రోగ నిర్ధారణ ఖర్చులను భారీగా తగ్గిస్తున్న ‘మెడ్.ఇన్’ యాప్

రోగ నిర్ధారణ ఖర్చులను భారీగా తగ్గిస్తున్న ‘మెడ్.ఇన్’ యాప్

Friday November 20, 2015,

4 min Read

ముగ్గురు ఐఐటీ-బాంబే విద్యార్థులు రూపొందించిన ఓ హెల్త్ కేర్ యాప్ మధ్యతరగతి వైద్యఖర్చులను భారీగా తగ్గించేస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షలు, మందులను తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తోంది. నకిలీ వైద్యులు, డయాగ్నస్టిక్ సెంటర్ల బారిన పడకుండా కాపాడుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ యాప్ ఇప్పుడు ముంబై వాసులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

image


ఈ మధ్య గల్లీకో డయాగ్నస్టిక్ సెంటర్ వెలుస్తోంది. రోగ నిర్ధారణ పేరుతో వేలల్లో వసూలు చేస్తూ సామాన్యుల జేబులను కొల్లగొడుతున్నాయి. పోనీ అవైనా ప్రామాణికమా అంటే అదీ లేదు. ఈ దోపిడీకి ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నారు బాంబే ఐఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు. వీరికి కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఎరా ద్వివేదీ కూడా జతకలిశారు. నలుగురు కలిసి Medd.in పేరుతో ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్, వెబ్ సైట్ క్రియేట్ చేశారు. ఇందులో దగ్గర్లోని ప్రామాణికమైన డయాగ్నస్టిక్ సెంటర్ల పూర్తి వివరాలు, వివిధ రోగ నిర్ధారణ పరీక్షలకయ్యే ఖర్చు వివరాలను అందుబాటులో ఉంచారు. అంతేకాదు తమ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నారు. సర్టిఫికేషన్ ఉన్న వివిధ డయాగ్నస్టిక్ సెంటర్లు, అక్కడి ధరలు కూడా తెలుస్తుండటంతో ఏది ఉత్తమమో తేల్చుకునే సదుపాయం వినియోగదారులకు కలుగుతుంది. ఈ మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది జూన్ లో ఆవిష్కరించిన నిర్వాహకులు.. ఇప్పుడు ముంబైలోనూ తమ కార్యకలాపాలను మొదలుపెట్టారు. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిన నేపథ్యంలో రోగులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మోసపూరిత ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల బారిన పడకుండా, అనవసర రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా అవగాహన కల్పిస్తోంది.

image


ఎలా పనిచేస్తుందంటే..

ఈ సర్వీస్‌ను వినియోగించుకోవాలంటే ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి medd.in అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. లేదా www.medd.in వెబ్ సైట్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే రక్త పరీక్షలు, ఎమ్మారై, సీటీ స్కాన్లు, సోనోగ్రఫీ, ఈసీజీలాంటి వాటిపై కనీసం 20 శాతం తగ్గింపు పొందే అవకాశం కూడా ఉండటం విశేషం. యాప్ లోకి వెళ్లి కావాల్సిన రోగ నిర్ధారణ పరీక్షను ఎంపిక చేసుకుంటే చాలు ఆ సేవలు అందించే డయాగ్నిస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ వివరాలు తెలుసుకోవచ్చు. వివిధ సెంటర్లలో దానికయ్యే ఖర్చుతోపాటు వాటి అక్రిడిటేషన్, లొకేషన్, యూజర్ రివ్యూలు కూడా అందుబాటులో ఉంటాయి. అందులోంచి మనకు అత్యుత్తమంగా అనిపించిన డయాగ్నిస్టిక్ సెంటర్‌ను ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవచ్చు. యాప్, వెబ్ సైట్‌తోపాటు వినియోగదారుల సందేహాలు తీర్చడానికి ఓ కాల్ సెంటర్‌ను కూడా నడిపిస్తున్నారు. భవిష్యత్‌లో తగ్గింపు ధరలపై మందులను కూడా సరఫరా చేయాలని భావిస్తున్నారు.

image


ఐఐటీని మధ్యలోనే మానేసి..

Medd.in యాప్ హోలామెడ్ హెల్త్ కేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఉత్పత్తి. దీనిని స్థాపించింది ముగ్గురు బాంబే ఐఐటీ విద్యార్థులు. వారి పేర్లు అర్పిత్ కొఠారి, అనురాగ్ ముందాడ, ఆకాశ్ దీప్ సింఘాల్. ఈ ముగ్గురితోపాటు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఎరా ద్వివేది కలిసి ఈ యాప్ రూపొందించారు. వీరంతా కలిసి సుమారు లక్ష మంది రోగుల హెల్త్ కేర్ ఖర్చులపై అధ్యయనం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆన్ పబ్లిక్ హెల్త్, ఐక్యరాజ్యసమితి పబ్లిక్ హెల్త్ పై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో తమ పరిశోధన ఫలితాలను ఉంచారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి వెబ్ సైట్ రూపొందించే దిశగా పని ప్రారంభించారు. అజీత్ ఖురానా అనే వ్యక్తి పెట్టుబడి పెట్టారు. మేలో రిజిస్టర్ చేసుకున్న వీరు.. జూన్‌లో ఇండోర్‌లో ప్రయోగాత్మకంగా యాప్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఏడుగురు వ్యక్తులు ఈ యాప్‌ను నడిపిస్తున్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు తమ ఉద్యోగాలను వదులుకొని ప్రస్తుతం ఉచితంగా ఈ యాప్‌కు సేవలు అందిస్తున్నారు. రోగ నిర్ధారణ, మందులపైనే తాము ప్రత్యేకంగా దృష్టిసారించడానికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు ఈ యాప్ సృష్టికర్త అర్పిత్ కొఠారి. ‘డాక్టర్ అపాయింట్‌మెంట్‌తో పోలిస్తే రోగ నిర్ధారణ, మందుల విషయంలో ఎంతోకొంత ఆదా చేసుకొనే వీలు ఉంటుంది. అంతేకాదు మార్కెట్లో ప్రామాణికం కాని ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్లు, నకిలీ మందులు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. వీటిలో ఏది ప్రామాణికమో తేల్చుకోవడం కష్టతరమవుతుంది. గతంలో ఎన్నో డయాగ్నస్టిక్ సెంటర్లతో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉండటంతో వాటి ప్రామాణికతపై అవగాహన ఉంది. బాంబే ఐఐటీలోని సెంటర్ ఫర్ అర్బన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో నా రీసెర్చ్ పూర్తిచేశాను. ఆ తర్వాత నాతో అనురాగ్, ఆకాశ్, ఎరా జతకలిశారు. నా అధ్యయనంలో డాక్టర్ వినీత ఎంతగానో తోడ్పడ్డారు’ అని అర్పిత్ చెప్పారు. ‘ఒకే నగరంలో ఉన్న వివిధ డయాగ్నస్టిక్ సెంటర్లలో వివిధ ధరలు ఉన్నాయి. ప్రామాణిక ధర లేకపోవడం దీనికి ప్రధాన కారణం. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబొరేటరీస్ గుర్తింపు ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్లలో ఓ పరీక్షకు 250 ఖర్చయితే.. అదే మరో తక్కువస్థాయి సెంటర్ లో 500 వరకూ అవుతోంది. అవగాహన లేకపోవడంతో రోగులు తమ విలువైన డబ్బు, ఆరోగ్యం కోల్పోతున్నారు’ అని యాప్ కో ఫౌండర్ అనురాగ్ చెబుతున్నారు. తమ అప్లికేషన్ మెడికల్ బిల్స్‌ను తగ్గించడంతోపాటు వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పిస్తోందని మరో కోఫౌండర్ ఆకాశ్ దీప్ సింఘాల్ చెప్పారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబొరేటరీస్ గుర్తింపు ఉన్న, ప్రముఖ జాతీయస్థాయి డయాగ్నస్టిక్ సెంటర్లను మాత్రమే యాప్ లో అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ప్రామాణిక సెంటర్లు ఏవో వినియోగదారులు తెలుసుకోగలుగుతున్నారు. ‘మా యాప్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఎవరైనా చాలా సులువుగా వాడుకోవచ్చు. అత్యాధునిక టెక్నాలజీ వాడటం కూడా ఇతరుల కన్నా మమ్మల్ని ముందుంచుతోంది’ అని ఎరా ద్వివేది తెలిపారు. ఇండోర్, ముంబైలలో ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరుగుతోంది. 2020 నాటికి మన దేశంలో హెల్త్ కేర్ మార్కెట్ 280 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న సర్వే ఫలితాలు మెడ్.ఇన్ యాప్ నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. భవిష్యత్తులో తమ యాప్ మరింత విజయవంతమవుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు.