ఇతను ఆలోచించాడూ అంటే అద్భుతం చేసినట్టే !

ఇతను ఆలోచించాడూ అంటే అద్భుతం చేసినట్టే !

Tuesday January 26, 2016,

4 min Read

మన సమాజం మారాలి. కేవలం మార్కులు, మెరిట్ల దగ్గరే ఆగిపోకూడదు. తెలుసుకోవాలన్న బలమైన కోరిక, తపన కూడా చదువులో భాగమే. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించాలి - అబ్దుల్ కలాం.

అబ్దుల్ కలాం చెప్పిన ఈ మాటలు అబ్దుల్ కలీం జీవితానికి సరిగ్గా సరిపోతాయి. 22 ఏళ్ల వయస్సులోనే అతని సృష్టించిన అద్భుతాలను చూసి 2009లో భారత రాష్ట్రపతి సన్మానించారు. అదే ఏడాది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) అతని క్షేత్రస్థాయి ఆవిష్కరణ చూసి గౌరవించింది.

image


మంచి గ్రేడ్స్, అద్భుతమైన కలలకు దూరంగా బతికాడు కలీం. విద్యార్థి దశ నుంచే ఎప్పుడూ తన జీవితాన్ని విభిన్న పార్శ్వంలో చూశాడు, తనకంటూ ఓ ఫిలాసఫీని రూపొందించుకుని అందులో బతుకుతూ వచ్చాడు.

''ఏదైనా జరిగినప్పుడు, అది ఎందుకు జరిగింది, దాని వెనుక కారణం ఏంటి ? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను''.

ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలోనే ఎన్నో ఆవిష్కరణలకు దారితీశాయి. ఏడోతరగతిలో ఉన్నప్పుడు తన పాకెట్ మనీలో రూ.2 దాచి ఓ క్రిస్టల్ బర్డ్ కొని, దాన్ని ఓ గ్రీటింగ్ మెషీన్‌లా మార్చేశాడు. ఎవరైనా తన రూంలోకి అడుగుపెట్టగానే... ఆ పక్షి నుంచి ఈద్ ముబారక్ అనే మాటలు వినిపించేలా తయారు చేశాడు. తన బంధువు ఇంట్లో జరిగిన ఓ దొంగతనం అతడిని ఓ అలర్ట్ వ్యవస్థ రూపొందించేలా చేసింది. ఎవరైనా డోర్ తెరిచేందుకు ప్రయత్నించగానే.. సదరు ఓనర్ డయల్ చేసిన లాస్ట్ నెంబర్‌కు కాల్ వెళ్లేలా దీన్ని తీర్చిదిద్దాడు.

ఇదంతా ఉత్తరప్రదేశ్‌లోని డియోరియోలో ఉన్న ఓ మారుమూల గ్రామంలో ఉన్న ఓ కుర్రాడు చేశాడంటే నమ్మగలరా ? అదీ ఉర్దూ ట్యూటర్‌గా పనిచేస్తున్న తండ్రి, ఓ చదువురాని అమ్మ ఎప్పుడూ కనీవినీ ఎరుగుని అలారం వ్యవస్థ తయారు చేశారంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా ?

కలీం తల్లిదండ్రులకు ఎప్పుడూ అతనో మిస్టరీనే. ఇతడు ఏం చేస్తాడో, చేస్తున్నాడో.. వాళ్లకు అంతుబట్టేదికాదు. వాళ్లకు కావాల్సిందల్లా స్థిరమైన చదువు, మార్కులు, ఓ ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. తండ్రితో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా ఎప్పుడూ కలీంకు క్లాసులు ఇస్తూనే ఉండేవారు. సమయాన్ని దుబారా చేయకుండా.. ఏదైనా పనికొచ్చేది చేయమంటూ సలహాలు పడేసేవారు.

కానీ అబ్దుల్ మాత్రం అతడి లోకంలోనే విహరించేవాడు. ఎలక్ట్రానిక్స్, మెషీన్స్, నూతన ఆవిష్కరణలు.. ఇదే అతని జీవితం.

''ఆవిష్కరణల సమయంలో నాకు తగిలిన షాకులన్నీ.. చాలా బలమైన షాకులే.. అంటూ నవ్వేస్తాడు'' కలీం.

ప్రశ్నలకు సమాధానాలే.. ఆవిష్కారాలు

ఓవైపు చదువుకుంటూనే డియోరియాలో సైకాలజీలో చేరిన కలీం.. సమాజానికి వేటివల్ల ఉపయోగం ఉందో ఆలోచించడం మొదలుపెట్టాడు. తన ఆవిష్కరణల వల్ల ఏదో ఒక బలమైన ప్రయోజనం ఉండాలనే బలీయమైన కాంక్ష అతనిలో నాటుకుపోయింది. ఇదే ఓ సెన్సార్ తయారు చేయించింది. మట్టిలో ఉన్న తేమ శాతాన్ని గుర్తించి పొలాలకు నీటిని పట్టే సెన్సార్లను రూపొందించాడు. నేలకు అవసరమైన తేమ వచ్చిన తర్వాత ఆటోమోటిక్‌గా నీటి సరఫరాను సెన్సార్లు ఆపేస్తాయి.

ఆ తర్వాత వరదలను హెచ్చరించే మరో వ్యవస్థ. ఓ నదిలో వివిధ ప్రాంతాల్లో సెన్సార్లు ఏర్పాటు చేశారు. నది మధ్యతో పాటు రివర్ బెడ్‌పై కూడా సెన్సార్లు అమర్చారు. ఎప్పుడైతే నదిలో నీళ్లు మూడో లెవెల్‌కు వస్తాయో.. అప్పుడు సైరెన్లు మోగి ఊరివాళ్లందరినీ హెచ్చరిస్తుంది.

ఒకసారి తన సైకాలజీ ప్రొఫెసర్ ఇంటికి రావడం వల్లే కలీం ఈ స్థాయిలో పాపులర్ అయ్యాడు. తన ల్యాబొరేటరీకి రావాలంటూ చాలాసార్లు కలీం కోరినప్పటికీ సైకాలజీ ప్రొఫెసర్ డా. నగీజ్ భాను మాత్రం ఏదో ఒక సాకు చెప్పేవారు. ఒకసారి తప్పని పరిస్థితుల్లో అతని ఇంటికి వచ్చిన ఓ ల్యాబొరేటరీలోని ఆవిష్కరణలు చూసిన తర్వాత ఆమెకు మతిపోయింది. స్టూడెంట్‌ను చూసి మురిసిపోయి.. వెంటనే తన ఆలోచనలన్నీ ఎన్ఐఎఫ్‌కు పంపాలని సూచించారు. అలా నవంబర్ 21,2009న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు కలీం. అప్పటి నుంచి వాళ్ల రాష్ట్రంలో పాపులర్ అయ్యాడు.

image


ఆవిష్కరణలు ఆంట్రప్రెన్యూర్‌ను చేశాయా.. ?

నేను ఓ మంచి ఆవిష్కర్త కావొచ్చేమో కానీ ఓ బిజినెస్ మ్యాన్‌ను మాత్రం కాలేను అంటాడు కలీం. వ్యాపారంలో ఉండే లెక్కల చిక్కులేవీ తనకసలు అర్థమే కాదంటూ నవ్వుతాడు.

2011లో జాగృతి యాత్రలో 350 మంది కొత్త వాళ్లతో కలిసి ప్రయాణించాడు కలీం. అప్పుడే తన ఆలోచనలన్నీ స్టార్టప్‌వైపు మళ్లాయి. యాత్ర ముగిసిన వెంటనే.. అతడు ఓ చౌక సోలార్ టేబుల్ ల్యాంప్ తయారు చేశాడు. ఇది కూడా ఎంతో మందికి అవసరపడేదే.

ఐడియాను బిజినెస్‌గా మార్చేందుకు రూ.5 లక్షలు అవసరమయ్యాయి. నిధులు దొరక్కపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు.

2014లో సిద్ధార్థ్ అనే కస్టమర్‌ ఇంటికి యూనివర్సల్ సోలార్ లైట్ కంట్రోలింగ్ రిమోట్‌ను తయారు చేసి ఇచ్చాడు కలీం. అతడు జికె సిన్హా అనే ఏంజిల్ ఇన్వెస్టర్‌కు కలీం‌ను పరిచయం చేశాడు. కుర్రాడి ఆలోచనలు చూసి సిన్హాకు మతిపోయింది.

ఎకో ట్రోనికా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటుకు సాయపడడంతో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ గౌతమ్ కుమార్‌కు పరిచయం చేశారు సిన్హా. గౌతమ్‌కు కూడా కలీం ఆలోచనల్లో ఉన్న పదును చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కలిసి కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఎర్త్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సెంట్రల్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ట్రస్ట్స్‌కు పనిచేశారు. భూమిలో ఉన్న తేమ శాతాన్ని పరీశీలించే సెన్సార్ల ఆలోచనను మరింత అభివృద్ధి చేశారు. వీటికి తోడు వాతావరణ సూచనలు చేసే మొబైల్ వ్యవస్థను కూడా రూపొందించారు.

చౌకలో రూపొందిన సౌర శక్తి ఆధారిత వాతావరణ స్టేషన్లు క్లౌడ్ కంప్యూటింగ్‌తో పనిచేస్తాయి. వీటి సెన్సార్లను బిల్డింగులపై అమర్చుకోవచ్చు. పరిశ్రమలకైతే రూ.15,000 - ఇంటి అవసరాల కోసమైతే రూ. 5 నుంచి 10 వేలలో ఇన్‌స్టలేషన్ పూర్తైపోతుంది. జార్ఖండ్‌లోని బిర్లా అగ్రికల్చర్ యూనివర్సిటీ.. ఈ సెన్సార్లను తన అంగారా బ్లాక్‌లో ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న 700 మంది రైతులకు దీని వల్ల ప్రయోజనం ఉంటుంది.

సోలార్ పవర్‌తో నడిచే డ్యూయల్ ఎల్ఈడీ లైట్లపై ప్రస్తుతం కలీం పనిచేస్తున్నాడు. ఐదు నిమిషాల సోలార్ ఛార్జింగ్‌తో 24 గంటల పాటు పనిచేసేలా దీన్ని తయారుచేస్తున్నాడు. ఆదాయం, అమ్మకాలు, లాభాలు అనే విషయాలు ఇప్పటికీ తనకు అర్థం కాదని, తనకు తెలిసిందల్లా ఆవిష్కరణలు మాత్రమేనంటాడు కలీం.

మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌కు ఉన్న ఏకైక ఛాలెంజ్‌ ఓ మంచి వెండార్‌ను పట్టుకోవడమే. అది కూడా తక్కువ ధరలో నాణ్యమైన ప్రోడక్టును అందించగలిగిన వాళ్లే అంటారు.

''నాలో ఆత్మస్థైర్యం తక్కువగా ఉండడం వల్లే నన్ను చాలా మంది ఉపయోగించుకుని వదిలేస్తున్నారు అంటూ బాధపడ్తాడు'' కలీం.

ఆంట్రప్రెన్యూర్స్ అందరూ కలీం మాటలు జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. మరో ఉబర్, అమెజాన్ కోసం మనం పడ్తున్న తాపత్రయం నిజంగా సమాజానికి ఉపయోగపడ్తుందా.. ? బిజినెస్ మోడల్స్, రెవెన్యూల లెక్కలే ఓ స్టార్టప్‌ సక్సెస్‌కు కొలమానాలా... ? అని ఆలోచింపజేస్తాయి.

image


మనకు ఎంతసేపూ.. ఓ టెక్నాలజీని రూపొందించి దాన్ని సిలికాన్ వ్యాలీ వరకూ తీసుకెళ్లగలిగితే.. విజయం సాధించినట్టేనని మురిసిపోతాం. మరి సామాన్యులందరికీ పనికొచ్చే ఆవిష్కరణల పరిస్థితేంటి ?

అబ్దుల్ కలీం లాంటి ఆవిష్కర్తలు ఇంకా మన విద్యావ్యవస్థలో చాలా మందే ఉన్నారు. మనకు ఉన్న అవరోధాలు వేరు, మన అవసరాలు వేరు. చదువుకు బలమైన తపన తోడైనప్పుడే ఇలాంటి వాళ్లు, ఇలాంటి ఆవిష్కరణలు పుట్టుకువస్తాయి అనడంలో సందేహం లేదు. వ్యాపారం ఒక్కటే సమస్య పరిష్కారానికి సమాధానం కాదు.