సంకలనాలు
Telugu

రూ.200 పెట్టుబడి + క్రియేటివిటి = కోటి రూపాయల బిజినెస్

3rd Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

తనతో పాటు చదివే విద్యార్థులకు నాలుగు డబ్బులు మిగల్చాలనే తాపత్రయం. ఆన్ లైన్ రంగంలో ఏదో ఒకటి చేయాలనే తపన. చదివేది ఎలక్ట్రానిక్స్ అయినా.. కంప్యూటర్ సైన్స్ అంటే లోలోపల ఏదో తెలియని అభిమానం. ఇవన్నీ వెరసి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఓ వినూత్న డిస్కౌంట్, కూపన్స్, క్యాష్ బ్యాక్ వెబ్‌సైట్ రూపకల్పనకు ప్రోత్సహించాయి. కేవలం రూ.200 పెట్టుబడితో డొమైన్ కొనుగోలు చేసి... తనకు తాను రీసెర్చ్ చేసి కోడింగ్ రాసుకుంటూ.. ఇప్పుడు కోటి రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఓ విద్యార్థి ఎదిగాడు. ఇప్పటికీ ఇంకా కాలేజీలో ఉదయం క్లాసులకు వెళ్తూ.. తీరిక వేళల్లో బిజినెస్ ప్లాన్స్ రచిస్తున్నారు. చదువు పూర్తికాకముందే ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.

imageమందడపు జీవన్ చౌదరి ఓ హైదరాబాదీ విద్యార్థి. ట్రిపుల్ ఐటీలో ఎలక్ట్రానిక్స్‌లో మూడో సంవత్సరం చదువుతున్నారు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి షాపింగ్, కిరాణా కొట్టుకు వెళ్లి సరుకులు తీసుకురావడంలో కొద్దిగా చురుగ్గా ఉండేవాడు. ఇంటి దగ్గర ఉన్న ఓ పచారీ కొట్టుకు తరచూ వెళ్లడం వల్ల మొదట్లో కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు ఫ్రీగా వచ్చేవి. ఆ తర్వాత వయస్సుతో పాటే డిస్కౌంట్లు కూడా పెరిగాయి. ప్రతీ సారీ బిల్లు మీద కొంత మొత్తాన్ని తగ్గించేవారు. అప్పుడే అతనిలో ఓ బిజినెస్ ప్లాన్ తయారైంది. తరచూ ఒకరి దగ్గరికి వెళ్లడం వల్ల మనకూ.. వాళ్లకూ ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని అనిపించింది.

ఇక మెల్లిగా చదువుల వేటలో భాగంగా ట్రిపుల్ ఐటీలోకి వచ్చి పడ్డాడు జీవన్. అయితే చిన్నప్పటి నుంచీ తనకేమో కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం. కానీ సీట్ వచ్చింది మాత్రం ఎలక్ట్రానిక్స్‌లో. చేసేది లేక జాయిన్ అయిపోయాడు. రోజులు, నెలలు గడుస్తున్నాయే కానీ ఇంట్రెస్ట్ మాత్రం లేదు. సెలవుల్లో సరదాగా కంప్యూటర్ సైన్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కోడింగ్‌పై ఆసక్తి పెరగడంతో తండ్రి నుంచి రూ.200 తీసుకుని ఓ వెబ్ సైట్‌ డొమైన్ కొనుగోలు చేశాడు. అదే 'షాపర్స్ ఎక్స్‌ప్రెస్'.

image


సాధారణంగా ట్రిపుల్ ఐటి, బిట్స్ వంటి కాలేజీల్లో చదుపుకునే విద్యార్థులకు బయటకు వెళ్లి షాపింగ్ చేసే తీరిక కాస్త తక్కువే. బడ్జెట్ కూడా అంతంతమాత్రమే. అందరూ తల్లిదండ్రులపై ఆధారపడే వాళ్లే కాబట్టి ఆచితూచి కొంటూ ఉంటారు. వీళ్లతో 70-80 శాతం మంది ఇప్పుడు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారనే విషయాన్ని జీవన్ గమనించాడు. కానీ చాలా మంది డిస్కౌంట్ కూపన్లు, ఆఫర్ల కోసం అనేక సైట్లు చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారని తెలుసుకున్నాడు. అప్పటికే మార్కెట్లో కుప్పలుతెప్పలుగా అనేక ఈ-కామర్స్ సైట్లు ఉన్నా ఈ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. కేవలం తమలాంటి విద్యార్థులు ప్రయోజనం పొందితే చాలనే ఉద్దేశంతో ఈ సైట్ మొదలుపెట్టాడు. ఆగస్ట్ 2014లో షాపర్స్ ఎక్స్‌ప్రెస్ మొదలైంది. అమెజాన్, ఫ్లిప్ కార్డ్, పేటిఎం, జబాంగ్, ఫుడ్ పాండా, కెఎఫ్‌సి వంటి 450 సైట్లను అనుసంధానం చేశారు. ఏదైనా సైట్లోకి కొనాలని అనుకున్నప్పుడు డైరెక్టుగా వారి దగ్గరకి వెళ్లకుండా వీళ్ల వేదిక నుంచి వెళ్లి కొనుగోలు జరపాల్సి ఉంటుంది. సదరు సైట్ ఇచ్చే కమిషన్‌ను వీళ్లు విద్యార్థులకు, కస్టమర్లకు డిస్కౌంట్ కూపన్స్, క్యాష్ బ్యాక్‌గా తిరిగి ఇచ్చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్స్ అన్నిటినీ కలిపే ఒక వేదిక. అంతే కాదు.. ప్రస్తుతానికి కమిషన్ కోసం ఆశపడకుండా వాటిని తిరిగి ఇచ్చేయడం కూడా స్పెషాలిటీ. దీని వల్ల రిపీటెడ్‌గా కస్టమర్లు వస్తున్నారు.

image


ఇప్పటివరకూ కమిషన్ ద్వారా వచ్చిన 8 లక్షల ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్ల రూపంలో కస్టమర్లకే ఇచ్చేసినట్టు జీవన్ వివరించారు. వీటితో పాటు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఒక్కో రూపాయి చొప్పున ఎన్జీఓకి కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.20 వేల వరకూ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చారు.

విద్యార్థులంతా కస్టమర్లైపోయారు

ఆగస్ట్ 2014లో షాపర్స్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైనప్పటి నుంచే జోరు కనిపించింది. విద్యార్థులంతా ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ మొదటి నెలలోనే వెయ్యి మంది యూజర్స్ వచ్చారు. ఆ తర్వాత స్టూడెంట్ కమ్యూనిటీ దీన్ని తమ సొంత ప్రొడక్ట్‌గా భావిస్తూ.. మార్కెట్ చేశారు. 

'' నవంబర్‌లో అనూహ్యంగా ట్రాఫిక్ కూడా పెరగడంతో ఓ సారి సైట్ హ్యాక్ కూడా అయింది. డేటా అంతా పోయింది. నాకు దిమ్మతిరిగినంత పనైంది. ఎందుకంటే నేను కేవలం 'రా టెక్నాలజీ'తోనే సైట్ డిజైన్ చేశాను. కోడింగ్ సహా సెక్యూరిటీ ఇష్యూస్‌లో నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అప్పుడే అర్థమైంది. బ్యాకప్ ఉండడంతో అప్పుడు గండం గట్టెక్కింది. సౌమిత్, రోహిత్ రెడ్డి, ఎస్‌వికె రోహిత్, రాజశేఖర్ రెడ్డి వంటి మిత్రుల సహకారంతో సైట్ రీడిజైన్ చేసి జనవరి 2015న మళ్లీ రీలాంచ్ చేశాం ''.

డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ

విద్యార్థులనే టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తోంది షాపర్స్ ఎక్స్‌ప్రెస్. ప్రస్తుతానికి 70 కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. ఒక్కో కాలేజీలో ఒక ఎంబాసిడర్‌ను నియమించుకున్నారు. వాళ్ల ద్వారా తమ వెబ్ సైట్‌ను మార్కెట్ చేస్తున్నారు. ఆ ఎంబాసిడర్‌కు డిస్కౌంట్స్, క్యాష్ కూపన్లకు ఇవ్వడం వల్ల లాయల్ కస్టమర్లుగా మారడమే కాకుండా మౌత్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారని జీవన్ వివరించారు. త్వరలో 300 కాలేజీలకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఒక్కో కాలేజీ నుంచి వెయ్యి మంది స్టూడెంట్స్ సైన్ ఇన్ అయి.. కొనుగోళ్లు జరిపినా బిజినెస్ గ్రోత్ అనూహ్యంగా ఉంటుందనేది వీళ్ల ఆలోచన.

ప్రస్తుతం షాపర్స్‌ ఎక్స్‌ప్రెస్‌కు 15,000 మంది రిజిస్టర్డ్ యూజర్లతో పాటు ఫేస్ బుక్‌లో దాదాపు 10,000 మంది వరకూ ఫ్యాన్స్ ఉన్నారు. రోజుకు కనీసం 200-300 ఆర్డర్లు తమ సైట్ ద్వారా ట్రాన్సాక్ట్ అవుతాయని టీమ్ చెబ్తోంది.

ప్రస్తుతం కొండా మురళి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. జీవన్ స్నేహితులైన రామ్ మనోజ్, అరవింద్ పాడూరు, వంశీ పాలభట్ల, అయులూరి అరవింద్ కూడా టీంలో సభ్యులుగా ఉన్నారు.

image


ఇప్పటి వరకూ అంతా బూట్ స్ట్రాప్డ్‌గా నడుస్తున్న ఈ స్టార్టప్‌లో టెక్నికల్, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేందుకు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఇంక్యుబేషన్ హబ్ (సిఐఈ) నుంచి స్టార్టప్‌ నడుస్తోంది.

ఫ్యూచర్ ప్లాన్స్

2016 నాటికి 10 లక్షల మంది యూజర్స్‌ బేస్‌కు చేరడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది షాపర్స్ ఎక్స్‌ప్రెస్ టీం. ఈ డిసెంబర్ నాటికి కొత్త యాప్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ సెగ్మెంట్‌ను కూడా ఆకర్షించేలా యాప్ ఉంటుందని టీమ్ చెబ్తోంది. ఆఫ్ లైన్ కొనుగోళ్లకు కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తూ, పిఓఎస్ సమస్యలను కూడా దూరం చేసేలా తమ యాప్ ఉంటుందని చెబ్తున్నారు. ఎనిమిది నెలలుగా 11 మంది టీమ్ ఈ యాప్ పై పనిచేస్తోందని.. త్వరలో దీన్ని లాంఛ్ చేస్తామని షాపర్స్ ఎక్స్‌ప్రెస్ ఫౌండర్ జీవన్ వివరించారు.

యూఎస్ వెళ్లి ఎంఎస్ చేద్దామని గతంలో అనుకున్న జీవన్ ఇప్పుడు ఆ ప్లాన్‌ను విరమించుకున్నారు. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ పూర్తి చేసి బిజినెస్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ చదివి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో సక్సెస్ సాధించడం తనకే ఆశ్చర్యంగా ఉందని చెప్తారు జీవన్. ప్యాషన్ ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. డొమైన్ కొనుగోలుకు రూ.200 మాత్రమే ఖర్చు చేసి ఉండొచ్చు, కానీ దాని వెనుక ఆలోచన, మార్కెటింగ్ స్ట్రాటజీ, విద్యార్థులకు నాలుగు డబ్బులు మిగిలేలా చేయాలనే ఆలోచన ఈ ఐడియాను సక్సెస్ చేసింది.

షాపర్స్ ఎక్స్‌ప్రెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కొంత మంది ముందుకు వచ్చారని, తమకు పూర్తి క్లారిటీ వచ్చాక ఒక డెసిషన్ తీసుకుంటామని జీవన్ ముగించారు.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి