మీరు ఈ కథ చదివితే.. కచ్చితంగా వాళ్లకు సాయం చేయాలనుకుంటారు..

గిరిజనగూడేనికి వెలుగు పంచే మహత్కార్యం
0 CLAPS
0

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఇంకా చీకట్లో మగ్గుతున్న పల్లెలెన్నో ఉన్నాయి. లెక్కల్లో చెప్పాలంటే, 130కోట్లకు పై చిలుకు జనాభాలో 40 కోట్ల మందికిపైగా నేటికీ కరెంట్ అంటే తెలియదు. పొద్దువాలగానే వాళ్లు చీకటితో సహవాసం చేస్తారు. మళ్లీ సూర్యోదయంతో బతుకు సమరం మొదలు పెడతారు. అందరికీ రోజులో 24 గంటలుంటే.. వాళ్లకు మాత్రం 12గంటలే. మిగతా సమయమంతా చీకట్లోనే ముడుచుకుంటారు. ఇప్పటికీ బల్బు ఎలా వుంటుందో, స్విచ్ ఎలా వేస్తారో తెలియని గ్రామాలెన్నో ఉన్నాయి. రాత్రిపూట గంటసేపు కరెంటు పోతే విలవిల్లాడిపోతాం.. మరి అలాంటిది కొన్ని ఏళ్లపాటు 12 గంటలు చిమ్మచీకట్లో బతకాలంటే ఒక్కసారి ఊహించుకోండి..

ఇదంతా వింటుంటే మనసు చివుక్కుమంటోంది కదా. గుండెలో కలుక్కుమన్న ఫీలింగేదో కలుగుతోంది కదా. అందుకే ఈ కథ మొత్తం చదవండి.. చివర్లో మీకు తెలియకుండానే వాళ్లకు మీవంతుగా చిన్నపాటి సాయం చేయాలని కచ్చితంగా భావిస్తారు.


విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం. ఒడిశా సరిహద్దు. గ్రామాలన్నీ విసిరివేసినట్టుగా అక్కడొకటీ ఇక్కడొకటీ ఉంటాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఊళ్లున్నాయి. కానీ మనుషులే ఎందుకూ కొరగానివారయ్యారు. సూర్యుడు ఉన్నంత వరకే వాళ్ల దైనందిన జీవితం. పొద్దుగుంకిందో ఎక్కడివాళ్లు అక్కడే. కారణం కరెంట్ లేకపోవడం.

దీనికి కారకులు ఎవరు? ఎవరిని నిందించాలి..? ఎవరిని నిలదీయాలి..? అనే టాపిక్ చర్చించుకోవడం కంటే.. అమాయక, నిరుపేద గిరిజనగూడెం ప్రజల కోసం పాటుపడుతున్న ఒక సంస్థ గురించి మాట్లాడుకుందాం. వాళ్ల జీవితాల్లో కొన్ని వెలుగులు నింపాలనే వారి ఆశయం గురించి చదువుదాం.


గూడెం కొత్తవీధి మండలంలోని గ్రామాలన్నీ చాలాచిన్నవి. మినిమం 25 గడపలు. మాగ్జిమం 75 కుటుంబాలు. అక్కడో ఊరు.. అక్కడో ఊరు.. మధ్యమధ్యలో అడవి.. బండలమీద నుంచి కమ్మగా పారే సెలయేళ్లు.. పోడు వ్యవసాయం.. వారాంతపు సంత.. అంతకుమించి బాహ్యప్రపంచంతో వాళ్లకుండే అనుబంధం చాలా తక్కువ. చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. కరెంటు లేకపోవడం వల్ల వాళ్ల జీవితంలో సగం రోజులు చీకట్లోనే మగ్గుతున్నాయి. రాత్రయితే భయంగుప్పిట్లో బతకాలి. సాయంత్రంలోగా ఎట్టిపరిస్థితుల్లో ఇల్లు చేరుకోవాలి. చీకటి పడితే దారీ తెన్నూ తెలియదు. ఆలోపే వండుకుని తినేసి పడుకోవాలి. మళ్లీ తెల్లారితేగానీ బతుకు బండి మొదలుకాదు.

కరెంటు లేని కారణంగా పిల్లల చదువు పడకేసింది. కరెంటు లేని కారణంగా మొబైల్ ఫోన్ తెలియదు. కరెంటు లేని కారణంగా టీవీ మొహమే చూడలేదు. ఫలితంగా బాహ్యప్రపంచం గురించే తెలియదు. కిరోసిన్ కొనాలంటే తాహతకు మించిపోతోది. వచ్చే నాలుగు డబ్బుల్లో సగం కిరసనాయిలుకే సరిపోతోంది. అదీగాక దాన్నుంచే పొగ మూలంగా పిల్లలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని పర్యావసానలు కేవలం కరెంటు లేకపోవడం వల్లనే అంటే గుండె తరుక్కుపోతుంది.

రాత్రిపూట ఆ ఒక్క వెలుగే కనుక ఉంటే.. వాళ్ల జీవితాలు కొంతలో కొంతైనా మారేవి. రాత్రిపూట ఒక్క బల్బ్ వెలిగే అవకాశమే ఉంటే.. వాళ్ల జీవితాలకూ ఓ అర్ధముండేది. కొన్ని దశాబ్దాల పాటూ పేరుకుపోయిన ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని నడుం కట్టింది ఫుయెల్ ఏ డ్రీమ్ సంస్థ. మొత్తం కాకపోయినా మండలంలోని 8 గ్రామాల్లోని 367 కుటుంబాల్లో రాత్రిపూట వెలుగులు నింపాలని ఆశయంగా పెట్టుకుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 3లక్షలు సేకరించి ఒక్కో కుటుంబానికి మూడేళ్లపాటు నిరంతరాయంగా వెలిగే సోలార్ లాంప్స్ అందజేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.


సంస్థ చెప్పేదాని ప్రకారం ఒక్కో ఫ్యామిలీకి మూడేళ్లపాటు వెలుగులు అందించాలంటే అయ్యే ఖర్చు కేవలం రూ.820 మాత్రమే. అంటే ఒక పది ఇళ్లకు మూడేళ్లపాటు వెలుగులు అందివ్వాలంటే రూ.8200 అవుతాయి. ప్రస్తుతానికి దాదాపు 16వేల ఫండింగ్ అందింది. మరో 40 రోజుల డెడ్ లైన్ ఉంది.

ఢిల్లీకి చెందిన డి-లైట్ సోలార్ అనే కంపెనీ సహకారంతో ఈ మహత్కార్యం చేపట్టారు. మరోవైపు గూంజ్ అనే ఎన్జీవో కలిసి గత పదహారేళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాలను భుజానికెత్తుకున్నారు. దీనికి కూడా గూంజ్ సహకారం ఉంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎన్నో ప్రాజెక్టులను విజయతీరాన నిలిపిన సంస్థ.. ఇలాంటి సోలార్ ప్రాజెక్టును ఇంతకు ముందు మహారాష్ట్రలో చేపట్టింది. అక్కడ దాదాపు 250 గ్రామాలకు వెలుగులు పంచారు. ఇప్పుడు ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న గూడెం కొత్తవీధి మండలంలోని కొన్ని గ్రామాలను ఎంచుకున్నారు.

బెంగళూరుకు చెందిన ఫుయెల్ ఏ డ్రీమ్.. బేసిగ్గా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ద్వారా సోషల్ సర్వీస్ చేస్తుంది. ఈ సంస్థ ఫౌండర్ కమ్ సీఈవో తోట రంగనాథ్. ముంబై యూనివర్శిటీ నుంచి బీఈ, ఎంబీయే చేసిన రంగనాథ్.. గత 24 ఏళ్లుగా.. గోద్రెజ్, వర్ల్ ఫూల్, హిందుస్తాన్ టైమ్స్, పెప్సీ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశారు. స్టార్టప్స్ కోసం కూడా వర్క్ చేశారు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో సెంటర్ హెడ్ గా, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. అనర్ఘళంగా 7 భారతీయ భాషలు మాట్లాడతాడు.


ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చేతనైనంత మేర సాయం చేయడం.. ఆర్ధిక స్తోమత లేక అడుగున పడిపోయిన క్రియేటివ్ ఐడియాలకు ఫైనాన్షియల్ గా ఊపిరిపోయడం.. కోసమే ఫుయెల్ ఏ డ్రీం అనే సంస్థను నెలకొల్పాడు. రంగనాథ్ భార్య స్కందప్రియ అవార్డ్ విన్నింగ్ ఇంటీరియర్ డిజైనర్.

పేదరికం వల్ల మరుగున పడిపోతున్న ఎందరో టాలెంటెడ్ వ్యక్తులకు పైకి తెచ్చి, ప్రపంచానికి దూరంగా బతుకీడుస్తున్న నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్ధికంగా సామాజికంగా చేయూతనిస్తున్న రంగనాథ్ నిజంగా అభినందనీయుడు.

Latest

Updates from around the world