మృత్యువుకే సవాల్ విసిరిన నీలమ్...!!

రెండు కేన్సర్లు.. అనేక విజయాలు..

మృత్యువుకే సవాల్ విసిరిన నీలమ్...!!

Friday January 08, 2016,

5 min Read

జీవితం మూడు పూలు ఆరు కాయలుగా వెలిగిపోవాలనుకుంటారంతా.. నిజమే, లైఫంటే ఓ సెలబ్రేషన్ లా... కలర్ ఫుల్ గా సాగిపోవాలని ఆశించటం మానవ నైజం. కానీ, రేపటి రోజులో మనకోసం ఏ సర్ ప్రైజ్ దాచి ఉందో... అది సెవెంత్ హెవెన్ లో నిలబెడుతుందో, లేదంటే పట్టరాని దు:ఖంలో ముంచుతుందో ఎవరూ ఊహించలేరు. ఇది సత్యం. కానీ, మిన్నువిరిగి మీదపడ్డా చలించకుండా ఉండగలగటం, కాళ్ల కింద భూమి కదులుతుంటే నిబ్బరంగా రేపటిని కలలు కనడం కొందరికి మాత్రమే సాధ్యం. సింపుల్ గా చెప్పాలంటే మృత్యువుకు సవాల్ విసిరి రేపు నాది అని ధైర్యంగా ప్రకటించే ధీశాలురు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు నీలమ్ కుమార్.

ఆమె గెలవటం కోసమే పుట్టింది...

ఆమె గెలవటం కోసమే పుట్టింది...


ఎవరీ నీలమ్ కుమార్... ఈమె గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే... దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది. అందులో ఓ నిండు జీవితం అనుక్షణం రేపటి కోసం తపించిన స్వప్నం ఉంది. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న పోరాటం ఉంది. ఆ పోరాటం తర్వాత వెనక్కు చూస్తే అదో అసమాన విజయగాథలా శిఖర సమానంగా కనిపిస్తుంది. అంతులేని స్ఫూర్తినిస్తుంది.

అందమైన బాల్యం.. తన సోదరితో కలిసి మాస్కోలో ప్రైమరీ స్కూల్ కి వెళ్లిన రోజులు తలచుకుంటే ఇప్పటికీ చిన్నపిల్లలా మారిపోతారు నీలమ్. బండెడు పుస్తకాలు, బరువైన హోం వర్కులు లేవు. ఉన్నదల్లా చెట్లూ, పుట్టలు, బలాదూర్ తిరుగుళ్లు, తియ్యటి స్ట్రాబెర్రీ పండ్లు.. అంతే. ఎండాకాలం వచ్చిందంటే చాలు అనాపా రిసార్ట్ లో తుళ్లుతూ, గెంతుతూ అల్లరిగా గడిచే రోజులు.. నత్తగుల్లలు, ఆల్చిప్పలు ఏరుకుంటూ, నల్లటి సంద్రం నీళ్లలో మునుగుతూ తేలుతూ, ఈత నేర్చుకుంటూ, సన్ బాత్ చేస్తూ....ఓహ్.. ఆ జీవితం వేరు. ఆ అనుభూతే వేరు. నీలమ్ రష్యాలో నేర్చుకున్నదంతా ప్రకృతి నుంచే. పేరెంట్స్ ఓ.ఎన్.పంచలార్, ఊర్మిళా పంచలార్ .. ఇద్దరూ మాస్కోలోని ఇండియన్ ఎంబసీకి రష్యన్ సాహిత్యాన్ని హిందీ, ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేయటానికి సెలక్టయి అక్కడ కొంతకాలం ఉండటంతో ఆమెకీ అవకాశం దక్కింది.

ఆ తర్వాత కొంతకాలానికి చిన్నారి నీలమ్ ఇండియా వచ్చింది. ఇక్కడ చదువు అఆ ల నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. టీచర్లు ఆమెను సుద్దమొద్దనే ముద్రవేశారు .ఇంగ్లీష్ టీచరైతే, నీలమ్ జీవితంలో ఒక్కముక్క కూడా నేర్చుకోలేదని తేల్చి పారేసింది.

కానీ, అంచనాలను తలక్రిందులు చేయటం.. సవాళ్లను ఎదుర్కోవటం చిన్నపుడే మొదలయిందేమో. చిన్ననాటి ఇంగ్లీష్ టీచర్ మాటలను తప్పని అడుగడుగునా నిరూపిస్తూ, తన జీవితాన్ని అదే ఇంగ్లీషుతో అనుసంధానం చేసుకున్నారు నీలమ్.. ఇంగ్లీష్ లిటరేచర్ లో బీఏ, బీఈడీ, పబ్లిక్ రిలేషన్స్ అండ్ అడర్వ్టైజింగ్ లో పీజీ, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుండి జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేశారు. అంతే కాదు..అయిదు పుస్తకాలు ఇంగ్లీషులోనే అలవోకగా రాశారు.

అంతులేని ఆత్మవిశ్వాసం..

అంతులేని ఆత్మవిశ్వాసం..


మిన్నువిరిగి మీద పడితే....

1996.. నీలమ్ జీవితం మొదటి మలుపు తిరిగిన సంవత్సరం. బ్రెస్ట్ కేన్సర్ డిటెక్ట్ అయింది. నాకే ఎందుకిలా..? నేనేం తప్పు చేశాను? నీలమ్ మదిలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఏం చేయాలో తెలియదు. ఎలా అధిగమించాలో తెలియదు. నిరాశా, నిస్పృహ ఒక్కసారిగా జీవితాన్ని కమ్మేసిన క్షణాలవి. అప్పటికి మూడేళ్ల క్రితమే ఆమె జీవితానికి వెన్నెముకలా నిలిచిన భర్త చనిపోయారు. ఇప్పుడామెకు భర్త లేని లోటు మాత్రమే కాదు, ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల బాధ్యతలు అన్నీ చుట్టుముట్టాయి. ముప్పేట దాడి. కానీ, ఇంత టఫ్ టైమ్ లో పిల్లలే కాదు, తోబుట్టువుల కుటుంబాలు, అమ్మమ్మ, స్నేహితులతో పాటు అందరికంటే ముఖ్యంగా ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. టాటా మెమోరియల్ హాస్పిటల్ లో డాక్టర్ రాజేంద్ర బడ్వే, హిందూజా హాస్పిటల్ లో డాక్టర్ షేక్ ముజ్జమిల్, డాక్టర్ విజయానంద్ ఇలా.. ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్లకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెప్తారామె.

అడుగడుగునా పరీక్షలే...

కేన్సర్ నుండి నీలమ్ పూర్తిగా కోలుకున్నారు. కానీ, ఆమె కష్టాల ప్రవాహం ఇంకా పూర్తి కాలేదు. 2013లో మళ్లీ బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. ఈ సారి ఆమె సమస్యను జయించటానికి పూర్తిగా సిద్ధమై ఉన్నారు. సమస్య పాతది. కానీ, ఆయుధం కొత్తది. అదే నిచిరెన్ బుద్ధిజం. నామ్ మ్యోహో రెంగే క్యో...ఈ మంత్రమే ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేసిందని నమ్ముతారు.

కేన్సర్ కి నీలమ్ ని కబళించే శక్తి ఉందా..?

కేన్సర్ కి నీలమ్ ని కబళించే శక్తి ఉందా..?


కేన్సర్ ని జయించిన ధీర...

సాధారణంగా ఆరోగ్య సమస్యలనుండి బయటపడి బతికి బట్టకడతారు. కానీ, నీలమ్ కేన్సర్ ని జయించారు. రెండు సార్లు కేన్సర్ రావటం కంటే పెద్ద సమస్య ఏముంటుంది. కష్టకాలాన్ని నిబ్బరంగా దాటిన నీలమ్.. పెదాలపై చిరునవ్వు ఏ మాత్రం చెరగలేదు. పైగా," కేన్సర్ నాకిచ్చిన గిఫ్ట్స్ ఇంకా అద్భుతం.. ఈ కర్లీ హెయిర్ ని చూడండి.. ఇంతకుముందున్న జడకంటే బాగుంది కదా.. "అంటారు. ఒక్కొక్కటిగా మృత్యువుతో పోరాటం చేసి మళ్లీ పుట్టుకొచ్చిన కొత్త కణాలు, తనకు నూతన ఉత్తేజాన్ని అందించాయని చెప్తారు.

చావు కోరలు పీకి కొత్త జీవితం మొదలు పెట్టిన నీలమ్

చావు కోరలు పీకి కొత్త జీవితం మొదలు పెట్టిన నీలమ్


అన్ ఫర్గెటబుల్ నీలమ్

నీలమ్ 1996లో జంషెడ్ పూర్ రోటరీ క్లబ్ కాన్ఫరెన్స్ లో ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ ని కలిశారు. అక్కడ కుష్వంత్ ని గురించి పరిచయ వాక్యాలు చెప్పే బాధ్యత నీలమ్ పై పడింది. ఆమె కేవలం పరిచయంతో వదలకుండా కుష్వంత్ రచనల్లో మహిళా పాత్రల గురించి, దానిపై మహిళా పాఠకుల అభిప్రాయాలను కూడా చెప్పారు. ఆ సభలో నీలమ్ మాట్లాడిన తీరుని కుష్వంత్ అభినందించటమే కాదు.. తాను రెగ్యులర్ గా పేపర్ లో రాసే కాలమ్ లో అన్ ఫర్ గెటబుల్ నీలమ్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలా ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. అదే క్రమంలో అవర్ ఫేవరెట్ ఇండియన్ స్టోరీస్ అనే సంకలనాన్ని నీలమ్, కుష్వంత్ ఇద్దరూ కలిసి వెలువరించారు.

అనేక కార్యక్రమాల్లో బిజీగా...

అనేక కార్యక్రమాల్లో బిజీగా...


సృజనాత్మక ప్రవాహం దిశగా...

టు కేన్సర్ విత్ లవ్-మై జర్నీ ఆఫ్ జాయ్. ఇది నీలమ్ కుమార్ పర్సనల్ స్టోరీ. ఇది రాయటం వెనుక ఓ చిన్న కథ ఉంది. ఆమె రెండో సారి కేన్సర్ బారిన పడ్డపుడు, తనను తాను ఉత్సాహపరుచుకుందామని కొన్ని పుస్తకాలు చదవటం మొదలపెట్టారు. ర్యాండీ పాస్క్ రాసిన ఇన్ ద లాస్ట్ లెక్చర్, మిట్చ్ ఆల్బమ్ రాసిన ట్యూస్ డేస్ విత్ మూరీ, కెన్ విల్బర్ రాసిన గ్రేస్ అండ్ గ్రిట్ లాంటి బెస్ట్ సెల్లింగ్ నవలలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటిలో ప్రధాన పాత్రలు చనిపోతాయి. ఇలా కేన్సర్ అనే మాట చుట్టూ ఈ ప్రపంచం ఎంత భయాన్ని, బాధని అల్లుకుందో అర్థంచేసుకున్నారు. కానీ, కేన్సర్ ఆమెకు ఆమడ దూరంలో నిలబడ్డానికి కూడా భయపడే మన:స్థితి ఆమెది. అందుకే తనను తాను ఉత్సాహపరచుకోటానికే మొదటి బుక్ రాశారు.

ఇవి కాకుండా, లెజెండరీ లవర్స్ -21టేల్స్ ఆఫ్ అన్ ఎండింగ్ లవ్, మైరా-లవ్.. సోల్ సాంగ్..డెత్, ఐ ఎ వుమన్ పుస్తకాలూ రాశారు.

యుద్ధానంతర జీవితం...

రచయితగా సక్సెస్ అయిన తర్వాత నీలమ్ చాలా బిజీగా మారారు. ఇప్పుడామె 24 గంటలు కూడా సరిపోనంత బిజీపనుల్లో మునిగితేలుతున్నారు. ముంబయి ఆర్ ఎన్ పొడార్ స్కూల్ లో లైఫ్ స్కిల్స్ కోచ్ గా, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పే సక్సెస్ ఫుల్ కార్పొరేట్ ట్రెయినర్ గా చాలా బిజీగా మారారు. అదే క్రమంలో అనేక కార్యక్రమాల్లో స్పీకర్ గా ఆహ్వానాలు అందుకుంటున్నారు. www.thetraininghub.co. వెబ్ సైట్ ద్వారా ఆమెను కాంటాక్ట్ చేయొచ్చు.

ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ తో ...

ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ తో ...


రేపటి కోసం ఎన్నో కలలు..

ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి తన జీవితాన్ని నిలబెట్టుకున్న నీలమ్ కుమార్, ఇప్పుడు కేన్సర్ బాధితులకు ఓదార్పునివ్వాలనుకుంటున్నారు. గతంతో పోలిస్తే, కేన్సర్ ట్రీట్ మెంట్ ఇప్పుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. కేన్సర్ అవేర్ నెస్ గురించి, మరీ ముఖ్యంగా మొదటి దశలోనే గుర్తించాల్సిన ప్రాధాన్యత గురించి నీలమ్ ప్రచారం చేయాలనుకుంటున్నారు . ఇండియా అంతా తిరుగుతూ, తన జీవితాన్ని ఉదాహరణగా చెప్తూ కేన్సర్ పేషంట్లకు ధైర్యాన్నివ్వాలని, కేన్సర్ ని అధిగమించిన వారిని కలుసుకోవాలని అనుకుంటున్నా.., స్పాన్సర్ల కొరత కొంత అడ్డంకిగా నిలుస్తోంది.

నీలమ్ జీవితం నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. మనం లైఫ్ గురించి చాలా కంప్లెయింట్స్ చేస్తాం. చిన్నా చితకా సమస్యలకే కుంగిపోతాం. నిజానికి జీవితం మనకు రెండు అవకాశాలను ముందుంచుతుంది. ఒకటి సమస్యలకు కుంగిపోతూ మనవాళ్లకు కూడా దు:ఖాన్ని పంచటం, రెండూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వెలిగించి ధైర్యంతో నింపటం. కష్టాలకు దిగులుపడి, సమస్యలకు బెంబేలెత్తి నిరాశతో, నిస్పృహతో గడపటం కూడా ఒక లైఫేనా? జీవితం అంటే నిత్య పోరాటం. జీవితం అంటే ఉరకలేసే సంతోషం, జీవితం అంటే కలలను సాకారం చేసుకోవటం. ఇదే నీలమ్ జీవితం ఇచ్చే సందేశం.