సంకలనాలు
Telugu

ఆన్ లైన్ కల్యాణ వైభోగమే..

దూసుకెళ్తున్న పెళ్లి సేవల స్టార్టప్స్

SOWJANYA RAJ
17th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


పెళ్లిళ్లు స్వర్గంలోనే ఫిక్సవుతాయట. సరే.. ఆ మాట సంగతి ఎలా వున్నా.. జరిగేది మాత్రం భూమ్మీదే. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట అంటూ ఉపమానాలు చెప్తుంటాం..?. అయితే పెళ్లి చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. సవాలక్ష వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా... అంటే చివరికి పప్పులో ఉప్పు తక్కువైనా అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. పెళ్లి ఎంత వైభవంగా జరిగిందనేది పక్కన పెడతారు. 

అందుకే పెద్దలు "ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు" అని ఊరికే అనలేదు. ఇల్లు సంగతేమో కానీ పెళ్లి మాత్రం పెద్దలు చెప్పినంత కష్టం కాదు ఇప్పుడు. ఎందుకంటే వధూవరుల తల్లిదండ్రులకు ఇప్పుడు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి ఆన్ లైన్ మ్యారేజ్ రిలేటెడ్ స్టార్టప్స్. భారతీయ పెళ్లిళ్ల మార్కెట్ లో మంచి వాటాను కైవసం చేసుకునేందుకు రేసులో పరుగులు పెడుతున్నాయి.

షడ్రసోపేత "మ్యారేజ్ మార్కెట్"

ఇండియాలో ఏడాదికి దాదాపుగా కోటి పెళ్లిళ్లు జరుగుతుంటాయని అంచనా. సగటును ఒక్కో పెళ్లికి రూ.20 లక్షల వరకూ ఖర్చు పెడతారు. మన సమాజంలో పెళ్లిళ్లు వైభవంగా చేయడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడరు తల్లిదండ్రులు. అయితే తమకు తాము "ది బెస్ట్" కావాలని కోరుకుంటారు. కొన్నాళ్ల క్రితం వరకు బంధుమిత్రుల ఇళ్లలో జరిగిన పెళ్లిళ్లలో ఎవరు బాగా చేశారో వారినే ఎంపిక చేసుకునేవారు. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నాయి కొత్తతరం స్టార్టప్స్. ఒక్క సింగిల్ యాప్ తో పెళ్లి మొత్తాన్ని కోఆర్డినేట్ చేయగలిగే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. జంట ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోవడం, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రెండు వైపులా సోషల్ ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేయడం.. వధూవరుల కుటుంబాలు రెండూ ఐడియాస్ షేర్ చేసుకుని పెళ్లి పనులు చేసుకోవడం.. ఇలాంటి సేవలు ఈ స్టార్టప్స్ అందిస్తున్నాయి.

" భారత్ లో పెళ్లిళ్ల మార్కెట్ ఇంకా వ్యవస్థీకృతం కాలేదు. ఇందులో గొప్ప సేవలు అందించడానికి అవకాశం ఉంది. ఆన్ లైన్ పోర్టల్స్.. సర్వీస్ ప్రొవైడర్స్ వివరాలు అందించడం కన్నా ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.." హేమంత్ కనాకియా

హేమంత్ కనాకియా ఆలోచనలకు తగ్గట్లుగా నడుస్తున్న స్టార్టప్ "వెడ్ మి గుడ్.కామ్. హేమంత్ ఇందులో పెట్టుబడి పెట్టారు. ఇందులో ఇటీవల పెళ్లి చేసుకున్న జంటల ఫోటోలను సైట్ లో అందుబాటులో ఉంచుతారు. పెళ్లికి పనిచేసిన సంస్థలు, వ్యక్తులు తదితర వివరాలనూ ఉంచుతారు. పెళ్లి జరిగిన సిటీలోని వెడ్ మి గుడ్ యూజర్స్ రివ్యూలను అందుబాటులో ఉంచుతారు. పెళ్లి వైభోగాన్ని, దానికి పనిచేసిన వారి పనితనాన్ని అలాగే సమీక్షలను చదివి యూజర్స్ తమకు కావాల్సిన వారికి ఎంపిక చేసుకోవచ్చు. వెడ్ మి గుడ్ యాప్ కి ఇప్పుడు నెలకు మూడు లక్షల మంది విజిటర్స్ ఉన్నారు. పదిశాతం చొప్పున పెరుగుదల నమోదు చేస్తోంది. ప్రారంభించిన మూడు నెలల్లోనే పదిహేను వేల మంది యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2020 కల్లా మార్కెట్ లో కనీసం 20 శాతం గ్రోథ్ సాధించాలని వెడ్ మి గుడ్ ఫౌండర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియన్ ఎంజెల్ నెట్ వర్క్ ద్వారా హేమంత్ కనాకియా, అలోక్ మిట్టల్ వెడ్ మి గుడ్ లో రూ.2 కోట్ల 70లక్షల పెట్టుబడి పెట్టారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న ఈ దశలో వెడ్ మి గుడ్ లాంటి యాప్ లకు మంచి భవిష్యత్ ఉందని అలోక్ మిట్టల్ అంచనా వేస్తున్నారు.

image


అందుకున్నన్ని అవకాశాలు

ఆఫ్ లైన్ మార్కెట్ లో ఉన్న పరిమితులు ఆన్ లైన్ మార్కెట్ కు ప్లస్ పాయింట్లని వెడ్డింగ్ సేవలు అందించే మరో యాప్ ఇన్ డియర్.ఇన్ విశ్లేషిస్తోంది. భారతదేశ జనాభాలో సగం యువతరం. అంతా పాతికేళ్లలోపు వారే. అందరూ టెక్నికల్ గా పరిజ్ఞానం ఉన్నవాళ్లే. ఇంటర్నెట్ ను యూజ్ చేసేవాళ్లే. ఆన్ లైన్ సేవలు పొందడంలో ఉన్న సౌలభ్యాన్ని చవిచూసినవారే. అందుకే పెళ్లిళ్ల విషయంలో ఆన్ లైన్ లో సమాచారం సేకరించడానికి ...సేవలు పొందేందుకు వెనుకాడటం లేదు. 2014లో సన్నా వోహ్రా ఇన్ డియర్.ఇన్ ను ప్రారంభించారు. దీని ద్వారా వెడ్డింగ్ వెండర్స్, డిజైనర్స్ నుంచి నేరుగా సేవలను పొందొచ్చు..వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అలాగే వినియోగదారులు కూడా తమ ఆలోచనలను..తమకు అవసరమైన వాటి గురించి యాప్ లో పిన్ చేయవచ్చు. ఇరు కుటుంబాలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా జరిగిన బుకింగ్స్ తో ఇన్ డియర్.ఇన్ కు కమిషన్ వస్తుంది. తాజ్ గ్రూప్ హోటల్స్ తో పాటు ప్రసిద్ధ డిజైనర్లు అబు జాని-సందీప్ ఖోస్లా, రీతూకుమార్, అనితా డోంగ్రే, అమ్రపాలి అలాగే ఫోటోగ్రఫి సేవలు అంది వెడ్డింగ్ ఫిల్మర్ లాంటి సంస్థలతో ఒప్పందాలు Indear.inని రేసులో అగ్రభాగంలో నిలబెడుతున్నాయి.

సన్నా వోహ్రా, indear.inఫౌండర్<br>

సన్నా వోహ్రా, indear.inఫౌండర్


పెళ్లి సంబంధాలూ చూసిపెడతారు..!

అన్ లైన్ మార్కెట్ విస్తరిస్తున్న్ దశలో పెళ్లి సంబంధాల వెబ్ సైట్స్ బాగా పేరు తెచ్చుకున్నాయి. మ్యాట్రిమోని వెబ్ సైట్లకు లెక్కేలేదు. కానీ టెక్నాలజీ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్నదశలో కొత్త వాటికీ ఎంతో కొంత మార్కెట్ ఉంటూనే ఉంటుంది. కొద్దిగా భిన్నంగా ఆలోచిస్తే గెలుపూ సునాయాసమే. నాగపూర్ లో గతఏడాది ప్రారంభమైన స్టార్టప్ మేరీవివాహ్.కామ్ రోజుకు ఐదు నుంచి ఆరు వందల మంది విజిటర్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే 3,500 KYC అప్రూవ్డ్ ప్రొఫైల్స్ ను ఈ సంస్థ వద్ద రిజిస్టర్ అయ్యారు. 20 జంటలకు తమ సైట్ ద్వారా పెళ్లిళ్లు చేశారు.

మేరావివాహ్ బృందం <br>

మేరావివాహ్ బృందం


పెళ్లి పనులకు వెడ్డింగ్జ్.ఇన్

పెళ్లితో ముడిపడి ఉన్న అన్ని పనులకు చక్కని సొల్యూషన్స్ చూపించే స్టార్టప్ Weddingz.in. పెళ్లి వేదికలు, నైపుణ్యం కలిగిన వ్యక్తుల సేవలను అందించే అందించే విషయంలో ఈ స్టార్టప్ తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ఢిల్లీ, బెంగళూరు, గోవా సహా పది నగరాలకు సేవలను విస్తరించింది. ఈ ఏడాది లో కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లకు తమ సేవలు విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.

" పెళ్లి అనేది ఓ ఉత్పత్తో, సేవనో కాదు. వేదిక నుంచి బడ్జెట్ వరకు అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరు ప్రధాన నగరాల్లో కస్టమర్ల ఎక్కడికక్కడ అభిరుచులు వేరుగా ఉన్నాయి. ఇది మరింత క్రియేటివ్ గా సేవలు అందించేందుకు మాకో గొప్ప అవకాశంగా భావిస్తున్నాం" సందీప్ లోథా, వెడ్డింగ్జ్.ఇన్ ఫౌండర్

Weddingz.in బృందం<br>

Weddingz.in బృందం


పెళ్లి మార్కెట్ "షాదీసాగా"

కొన్నాళ్లుగా పెళ్లి సంబంధిత మార్కెట్ లో స్టార్టప్ సేవలు అందిస్తున్న షాదీ సాగాలో ఔట్ బాక్స్ వెంచర్స్ పెట్టుబడులు పెట్టింది. మరిన్ని విభాగాలు, నగరాలకు విస్తరించేందుకు షాదీసాగా ప్రణాళికలను చురుగ్గా అమలు చేస్తోంది. పదిహేను వందల మందికిపైగా సర్వీస్ ప్రొవైడర్స్ షాదీషాగాలో నమోదు చేసుకున్నారు. వచ్చే రెండేళ్లలో 20నగరాలకు విస్తరించడంతో పాటు ఏడాదికి 20వేల పెళ్లిళ్లకు సేవలు అందించాలని ఫౌండర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

"కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోని ప్రధాన నగరాలను నేను కవర్ చేశాను. మైసూరు, బెంగళూరు నుంచి ఎక్కువ ప్రాజెక్టులు పొందారు. ఒక్కో పెళ్లికి రూ.60 నుంచి 70 వేల వరకు ఫీజు వసూలు చేస్తాను" అతిథి దినకర్, షాదీసాగాలో రిజిస్టర్ చేసుకున్న ఫోటోగ్రాఫర్

 అతిథి దినకర్,  ఫోటోగ్రాఫర్

అతిథి దినకర్, ఫోటోగ్రాఫర్


ఆదాయానికి మార్గాలు అనంతం

వెడ్డింగ్ స్టార్టప్స్ రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వెడ్ మి గుడ్ క్లాసిఫైడ్ మోడల్ లో వెండర్స్ ప్రకటనల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. త్వరలోనే ట్రాన్సాక్షన్ మోడల్ లోకి కూడా మారి ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ స్టార్టప్ నెలకు 15 శాతం చొప్పున ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తోంది. మేరావివాహ్.కామ్ మెంబర్ షిప్ ప్లాన్స్ ద్వారా రెవిన్యూ ని జనరేట్ చేస్తోంది. త్వరలో పెళ్లి సేవలు అందించే క్యాటరర్స్, ఫ్లోరిస్ట్స్, డిజైనర్స్ ఇలా అన్ని విభాగాల వారిని పెయిడ్ మెంబర్లుగా చేర్చే సన్నాహాల్లో ఉంది. సేల్స్, మార్కెటింగ్ పార్టనర్ గా వ్యవహిరిచేలా వీరు తదుపరి ప్లాన్ ను రెడీ చేసుకుంటున్నారు.

ఏ ప్రాంతంలో జరిగినా... ఏ సామాజికవర్గంలో జరిగినా.. పెళ్లి భోజనం షడ్రసోపేతమే. ఈ మార్కెట్ ఎంత రుచిగా ఉంటుందో వెడ్డింగ్ సేవలు అందించే స్టార్టప్స్ ఈజీగానే అంచనా వేశాయి. సేవలు విస్తరిస్తూ వైభోగం అంతా తమదే అనేలా విస్తరిస్తున్నాయి. వీటి దూకుడు చూసి ఇటు సేవలు అందించేవారు, పొందేవారే కాదు.. వినియోదారులు కూడా అంటున్నారు... "అన్ లైన్ కల్యాణ వైభోగమే" అని...

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags