సంకలనాలు
Telugu

స్థానిక వ్యాపారులకు సాంకేతిక ఆసరా... 'బీకానిఫై'

Malavika P
24th Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఈ-కామర్స్... ఈ రోజుల్లో దీని గురించి తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో ! ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలో ఈ-కామర్స్ వ్యాపారస్తులు దిట్ట అనడంలో సందేహం లేదు. దీని కారణంగా సంప్రదాయ మార్కెట్లు కుదేలవుతున్నాయి అనే వాదన కూడా లేకపోలేదు. సంప్రదాయ వ్యాపారస్తులు ఆన్ లైన్ రిటైల్ స్టోర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.

మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ పరంగా ఆన్ లైన్ రిటైలర్లకు ఉన్న అవకాశాలు స్థానిక (లోకల్) వ్యాపారులకు ఉండవు. పైగా ఆన్ లైన్ రిటైలర్లు (ఈ-టెయిలర్)కు పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు సమకూరుతాయి. ఈ సౌకర్యం కూడా లోకల్ మర్చంట్లకు ఉండదు. కానీ ఈ-టెయిలర్లతో పోటీ పడాలంటే స్థానిక వ్యాపారస్తులు కూడా తమ కస్టమర్ల అవసరాలు, ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల ఆఫర్లు, స్కీములను ప్రవేశపెట్టాలి. ఆన్ లైన్ లో ప్రచారం చేసుకోవాలి. మరి ఇదంతా ఎలా సాధ్యం ?

image


లోకల్ (ఆఫ్ లైన్) రిటైలర్లకు సాంకేతికత పరంగా చేయూతనిచ్చే లక్ష్యంతో... రితబ్రతా భౌమిక్, రానా హల్దార్, అనురాజ్ ఎన్నయ్... కలసి ఓ అప్లికేషన్ ను రూపొందించారు. అదే... బీకానిఫై. దీని సాయంతో ఎవరైనా స్థానికంగా అందుబాటులో ఉన్న రిటైలర్లు, హోటళ్లు, పెయింటర్లు, లాండ్రీ, కార్పెంటర్లు, మెకానిక్‌ వంటి వివిధ రంగాలకు చెందిన వారి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు మనం కోరుకున్నవి మన ఇంటికే నేరుగా వచ్చేస్తాయి.

బీకానిఫై ఎలా ప్రారంభమైంది ?

“ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్ వంటి ఆన్ లైన్ రిటైల్ బిజినెస్ కంపెనీల నుంచి గల్లీ వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఈ గల్లీ మర్చంట్లకు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి సరైన వేదిక లేదు. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. ఇదే మమ్మల్ని ఈ అప్లికేషన్ రూపొందించేందుకు ముందుకు నడిపించింది. క్లుప్తంగా చెప్పాలంటే... బీకానిఫై లోకల్ వ్యాపారులకు ఓ బిగ్ బాస్కెట్ లాంటింది” అంటారు రితబ్రతా భౌమిక్.

చాలా సందర్భాల్లో కస్టమర్లకు తమ ఇంటి పక్కనో, సమీపంలోనో ఉన్న సోర్లలో ఏమి ఆఫర్లున్నాయో తెలియదు. ఎందుకంటే దీనిపై ఎలాంటి ప్రచారమూ ఉండదు. ఫలితంగా ఆ గల్లీ వ్యాపారి ఎందరో విలువైన కస్టమర్లను కోల్పోతున్నారు. ఇలాంటి వ్యాపారస్తులకే మా బీకానిఫై చక్కగా సరిపోతుంది... అంటారు రితబ్రతా.

image


బృందంలో ఎవరున్నారు ?

ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం బెంగళూరులలో చదువు పూర్తి చేసిన రితబ్రతా... రెండేళ్లపాటు వివిధ కంపెనీల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. చివరగా ఆక్సెంచర్ ఇండియాలో సీనియర్ మేనేజర్‌గా ఫార్చ్యూన్ టాప్ 500 జాబితాలోని టెలికాం రంగానికి చెందిన క్లయింట్లతో పనిచేసేవారు.

సింద్రీలోని బిట్స్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన రానా... ప్రపంచవ్యాప్తంగా ఆధునిక టెలికమ్యూనికేషన్ స్విచింగ్ ఉత్పత్తుల రూపకల్పన, వీఓఐపీ సొల్యూషన్స్ లలో నిపుణుడు. తన పరిశోధనలతో దాదాపు దశాబ్దకాలం పాటు మోటరోలా మొబైల్ ఫోన్ల టెక్నాలజీలో ఎన్నో కొత్త మార్పులు తీసుకువచ్చారు.

ఇల్లినాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంఎస్ పూర్తి చేసిన అనురాజ్ కూడా మోటరోలాలో దాదాపు పదేళ్లపాటు పనిచేశారు. ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో అనురాజ్ నిపుణుడు. ఐఐఎం-బెంగళూరు ద్వారా ఎగ్జిక్యూటివ్ మేనేజ్ మెంట్ డిగ్రీ కూడా పూర్తిచేశారు.

image


ఎలా పనిచేస్తుంది ?

బీకానిఫైలో వినియోగదారులకు, వ్యాపారస్తులకు ప్రత్యేకంగా అప్లికేషన్లు ఉన్నాయి. బీకౌన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, స్టోర్లలో ఏం ఆఫర్లున్నాయో తెలుసుకోవడంతో పాటు అవసరమైన సేవలందించే (పెయింటర్లు, మెకానిక్, వంటి) వారి వివరాలు కూడా చూడవచ్చు. అలాగే బీకౌన్ మర్చంట్ ఆండ్రాయిడ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకుని, లాగిన్ అవడం ద్వారా వ్యాపారస్తులు తమ వద్ద లభించే ఉత్పత్తులు, అందించే ఆఫర్లు, సేవలు వంటి వివరాలను పోస్ట్ చేయవచ్చు.

“మన చుట్టూ ఉన్నవారి కొనుగోలు సామర్థ్యం, అలవాట్ల ఆధారంగా మార్కెటింగ్ చేస్తే... స్థానిక వ్యాపారస్తులు సైతం ఈ-టెయిలర్లకు గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకమే మా అప్లికేషన్ అభివృద్ధికి పునాది” అంటారు రానా.

లక్ష్యాలు, ప్రణాళికలు

ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక అంచనాల ప్రకారం ప్రస్తుత భారత రిటైల్ మార్కెట్ విలువ సుమారు 525 బిలియన్ డాలర్లు. ఇందులో 5 శాతం అంటే సుమారు 25 బిలియన్ డాలర్లు అడ్వర్టైజింగ్, ప్రమోషన్ల కోసం ఖర్చుపెడుతున్నారు. ఈ 5 శాతంలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ బేకనైఫై ద్వారా జరగాలనేది రితబ్రతా బృందం నిర్దేశించుకున్న భారీ లక్ష్యం.

తమ మార్కెటింగ్ వ్యూహాల్లో మార్పులు చేసి బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బేకనైఫైని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు రితబ్రతా బృందం. ఈ ప్రయోగ ఫలితాలను బట్టి తమ మార్కెటింగ్ వ్యూహాలకు తగిన మార్పులు చేసి బెంగళూరు నగరం మొత్తానికి తమ అప్లికేషన్ ను అందుబాటులోకి తేవాలనేది వారి ప్రణాళిక. “2016 చివరి నాటికి కనీసం లక్ష మంది వ్యాపారస్తులను తమ బీకానిఫై సభ్యులుగా చేసుకోవాలి. అలాగే కనీసం 10 లక్షల మంది వినియోగదారులు బేకనైఫైని ఉపయోగించేలా చేయాలి. ఇదే మా లక్ష్యం” అంటారు రానా.

మార్కెట్లో పోటీ

ముంబయి ఆధారంగా పనిచేస్తున్న నిఫ్లర్, పే మ్యాంగోల నుంచి బీకానిఫై గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బేకనైఫై తన వైవిధ్యమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నిఫ్లర్, పే మ్యాంగోలలో ఆన్ డిమాండ్ సర్వీసెస్ (అవసరార్థ సేవలు) వివరాలు లేవు. కానీ బీకానిఫైలో పెయింటర్లు, మెకానిక్స్, కార్పెంటర్స్ వంటి వివిధ రకాల పనివాళ్లకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. అది కూడా మన ఇంటి చుట్టుపక్కలవారివే కావడం గమనార్హం. ఇదే బీకానిఫైని పోటీలో ముందు నిలబెడుతుందనేది రానా బృందం గట్టి నమ్మకం.

ఇటీవల కాలంలో “స్థానిక (లోకల్)” అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న కొత్త కంపెనీలు, అప్లికేషన్లు చాలా చూస్తున్నాం. బేకనైఫై కూడా అదే వ్యూహంతో పోటీ మార్కెట్లో కాలుమోపింది. నిఫ్లర్, పే మ్యాంగో, బేకనైఫై... ఏదైనా సరే... లోకల్ మర్చంట్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, దాని ఫలాలను రుచి చూపించి, తద్వారా వారికి లబ్ది చేకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే. వీటి పనితీరును గమనిస్తూ ఉంటే మనం కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సో... ఫ్రెండ్స్... కీప్ యాన్ ఐ ఆన్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags