సంకలనాలు
Telugu

తోడుదొంగలు ఆడుతున్న నాటకం "అగస్టా స్కాం"

SOWJANYA RAJ
10th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


అవినీతి అనే క్యాన్సర్ భారదేశాన్ని పట్టిపీడిస్తోంది. ఈ విషయాన్ని మనం దశాబ్దాలుగా చెప్పుకుంటున్నాం. పదే పదే చర్చించుకుంటున్నాం. కానీ ఈ అవినీతి క్యాన్సర్ మాత్రం అంతమవడం లేదు. ఈ కోణంలో ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం. ఈ స్కాం మళ్లీ ప్రజల దృష్టికి రావడం ఇదే మొదటిసారి కాదు. యూపీఏ హయాంలో... 2014 ఎన్నికల ముందు కూడా ఈ కుంభకోణం ఓసారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఇటలీలోని మిలన్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మళ్లీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంపైనే దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా విస్త్రతమైన చర్చ జరుగుతోంది. దేశంలో అధికార, విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ స్కాం నేపధ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. రాజకీయంగా దుమారం రేగుతోంది. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన, సహజంగా జరిగే అంశం ఏమిటంటే.. ఈ స్కాం విషయంలో ఎలాంటి పరిష్కారమూ దొరకదు.


భారతదేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతి, రాజకీయాలు ఎలా పెనవేసుకుపోయాయో ఈ అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం స్పష్టంగా చూపిస్తోంది. మన దేశ రాజకీయ వ్యవస్థలో ఎంత దారుణమైన లోపాలున్నాయో స్పష్టంగా ఈ స్కాం బయటపెడుతోంది. అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్.. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ హయాంలో కుదుర్చుకున్నారు. వీవీఐపీ హెలికాఫ్టర్ల స్పెసిఫికెషన్ల మార్పు కూడా అప్పుడే జరిగింది. ఈ మార్పులను చేసినందుకే ఒప్పందానికి ముందు, ఆ తర్వాత కాలంలో మిలియన్ల కొద్దీ యూరోల సొమ్ము అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ ముడుపుల కింద భారత్ లో రాజకీయనేతలకు,అధికారులకు చెల్లించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అగస్టా వెస్ట్ ల్యాండ్ తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సంవత్సరమే అంటే 2014లో అటల్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. మన్మోహన్ సింగ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అగస్టాతో ఒప్పందం మన్మోహన్ హయాంలోనే పూర్తిస్థాయిలో అమలయింది. ఈ స్కాంలో 2014 ఎన్నికల సమయంలో మొదటిసారిగా ప్రచారాస్త్రం అయింది. ఎన్నికల తర్వాత అది మరుగునపడింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మిలన్ కోర్టు తీర్పు బీజేపీకి ఓ రాజకీయ ఆయుధంలా దొరికింది. కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి ఈ తీర్పును అన్ని విధాలుగా బీజేపీ వాడుకుంటోంది. మిలన్ కోర్టు తీర్పులో సోనియాగాంధీ, అహ్మద్ పటేల్ ల పాత్రపై చూచాయగా పేర్కొన్నది. అదీ కూడా ఏ మాత్రం స్పష్టత లేకుండా. అసలు వాళ్లిద్దరేనా అన్నది కూడా అనామానాస్పదమే అన్నట్లుగా. అలాగే ఏ రాజకీయ నాయకుని పాత్ర అయినా ఈ స్కాంలో ఉన్నదని స్పష్టంగా చెప్పలేదు. కానీ విచారణ జరపాల్సిన అవసరం ఉందని మాత్రం తీర్పును బట్టి విశ్లేషించవచ్చు.

బీజేపీ ఈ స్కాం నేపధ్యంగా చాలా దూకుడుగా రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ అంశంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొదటి ప్రశ్న... అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం బయటపడినప్పటి నుంచి ఇటలీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తి చేసింది. నివేదికలన్నీ సమర్పించింది. విచారణ పూర్తి చేసి దిగువ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అలాగే అప్పిలేట్ కోర్టు ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఈ స్కాంలో లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు అగస్టా వెస్ట్ ల్యాండ్ సీనియర్ అధికారులపై నేరం నిరూపణ అయింది. వారిద్దరికీ శిక్ష కూడా విధించారు. ఈ అధికారులిద్దరూ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే ఇందులో విచారించవలసిన విషయంలో భారత్ లోనే ఉంది. ఈ కేసులో ఇప్పటికీ ప్రాథమిక విచారణ ప్రారంభం కాలేదు. ఇక నిందితులకు పడే శిక్ష గురించి ఎలా చర్చించగలం...?

image


ఈ కేసు విషయంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు వెనుకడుగు వేశారో నేను సులువుగా అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది..?. ఈ స్కాం గురించి ఎన్నికల ముందే ఆరోపణలు గుప్పించినప్పటికీ.. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..?. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎందుకు సైలెంట్ ఉండిపోయాయి. వారిని ఎవరు ఆపారు..?. అవినీతి వ్యవహారాల్లో పాలు పంచుకునేది లేదని.. అలాగే అవినీతికి పాల్పడేవారిని సహించబోనని ప్రధానమంత్రి మోదీ పదే పదే ప్రకటించుకుంటూ ఉంటారు. ఈ విషయం నిజమే అయితే ... అగస్టా స్కాంలో అసలైన నిందితులెవరో తెలుసుకోవాలని ప్రజలు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని ఈ దేశానికి ఈ విషయాన్ని బయటపడతారా..?

రెండో ప్రశ్న.. బీజేపీ నేతలు అగస్టా కంపెనీ నుంచి సోనియా గాంధీ లంచం తీసుకుందని పదేపదే ప్రకటలు చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్నది వారే కదా.. ఎందుకు ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి కూడా తమిళనాడు ఎన్నికల ర్యాలీల్లో సోనియాగాంధీ లంచాలు తీసుకున్నట్లు ప్రకటించారు. మరి ఆయన అయినా ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు..? సోనియాగాంధీకి కనీసం ఒక నోటీసులు కూడా జారీ చేసే ప్రయత్నం జరగలేదు. ఇంక ఇంటరాగేషన్, అరెస్ట్ అనేది అసలు ఊహించలేము. అసలు లంచాలు తీసుకున్నవారి పేర్లను బయటపెట్టాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా... సోనియాగాంధీని డిమాండ్ చేశారు ఇటీవల. ఇది ఇంకా విచిత్రం. ఇది నేరంలో సహ నేరస్తుల వివరాలను బయటపెట్టమని ప్రధాన నేరస్తుడ్ని యాచించడం లాంటిదే. ఇదే సమయంలో కాంగ్రెస్ స్కాం నేపధ్యంలో రాజకీయ నేతల్ని ఉసిగొల్పడం కాకుండా.. రెండు నెలల్లో అగస్టా స్కాం విచారణ పూర్తి చేయాలని సవాల్ విసురుతోంది. ఈ విషయంపై మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఈ స్కాం నేపధ్యంగా జరుగుతున్న రాజకీయం.. అవినీతిపై మన పోరాటంలోఉన్న లోపాలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.

1. ప్రధాన రాజకీయ పార్టీలు అవినీతిపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నాయా..?. అసలు చాన్సే లేదు. కానీ దీన్ని ప్రత్యర్థులను డీల్ చేయడానికి ఓ రాజకీయసాధనంగా వాడుకుంటున్నాయి. గత ఎన్నికలసమయంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంను చూపి కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించింది.ఆరోపణలుచేసింది. కానీ బీజేపీ కుంభకోణంపై అంత సీరియస్ గా లేదని తర్వాత స్పష్టమయింది. బీజేపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఈ స్కాం విచారణ పూర్తి.. దోషులతో శిక్ష కూడా పడేలా చేసి ఉండేది. ఇది ఇటలీలో జరిగింది. కానీఇక్కడ జరగలేదు.

2. రాజకీయ పార్టీలకు ఈ కుంభకోణంతో సంబంధం లేదా..? . కచ్చితంగాఉంది. కాంగ్రెస్ ఈ వ్యవహారంలో తప్పు చేసినట్లయితే.. బీజేపీ కూడా అందులో భాగం ఉంది. హెలికాఫ్టర్ స్పెసిఫికేషన్స్ మార్పులు చేయడంలో ఎన్జీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలే తర్వాత అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీకి భారీగా లబ్ది చేకూర్చాయి.

3. సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయని తప్పు విచారణ సంస్థలదేనా..?.. కానే కాదు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఆరోపణల విషయంలో నిందితులను గుర్తంచడానికి ఎలాంటి కసరత్తు జరగలేదని సదరు కంపెనీయే తెలిపింది. విచారణ సంస్థలన్నీ పాలక పక్ష కనుసన్నల్లోనే నడుస్తూంటాయి. ప్రభుత్వ పెద్ద దయతోనే అవి కార్యకలాపాలు నిర్వహిస్తూంటాయి. అందుకే ఈ విషయంలో సీబీఐ,ఈడీలను ఎంత మాత్రం నిందించలేం. అసలు నిందించాల్సింది...ఈ స్కాంలో భారీగా లాభపడి అధికారం మాటున దాక్కన్నవారినే.

4. దీనికి పరిష్కారం లేదా..?. అనినీతిపై పోరాటం ఎలా సాగించాలి..?. దీనికి సమాధానం చాలా సింపుల్. విచారణ సంస్థలకున్న సంకెళ్లన్నింటినీ తొలగించారు. వాటికి స్వతంత్ర ప్రతిపత్తినివ్వాలి. వాటికి స్వేచ్ఛగా విచారణ జరుపుకునే అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తికల్పించాలి. వాటిని సర్వస్వతంత్రంగా చేస్తే ..విచారణ కూడా వేగంగా పూర్తవుతుంది.

5. ఇది జరిగే పనేనా..? ..ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మేం అన్నా హజారేతో కల్సి సర్వ స్వతంత్ర, బలమైన విచారణ సంస్థ అయిన లోక్ పాల్ కోసం ఉద్యమం చేశాం. ప్రజల్లో వచ్చిన ఓ రకమైన విప్లవం చూసి భయపడిన ప్రభుత్వం లోక్ పాల్ తెచ్చేందుకు అంగీకరించింది.కానీ చివరికి జీవం లేని లోక్ పాల్ బిల్లను పాస్ చేసింది. అయితే ఇప్పటికీ ఆ లోక్ పాల్ ను నియమించలేదు. ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి ఉన్నా... లోక్ పాల్ ను నియమించి ఉండేవారు. మోదీ అవినీతికి వ్యతిరేకమని... లోక్ పాల్ ను నియమించడం ద్వారా చేతల్లో చూపించవచ్చు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

నా భయం ఏమిటంటే.. అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం కూడా భోఫోర్స్ లాగానే చరిత్రలో కలిసిపోతుంది. ఇంతకు ముందు జరిగినట్లు..ఇప్పుడు జరుగుతున్నట్లు ప్రజల సొమ్ము లూటీ చేసిన వాళ్లు ధైర్యంగా బయట తిరుగుతూనే ఉంటారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో నిజమైన విప్లవం రావాలి. ఇది జరుగుతుందా..? మిలియన్ డాలర్ల క్వశ్నన్..? . అవినీతి క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయాల్సిందే. చిన్నచిన్న చికిత్సలతో నయమవదు.

రచన: ఆశుతోష్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత

అనువాదం: సౌజన్య

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags