గర్భిణిల కోసం స్మార్ట్ బ్యాంగిల్.. ఏం జరిగినా అలర్ట్ చేస్తుంది

గర్భిణిల కోసం స్మార్ట్ బ్యాంగిల్.. ఏం జరిగినా అలర్ట్ చేస్తుంది

Friday May 19, 2017,

3 min Read

కాలం మునుపటిలా లేదు. అనేక వ్యాధులు స్వైర విహారం చేస్తున్న రోజులివి. ఒకప్పుడు ఏం తిన్నా శరీరం హరాయించుకునేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ముఖ్యంగా గర్భిణిలకు. థైరాయిడ్ మొదలుకొని, కాల్షియం నుంచి కామెర్ల దాకా- ఎప్పుడేం ఎటాక్ చేస్తుందో తెలియదు. పట్టణాలు, నగరాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉండొచ్చుగాక. కానీ మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఏంటి? అందునా గర్భిణల ఆరోగ్యం సంగతేంటి? సరైన వైద్య సలహా ఉండదు. టైంకి మెడిసిన్ అన్నమాటకు వాళ్లు ఆమడ దూరం. తినే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా అర్ధం కాదు. మొదటి నెల నుంచి ప్రసవం దాకా దేవుడి మీద భారం వేయాల్సిందే!

image


గర్భిణులు నెలనెలా మెడికల్ చెకప్స్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అసలు ఏం జరుగుతోందో తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాలా వద్దా అన్నది అర్ధమవుతుంది. అలాంటి అలర్ట్స్ ఇవ్వడానికి కనిపెట్టిందే హైటెక్ స్మార్ట్ బ్యాంగిల్. కలర్ ఫుల్, లైట్ వెయిట్ బ్యాంగిల్ ధరించిన గర్భిణులకు ఠంచనుగా మెడికల్ అలర్ట్స్ ఇస్తుంది. హైటెక్ అన్నాం కదాని ఇదేదో అర్బన్ వాళ్లకు సంబంధించిందే అనుకుంటే పొరపాటే. మారుమూల గ్రామీణ మహిళలు సైతం ఈజీగా అర్ధం చేసుకునేలా ఉంటుంది.

డ్యూరబుల్ ప్లాస్టిక్ తో తయారు చేసిన ఈ బ్యాంగిల్ నీళ్లలో తడిసినా పాడవదు. రెగ్యులర్ గాజులాగే ధరించవచ్చు. బ్యాటరీ కూడా పదేపదే మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ధరిస్తే 9 నెలల వరకు చార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు.ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఒకేసారి వాడి పడేసిది కూడా కాదు. ఎన్నిసార్లయినా పనికొస్తుంది.

ఇంటెల్ కార్పొరేషన్- బంగ్లాదేశ్ నాన్ ప్రాఫిట్ గ్రామీణ్ ట్రస్ట్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తిగా గర్భిణి మహిళల కోసమే. ఇప్పటికీ చాలాచోట్ల మొబైల్ కనెక్టివిటీ మహిళల దాకా రాలేదు. ఇంట్లో మగవాళ్లే ఫోన్ చేస్తారు. ఏదో అవసరానికి మాట్లాడ్టం తప్ప, వాళ్లకంటూ సొంతంగా ఫోన్ లేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి నైపుణ్యం లేకుండానే బ్యాంగిల్ ద్వారా అవసరమైన మెడికల్ హెల్ప్ పొందవచ్చు. ఎప్పటికప్పుడు ఆడియో ద్వారా వాళ్లను అలర్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు చేపట్టిన మరో మంచి పని ఏంటంటే.. మెటర్నల్ హెల్త్ కోసం మొబైల్ యాప్స్.

దక్షిణ ఆసియా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ కలర్ ఫుల్ బ్రేస్ లెట్ ని రూపొందించారు. ఫిట్ నెస్ బ్యాండ్స్, స్మార్ట్ వాచీలను కాపీ కొట్టి చేసింది కాదు. వారానికి రెండు సందేశాలను పంపిస్తుంది. అది కూడా లోకల్ లాంగ్వేజీలోనే. పిండం ఎదుగుదలను బట్టి ఏం తినాలి? శరీరం బరువుని బట్టి ఏం తినకూడదు.. ఏ సమయంలో డాక్టర్ ని కలవాలి లాంటి సందేశాలను పంపిస్తుంది.

ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నిండు గర్భంతో ఉన్నా కూడా నీళ్లు తెస్తుంటారు. వంట వండుతుంటారు. అది కూడా కట్టెల పొయ్యిమీద. గంటల కొద్దీ పొగలో ఉంటారు. అదెంత హానికారకమో రూరల్ ఏరియాలో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేయడంలో బ్యాంగిల్ చక్కగా పనిచేస్తుంది. పొగ ఎక్కువైంది దూరం వెళ్లిపో, లేదంటే ప్రమాదం అని అర్ధం వచ్చేలా మోగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రోజుకి 830 మంది ప్రసవ సంబంధమైన వ్యాధులతో కన్నుమూస్తున్నారు. ఈ మరణాల్లో మూడోవంతు దక్షిణ ఆసియాలోనే సంభవిస్తున్నాయి. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని మారుమూల గ్రామాల్లోనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి.

బంగ్లాదేశ్ లాంటి దేశంలో 70 శాతం ప్రసవాలు ఇళ్లలోనే జరుగుతాయి. ఆసుపత్రులకి వెళ్లరు. అందుకే ప్రసవ మరణాల సంఖ్య ఆ దేశంలో ఏడాదికి 5వేల ప్రసవ మరణాలు నమోదవుతున్నాయి. ఇంకా విషాదం ఏంటంటే నెలలు నిండని మరణాలు 77వేల పైచిలుకే.

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ పరిశోధన ప్రకారం జనం స్మార్ట్ వేరబుల్ డివైజ్ గురించి మాట్లాడుతున్నారు. స్మార్ట్ వాచీలు, బ్యాండ్స్, షూస్, ఇతరాత్ర వాటి గురించి వాకబు చేస్తున్నారు. అందుకే స్మార్ట్ మార్కెట్ నానాటికీ పుంజుకుంటోంది. గత ఏడాది 2.5 మిలియన్ డివైజెస్ అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యలోనే బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ లాంటి దేశాల్లో స్మార్ట్ పరికరాల ప్రారంభ ధర 12 డాలర్ల నుంచి 15 డాలర్లుగా ఉంది.