స్పైసీ స్టార్టప్ "మామ చికెన్"... గుంటూరు స్పెషల్

స్పైసీ స్టార్టప్ "మామ చికెన్"... గుంటూరు స్పెషల్

Thursday March 03, 2016,

2 min Read


స్టార్టప్ అంటే యాప్ లతో వెబ్ సైట్లతో మాత్రమే ప్రారంభించేదే కాదు. కస్టమర్లను ఆకర్షించి మార్కెట్ దున్నేసే ఎంత చిన్న వ్యాపారమైన స్టార్టపే. ఒక్క అడుగు నుంచే మైళ్ల పయనం ప్రారంభమైనట్లు.. గుంటూరు కుర్రాళ్లు త్రిశాంక్, కోటిరెడ్డి తమ ఐడియాకు స్టార్టప్ రూపమిచ్చారు. చిన్నతరహాలోనే ప్రారంభించినా పెద్దపెద్ద ప్రణాళికలతోనే ముందుకెళ్తున్నారు. ఇంతకీ వారి స్టార్టప్ ముడిసరుకేమిటో తెలుసా స్పైసీ స్పైసీ చికెన్.

పీక ఊదుకుంటూ ఐస్ క్రీమ్ అమ్మే బండ్లు తిరగని వీధి ఎక్కడా ఉండదు. అయితే ఆ ఐడియా ఐస్ క్రీమ్ కే పరిమితమయింది. అందుకే గుంటూరు కుర్రాళ్లు త్రిశాంక్, కోటిరెడ్డి కాస్త వెరైటీగా ఆలోంచారు. అలాంటి బండిలోనే వేడివేడి పొగలుగక్కే చికెన్ ముక్కలు అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఐడియా కత్తిలా వుంది. కంపల్సరీ వర్కవుట్ అవుతుంది. అందరిదీ అదే నమ్మకం. ఇంకేముంది రంగంలోకి దిగారు. "మామ చికెన్" బండ్లతో స్టార్టప్ మొదలుపెట్టారు.

ఎంబీఏ చదివిన త్రిశాంక్, కోటిరెడ్డి బావబామ్మర్దులు. ఉద్యోగం చేయడమే కాదు.. ఉద్యోగాలు కూడా ఇవ్వాలనేది ఇద్దరి లక్ష్యం. అందుకే కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించారు. వచ్చిన ఆలోచనకు, తమ దగ్గరున్న పెట్టుబడికి "మామ చికెన్" బండ్లు కరెక్ట్ గా సరిపోతాయని డిసైడయ్యారు. ఐస్ క్రీమ్ బండ్ల తరహానే "మామ చికెన్" బండ్లను డిజైన్ చేయించారు. అందులో బొగ్గులతో నిప్పులు కక్కే కొలిమి ఉండే విధంగా చూశారు. చికెన్ అంటే రెస్టారెంట్లకో, హోటల్స్ కో వెళ్లే అవసరం లేకుండా, మిర్చి బజ్జీల్లా రోడ్ సైడ్ దొరికితే వినియోగదారులు కచ్చితంగా ఆసక్తి చూపిస్తారని నమ్మారు. ఆ నమ్మకం వమ్ముకాలేదు.

మామ చికెన్ బండి<br>

మామ చికెన్ బండి


హెల్దీ చికెన్

మామా చికెన్ బండిలో అమ్మే చికెన్ పూర్తిగా హెల్దీ చికెన్. స్కిన్ లెస్ చికెన్ తో పూర్తిగా నూనె వాడకుండా ఐటమ్స్ రెడీ చేస్తారు. ఆయిల్ లేకుండా తయారు చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందనేది ఇద్దరి అభిప్రాయం. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ కూడా అదే. బండి మీద ఏం వెరైటీలు ఉంటాయని అనుకోవడానికి లేదు. చికెన్ వింగ్స్, లెగ్ పీసెస్, బేబీ క్యూబ్స్, తందూరి చెకెన్ వీరి మెనూలో ఉన్నాయి. వీటితో పాటు కౌజు పిట్ట మాంసం కూడా దొరుకుతుంది.

బయట ఎక్కడైనా నాన్ వెజ్ తింటున్నామంటే అందరికీ.. ఆ చికెన్ ఎలాంటిదో అనే డౌట్ రావడం సహజం. ఆ డౌట్ "మామ చికెన్" బండి దగ్గర రాదు. ఎందుకంటే వీరిది లైవ్ కిచెన్ కాన్సెప్ట్. కస్టమర్ ఎదుటే చికెన్ రెడీ చేస్తారు. పైగా ధర కూడా అందుబాటులో ఉంటుంది. నిర్వహణ ఖర్చులు బాగా తక్కువ కావడంతో... రూ. 40 నుంచి 70 రూపాయల లోపే చికెన్ వెరైటీస్ అందిస్తున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చిన చెఫ్ లతో చెకెన్ ఐటెమ్స్ తయారు చేయిస్తున్నారు.

రెస్టారెంట్లలో అయితే ఇదే చికెన్ 150 నుంచి 200 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మేము తక్కువ ధరకే అందిస్తున్నాము. ఈ తరహా మొబైల్ చికెన్ ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి. ప్రజలనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది- త్రిశాంక్ రెడ్డి

image


మొదట్లో మామా చికెన్ బండ్లు రోడ్డు పక్కన కనపడినప్పుడు కొంతమంది అనుమానంగా చూశారు. కానీ టేస్ట్ చేసిన తర్వాత మళ్లీ మళ్లీ రాకుండా ఉండలేకపోయారు. మౌత్ పబ్లిసిటీయే ఇప్పుడు మామా చికెన్ కు మరింత డిమాండ్ పెంచుతోంది. అందుకే మొదట సింగిల్ డిజిట్ బండ్లతోనే వ్యాపారం ప్రారంభించిన వీరు... కొంచెం సమయం తీసుకుని భారీ ప్రణాళికలతో రావాలని చూస్తున్నారు.