సంకలనాలు
Telugu

ఈ దెబ్బతో నల్లధనం ఖేల్ ఖతమా..? లేకుంటే సీన్ రివర్స్‌ అవుతుందా..?

ఆప్ నేత అశుతోష్ ఆసక్తికర విశ్లేషణ

team ys telugu
23rd Nov 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

ఫ్లాష్ న్యూస్ రావడంతో నా మొబైల్ టింగ్ మని వెలిగింది. ఏంటాని ఆసక్తిగా చూశాను. రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ప్రెస్ మీట్ అని ఉంది. ఏమై ఉంటుందబ్బా అనుకున్నాను. ప్రత్యేకంగా జాతినుద్దేశించి అని కోట్ చేశారేంటని ఆలోచనలో పడ్డాను. ఇండియా పాక్ సరిహద్దులో పెద్దగా యుద్ధవాతావరణం కూడా లేదే.. మరి ఏమై ఉంటుందీ అని సందేహాలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఎంత గింజుకున్నా బుర్రకు తట్టలేదు. ఈలోగా టైం 8 అయింది. టీవీ ఆన్ చేశాను.

ప్రధాని మోడీ మాట్లాడుతున్నాడు. ఉగ్రవాదం, అవినీతి, నల్లధనం మీద ప్రసంగం గుంభనంగా సాగుతోంది. పదినిమిషాలు గడిచిన తర్వాత మాటల్లోంచి తూటాలు బయటకొచ్చాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి 500,1000 నోట్లు రద్దు చేస్తున్నాం అన్నారు. పక్కన పెద్ద బాంబు పేలిన శబ్దం. ఏంటీ డెసిషన్ అని ఉలిక్కిపడ్డాను. బ్లాక్ మనీని, అవినీతిని అరికట్టేందుకు ఇంతకంటే వేరే మార్గం లేదనేది ప్రధాని ప్రసంగ సారాంశం. వెంటనే వాలెట్ తీసి చూసుకున్నాను. 500 నోట్లు మూడున్నాయి. అవి ఒక్కసారిగా ఎందుకూ పనికిరాని పేపర్లుగా కనిపించాయి.

అర్ధరాత్రి నుంచి అవి ఎలాగూ పనికిరావు కాబట్టి ఈలోపే బయటకు వెళ్లి ఏమైనా తిని వద్దామని మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం. మాంచి హోటల్ కి వెళ్లి శుబ్బరంగా భోం చేశాం. తింటూనే డిమానిటైజేషన్ మీద వాడీవేడిగా చర్చించుకున్నాం. కేంద్రం తీసుకున్న డేరింగ్ స్టెప్ మీద మా మధ్య రకరకాల వాదనలు వచ్చాయి. అంతా బానే ఉంది కానీ, నిజంగా ఈ నిర్ణయం అవినీతిని అరికడుతుందా? నల్లబాబుల భరతం పడుతుందా? వీటికి అప్పటికప్పుడు సమాధానం దొరకలేదు! ఈ నిర్ణయం దేశరాజకీయాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఈ డెసిషన్ మోడీకి లాభిస్తుందా? గందరగోళంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ చక్కబడుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉద్భవించాయి.

నిజం చెప్పాలంటే నేను చాలా కన్ ఫ్యూజన్ లో పడ్డాను. ఏ ప్రశ్నకూ సమాధానం దొరకడం లేదు. ఈలోగా పెట్రోల్ పంపుల దగ్గర జనం పోటెత్తారని వార్తలు వెల్లువెత్తాయి. తెల్లారి చూస్కోండి.. మామూలు గందరగోళం కాదు. వ్యవస్థ ఒక్కసారిగా అస్తవ్యస్తం, ఆగమాగం. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు. ఒక్క దేశమే కాదు.. యావత్ ప్రపంచమే మన కరెన్సీ రద్దు మీద చర్చించుకుంది. ప్రతిపక్షాలు అంతెత్తున లేచాయి. రాజకీయం వేడెక్కింది. రెండు వారాలు గడిచింది. మద్దతిచ్చేవారు.. వ్యతిరేకించేవారు.. ఇలా రెండు గ్రూపులుగా విడిపోయారు.

ఆ రోజు నుంచి మోడీ చెప్పేదొక్కటే.. నల్లధనాన్ని అరికట్టడానికి ఇంతకంటే మార్గం లేదని. అవినీతిని అంతమొందించాలంటే ఇదొక్కటే పరిష్కారమని చెప్పుకొస్తున్నారు. కానీ నాకుమాత్రం ఆ నిర్ణయం మింగుడుపడలేదు. చేదుమాత్ర కడుపులో కరగకుండా తిరుగుతోంది.

image


2014 ఎన్నికలప్పుడు మోడీ ప్రామిస్ చేశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతీ ఒక్కరి ఖాతాలో 15లక్షల చొప్పున డిపాజిట్ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీస్తాని మాటిచ్చారు. విదేశీ బ్యాంకులన్నీ మనవాళ్లతో రొమాంటిక్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తున్నాయి. రాజకీయాల్లో కాస్త పేరు వచ్చిందో లేదో సదరు నాయకుడు స్విస్ అకౌంట్ క్షణాల్లో తెరిచేస్తాడు.

అంతులేని అవినీతి వల్లే కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం యాభై ఎంపీ స్థానాలు కూడా గెల్చుకోలేకపోయింది. సుదీర్ఘ రాజకీయ చరిత్రగల కాంగ్రెస్ అవినీతి దెబ్బకు మట్టికరిచింది. ఒక కుంభకోణం తర్వాత మరో కుంభకోణం దేశాన్ని కుదిపేశాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశం మొత్తం అవినీతి, స్కాంల మయమైంది.

2009 ఎలక్షన్ల సమయంలో బీజేపీ సీనియర్ నేత అద్వానీ నల్లధనం గురించి లేవనెత్తారు. కానీ 2008లో వచ్చిన గ్లోబల్ రెసిషన్ కారణంగా ఆ ఇష్యూపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలోనూ నల్లధనం విషయం మరుగున పడింది. 2011 నుంచి పొలిటిలక్ స్పెక్ట్రమ్ క్రమంగా మారతుండటంతో బ్లాక్ మనీ హాట్ టాపిక్ గా మారింది. అన్నా హజారే ఉద్యమంతో అవినీతి సర్వత్రా చర్చనీయాంశమైంది

ఎప్పుడైతే మోడీ తెరమీదికి వచ్చారో అప్పటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అయితే ప్రధాని మోడీ ప్రామిస్ చేసినట్టుగా వందరోజుల్లో విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పిస్తాన్న మాట నెరవేరలేదు. ఆయన ఓ రేంజ్ లో ప్రచారం చేశారు కానీ నెరవేర్చలేకపోయారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు. కానీ దీనికి ఎలాంటి అధికారాలు లేవు. అదొక కోరల్లేని పాము. చివరికి అమిత్ షా ఏమన్నారంటే.. ఎన్నికల ప్రచారంలో ప్రజలను నమ్మించడానికి రాజకీయ పార్టీలు సీరియస్ గా ఇచ్చే హామీ లాంటిదే ఇది కూడా అన్నారరు. ప్రజలు కూడా సీరియస్ గా పరిగణించలేదని ఆయన అంటున్నారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే గత ఎన్నికల్లో మోడీది అత్యంత ఖరీదైన ప్రచార ఆర్భాటం. ఇది డబ్బుకు అశ్లీల ప్రదర్శన లాంటిది. ఇలా మోడీ ప్రచారం కోసం ఖర్చు పెట్టిన మొత్తం రూ.10వేల కోట్లో, రూ.20వేల కోట్లో ఉంటుంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ వ్యయాలన్నింటినీ భరించాయి. ఈ లెక్కలను మోడీ ఇంత వరకూ ప్రకటించలేదు కూడా. కనీసం వీటి గురించి మాట్లాడలేదు కూడా. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 80 శాతం నిధుల సమాచారాన్ని ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. రోడ్డున పోయే సామాన్యుడినే కాదు...అన్నీ తెలిసిన ఎక్స్ పర్ట్ ను అడిగినా ముక్తకంఠంతో చెబుతారు అదంతా బ్లాక్ మనీయేనని. లెక్కలు లేని డబ్బులని.

గత రెండున్నరేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మోదీ ఇప్పటి వరకూ లోక్ పాల్ ను నియమించడానికి సిద్ధపడలేదు. మన్మోహన్ ప్రధానిగా దిగిపోయేముందు లోక్ పాల్ బిల్లు పాసయింది. అప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 12 ఏళ్ల పాటు ఉన్నారు. అక్కడ లోకాయుక్త బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించలేదు.

అక్కడ అవినీతిపై చర్యలు తీసుకునే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా మోడీ కేబినెట్ లో ఉన్న అవినీతి మంత్రుల్ని అరెస్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఎంతో మంది అవినీతి పరులు మోడీ కేబినెట్ లో మంత్రులుగా చేరారు. అంతేగా ఢిల్లీలోని ఆప్ గవర్నమెంట్ వద్ద ఉన్న అవినీతి నిరోధక శాఖను కూడా రాజ్యాంగ విరుద్ధంగా దూరం చేశారు.

ప్రస్తుతం మోడీ ..రెండు పెద్ద వ్యాపారసంస్థల నుంచి లంచాలు తీసుకున్నారన్న తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారికమైన సాక్ష్యాలు కూడా ప్రభుత్వ విచారణ సంస్థల వద్ద ఉన్నాయి. ప్రధాన మంత్రి ఇంత వరకూ వీటిపై స్పందించలేదు. అలాంటి మోడీ ఇప్పుడు తాను అవినీతికి వ్యతిరేకమని.. దాన్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తరిమేస్తానని మోడీ చెబుతున్నారు. అదెలా సాధ్యం..? అయనను ఎలా నమ్ముతారు..? ఇది కూడా ఓ రకం రాజకీయమేనా..?. ప్రస్తుత పరిస్థితులపై దేశ ప్రజల అభిప్రాయాన్ని పోలరైజ్ చేస్తున్నారని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. మొత్తానికి మోడీ ఇప్పుడు కరప్షన్ పై పోరాడుతున్నట్లు షో చేస్తున్నారు. తాను అవినీతిని అంతమొందించడానికి పుట్టినట్లు ఇమేజ్ సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుత నిర్ణయం వల్ల లాభం జరుగుతుందో... అపరిమితమైన నష్టం జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేం. ఫలితాలు బయటపడటానికి కొంచెం సమయం పడుతుంది. చిల్లర నోట్ల కష్టాల నుంచి బయటపడిన తర్వాత ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచిస్తారు. ఇది అత్యంత కీలకమైన సమయం. ఒక్క మోడీకే కాదు. ప్రజలకు కూడా.. ! ఏం జరుగుతుందో వేచి చూద్దాం...

రచయితః అశుతోష్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags