సంకలనాలు
Telugu

యాభయ్యేళ్ళ వైమానిక జీవితం... బిపి బలిగ సొంతం

చిన్నప్పుడు విమానాలపై ఉన్న మోజే ఈ స్థాయికి చేర్చిందిఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌లో ట్రైనింగ్దేశవిదేశాల్లో వివిధ స్థాయిల్లో విధులుభారత్‌లోకి బోయింగ్ అడుగుపెట్టేందుకు ఆయనే గ్రీన్ సిగ్నల్మూడు దశాబ్దాల పాటు ఎయిరిండియాలో సేవలుజెట్ ఎయిర్‌వేస్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌విమాన రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం

30th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మీరెప్పుడైనా ఎయిరిండియా బోయింగ్ -747 లో ప్రయాణించిన అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకున్నారా? మీరు కచ్చితంగా భారత వైమానిక రంగం మార్గదర్శకులను స్మరించుకోవాల్సిందే. అలాంటి మార్గదర్శకులలో ఒకరు బంట్వాల్ పురుషోత్తమ్ బలిగ. పౌర విమానయాన రంగంలో బి.పి. బలియాకు ఐదు దశాబ్దాలకు పైగా అనుభవముంది. ఎయిరిండియాలో 1954-91 మధ్య కాలంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్‌, కార్పొరేట్ మేనేజ్‌మెంట్ లోనూ పనిచేశాక 1992-2009 మధ్య జెట్ ఎయిర్ వేస్‌లో సేవలందించారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ఆవిష్కరిస్తూ, సమర్థవంతమైన యాజమాన్య విధానాలతో భారత వైమానిక రంగం ఈనాడున్న స్థితికి ఎదగటంలో అయన విశేషంగా కృషిచేశారు.

ఎల్ కె అద్వానీ, నరేంద్ర మోడీలతో బి.పి. బలిగ

ఎల్ కె అద్వానీ, నరేంద్ర మోడీలతో బి.పి. బలిగ


ఆయనతో సంభాషించే అవకాశం సంపాదించిన యువర్ స్టోరీ ఇప్పుడు ఆయన కథను మీకందిస్తోంది.

తొలిరోజులు

కేరళలోని కన్ననూర్ లో ఒక పేద కుటుంబంలో 1933 ఏప్రిల్ 4 న పుట్టిన బలిగ కష్టాలమధ్యనే పెరిగాడు. 1950 లో తండ్రి అకస్మాత్తుగా చనిపోవటంతో 9 మంది పిల్లలున్న ఆ కుటుంబం మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ఇంట్లో పెద్దవాడే బాధ్యతలు తీసుకొని చిన్నవాళ్ల చదువు సంధ్యలన్నీ చూసుకోవాల్సి వచ్చింది. 11 ఏళ్ళ వయసులో బలిగాకు మొదటిసారిగా విమానంతో బంధం ఏర్పడింది. ఒక చిన్న విమానం తన ఇంటిమీద ఎగురుతూ కనిపించి ఆ తరువాత ఖాళీ మైదానంలో దిగటం చూసినప్పుడు అదెలా దిగిందన్న ఆలోచనే మెదడును తొలిచేసేది.

మంగుళూరులో 1951 లో పి.యు.సి. పూర్తి కాగానే ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు.అప్పట్లో మూడే విభాగాలుండేవి – మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్. అప్పటికింకా ఏవియేషన్ పెద్దగా ఎవరికీ తెలియదు కూడా. మర్చంట్ నేవీకి అప్లై చేద్దామనుకుంటే సముద్రంలో చాలా ఇబ్బందులుంటాయని అందరూ భయపెట్టారు. చాలా అసంతృప్తితో బిఏలో చేరిపోయాడు.

జీవితాన్ని మార్చేసే ఘటన 1951 లో జరిగింది. అప్పటికే ఒక తండ్రిలా, గురువులా మారిన పెద్దన్న మాధవ బలిగ ’ ది హిందూ ’ పత్రికలో వచ్చిన ఒక ప్రకటన తెచ్చి తమ్ముడికి చూపించాడు. అలహాబాద్ లోని సివిల్ ఏవియేషన్ ట్రెయినింగ్ సెంటర్ వాళ్ళు అందిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సు ప్రకటన అది. దరఖాస్తు చేయటానికింకా రెండువారాలే గడువుంది. మామూలుగా దరఖాస్తు పంపుకోవటమంటే ఆ రోజుల్లో అది అందటానికి చాలా సమయం పట్టేది. అందుకే తనకు ఆసక్తి ఉందంటూ ఒక టెలిగ్రామ్ పంపి వెంటనే వ్యక్తిగతంగా వెళ్ళి అన్ని లాంఛనాలూ పూర్తిచేశాడు.

ఇంటర్వ్యూ

1951 ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూ బోర్డు ముందు హాజరయ్యాడు. అంతా బాగానే జరిగింది. చివర్లో ధైర్యం కూడగట్టుకొని అడగనే అడిగేశాడు. “నేను మంగుళూరునుంచి మూడు రోజుల రైల్లో ప్రయాణం చేసి ఇక్కడికొచ్చా. నాకేమైనా అవకాశాలుంటాయని చూచాయిగా చెప్పినా ఇక్కడే ఉండి ఎదురుచూస్తా..” అని. నిజానికి ఇది పచ్చి అబద్ధం. కొద్ది రోజులు ఉండటానికి సిద్ధమయ్యే అన్నీ సర్దుకొని వచ్చాడు. వచ్చే అవకాశముందని చెప్పడంతోబాటు ఉండిపొమ్మనటం, రెండువారాల్లో సమాచారం రావటం జరిగిపోయాయి.

సివిల్ ఏవియేషన్ ట్రెయినింగ్ సెంటర్

మూడు సంవత్సరాల ట్రెయినింగ్ అది. ఆ తరువాత కాలంలో సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అయిన ఆర్ ఎన్ ఖట్జూ అప్పట్లో ఆ సెంటర్ ప్రిన్సిపాల్. భద్రతే తొలి ప్రాధాన్యమన్న తన సిద్ధాంతాన్ని నూరిపోస్తూ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ పాఠాలు తన విద్యార్థులకు అద్భుతంగా చెప్పారాయన. తరువాత కాలంలో ఈ విద్యార్థుల బృందమే భారత వైమానిక పరిశ్రమకు వెన్నెముకగా నిలిచింది. వాళ్ళలో చాలామంది వివిధ వైమానిక సంస్థల్లో చేరి తాము నేర్చుకున్న పరిజ్ఞానాన్ని అమలు చేశారు.

image


'మీరంతా మెరికల్లాంటివాళ్ళు. భారత వైమానిక రంగం ఎదుగుదల మీ కళ్ళముందే జరగాలి. ఎప్పుడూ మీ స్థాయికి తగ్గకుండా కృషిచేయండి. మామూలు మధ్య స్థాయిలోనే ఆగిపోకండి' అని ఖట్జూ తరచూ చెప్పి స్ఫూర్తి నింపుతుండేవారు.

ఎయిరిండియాలో మొదటి ఇన్నింగ్స్

బలిగాకg లైసెన్స్ వచ్చేనాటికి ఎయిరిండియాలోనూ, ఇండియన్ ఎయిర్ లైన్స్‌లోనూ ఖాళీలున్నాయి. ఇండియన్ ఎయిర్ లైన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలక్టయ్యాడు గాని ఎయిరిండియాకి ఉండే అంతర్జాతీయ స్థాయి అతణ్ని వెనక్కి పిలిచింది. అందుకే అవకాశాలు వెతుక్కుంటూ ముంబై చేరుకున్నాడు. నవంబర్ 30 ఉదయం బలిగా అప్పట్లో ఎయిరిండియా టెక్నికల్ డైరెక్టర్ గా ఉన్న ఎ సి గజ్దార్ తలుపు తట్టాడు. “ఇంటర్వ్యూకి సిద్ధమా? “ అని ఆయనడిగారు. రెండువారాల్లో మొదలుపెట్టబోయే శిక్షణకు ఇంజనీర్ల కోసం చూస్తున్నట్టు తెలిసి ఆయన వెళ్లాడు. ఎందుకనో ఇంటర్వ్యూ అంతబాగా చేయలేదేమోనన్న అనుమానం పీడిస్తుండగా చివర్లో “ మెడికల్ టెస్ట్‌కి సిద్ధమా ? “ అన్న ప్రశ్న ఎదురవటంతో ఇక ఆ కుర్రాడి ఆనందానికి హద్దుల్లేవు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని 90 రూపాయలు పెట్టి మంగుళూరుకు రాను పోను ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం టికెట్ కొనుక్కొని మరుసటి రోజే కన్ననూర్ బయల్దేరాడు. కుటుంబ సభ్యులను కలిసి అప్పటికి మూడేళ్ళయింది.

1954 డిసెంబర్ 7న ఎయిరిండియాలో జూనియర్ ట్రెయినీగా చేరాడు పురుషోత్తం బలిగ. ఆ తరువాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరుగా బోయింగ్ 707, బోయింగ్ 747 సహా అనేక విమానాలమీద పనిచేశాడు. ఆరు నెలల్లోపే సంబంధిత పరీక్షలన్నీ పాసై 1956 లో చెన్నై లో ఉద్యోగంలో చేరి పెళ్ళిచేసుకున్నాడు. రెండేళ్లలోపే స్టేషన్ ఇంజనీరయ్యాడు.

మొదటి పోస్టింగ్ పూర్తయ్యేసరికల్లా విదేశాల్లో పోస్టింగ్ అవకాశం వచ్చింది. ఒక సీనియర్ ఇంజనీర్ ట్రెయినింగ్‌కి వెళ్ళటంతో కైరోలో పోస్ట్ ఖాళీ అయింది. ఆ తరువాత 1961-64 మధ్య మాస్కోలో మెయింటెనెన్స్ ఇంజనీరుగా పనిచేశాడు. 1965 నాటికి ఎయిరిండియా అన్నీ జెట్ విమానాలే వాడే స్థితికి వచ్చింది. అప్పుడే కైరోకి తిరిగి వచ్చాడాయన. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ కొడుకులు వినోద్‌ను, సతీశ్‌ను వాళ్ళ చదువులు దెబ్బతినకుండా మంగళూరులోనే వదిలేసి ఏడాది కూతురు ఆశాను మాత్రమే వెంటబెట్టుకొని కైరో వెళ్ళారు. కైరో నుంచి తిరిగి రాగానే ఆ యువరక్తాన్ని అసిస్టెంట్ ఇంజనీరింగ్ మేనేజర్‌గా ప్రమోట్ చేశారు. ఆ తరువాత లైన్ మెయింటెనెన్స్, మేజర్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ లాంటి వివిధ విభాగాలలో పనిచేశారాయన. ఆయనను డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పోస్ట్‌కి ప్రమోట్ చేసినప్పుడు బోర్డ్ ధ్రువీకరించాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి, సోనియా గాంధి ప్రయాణిస్తున్న విమానంలో జరిగిన ఒక ఘటనతో క్రమశిక్షణాచర్య తీసుకోవటం ఆయన ప్రమోషన్‌కు అడ్డుకట్ట వేసింది. తన తప్పేమీ లేకపోయినా ప్రమోషన్ తిరస్కరించినప్పుడు ఏ మాత్రమూ లొంగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులే స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ అనే పోస్ట్ సృష్టించి ఫ్రాన్స్ పంపారు. భారతదేశం కోసం కొనాల్సిన ఎ310 విమానాలను సాంకేతికంగా పరీక్షించి సరైనవేనని నిర్థారించాల్సిన పని ఆయనది. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా ఆరునెలలపాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ అనుభవం ఆ తరువాత జెట్ ఎయిర్ వేస్‌లో అద్భుతంగా పనికొచ్చింది.

ఎయిరిండియాకు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయగలిగాడు బలిగా. భారత ఇంజనీర్ల నైపుణ్యం మీద ఆయనకు గట్టి నమ్మకముంది. అందుకే ఎయిరిండియా వారి 4 బోయింగ్ 747లకు కీలకమైన మార్పులు చేయాలని పట్టుబట్టాడు. ఎయిర్ లైన్స్ ఇంజనీర్లతోబాటు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇంజనీర్లు కూడా కలిసి దాదాపు 6,000 విడి భాగాలను మార్చారు. ఆ విధంగా పెద్దమొత్తంలో డాలర్లను ఆదా చేశారు. అదే విధంగా గల్ఫ్ వార్ సమయంలో దాదాపు లక్షమంది భారతీయులను ఒమన్ నుంచి తీసుకురావటానికి ఎయిరిండియా విమానాలను వినియోగించి సమన్వయపరచటం లోనూ కీలకపాత్ర పోషించారు. బొంబాయికి తిరిగి రాగానే అధికారికంగా ఆయనను డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ గా మళ్ళీ నియమించారు. అధికారికంగా ఆయన 1991 లో ఎయిరిండియా నుంచి రిటైరయ్యారు.

ఎయిర్ లంక, 1991-1992

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం ( సార్క్ ) టెక్నికల్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న బలిగా నుంచి ఎయిర్ లంక సాయం కోరింది. శ్రీ లంక వైమానిక సంస్థ అప్పట్లో విమానాల కొనుగోలుకు ప్రపంచ బ్యాంకు అప్పు కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరమైంది. ఎ340లు, ఎ320 లమీద సలహా కోసం ఆయనను సంప్రదించారు. వాణిజ్యపరంగా, ఇంజనీరింగ్ పరంగా ఆయన అభిప్రాయం కోరారు. అప్పుడాయన కన్సల్టెంట్‌గా పనిచేసేందుకు ఒప్పుకుని నివేదిక తయారుచేసి ఇచ్చారు. ఆ విమానాల కొనుగోలు తరువాత మళ్ళీ దాని వాడకం విషయంలోనూ ఆయనను సంప్రదించారు. ఆయన సూచన మేరకు వాటి ఇంజన్లను ఎయిర్ లంక అధికారులు మెయింటెనెన్స్ కోసం ఎయిర్ ఇండియాకు పంపారు. బిపి బలిగ రిపోర్ట్ పేరుతో ప్రచురితమైన ఆ నివేదిక ఆ తరువాత కాలంలోనూ మార్గదర్శకంగా నిలిచింది.

జెట్ ఎయిర్ వేస్‌లో సెకండ్ ఇన్నింగ్స్

1992మార్చి నాటికల్లా జెట్ ఎయిర్ వేస్ ఆలోచన పుట్టి ఏప్రిల్ 1 నాటికి కంపెనీ ఏర్పాటైంది. ఫౌండర్ చైర్మన్ నరేశ్ గోయల్ తన జట్టులో ఫ్లైట్ ఆపరేషన్స్ చూసుకోవటానికి కెప్టెన్ విలియమ్స్ ను ఎంచుకున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగం చూసుకునే మనిషి కావాలి. ఎయిర్ ఇండియా ఎండీ రాజన్ జైట్లీ ఆ పోస్టుకు బిపి పేరు సూచించారు.కానీ అప్పటికే ఆయన ఓ విమాన ప్రమాదం దర్యాప్తులో బిజీగా ఉన్నారు. అందువలన ఆయనను సంప్రదించటం కుదరలేదు. ముంబై - కోల్ కతా మధ్య అదేపనిగా తిరుగుతూ ఉన్నారు. ఎట్టకేలకు సమాచారం అందుకొని జెట్ ఎయిర్ వేస్ చైర్మన్‌ను కలిసిన బలిగాకు ఆయన తన పథకాలు వివరించారు. సాయం చేయాలని బాలిగా ను కోరారు.

జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ చైర్మన్ నరేశ్ గోయల్ తో

జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ చైర్మన్ నరేశ్ గోయల్ తో


బలిగా విన్నారు కానీ ఊగిసలాటలో ఉన్నారు. పిల్లలందరూ విదేశాల్లో సెటిలయ్యారు. 60 ఏళ్లకు దగ్గరవుతున్న ఈ దశలో పనిచేయాలా విశ్రాంతి తీసుకోవాలా అర్థం కాలేదు. ఏమైతేనేం, ఏడాదిపాటు కన్సల్టెన్సీ పద్ధతిలో జెట్ ఎయిర్ వేస్‌లో చేరాలనే నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత అది సాగుతూ పోయి 17 ఏళ్లపాటు కొనసాగింది. మొత్తానికి 2009 లో జెట్ ఎయిర్ వేస్ సపోర్ట్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు.మొదట్లో ఔత్సాహికులైన కొంతమంది ముంబైలోని మేకర్ చాంబర్స్‌లో కిక్కిరిసిన ఆఫీసులో పనిచేసేవారు. శివార్లలో మరింత విశాలమైన భవనం మంచిదని వాళ్ళు చైర్మన్‌కు సూచించారు. ఆ సమయంలో బాలిగా భార్య కూతురి పురిటి కోసం అమెరికా వెళ్ళి ఉన్నారు. వాళ్ళకు జుహూ లో రెండు ఫ్లాట్స్ ఉండటంతో వాటిలో ఒకదాన్ని పార్టిషన్లతో ఆఫీసుగా మార్చారు. ప్రాథమిక సౌకర్యాలు సిద్ధం కాగానే జెట్ ఎయిర్ వేస్ కోర్ టీమ్ అంతా బలిగా ఇంటికే వచ్చి పనిచేయటం మొదలుపెట్టింది. రోజువారీ కార్యకలాపాలమీద ఫాక్స్ ద్వారా చైర్మన్‌కి రిపోర్టులు పంపేవారు. బాలిగా భార్య తిరిగి రాగానే అక్కడి ఏర్పాట్లు చూసి అవాక్కయ్యారు. ఆమెకు ఇదేమీ తెలియదు.

జెట్ ఎయిర్ వేస్ బృందం చట్టపరంగా అవసరమైన అన్ని రకాల పత్రాలూ తయారుచేసింది. 1992 చివరికల్లా ప్రభుత్వం ఆమోదముద్ర వేసి, విమానాలు నడుపుకోవటానికి అనుమతి మంజూరు చేసింది. విమానాల కొనుగోళ్లకు మరి కొద్ది నెలలు పట్టగా 1993 మే 5 న నాలుగు బి737-300 విమానాలతో జెట్ ఎయిర్ వేస్ కార్యకలాపాలు మొదలయ్యాయి.

1993-94 లో 28 భారతీయ నగరాలను కలుపుతూ వాళ్ళ దగ్గర 28 విమానాలుండేవి. 2004 లో రోజుకు 265 ట్రిప్పులు నడుపుతూ 42 భారతీయ నగరాలతోబాటు కొలంబో, నేపాల్‌కు కూడా విస్తరించారు. ఆ ఏడాది 46 శాతం మార్కెట్ వాటా సంపాదించుకోగలిగింది జెట్ ఎయిర్ వేస్. సరికొత్త విమానాలున్న సంస్థ ఇప్పుడు జెట్ ఎయిర్ వేస్ మాత్రమే. మొత్తం 115 విమానాలలొ 12 ఎయిర్ బస్ లు, 59 బోయింగ్ 737-800 లు ఉన్నాయి.

2001 లో భారీ భూకంపం గుజరాత్ ను కుదిపేసినప్పుడు జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు జీతంలో కొంతశాతం విరాళంగా ఇవ్వటంతో బాటు తత్కాలిక శిబిరాల ఏర్పాటు లాంటి అత్యవసర సేవల్లొ పాల్గొన్నారు. ఎల్ కె అద్వానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ భుజ్ విమానాశ్రయ పునరుద్ధరణలో విశేష కృషి చేసిన బాలిగాను, ఆయన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి జెట్ ఎయిర్ వేస్ సేవలను కొనియాడారు.

కన్సల్టెంట్ గా మొదలై, ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా మారి అ తరువాత రిటైరయ్యేనాటికి సపోర్ట్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన హయాంలో జెట్ ఎయిర్ వేస్ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. వరుసగా నాలుగేళ్ళపాటు బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్ లైన్ అవార్డు కూడా దక్కించుకుంది. ఏషియా పసిఫిక్ లోనూ టిటిజి ట్రావెల్ అవార్డ్ సంపాదించుకుంది.

2006 లో వాషింగ్టన్ లోని ఇంటర్నేషనల్ హూ ఈజ్ హూ సొసైటీ లో స్థానం పొందారు. 2004 లో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆయనను ఎక్సలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరించింది. రోటరీ క్లబ్ 2008 జులై 5న కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో జరిగిన కొంకణి సమ్మేళన్ సందర్భంగా ఆయనకు పద్మభూషణ్ ప్రకాశ్ పదుకొనె చేతులమీదుగా లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం ప్రదానం చేసింది.

తన అవార్డులతో బిపి బలిగ

తన అవార్డులతో బిపి బలిగ


నమ్మకాలూ, నైతికత, ఆదర్శం

జెట్ ఎయిర్ వేస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో బలిగ ఆఫీసు గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. క్లీనర్లు, ట్రెయినీలు మొదలుకొని ఇంజనీర్ల దాకా ఎవరైనా సరే ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికీ ఆయన అందరినీ కలుసుకోవటానికీ, మాట్లాడ్డానికీ ఎంతో ఇష్టపడతారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఆయనకు నచ్చుతుంది. ఇతరులకోసం ఏదైనా చేస్తున్నామనుకునప్పుడు మనకు అవసరమైనప్పుడు అడగటానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదంటారాయన. ఆయన నమ్మే సూత్రం ఒక్కటే – చర్చించటం, నిర్ణయించటం, బాధ్యతలు అప్పగించటం.

బిపి బలిగా తనకు ఆదర్శంగా, నిరంతర స్ఫూర్తిగా భావించే వ్యక్తి జె ఆర్ డి టాటా. టాటా ఎప్పుడూ భద్రత మీద నిర్వహణ మీద దృష్టి సారించేవారు. అప్పుడే పరిశుభ్రమైన సౌకర్యవంతమైన ప్రయాణం అందించగలమనే వారు. చాలా నిరాడంబరునిగా ఉంటూ తన చుట్టూ ఉండేవాళ్లను సాధ్యమైనంత బాగా పనిచేయమని కోరేవారాయన. ఒక ప్రత్యేక సందర్భాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఒకసారి బాలిగాకు, ఆయన భార్యకు జెనీవా నుంచి లండన్‌కు స్విస్ ఎయిర్ లో కన్ఫర్మ్ అయిన టికెట్లున్నాయి. విమానం అప్పటికే నిండిపోవటంతో టాటా కు టికెట్ దొరకలేదు. బాలిగా సర్టిఫైడ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అయి ఉండటంతో పైలెట్‌తో మాట్లాడి కాక్ పిట్‌లో కూర్చోటానికి అనుమతి సంపాదించాడు. ఆ విధంగా తన సీటు టాటా కి ఇప్పించాడు. విమానం దిగుతున్నప్పుడు బాలిగ భార్య లగేజ్ పట్టుబట్టి మరీ టాటా మోసుకుంటూ వచ్చారు.

ఆయన మానవత్వం, నిరాడంబరత తన హృదయాన్ని తాకిందంటాడు బలిగ. మూర్తీభవించిన నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని, అందుకే జీవితంలో ఎలా ఉండాలో చెప్పిన మార్గదర్శి ఆయనేనని గుర్తు చేసుకుటారు.

ఇందిరా గాంధీతో సంభాషిస్తూ...

ఇందిరా గాంధీతో సంభాషిస్తూ...


మేటి ఇంజనీరే కాదు.. మెరుగైన ఆటగాడు కూడా... 

బాలిగా ఐదు దశాబ్దాలకు పైగా విమానయానరంగంలో గడిపినప్పటికీ అది మాత్రమే ఆయనకు నచ్చిన పని కాదు. ఆయన మంచి క్రీడాకారుడు కూడా. ఎయిరిండియా తరఫున టెన్నిస్, హాకీ, సాకర్ పోటీల్లో పాల్గొన్నాడు. ఎయిరిండియా స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగా, ఆలిండియా పబ్లిక్ సెక్టార్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా, 1973-77 మధ్య ఖార్ జింఖానా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆయనను, ఎయిరిండియా మహిఉళా హాకీ జట్టును ఒకసారి ఇందిరా గాంధీ తేనీటి విందుకు ఆహ్వానించారు. ఒక దశలో ఎయిరిండియాకు మహిళా హాకీ జట్టు లేనే లేదు. అందుకే రెండేళ్ళలోనే జట్టును తయారుచేసి నేషనల్ విమెన్స్ హాకీ చాంపియన్ షిప్ గెలుచుకునేట్టు చేశారాయన.

చాలా ఏళ్ళ తరువాత షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా విడుదలైనప్పుడు బాలిగా ఫ్రెండ్స్ చాలామంది అది ఆయన జీవిత కథేనా అంటూ ఆటపట్టించేవారు. ఎందుకంటే, విమెన్స్ హాకీ టీమ్ కి కోచ్ గా ఆయన చేసిన కృషి సహా చాలా విషయాలలో అలాంటి పోలిక ఉంది మరి!

రిటైరయ్యాక జీవితం

బాలిగా ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ మధ్యే చిన్నపాటి గాయమయ్యేదాకా ఆటల్లోనూ చురుగ్గా ఉన్నారు. గాయం ఆయనను బలవంతంగా ఆటలకు దూరంగా ఉంచింది. అమెరికాలో స్థిరపడ్డ కొడుకులూ, కూతురూ వచ్చి వెళుతుంటారు. బాలిగా కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు. జె ఆర్ డి మెమోరియల్ ట్రస్ట్ లో ఒక ట్రస్టీగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ మధ్యనే ఆయన ముంబయ్ నుంచి బెంగళూరుకు మకాం మార్చారు.

“ విమానయాన సంస్థ ప్రారంభంచటం ఎలా “ ( How to start an airline ) అనే నివేదిక రూపకల్పనలో బాలిగా పాలుపంచుకున్నారు. అందులో సాంకేతిక, యాజమాన్య పరమైన అంశాలను ఒక కంపెనీ ఎలా అనుసరించాలో రాశారు. ఆసియాలో వస్తున్న అనేక కొత్త ఎయిర్ లైన్స్ కంపెనీలకు అదొక మార్గదర్శి.

భార్యతో కలిసి బిపి బలిగ

భార్యతో కలిసి బిపి బలిగ


భారత వైమానికరంగం ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ, ఈ రంగంలో కొత్త కంపెనీలకు పరిస్థితి సానుకూలంగా లేకపోయిన ఇంజనీర్లకు మాత్రం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటున్నారు. ముందు ముందు అద్భుతమైన రవాణా రంగంగా పేరు తెచ్చుకుంటుందని అంచనావేస్తున్నారు. కష్టపడి పనిచేయటాన్ని మించినది మరొకటి లేదన్నది యువతకు ఆయన ఇస్తున్న సలహా. ప్రతి టాస్క్‌నూ ఒక సవాలుగా తీసుకున్నప్పుడే ఫలితాలు ఆటోమేటిక్‌గా అనుకూలంగా ఉంటాయంటారు. 78 ఏళ్ళ వయసులోనూ ఇంత చురుగ్గా ఉండటంలో రహస్యమేంటని అడిగితే, మనకు మన పరిమితులు తెలియాలంటారు. రిటైర్ కావాలని అనుకున్నప్పుడల్లా చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రోత్సహించి మరింత పనిచేసేలా చేశారంటారు. 2015 జనవరి 1 బాలిగా 59 వ పెళ్ళిరోజు. 60వ వైవాహిక జీవిత సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా బాలిగా దంపతులకు యువర్ స్టోరీ అభినందనలు తెలియజేస్తోంది

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags