సంకలనాలు
Telugu

పనికిరాని బీడు భూముల్లో డబ్బులు పండిస్తున్న నలుగురు ఇంజినీర్లు !

వ్యవసాయాన్నే నమ్ముకున్న నలుగురు ఇంజినీర్ల కథ

team ys telugu
26th Mar 2015
Add to
Shares
12
Comments
Share This
Add to
Shares
12
Comments
Share


తెలిసి తెలిసి ఈ రోజుల్లో ఎవరైనా వ్యవసాయం చేస్తారా? పంటలూ, పొలాలు అంటూ లక్షల రూపాయలను పెట్టుబడిగా పెడతారా? తెలిసో తెలియకో ఒక్కసారి పెట్టుబడి పెడితే లాభం రాకున్నా సరే నష్టపోకుండా ఉంటే అదే పదివేలు అనుకునే రోజులివి. కానీ నలుగురు ఇంజనీర్లు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. కాసుల్ని పండిస్తున్నారు. చెట్లకు డబ్బులు కాస్తాయన్న మాటల్ని నిజం చేస్తున్నారు. ఓ వైపు పర్యావరణానికి మేలు చేస్తూ, మరోవైపు తమ ప్రాజెక్ట్ ను లాభాల బాటలో నడిపిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటీ? ఎవరా ఇంజనీర్లు?

హోసచిగురు... నలుగురు ఇంజనీర్ల బుర్రలో మొలకెత్తిన గ్రీన్ ప్రాజెక్ట్ ఇది. పనికిరాకుండా పడి ఉన్న బీడు భూములను పచ్చగా కళకళలాడేలా చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతోంది ఈ ప్రాజెక్ట్. డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అని ప్రశ్నించే వారికి సమాధానం ఈ ప్రాజెక్ట్. చెట్లకు డబ్బులు కాయకపోయినా... చెట్లను నమ్ముకుంటే కాసులు కురిపిస్తాయని రుజువు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే...సాగుకు ఉపయోగపడే స్థలాన్ని కొనడం, రియల్ ఎస్టేట్ వెంచర్ గా అభివృద్ధి చేయడం, కస్టమర్లకు అమ్మెయ్యడం, తర్వాత అదే స్థలంలో శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు పండించడం, చివర్లో లాభాలు పంచుకోవడం... ఇదీ ప్రాజెక్ట్ పని చేసేతీరు. సరిగ్గా ఇలాగే అనంతపురం జిల్లా గోరంట్లలో 31 ఎకరాల భూమిని తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి, కస్టమర్లను భాగస్వాములుగా చేసి, బొప్పాయి దానిమ్మ పంటల్ని పండిస్తున్నారు. స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తున్నారు.

నలుగురు ఇంజనీర్లు... నలుగురిదీ వేర్వేరు నేపథ్యం. కొన్నేళ్ల క్రితం వారి మదిలో ఈ ప్రాజెక్ట్ మొలకెత్తింది. హోసచిగురు అని నామకరణం చేశారు. పట్టణప్రాంతంలో పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గరికెళ్లి తమ ఐడియాను వివరించారు. కార్పొరేట్ కంపెనీల మేనేజర్లు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు... ఇలా అందరిదగ్గరికెళ్లి తమ ప్రాజెక్ట్ గురించి వివరించారు. చాలా మందికి ఈ ఐడియా నచ్చింది. సాగుకు కావాల్సిన భూమిని కొనడం, అభివృద్ధి చెయ్యడం, చెట్లను పెంచడమంతా హోసచిగురు టీమ్ చూసుకుంటుంది. కేవలం కస్టమర్లు పెట్టుబడి పెడితే చాలు. మంచి లాభాలొస్తాయి. ఈ ఫార్ములా వర్కవుట్ కావడంతో చాలా మంది స్థలాల్ని కొన్నారు. హోసచిగురు ప్రాజెక్ట్ కు లీజుకిచ్చారు. ఆ స్థలాల్లో బొప్పాయి, దానిమ్మ లాంటి చెట్లతో పాటు చందనం చెట్లను పెంచడం ద్వారా బోలెడన్ని లాభాలు. వచ్చిన లాభాల్ని అంతా కలిసి పంచుకున్నారు. "చెట్లను పెంచడం ద్వారా ప్రతీ కస్టమర్ కు ఏటా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. దానికి తోడు స్థలం విలువ పెరుగుతుంది. దీంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తున్నామన్న సంతృప్తి మిగులుతుంది. కస్టమర్లకు కూడా వ్యవసాయంపై అవగాహన పెరుగుతుంది." ఇదీ హోసచిగురు హెడ్ శ్రీనాథ్ శెట్టి చెప్పే మాట.

image


ప్రాజెక్ట్ ఎందుకు సక్సెస్ అయింది ?

హోసచిగురు ప్రాజెక్ట్ క్లిక్ అవడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులన్నీ హైవేకు దగ్గర్లో ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాల్యూ పెరుగుతుంది తప్ప తగ్గదు. పది నుంచి పదిహేనేళ్ల పాటు లీజుకు ఇవ్వొచ్చు. ఆ తర్వాత లీజ్ ను కొనసాగించొచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. యజమానులు వారి ప్లాట్లలో ఫామ్ హౌజ్ లు నిర్మించుకోవచ్చు. లేదా మంచి ధర వస్తే అమ్ముకోవచ్చు. వీఆర్ సత్యనారాయణ హోసచిగురు ప్రాజెక్ట్ లో ఓ కస్టమర్. ఈయనను అడిగితే ఇది మంచి ఐడియా అంటున్నారు. కన్స్యూమర్ వరల్డ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సత్యనారాయణకు వ్యవసాయంపై అస్సలు ఆసక్తి లేదు. కానీ గోరంట్లలో హోసచిగురు ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టేందుకు అందరికంటే ముందు ఉత్సాహం చూపించింది ఆయనే. వ్యాపార కోణం మాత్రమే కాదు... మరో విషయం ఆయన్ను బాగా ఆకర్షించింది."అవును. ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెడితే కొంత భూమి నా సొంతం అవుతుంది. దానికి తోడు భూమాత మంచి కోసం నా వంతు కృషి చేస్తున్నానన్న సంతృప్తి మిగులుతోంది. నా స్థలంలో చెట్లను పెంచుతారు. కాబట్టి పచ్చని వాతావరణానికి, పర్యావరణానికి, స్వచ్ఛమైన గాలిని అందించడానికి నేను కృషిచేస్తున్నట్టే " అంటారాయన.

అనంతపురం జిల్లా గోరంట్లలో ఎకరా భూమి ధర 14 లక్షల రూపాయలు. దాంట్లో ఆరున్నర లక్షలను అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తారు. మిగతా ఏడున్నర లక్షలు భూమి ధర. రెండో ఏడాది బొప్పాయి, మూడో ఏడాది దానిమ్మ పండించాలని ముందే ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి దశలో భాగంగా 31 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. తర్వాత మరో వందెకరాలు లీజుకు తీసుకోవాలని నిర్ణయించారు. గోరంట్లలోనే కాదు... అనేక చోట్ల హోసచిగురు టీమ్ అడుగు పెట్టింది. ఇప్పటివరకు హోసచిగురు ప్రాజెక్ట్ లో భాగంగా వందల ఎకరాల బీడు భూముల్ని పచ్చని పొలాలుగా మార్చారు. వీరి ప్రాజెక్ట్ లో వందల సంఖ్యలో కస్టమర్లున్నారు. వారిలో ఒకరు విప్రో కంపెనీలో పనిచేసే ముఖేష్ కుమార్. ఈయన గోరంట్ల ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టారు. ఆయన కొన్న స్థలంలో చందనాన్ని పండిస్తున్నారు. దాంతో పాటు దానిమ్మ, మునగ చెట్లను పెంచుతున్నారు. బెంగళూరులోని హెచ్ సీజీ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ కేవీ మరో ఇన్వెస్టర్. "వృత్తిపరంగా డాక్టర్ అయిన నాకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని కాపాడటం లాంటి విషయంలో ఆసక్తి ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ రూపంలో నాకో మంచి అవకాశం దొరికింది. నేను కూడా రైతును అన్న ఆనందం కలుగుతుంది. నేను కూడా పర్యావరణం కోసం కృషి చేస్తున్నానన్న సంతృప్తి మిగుల్తోంది." ఈ సంతృప్తికి తోడు ఆయన పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం లభిస్తోంది.

image


వ్యవసాయమూ ఓ పరిశ్రమే !

కర్నాటక రాష్ట్రంలోని రాయిచూర్ లో ఓ రైతు కుటుంబానికి చెందిన శ్రీనాథ్ హోసచిగురు సహ వ్యవస్థాపకుల్లో ఒకరు . ఇంజనీరింగి పూర్తి చేశాడు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ కూడా. ఎకరమో, రెండెకరాల స్థలంలో వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆర్థిక కష్టాలు తప్పవని శ్రీనాథ్ కు బాగా తెలుసు. వ్యవసాయాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా చేయడం లాభదాయకం కాదని శ్రీనాథ్ కు తెలుసు. అనేక శాస్త్రీయ పద్ధతులు, వాణిజ్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో వ్యవసాయంలో లాభాలు సాధించడం అంత సులువు కాదంటారాయన. హోసచిగురు సహవ్యవస్థాపకుల్లో మరొకరు శ్రీరామ్ చిట్లూరు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారాయన. స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్ విభాగానికి సీఈఓ, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న హేమంత్ ప్రకాష్ ఐఐటియన్. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో సహజ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు విభాగాల్లో ఆరేళ్ల అనుభవం ఉంది. ఈ టీమ్ లో మరొకరు అశోక్ జయంతి... అగ్రికల్చరల్ ఎక్స్ పర్ట్. మట్టి లేకుండా మొక్కల్ని పెంచే పద్ధతులు, టేకు, ఉద్యానవనం లాంటి అంశాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. హోసచిగురుకు వ్యవసాయ పద్ధతులను వివరిస్తుంటారు. వీరితో పాటు అయ్యప్ప మాసగి, డాక్టర్ హెచ్ఎస్ అనంత పద్మనాభ, డాక్టర్ నారాయణ స్వామి లాంటి వాళ్లు అడ్వైజర్లుగా ఉన్నారు. ఇరిగేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సాండల్ వుడ్ ఫార్మింగ్ లాంటి విషయాల్లో సలహాలిస్తుంటారు. ఈ బృందమంతా కలిసి ఇప్పటి వరకు 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. మరో 250 ఎకరాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్నారు. 

image


నేలతల్లిని నమ్ముకుంటే ఎవరూ నష్టపోరని నిరూపిస్తున్నారు ఈ ఇంజనీర్లు. హోసచిగురు ప్రాజెక్ట్ ను మూడు పువ్వులు ఆరు కాయలుగా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.

Add to
Shares
12
Comments
Share This
Add to
Shares
12
Comments
Share
Report an issue
Authors

Related Tags