ఇక ఫ్యూచర్ అంతా ఎం-కామర్స్‌దే..!!
ఈ కామర్స్ లెక్కలు మారుతున్నాయ్ ..!!
స్మార్ట్ ఫోన్ ఓ ఆధునిక సూర్యుడు..! ప్రపంచమంతా ఇప్పుడు దాని చుట్టే తిరుగుతోంది...!!
ఇదీ మొబైల్ ఎనలిస్ట్ బెనిడిక్ట్ ఇవాన్స్ 2015లో చెప్పిన మాట. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్టే ఇందుకు నిదర్శనం. 23.5 కోట్ల మంది జనాలు మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను అనుసంధానమవుతున్నారు. దీన్ని విశ్లేషిస్తే.. భారత్ కూడా ఈ-కామర్స్‌లో 'యాప్-కామర్స్' బాటపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మొబైల్ వెబ్‌సైట్లకు ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ.. యాప్‌లో వెసులుబాటే వేరు. పర్సనలైజేషన్ వల్ల యాప్ ద్వారా ఈ-కామర్స్ ప్లేయర్స్‌కు ఎక్కువ లాభం ఉంటుంది. కస్టమర్లతో నిత్యం టచ్‌లో ఉండడం, వాళ్లతో మెరుగైన కమ్యూనికేషన్ సహా బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా కస్టమర్ అభిరుచికి తగ్గట్టు ప్రోడక్ట్స్‌ను ఆఫర్ చేయడం యాప్‌లో ఉన్న ప్లస్ పాయింట్.
పెహ్లే యాప్
యాప్ అంటే ఏంటి.. దానివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి అని ఆంట్రప్రెన్యూర్లకు వివరించాల్సిన రోజులు ఎప్పుడో పోయాయి అంటారు అర్బన్ పైప్ సీఈవో సౌరభ్ గుప్తా.
''ఇప్పుడు చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా సొంత యాప్ కోసం పోటీపడ్తున్నాయి. అగ్రిగేటర్లకు రాయల్టీలు చెల్లించాల్సిన అవసరం ఉండకపోవడం ఒక కారణమైతే.. తమకు నచ్చినట్టు యాప్ డిజైన్ చేయించుకోవడం మరో ముఖ్యాంశం ''
మొబైల్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న భారత్ లాంటి దేశంలో ఎం-కామర్స్‌ను ఎవరు ముందుగా గ్రహించగలరో.. వాళ్ల నిలవగలరు. కానీ మౌలిక సదుపాయాల కొరత, చౌక మోడల్ స్మార్ట్ ఫోన్లు ఓ సవాల్. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటూ కొత్త అనుభూతిని పొందేందుకు మన దగ్గర సరైన బ్యాండ్ విడ్త్ లేదు.
అయితే యాప్ ఎకో సిస్టమ్ మన దేశంలో ఇప్పటికీ కొత్తే అంటున్నారు క్రాఫ్ట్ విల్లా ఫౌండర్ మనోజ్ గుప్తా. సరుకు కొన్న తర్వాత ఫోన్ నుంచి 65 శాతం మంది యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేస్తారనేది మనోజ్ విశ్లేషణ. కానీ ఇప్పటికీ తమ గ్రాస్ మర్కండైజ్ వేల్యూలో 25 శాతం మొబైల్ యాప్ నుంచే వస్తుందని చెప్తున్నారు. కన్వర్షన్ రేట్ కూడా 50-60 శాతం ఉందంటున్నారు మనోజ్.
అమ్మడం, కొనడంతోనే సరిపోదు
ఈ-కామర్స్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. ఈ-కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు పేమెంట్స్‌లోకి దిగిపోయాయి. కస్టమర్లకు ఎలాంటి అడ్డంకులూ లేని షాపింగ్ అనుభూతిని కలిగించేందుకు 2015లో ఫ్రీచార్జ్‌ను స్నాప్ డీల్ కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా పేమెంట్ సొల్యూషన్స్ కోసం సిద్ధమవుతున్నాయి.
మొబైల్ కామర్స్ భవిష్యత్తంతా మొబైల్ వాలెట్స్‌పై ఆధారపడి ఉంటుంది. రాబోయే 12 నెలల్లో ఈ రంగంలో పెనుమార్పులు సంభవించే సూచనలున్నాయి అంటారు మార్కెట్ ప్లేస్ సంస్థ లిటిల్ - ప్రోడక్ట్ వైస్ ప్రెసిడెంట్ విషీ అరోరా.
విభిన్నమైన సంస్థలు కూడా ఈ-కామర్స్ మార్కెట్లోకి అడుగుపెడ్తూ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తున్నాయి. తాజాగా ఫేస్ బుక్ తన పేమెంట్ గేట్‌వే కోసం సిట్రస్ పేతో ఒప్పందం కుదుర్చుకుంది. చైనాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. 2015 ఆన్ లైన్ కామర్స్ మార్కెట్లో 50 శాతానికిపైగా డీల్స్ మొబైల్ ప్లాట్‌ఫాం ద్వారా జరిగినవే. మెసేజింగ్ సంస్థ విచాట్ చైనాలో గేమింగ్, పేమెంట్స్, ఇంటర్నెట్ సర్వీసులతో తన పరిధిని మరింత విస్తరించుకుంది.
మార్కెటింగ్ గేమ్స్
బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌లో పెద్ద మార్పులు ఏవీ చేయాల్సిన అవసరం లేకుండానే కస్టమర్లను హైలెవెల్‌లో టార్గెట్ చేయవచ్చు. స్నాప్ డీల్ వంటి సంస్థలు ఇప్పుడిప్పుడే ఈ విషయాలను అర్థం చేసుకుంటూ జియోట్రాకింగ్ వంటి ఫీచర్స్ జత చేస్తున్నాయి.
ఇప్పుడు లైట్ యాప్స్ తయారు చేసి ఇవ్వాలని యాప్ డెవలపర్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది. తక్కువ లోడింగ్ టైం, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. లొకేషన్ ఆధారిత టార్గెట్ ప్రమోషన్, ఆఫర్స్ కావాలని మా ఎస్ఎంఈ కస్టమర్లు కోరుకుంటున్నారు అంటారు అర్బన్ పైపర్ సౌరభ్.
ఇప్పుడు యాప్ స్పేస్ కూడా చాలా ముఖ్యమవుతోంది. అర్బన్ ల్యాడర్ మొదటిసారిగా మూడు రకాల యాప్స్‌తో ముందుకొచ్చింది. వీటిల్లో ప్రధాన యాప్ సైజ్ 5ఎంబి కంటే తక్కువే. షాప్ క్లూస్ కూడా లైటర్ యాప్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాత కస్టమర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని చూస్తోంది. అయితే యాప్ సైజ్ కంటే కంటెంట్ ముఖ్యమనేది పేటిఎం అభిప్రాయం. తమ మొబైల్ ఆర్డర్స్ రెండేళ్లలో యాభై నుంచి 80 శాతానికి పెరిగాయని అంటున్నారు పేటిఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాథ్.
ప్రాంతీయ భాషల్లోకి
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఆర్డర్లు పెరగడం వల్ల ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పుడు స్థానిక భాషలపై దృష్టిసారించాయి. స్నాప్ డీల్ డిసెంబర్ 2015లో వివిధ బాషలతో కూడిన ఇంటర్‌ఫేస్ లాంఛ్ చేసింది.
హిందీ, తెలుగు వెర్షన్స్ లేనప్పుడు కూడా స్నాప్ డీల్ గురించి చాలామందికి తెలుసు. ఇంటర్నెట్‌తో తమ మాతృభాషకు కనెక్ట్ కావాలి. అప్పుడే జనాలు ఆ వస్తువు లేదా సేవను తమదిగా భావిస్తారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ భాషల మార్కెట్ విస్తృతంగా వృద్ధి చెందబోతోంది.
పేటీఎం, వూనిక్ కూడా ఇప్పుడు ఇదే దారిపట్టాయి. ఇంగ్లిష్ సౌకర్యంగా లేని కస్టమర్లు సులువుగా అర్థం చేసుకునే విధంగా ఇంటర్‌ఫేస్ రూపొందిస్తున్నాయి. హిందీ సహా దక్షిణాది భాషల్లో తమ యాప్స్, కంటెంట్ గురించి చాలా కంపెనీలు ఆలోచిస్తున్నాయి.
మారితేనే మనుగడ
ఇండస్ట్రీ నెంబర్లే ఇందుకు నిదర్శనం. మారకపోతే మునిగిపోవడం ఖాయం. యాప్, మొబైల్ వెబ్‌సైట్ ద్వారా షాప్ క్లూస్‌కు 70 శాతం బిజినెస్ జరుగుతోంది. గతంతో పోలిస్తే ఇది 200 శాతానికిపైగా వృద్ధి. స్నాప్‌డీల్‌కు ఏడాదిన్నర క్రితం 90 శాతం ఆర్డర్లు డెస్క్ టాప్ ద్వారానే వచ్చేవి. ఇప్పుడు అది 25 శాతానికి పడిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌కు వచ్చే ఆర్డర్లలో ఇప్పుడు 75 శాతం వాటా యాప్‌దే.
అయితే నెంబర్లను చూసే వృద్ధి జరుగుతోందని చెప్పలేం. వాళ్లు మొబైల్ ప్లాట్‌ఫాంను ఎలా వినియోగించుకుంటున్నారనేదే ముఖ్యం. 2015లో మింత్రా, వూనిక్ సంస్థలు తమ డెస్క్‌టాప్ వెబ్ సైట్లను మూసేసి యాప్‌లకే పరిమితమయ్యాయి. అధిక డిస్కౌంట్లు ఇస్తూ 'యాప్ ఓన్లీ' ఫార్మాట్‌కు ఫిక్స్ అయ్యాయి. అయితే స్మార్ట్‌ఫోన్లలో ఉన్న పరిమితి వల్ల ఒకటి రెండు ట్రాన్సాక్షన్ల తర్వాత యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు.
ఇవన్నీ చూస్తే... యాప్ కామర్స్ పరిధి నానాటికీ విస్తృతమవుతోంది. మొబైల్ టెక్నాలజీ కూడా బెటర్ అవుతోంది. వర్చువల్ రియాల్టీ, మొబైల్ వాలెట్స్, జియో ట్రాకింగ్ వంటివి మరింత ఆకర్షణ తెస్తున్నాయి. వివిధ బాషల కంటెంట్, లైట్ యాప్స్ వీటికి అదనపు హంగులు ఇస్తున్నాయి. ఈ-కామర్స్ ఇప్పుడు ఎం-కామర్స్‌గా మారబోతోందా లేదా అనేది ప్రశ్న కానేకాదు. ఇలా రూపాంతరం చెందేందుకు ఇంకా ఎంతకాలం పడుతుంది అనేదే చర్చనీయాంశం.
రచయితలు - అథిరా నాయర్, హర్షిత్ మాల్యా
అనువాదం - చాణుక్య
Graphics by Gokul K and Aditya Ranade