సంకలనాలు
Telugu

సామాజికసేవ, విలువల నిలయం ..అరవింద్ కంటి చికిత్సాలయం

అంధులకు మార్గం చూపుతున్న అరవింద్ కంటి ఆస్పత్రి సామాజిక సేవే ధ్యేయంగా పురుడుపోసుకున్న చికిత్సాలయం విలువలే ఆస్తిగా డాక్టర్ జి. వెంకటస్వామి ప్రారంభించిన వైద్యశాల ప్రపంచంలోనే అత్యుత్తమ కంటి వైద్య సౌకర్యాలకు కేంద్రం

CLN RAJU
24th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అభిలాషకు మించిన సాధనం లేదు. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నిన్ను, నీ జీవితాన్ని నియంత్రణలో పెట్టుకో. నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లు. మంచి నుంచి గొప్పగా రూపాంతరం చెందు. ఉన్నత మైన ఆశయాలను ఆలోచించు. చివరగా ఒక్కటి.. ఓ మంచిపని, పేరున్న పని చేయాలంటే వాటికి విలువలే ఆస్తి. ఇవే ..డాక్టర్ జి. వెంకటస్వామి నేర్పిన పాఠాలు. అరవింద్ ఐ కేర్ హాస్పిటల్ తు.చ. తప్పకుండా పాటిస్తున్న ఆదర్శాలు. ఇంతకీ.. డాక్టర్ వెంకటస్వామి ఎవరు..? ఆయన చేసిందేంటి..? ప్రతి పారిశ్రామికవేత్త, ఔత్సాహిక వ్యాపారి తప్పక నేర్చుకోవాల్సిన విషయాలివి...

ఐదురోజుల తర్వాత జాగృతి యాత్ర రైలు తమిళనాడులోని మధురైని చేరింది. ఒక రోజంతా ఆరోగ్య చికిత్సపైనే దృష్టి పెట్టాం. భారతదేశంలోనే గొప్ప సామాజిక వ్యాపార సంస్థగా పేరుపొందిన ఆ ఆస్పత్రిని సందర్శించారు. ఆ చికిత్సాలయం ఎందరికో జీవితాలను ప్రసాదించింది. అదే.. అరవింద్ కంటి ఆస్పత్రి. ఎన్నో విజయాలు.. మరెన్నో అద్భుతమైన మైలురాళ్ల పునాదులపై నిర్మించిన వైద్యనిలయమే ఆ కంటి చికిత్సాలయం.

అరవింద్ కంటి ఆసుపత్రి

అరవింద్ కంటి ఆసుపత్రి


ప్రపంచంలో అంధులనే లేకుండా చేయాలి. అదే అరవింద్ ఐ కేర్ హాస్పిటల్ చిరకాల స్వప్నం. ప్రపంచ వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మందికి పైగా అంధులున్నారు. అందులో కోటి 20 లక్షల మంది మన భారత దేశంలో వున్నారు. కానీ.. విషయమేంటంటే 80 శాతం మందికి అంధత్వం రాకుండా నివారించవచ్చు. కాకపోతే మనమంతా చూపునకున్న విలువను, దాని ప్రాధాన్యాన్ని ఇతరులకు అవగాహన కలిగేలా ..తెలియజేయాలి. వారిని కూడా ప్రభావితం చేయగలగాలి. ఈ అంశాన్ని మనకు అందించి వెళ్లారు డాక్టర్ జి. వెంకటస్వామి. ఈయనే అరవింద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు. 1976 లో డాక్టర్ జి. వెంకటస్వామి తన మొదటి చికిత్సాలయాన్ని స్థాపించారు. అప్పటికి ఆయన వయసు 58ఏళ్లు. కేవలం 11 పడకలతో చిన్న కంటి ఆస్పత్రిగా ప్రారంభమైన ఆ వైద్యశాల దినదిన ప్రవర్థమానంగా ఎదిగి ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమమైన కంటి వైద్య సౌకర్యాలుగల చికిత్సాలయంగా సేవలందిస్తోంది. పదేళ్ల క్రితం డాక్టర్ జి. వెంకటస్వామి కన్నుమూశారు. కానీ ఆయన నేర్పిన పాఠాలు, విలువలు, చూపిన దారి.. అందరికీ ఆదర్శంగా నిలిచాయి. ఇవే మూల స్థంభాలుగా సంస్థ ఉన్నతికి కారణమయ్యాయి. మీరూ సామాజిక సేవా దృక్పథంతో ఏదైనా గొప్ప వ్యాపారాన్ని కానీ, సంస్థను కానీ ఏర్పాటు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అనుకుంటే.. అది అరవింద్ కంటి ఆస్పత్రిలా ఓ ప్రత్యేకతను కలిగి వుండాలి.


1) అభిలాషకు మించిన సాధనం లేదు

(Aspiration is always bigger than resources)

కేవలం 11 పడకలతో ప్రారంభించిన కంటి చికిత్సాలయం ప్రపంచంలోనే గొప్ప సామాజిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడమంటే అందంత తేలికేం కాదు. కానీ.. డాక్టర్ వెంకటస్వామి ఆకాంక్ష ఎంతో అద్భుతమైంది, ఉన్నతమైనది. ఆయన తన సంస్థను స్థాపించడానికి ఏదో గొప్పగా పెట్టుబడిని పెట్టలేదు. కానీ.. రోజురోజుకీ ఆయన ఆలోచించిన తీరు వ్యాపార దిగ్గజాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా చేసింది. ఓ దివ్యమైన సామాజిక వ్యవస్థను మన ముందు సగర్వంగా నిలిపింది. ఆస్పత్రిలో చాలీచాలని పడకలు వున్నా కూడా ఆయన కొత్త వారిని చేర్పించుకునేవారు. ఎప్పుడైతే ఈ స్థలం సరిపోదని అనిపించిందో.. అప్పుడు కొత్త గదుల్ని నిర్మిస్తూ వచ్చారు. ఆస్పత్రి సౌకర్యాలు చాలడం లేదని తెలిసిన తర్వాత మరికొన్నింటిని నిర్మించారు. అవి దేశవ్యాప్తంగా కూడా మంచి పేరును సంపాదించాయి. మన దేశంలో వున్న ఆస్పత్రులు కూడా సరిపోవని అనిపించిన తర్వాత పలు ఇతర దేశాల్లో మొత్తం ఏడు వైద్యశాలల్ని నిర్మించారు. ఇవన్నీ సేవచేయాలన్న ఆయనకున్న ఒకే ఒక్క గొప్ప ఆశయం నుంచి పుట్టుకొచ్చినవే తప్ప ఇంకేం కాదు.


2) ప్రపంచాన్ని మార్చడానికి నీ జీవితాన్ని నియంత్రించుకో

( Control your life to change the world )

సామాజిక వ్యాపారవేత్తల్లో చాలా మంది చాలా రకాలుగా వుంటారు. ఏదైనా పొరపాటు జరుగుతోందని అనిపిస్తే.. వాళ్లు దానిపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తారు. లేదా అలాంటివి పునరావృతం కాకుండా తమకు చేతనైనంతలో ఏదో ఒక కొత్త పని చేస్తారు. సహజత్వానికి విరుద్ధంగా అందరూ అబ్బురపడేలా ఓ బృహత్ కార్యాన్ని కూడా వాళ్లు చేసి చూపిస్తారు. డాక్టర్ వెంకటస్వామి ది కూడా అలాంటి మనస్తత్వమే. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే ధృఢ విశ్వాసమే ఆయన అద్భుతాలు సృష్టించడానికి మార్గమయ్యాయి. ఆయన తన ఆలోచనలతో ఇతరులను ఒప్పించగల సమర్థవంతమైన గొప్ప నాయకుడు. అంధుల జీవితాలను సమూలంగా మార్చేయాలని డాక్టర్ వెంకటస్వామి కోరుకున్నారు. మోయలేని భారంగా వున్నా, తమకు స్థోమత లేదని కుంగిపోతున్న రోగులకు కూడా అనువైన చికిత్స చేసి ఆదర్శంగా నిలిచాడు.


3) నాయకుడిగా వుండాలి

(You have to be a leader )

వృత్తిగతంగా ఒక వ్యక్తి పురోగతి సాధించడానికి చాలా దశలుంటాయి. నువ్వు అత్యంత సామర్థ్యంగల వాడివైనా, ఉత్తమ భాగస్వామిగా నిలవగలిగే బృంద సభ్యుడివైనా, పోటీతత్వం గల లేదా సమర్థవంతమైన నిర్వాహకుడివైనా అయ్యుండొచ్చు. కానీ.. నాయకత్వ లక్షణంతోనే ప్రపంచాన్ని మార్చగలం. డాక్టర్ వెంకటస్వామి కూడా అలాంటి గొప్ప నాయకుడు. వృత్తిలో నిబద్ధతతో పాటు వ్యక్తిలో మానవత్వమనే రెండు వేర్వేరు భావాలను కలిపి శాశ్వతమైన ఓ సంస్థను గొప్పగా నిర్మించాడు. ఆయన తన అమోఘమైన దూరదృష్టితో నిత్యనూతనమైన వ్యాపారానికి సామాజిక బాధ్యతను కూడా జోడించారు. అంతే కాదు.. సామాన్యమైన జీవన విధానంతో, వ్యక్తిగత సామర్థ్యాన్ని పంచుకుంటూ-పెంచుకుంటూ అందరికీ ఓ ఉదాహరణగా , ఆదర్శనీయుడిగా నిలిచాడు.


4) మంచి సంస్థ నుంచి గొప్ప కంపెనీగా మార్పు 

(Move your company from good to great)

డాక్టర్ వెంకటస్వామి తన ఆస్పత్రి సేవలను , సౌకర్యాలను మెరుగుపరచడంలో ‘మంచి’ నుంచి ‘గొప్ప’ అనే సూత్రాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఏ సంస్థ అయినా ప్రజల అండదండలతోనే ఆదరణను పొందగలుగుతుంది. అందుకే ప్రజల ప్రగతి పైనే ఎక్కువ దృష్టి పెట్టారు డాక్టర్ వెంకటస్వామి. ఆ ఆదర్శాలతోనే ఇప్పటికీ వ్యవస్థాపక బృందమంతా పనిచేస్తోంది. నిష్ఠూర వాస్తవాలనెన్నో ఎదుర్కొన్నారు వెంకటస్వామి. ఒక్కోసారి ఈ ఆశావాదిని కూడా అవి కొంత నిరాశ నిస్పృహలకు లోను చేశాయి. అయినా .. అదంతా తాత్కాలికమే. 58 ఏళ్ల వయసులో డబ్బుల్లేకున్నా కూడా ఆయన వీటన్నింటికీ భయపడలేదు. సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇదే.. డాక్టర్ వెంకటస్వామి సహనగుణం. తన కల సాకారమవడానికి సమయం పడుతుందని ఆయనకు బాగా తెలుసు. అయినా ఆయన ఏ సమయంలోనూ నిరుత్సాహ పడలేదు. ఆ ఓర్పే ఆయన కంపెనీని అభివృద్ధి పథంలో దూసుకెళ్లే స్థాయికి చేర్చింది.


5) విలువలే ఆస్తి 

(Values are your solid base )

డాక్టర్ వెంకటస్వామి ఓ ప్రిన్స్ పాల్ కు మార్గనిర్దేశం చేశారు. అదేంటంటే.. ఎవరైతే చికిత్స కోసం తమ గడప తొక్కుతారో...ఒకవేళ వాళ్ల దగ్గర డబ్బులు లేకున్నా సరే ..వైద్యం చేయకుండా వెనక్కి పంపకూడదు. ప్రతి ముగ్గురిలో ఒకరి దగ్గర డబ్బు తీసుకుని మిగిలిన ఇద్దరికీ ఉచితంగా వైద్యం చేసేవారు. ఇదే పద్ధతిని ఇప్పటికీ అరవింద్ కంటి ఆస్పత్రి అవలంబిస్తోంది. ఈ పద్ధతినే ఎంతో విలువలతో ఆచరణలో పెట్టారు.

ఈ చికిత్సాలయంలో సేవ చేయాలనుకునే వారికి వుండాల్సిన లక్షణంలో మొదటిది జాలి, కరుణ. ప్రతి ఒక్కరికీ దయతో వైద్యాన్ని అందించాలి. రెండోది .. సమానత్వం. ఆస్పత్రిలో చేరే వారు మంచివారా..? చెడ్డవారా..? అనేది కాదు.. వాళ్లకు సమానస్థాయిలో వైద్యమందుతోందా..? లేదా..? అనేదే ముఖ్యం. మూడోది.. పారదర్శకత. వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒకే స్థాయిలో చికిత్స అందాలి. పంచుకోవడమనేది డాక్టర్ వెంకటస్వామి నేర్పిన విలువలే. ఎలాంటి రహస్యాలు, అరమరికలు లేకుండా భావాలను స్వేచ్ఛగా పంచుకోగల వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఎంత నువ్విస్తే.. అంత నువ్వు పొందుతావు.. అనే దాన్ని నిజం చేశారు అరవింద్ కంటి చికిత్సాలయం వ్యవస్థాపకులు డాక్టర్ జి. వెంకటస్వామి.


6) గొప్ప ఆటగాళ్లలాగా ఆలోచించు 

(Think as the big players)

డాక్టర్ వెంకటస్వామి మెక్ డొనాల్డ్స్ వ్యాపార దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. దాన్నే కంటి ఆస్పత్రికీ అనువర్తింపజేశారు. ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖలను విస్తరించింది మెక్ డొనాల్డ్స్ . ఉత్పత్తుల్లో నాణ్యతను కాపాడుకుంటూనే ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో వుండేలా చర్యలు తీసుకుంది. దీన్నే ఆయన కంటి ఆస్పత్రికి వర్తింపజేశారు. మొదట్లో కంటి చికిత్సలో భాగంగా ఉపయోగించే అద్దాల ధర 2వందల డాలర్లుగా వుండేది. అలాంటి అద్దాలనే 5 డాలర్లకు అందించడం మొదలు పెట్టారు డాక్టర్ వెంకటస్వామి. దీంతో ఇప్పుడా లెన్స్ లను 85 దేశాలకు ఎగుమతి చేసేలా అరవింద్ కంటి ఆస్పత్రి అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసింది. అందుకే విశ్వవ్యాప్తంగా తమిళనాడు అరవింద్ ఐ కేర్ ఇన్ స్టిట్యూట్ అంటే .. విలువైన వైద్య సేవల కేంద్రంగా ప్రఖ్యాతిని సంపాదించుకుంది. కేవలం డబ్బే కావాలనుకుంటే ఆ ప్రాంతం వరకే పేరును పొందగలిగే వాళ్లు. కానీ.. విలువలతో కూడిన సామాజిక సేవ, వైద్యం అందించారు కాబట్టే ప్రపంచం అరవింద్ ఐకేర్ ఆస్పత్రిని చిరకాలం గుర్తించుకుంటోంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags