో ఒకటి. అలా.. ఏ అర్ధరాత్రో ఇల్లు చేరుతాడు. తన కోసం, తన ఆనందం కోసం అన్న మాటే మరిచిన వ్యక్తి ఫర్మాన్.

‘‘అన్ని సమస్యలకు పరిష్కారం చదువే. దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే మనమంతా కలిసి పనిచేయాలి. విద్య అనే కాంతిని అందరికీ పంచాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలో విద్యను అందరికీ అందించాలి. విద్యను ప్రజలకు అందించడం ఒక్క ప్రభుత్వ బాధ్యతే కాదు. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కూడా’’- ఫర్మాన్.

ప్రస్తుతం దేశంలో విద్య రెండుగా చీలిపోయింది. ప్రైవేట్ విద్య కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేవు. టీచర్ల కొరత పట్టి పీడిస్తున్నది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫర్మాన్ ప్రయత్నం నిజంగా ఎంతో అభినందించదగ్గది. పేద ప్రజలకునాణ్యమైన విద్యను అందించాలన్న ఆయన చేస్తున్న ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఫర్మాన్ ప్రయత్నంతో దేశమొత్తం ఒకేసారి బాగుపడకపోయినా, ఆయనను చూసి మరికొంతమంది సమాజ సేవ చేసేందుకు ముందుకు వస్తారన్నదే యువర్‌స్టోరీ ఆశ. ఫర్మాన్ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags