ఈమె లిఫ్ట్ ఇస్తారు !

సాఫ్ట్ వేర్ వదిలేసి తయారీరంగంలో సత్తా చూపుతున్న బిందు

Monday March 07, 2016,

4 min Read


అనుభవం లేదు. అస్సలు ఐడియా కూడా లేదు. మార్కెట్ ఎలా వుంటుందో తెలియదు. కస్టమర్లను ఎలా ఒప్పించాలో అర్ధం కాలేదు. ఆర్డర్లు సంపాదించడం ఎలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. పైగా చేయాలనుకున్న పనికీ చదివిన చదువుకీ సంబంధం లేదు. ఎక్కడ సాఫ్ట్ వేర్.. ఎక్కడ తయారీరంగం. రెంటికీ పొంతనే లేదు. ఈ క్రమంలో వినిపించిందో పిలుపు. దానిపేరే మేకిన్ ఇండియా. అదేంటోగానీ, ఆ పదం ఎంతో స్ఫూర్తిదాయకంగా వినిపించింది. ఆర్ధిక స్వావలంబన కళ్లముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అలా పడిన అడుగు.. అడుగులై.. వడివడిగా ఉరకలై.. వేగం పుంజుకుని ఇప్పుడు ఎలివేటర్ మీద ఎక్కి వెళ్తున్నాయి.

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. ప్రయాణం జీరో నుంచే మొదలవుతుంది. అది వ్యాపారమైనా ఇంకోటైనా. దానికో వేల్యూ రావాలంటే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వాటిని యుటిలైజ్ చేసుకోవాలి. వచ్చిన ఆర్డర్ చేజారొద్దంటే మార్కెట్లో మనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. అడుగుకో సవాల్ ఉంటుంది. చిక్కుముడులు విప్పాలి. తలనొప్పులు భరించాలి. ఇదంతా ఓవర్ నైట్ లో వచ్చేది కాదు.

ఏమాత్రం ఐడియా లేకుండానే లిఫ్ట్‌ ల తయారీ రంగంలో సాహసోపేత అడుగు వేసిందొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పేరు బిందు. యూఎస్ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌గా జీవితం మొదలుపెట్టి.. చివరికి హైదరాబాదులో లిఫ్ట్‌ ల తయారీ రంగంలోకి అడుగుపెట్టి, కంపెనీని టాప్ లెవల్ కు తీసుకొచ్చిన బిందు లైఫ్ జర్నీ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.

undefined

undefined


బిందు బై బర్త్ హైదరాబాదీ. ఓయూ నుంచి బీటెక్‌ చేసింది. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ చేయాలనేది తన డ్రీమ్. అందుకే ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లిపోయింది. కానీ అప్పట్లో దానికక్కడ డిమాండ్‌ లేదు. పొయిన తర్వాత తెలిసింది. అలా అని వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఉద్యోగం కావాలి. కానీ దొరకలేదు. అందుకే రూటు మార్చింది. ఐటీలో ఎంఎస్‌ చేసి జాబ్ లో చేరిపోయింది. ఈలోగా ఇంట్లోవాళ్లు పెళ్లిమాట తెచ్చారు. అబ్బాయి అమెరికాలోనే ఉంటాడు. సరే, కొంత తర్జనభర్జన పడ్డ తర్వాత పెళ్లిభాజా మోగింది. ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. మ్యారీడ్ లైఫ్ బానే వుంది. కానీ చేస్తున్న ఉద్యోగంలోనే ఏదో తెలియని వెలితి. మనసేమో క్రియేటివిటీ కోరుకుంటోంది. ఉన్నదేమో ఐటీ రంగంలో. సృజనకు ఛాన్సెక్కడిది. అఫ్ కోర్స్ ఇదే అందరి అభిప్రాయం కాకపోవచ్చు. కానీ బిందు మటుకు ఈ ఫీల్డులో నో క్రియేటివిటీ అంటారు. ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనే తపన ఉద్యోగంలో ఒకపట్టాన ఉండనీయలేదు. వేరే థాట్ లేకుండా ఉద్యోగానికి గుడ్ బై కొట్టేశారు. భర్త కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. సరే నీ ఇష్టం వచ్చినట్టు కానీ అన్నాడు.

ఆ టైంలో ఒక వార్త వినిపించింది. ఇండియాలో ఓ మెకానికల్ ఇండస్ట్రీ అమ్మకానికి ఉందట. కొనేద్దామని డిసైడయ్యారు. ఇంకొందరు ఎన్నారైలు తోడయ్యారు. అంతా కలిసి కొంత మొత్తానికి దాన్ని కొన్నారు. మంచి ముహుర్తంలో దాన్ని రీ స్టార్ట్ చేసేలోగా ఓ విచిత్రం జరిగింది. బిందు అంతకుముందు పనిచేసిన సంస్థ హైదరాబాద్‌లో బ్రాంచీ పెట్టాలనుకుంది. దాని ఆపరేషన్స్ చూడమంటూ ఆమెకు ఆఫర్ వచ్చింది. సరిగ్గా ఇక్కడ డైలమా మొదలైంది. ఇప్పుడెలా..? ఇక్కడేమో ఇండస్ట్రీని ఆల్రెడీ కొనేశారు. అక్కడేమో కాదనేని ఆఫర్. ధర్మసంకటం. సరే.. ఏదైతే అదైంది.. నేను ఇండస్ట్రీ చూసుకుంటాను.. నువ్వు బ్రాంచీ బాగోగులు చూడు అని భర్త ఒక సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందని బిందు కూడా ఒప్పుకుంది. కానీ ఒక కండిషన్. రెండేళ్లపాటే పనిచేస్తా.. తర్వాత నా వ్యాపారం చూసుకుంటా అని సదరు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

undefined

undefined


అయితే అన్ని రోజులు మనవి కావు. కొంత కాలానికే తెలిసొచ్చింది. ఆర్ధిక మాంద్యం ఐటీ మార్కెట్ ను ఈడ్చి తన్నింది. ఆ పరిస్థితుల్లో సంస్థను వదిలేయడం నైతికత కాదని బిందు భావించింది. రెండేళ్లు మాత్రమే చేస్తానన్న ఒప్పందం కాస్తా నాలుగేళ్లకు చేరింది.

మరోవైపు బిందు భర్త సాల్జిగిట్టర్‌ హైడ్రాలిక్స్‌ బాధ్యతలు చూసేవారు. బిందు ఆ సంస్థలో పేరుకు మాత్రమే భాగస్వామి. కానీ ఏ రోజూ కల్పించుకోలేదు. ఎప్పటికప్పుడు డిజైన్‌ మార్చుకోవడం...వాటికోసం అవసరమైన వస్తువులన్నీ ఉత్పత్తి చేయడం వంటివన్నీ చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకోగానీ.. అవుతున్న ప్రొడక్షన్ కు ప్రత్యామ్నాయం కావాలని బిందుకు అనిపించింది. పైగా భర్త ఒక్కడే అన్ని వ్యవహారాలూ చూడటం బిందుకు బాధ కలిగింది. ఇక లాభం లేదని చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది.

ఆల్టర్నేట్ కావాలి. ఆ ఆలోచనల్లోంచే వచ్చిందే ఫోర్క్‌ లిఫ్ట్‌ తయారీ. అందుకోసం చైనాలోని ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క ఆర్డరూ సంపాదించలేకపోయారు. ఎందుకిలా జరిగింది..? పోస్టుమార్టం రిపోర్టులో తేలిందేంటంటే.. ఆ టైప్ లిఫ్ట్‌ లను పెద్దపెద్ద కంపెనీలే వాడతాయి. పైగా వీళ్లది కొత్త సంస్థ. ఆర్డర్ మాట దేవుడెరుగు. డెమోకి అవకాశం లేదు. ఇప్పుడు మళ్లీ దీనికో పరిష్కారం కావాలి. ఆ దిశగా మేథోమథనం చేస్తుంటే ఐడియా మెరిసింది. దానిపేరే హైడ్రాలిక్స్‌ లిఫ్ట్స్‌. మరో ఆలోచన లేకుండా సాల్జిగిట్టర్‌ హైడ్రాలిక్స్‌ కి అనుబంధంగా దాన్ని ఏర్పాటు చేశారు.

undefined

undefined


ఏడాదిన్నర పరిశోధనల తర్వాత మొదటి దశలో ప్రోటోటైప్‌ లిఫ్ట్‌ తయారు చేశారు. తరవాత విదేశీ కంపెనీ ఒప్పందంతో ఎలివేటర్‌ బ్లాక్‌ తెప్పించుకున్నారు. ఆపై సిలిండర్స్‌, పవర్‌ప్యాక్‌ యూనిట్‌, క్యాబిన్‌, తలుపులు...ఇలా ప్రతి దాన్నీ ఇక్కడే తయారు చేశారు. ప్రతి స్టెప్ లోనూ అవసరమైన మార్పులు చేసుకుంటూ, క్వాలిటీలో ఏమాత్రం రాజీపడకుండా మొత్తానికి లిఫ్ట్‌ ని తయారుచేశారు. ఇంతవరకు బానేవుంది కానీ ఆర్డర్లు సంపాదించడం ఎలా? అందుకే మొదటి లిఫ్ట్‌ ని తమ సంస్థలోనే ఏర్పాటు చేశారు. తెలిసిన వాళ్ల ద్వారా కంపెనీలను, బిల్డర్లను పిలిచి డెమో ఇచ్చారు.

పెద్ద సంస్థలేమో బ్రాండెడ్‌ కాదుగా అన్నాయి. చిన్నవాళ్లేమో ధర విషయంలో బేరం తెగనీయడం లేదు. మహిళలు ఈరంగంలో కూడా ఉన్నారా? ఈ మార్కెట్‌లో నిలదొక్కుకోగలవా? అంటూ ప్రశ్నించేవారు. ఇవన్నీ తెలియకుండానే బిందుపై ఒత్తిడిని పెంచేవి. అయినా సరే ఈసారి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదనుకుంది. నన్ను నేను నిరూపించుకోవాలనుకుంది.

ఏడాదికి నలభై లిఫ్ట్‌ లు తయారు చేయాలనేది టార్గెట్. వాటి తయారీకి రెండు వారాల సమయం పడుతుంది. ఇన్‌స్టాల్‌ చేసేందుకు మరో ఫోర్ వీక్స్ టైం తీసుకుంటుంది. ప్రస్తుతం బిందు కంపెనీ తయారు చేస్తున్న రకాల్లో కాంపాక్ట్‌, ఎక్స్‌ టర్నల్‌, హెవీలోడెడ్‌ లిఫ్ట్‌ లతో పాటు కార్‌ లిఫ్ట్‌ కూడా ఉన్నాయి.

undefined

undefined


సాల్జిగిట్టర్‌ హైడ్రాలిక్స్‌ పెద్ద కంపెనీలతోనే పోటీ పడుతున్నది. లిఫ్ట్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఇంతవరకు ఎవరినుంచీ ఎలాంటి కంప్లయింటూ రాలేదు. కనీసం సర్వీసింగ్‌ కాల్ కూడా రాలేదు. అయినా సరే వీళ్లే ఫోన్ చేసి మరీ సర్వీసు అందిస్తున్నారు. అన్నట్టు.. కంపెనీలో కీలకమైన స్టోర్స్‌, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌, అకౌంటింగ్‌ విభాగాలన్నిటిలో మహిళలే కీలకం.

ఇప్పటి దాకా హైదరాబాద్ లో హైడ్రాలిక్ ఎలివేటర్స్ ని 50 పైగా ఇన్ స్టాల్ చేశారు. ఇదంతా ప్రారంభించిన కొద్ది సమయంలోనే సాధ్యపడింది. ఆంధ్రా తెలంగాణల్లో ఏడాదికి 1000కి పైగా ఎలివేటర్లు అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బ్రాండ్ నేమ్ ఉన్న చాలా విదేశీ కంపెనీలను తట్టుకుని నిలబడటం అంత సులువైన విషయమైతే కాదంటారామె.

చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అలవరుచుకోడానికి నాన్న కారణమని అంటారు బిందు. అదే తననీ స్థాయిలో నిలబెట్టిందని అంటారామె.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి