సంకలనాలు
Telugu

ఆర్థోపెడిక్ పరికరాల అద్దె రోజుకు రూపాయి

వినూత్న సేవలందిస్తున్న ఫల్గుణి దోషి

GOPAL
2nd Nov 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మానవ సేవే మాధవ సేవ. ఇలాంటి మాటలు చాలా చెప్తుంటారు. కానీ ఆచ‌రించేవారు కొంత‌మందే ఉంటారు. బేసిగ్గా మ‌న‌కు ఉప‌యోగ ప‌డ‌ని వ‌స్తువు ఇంట్లో ఉంటే- దాన్ని మూల‌కైనా ప‌డేస్తాం కానీ- అది ఎవ‌రికి అవ‌స‌రం ఉందో క‌నుక్కుని వారికి ఇద్దాం అనే ఆలోచ‌న ఎవ‌రికీ రాదు. ఒక‌వేళ వ‌చ్చినా ఎందుకులే అంత రిస్కు అనుకుంటారు. ఫ‌ల్గుణి దోషి మాత్రం అలా అనుకోలేదు. ఇంత‌కూ ఆమె ఏం చేసింది? తెలుసుకోవాలంటే ఆమె స్టోరీ చ‌ద‌వాల్సిందే.

image


అలా వ‌చ్చింది ఆలోచ‌న‌

16 ఏళ్ల క్రితం ఓ రోజు ఫల్గుణి దోషి వడోదరలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. కొంతసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత రూమ్‌లో కార్నర్‌లో ఒక వీల్ చైర్‌, వాక‌ర్‌, వాకింగ్ స్టిక్ క‌నిపించాయి. వాటిమీద దుమ్ము పేరుకుని ఉంది. చూడ‌గానే వాటిని ఎవ‌రూ వాడ‌టం లేద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఫ‌ల్గుణి వెంట‌నే అడిగారు.. అవి ఎవ‌రివి అని? వాటిని త‌న గ్రాండ్ మదర్ ఉపయోగించేవారని, ఆమె చనిపోవడంతో వాటిని ఏం చేయాలో తెలియ‌క చాలాకాలంగా అక్కడ ప‌డేశామ‌ని ఆమె స్నేహితురాలు చెప్పింది. వెంట‌నే ఫల్గుణికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దేశంలో ఎంతోమంది అవిటివాళ్లు- ముస‌లివాళ్లు- ప‌క్ష‌వాతం వ‌చ్చిన వాళ్లు- క‌నీసం ఊత‌క‌ర్ర కూడా లేకుండా జీవితాన్ని భారంగా వెళ్ల‌దీస్తున్నారు. దేశందాకా ఎందుకు- త‌ను ఉంటున్న చుట్టుప‌క్క‌ల ప్రాంతంలోనే ఎంద‌రికో వాటి అవ‌స‌రం ఉంది. ఇలాంటివ‌న్నీ సేక‌రించి లేనివారికి ఉచితంగా అద్దెకిస్తే ఎలా వుంటుంది? ఫ‌ల్గుణి మ‌న‌సులో వ‌చ్చిన ఆలోచ‌న ఇది. చెప్ప‌గానే ఫ్రెండ్ అద్భుతం అని మెచ్చుకుంది. లేట్ చేయ‌కుండా ఆ స్నేహితురాళ్లిద్ద‌రూ త‌మ‌కు తెలిసిన వారంద‌రికీ విష‌యం చెప్పారు. ఎవ‌రెవ‌రికి వీల్ చైర్లు, చంక‌క‌ర్ర‌లు, చేతిక‌ర్ర‌లు అవ‌స‌ర‌మున్నాయో కూడా ఆరా తీశారు.

ఉచితంగా అద్దెకివ్వడం

బాగానే ఉంది కానీ, అంద‌రూ వాటిని ఫ్రీగా ఎందుకిస్తారు? కొంద‌రు డ‌బ్బుల‌కు క‌క్కుర్తిప‌డ‌తారు. అలాంటి వారికోస‌మే కొంత ఫండ్ చేతిలో పెట్టుకున్నారు. ఫ్రీగా ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బులిచ్చి ప‌రిక‌రాలు కొంటారు. అలా సొంత డబ్బులతో కొనుగోలు చేసి ఉచితంగా అద్దెకివ్వడం ప్రారంభించారు. ఆ నోటా ఈ నోటా వారి సేవలు అందరికీ తెలిసి పోవడంతో పాపులరైపోయారు.

ఒంటరి పోరాటం..

హోంసైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఫల్గుణి స్వస్థలం ముంబై. పెళ్లి తర్వాత 27 ఏళ్ల క్రితం వడోదరకు తరలి వెళ్లారు. మెట్టినింటి వారు వ్యాపారస్తులైనప్పటికీ, సమాజానికి ఏదో తపన మాత్రం ఫల్గుణిని తొలిచివేసేది. అయితే అలాంటి సేవ చేసేందుకు సమయం మాత్రం దొరికేది కాదు. ‘‘ఈ ఆర్థోపెడిక్ పరికరాల పంపిణీ జరిపేవరకూ, సమాజానికి ఏం చేస్తే బాగుంటుందో అర్థమయ్యేది కాదు’’ అని ఫల్గుణి వివరించారు. పిల్లలు పెద్దవారైన తర్వాత సమయం చిక్కడంతో ఈ సేవను మరింత విస్తృతం చేశారు.

రోజుకు రూపాయి

ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే.. పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో వాటిని ఉపయోగించేవారు- సరిగా మెయింటెన్ చేయ‌డం లేదు. ఒక్కోసారి క‌ర్ర‌లు విరిగిపోతున్నాయి. అందుకే ‘‘ప్రీగా వ‌చ్చాయి క‌దా అని చాలామంది అక్కడా ఇక్కడా పడేస్తుంటారు. దీంతో అవి మళ్లీ తిరిగి ఇచ్చేటప్పటికీ పాడైపోతున్నాయి. పరికరాలను వాడేవారికి కొంత భ‌యం ఉండాల‌నే కొద్ది మొత్తంలో అద్దె తీసుకోవాలని మేం నిర్ణయించాం’’ అని ఫల్గుణి వివరించారు. అలా రోజుకు రూపాయి చొప్పున పరికరాలకు కిరాయి వసూలు చేశారు. అంతేకాకుండా ఆ పరికరం కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని డిపాజిట్ గా తీసుకున్నారు. ఇలాంటి సేవ ప‌దిమంది తెలియాల‌ని దగ్గర్లోని ఆర్థోపెడిక్ హస్పిటల్స్ ద‌గ్గ‌ర‌ ప్రచారం కూడా నిర్వహించారు. పాంప్లెట్లతో పరికరాల పంపిణీ గురించి అవగాహన కల్పించారు. దీంతో ఈ పరికరాల కోసం రోగులు క్యూ కట్టారు.

ఫుల్ టైం

కొన్ని రోజుల తర్వాత ఫల్గుణి స్నేహితురాలు ఈ సేవ నుంచి తప్పుకున్నారు. దీంతో ఫల్గుణి పరికరాలన్నింటిని తన బంగ్లాలోకి తరలించి, కార్యక్రమాన్ని కొనసాగించారు. పిల్లలు పెద్దవార‌య్యారు. అప్ప‌డు సమయం ఇంకా ఎక్కువ దొరుకుతోంది. దాంతో ఫుల్ టైం ఇలాంటి సేవకే అంకిత‌మ‌య్యారు ఫ‌ల్గుణి. 16 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు ఫల్గుణి ద‌గ్గ‌ర‌క టాయిలెట్ చైర్స్, స్టిక్స్, క్రచెస్, వాకర్స్, వీల్ చైర్స్, ఎయిర్ బెడ్స్, హాస్పిటల్ బెడ్స్ ఇలా ఎన్నో రకాల పరికరాలు ఉన్నాయి.

image


‘‘ఇలాంటి పనిలో పాలుపంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది లాభదాయకమైన ప్రాజెక్ట్ కాదు. ఇలాంటి దాని ద్వారా ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూడగలుగుతున్నాను. ఇలాంటి సేవ చేస్తున్నందుకు ప్రజలు నన్ను మన:పూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. జీవితంలో ఇంతకంటే ఏం కావాలి’’ అంటున్నారు ఫల్గుణి.

మానవ సేవే మాధవ సేవ

ఓసారి ఓ వ్యక్తి తన తల్లి కోసం ట్ర‌క్‌నిండా ఇంపోర్టెడ్ పరికరాలు కొనుగోలు చేశారు. అయితే అప్ప‌టికే ఆమె ఆస్పత్రిలోనే చ‌నిపోయారు. అవ‌న్నీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఫ‌ల్గుణి గురించి తెలిసింది. అంతే వేరే థాట్ లేకుండా ట్ర‌క్ నిండా పరికరాలు ఆమెకు పంపాడా వ్య‌క్తి. ఫ‌ల్గుణి కోరిక ఒక్క‌టే. గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ఇదే సేవ చేయాలి. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా ఆపొద్దు. అవును మ‌రి. ఆశ‌యం మంచిదైతే అడ్డంకులేం చేస్తాయి. ఫ‌ల్గుణి ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags