సంకలనాలు
Telugu

యూరోప్ కంపెనీ ఉద్యోగం వదిలేసి స్నాక్స్ స్టార్టప్‌ !

Krishnamohan Tangirala
28th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

స్టార్టప్ ఐడియాలు ఎప్పుడు ఎక్కడ ఎలా పుడతాయో చెప్పాలంటే చాలా కష్టం. అనుకోకుండా వచ్చే ఆలోచనలు బిజినెస్‌లుగా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఇలా హఠాత్తుగా వచ్చిన ఐడియాతో పుట్టిన కంపెనీ ఎక్స్‌పిడైట్ ఫుడ్స్. ఓ యూరోపియన్ కంపెనీకి చెందిన భారతీయ విభాగానికి సేల్స్ ఆపరేషన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహించేవారు ఎక్స్‌పిడైట్ ఫుడ్స్ వ్యవస్థాపకుడు అభినవ్ గుప్తా.

ఆ సమయంలో ఓ రోజు ఉదయాన్నే బరోడా వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అభినవ్. కాస్త ముందుగానే చేరుకోవడంతో.. భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక ఆర్టికల్ చదివారు. ఇదే ఆయన జీవితాన్ని మార్చేసిన ఘటనగా చెప్పుకోవాలి. వందకోట్లకు పైగా జనాభా ఉండడమే భారతదేశానికి అతి పెద్ద శక్తి అని అర్ధమైంది ఆయనకు. కొన్ని వారాల పాటు ఆలోచన, పరిశోధన, ప్రణాళికల తర్వాత.. స్నాక్స్ తయారీ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు అభినవ్.

ఇలా పజిల్ స్నాక్స్ బ్రాండ్‌పై ఎక్స్‌పిడైట్ ఫుడ్ కంపెనీకి బీజం పడింది. గుజరాతీ ఫ్లేవర్ నుంచి ఇండియన్ సాల్టెడ్ వరకూ.. పజిల్ బ్రాండ్‌పై 24 రరకాల స్నాక్స్ అందుబాటులో ఉండడం విశేషం.

image


తయారీ స్టార్టప్‌కి ఎదురయ్యే ప్రమాదాలు

“ఈ ఆలోచన క్లిక్ అవుతుందనే నమ్మకం నాకున్నా.. ఎవరూ నాకు మద్దతు ఇవ్వలేదు. తయారీ రంగంలో వ్యాపారం చేయడమంటే ఎంతో ప్రమాదం అని చాలా మందే చెప్పి చూశారు నాకు. ఈ ఆలోచన ఎంత మాత్రం సరికాదని నచ్చజెప్పారు కూడా. అయినా సరే వెంచర్‌పై వెనుకాడని నేను.. పొదుపు చేసిన మొత్తం సొమ్మును ఇందులో పెట్టేశాను. ఇంకా డబ్బులు అవసరమైనపుడు.. కొంతమంది మాత్రమే సహాయం చేసేందుకు ముందుకొచ్చార”ని చెప్పారు అభినవ్.

అన్ని దారులు మూసుకుపోతున్న సమయంలో.. కజిన్ ఒకరు సీడ్ ఫండింగ్ చేసి అభినవ్‌కి సాయం చేశాడు. “ఒక్క ఫోన్ కాల్‌తో అతన్ని ఎలా ఒప్పించగలిగానో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. దీర్ఘ కాలం వ్యాపారంలో ఉండగలననే నమ్మకం అతనికి లేదు. అయినా సరే సహాయం చేసేందుకు అంగీకరించాడు. నన్ను సరైన మార్గంలో నడవాల్సిందిగా ప్రోత్సహించాడ”ని గుర్తు చేసుకున్నారు అభినవ్.

ఇలా ఫండింగ్ అందినా.. మాన్యుఫాక్చరింగ్ రంగంలో వ్యాపారం ఏర్పాటు చేయడం చాలా క్లిష్టమైన విషయంగా చెప్పాలి. వెంచర్ ప్రారంభం నుంచే సరైన ప్రొడక్ట్స్‌నే విక్రయించాలన్నది అభినవ్ ఆలోచన. నాణ్యత విషయంలో రాజీపడకూడదని భావించినా.. క్వాలిటీకి సంబంధించిన సమాచారం ఈయన దగ్గర లేదు. దీంతో మార్కెట్‌పై పరిశోధన చేయాల్సి వచ్చింది.

“ప్రతీ రోజు ఉదయాన్నే ఆరు గంటలకు బయల్దేరి, దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్లి ఆర్డర్స్ తీసుకునేవాడిని. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకునేవాడిని. రాత్రి 11 గంటలకు కానీ నా షెడ్యూల్ పూర్తయ్యేది కాదని” అభినవ్ చెప్పారు.

ఇన్ని సమస్యలు ఎదుర్కుని సప్లయ్ ప్రారంభించినా.. మొదటి డెలివరీ తర్వాత మళ్లీ ఆర్డర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకిలా అనే ప్రశ్న అభినవ్‌ను వెంటాడింది. సమస్య ఏంటో తెలుసుకునేందుకు కస్టమర్స్ దగ్గరకు వెళ్లారు. శాంపిల్స్‌లో ఉన్నంత నాణ్యత.. తుది ప్రోడక్ట్‌లో లేదని తేల్చేశారు వారు. తన సొంత ప్లాంట్‌లోనే పరిశోధన చేసిన తర్వాత.. తాను బయటకు వెళ్లినపుడు వర్కర్స్ సరిగా పని చేయడం లేదనే విషయం తెలిసింది అభినవ్‌కి.

“వాస్తవంగా చెప్పాలంటే ఇదో విష వలయం లాంటిది. ఒకవైపు నేను ఊరూరా తిరిగి కస్టమర్స్‌ను సంపాదించి, ఆర్డర్స్ తెచ్చుకుంటుంటే.. సొంత ప్లాంట్‌లో పనివాళ్లే నేను లేనపుడు నాణ్యత పాటించడం లేదు. మళ్లీ అన్ని ఊళ్లు తిరిగి డిస్ట్రిబ్యూటర్స్‌ను అపాయింట్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో విసుగు చెందిన నేను మొత్తం ప్రొడక్షన్ టీంని మార్చేసి.. క్వాలిటీ కోసం మెషీన్లను తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేశాన”న్నారు అభినవ్.

ఈ సంఘటన తనకు గుణపాఠం నేర్పిందంటారు అభినవ్. ఏ స్టార్టప్‌కయినా ప్రతీ విషయానికీ ఫౌండర్ బాధ్యత వహించాల్సిందేనని తెలిసొచ్చింది అంటారాయన. ఉత్పత్తి నుంచి అమ్మకాలకు వరకు బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిందే. ప్రారంభం రోజుల్లో వేరేవారిని నమ్మి పని అప్పచెప్పడం పెద్ద తప్పు అంటున్నారు అభినవ్.

అభినవ్ గుప్తా, ఎక్స్‌పిడైట్ ఫుడ్స్ ఫౌండర్

అభినవ్ గుప్తా, ఎక్స్‌పిడైట్ ఫుడ్స్ ఫౌండర్


టీం బిల్డింగ్

ఇతర స్టార్టప్‌ల మాదిరిగానే... టీం నిర్మాణం క్లిష్టమైన విషయం అంటున్నారు అభినవ్. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఇది సంక్లిష్టమైన అంశంగా చెబ్తున్నారు. ఆయా పనుల కోసం నియమించుకునే వ్యక్తుల్లో ఎటువంటి లక్షణాలు ఉండాలో.. తెలియకపోవడం కూడా ఇబ్బందిగానే అనిపించింది. అయితే ప్రారంభ నియామకాల్లో కొన్ని తప్పులు చేసినా.. మెల్లగా వాటిని సరిదిద్దుకున్నారు అభినవ్.

అమ్మకాల విభాగానికి సంబంధించి కూడా నియామకం సమస్యగానే పరిణమించింది. చిన్న కంపెనీ కావడం, బ్రాండ్ ఇంకా పాపులర్ కాకపోవడంతో.. అనేక మంది టీంలో చేరడానికి ఇష్టపడలేదు. వీటితోపాటు.. నిధుల సమస్యని ఇప్పటికీ అభినవ్ ఎదుర్కుంటూనే ఉన్నారు.

తమ బ్రాండ్‌ నిర్మాణానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంటారు అభినవ్. “ఇందుకోసం అన్ని రకాల పద్ధతులను అవలంభిస్తున్నాం. పూర్తి స్థాయి వ్యూహ నిర్మాణం, సమాచార వ్యవస్థ గల బ్రాండ్‌గా మారేందుకు మాకు ఇంకా ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నా” మని చెప్పారు అభినవ్.

ఆదాయం, అభివృద్ధి

ఏప్రిల్ 2012లో ప్రారంభమైన ఎక్స్‌పిడైట్ ఫుడ్స్.. ఏటా లాభాల్లో 100శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఈ వృద్ధి రేటును రాబోయే మరికొన్నేళ్లపాటు కొనసాగిస్తామని టీం నమ్మకంగా ఉంది. కొత్త సేల్స్ టీం నియామకం ద్వారా.. మరింత మంది డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లను తమ నెట్వర్క్‌లో భాగం చేసుకుంటున్నారు. త్వరలో ఇప్పటి కంటే వేగంగా అభివృద్ధి సాధిస్తామని ధీమాగా చెబ్తున్నారు.

కేంద్ర ఆహార శాఖ చెబ్తున్న గణాంకాల ప్రకారం మన దేశంలో స్నాక్స్ ఇండస్ట్రీ విలువ ₹10వేల కోట్లు. బ్రాండెడ్ రంగంలో వెయ్యికిపైగా స్నాక్స్, 300లకు పైగా పానీయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. నమ్‌కీన్‌వాలే, ఇందుబెన్ ఖాక్రావాలే వంటి స్టార్టప్‌లతో పాటు.. హల్దీరామ్స్, ఆనంద్ వంటి కార్పొరేట్‌లు కూడా ఈ రంగంలో ఉన్నాయి. అయినాసరే.. పజిల్ బ్రాండ్‌తో.. పెద్ద కంపెనీగా ఎదుగుతామని నమ్మకంగా ఉంది ఎక్స్‌పిడైట్ ఫుడ్స్. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రస్తుతం స్థలాన్ని సేకరించే పనిలో ఉన్నారు.

“అమ్మకాల విషయంలో సాహసోపేతమైన లక్ష్యాలనే నిర్ణయించుకున్నాం. దీన్ని అందుకోవడానికి 24 గంటలు కష్టపడేందుకైనా మేం సిద్ధం. బ్రాండ్ నిర్మాణం కోసం మార్కెటింగ్ కన్సల్టెంట్స్‌ను సంప్రదిస్తున్నాం. ప్రధానంగా సెకండరీ అర్బన్ ప్రాంతాలే మా టార్గెట్‌ మార్కెట్‌గా నిర్ణయించాం. ముందు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానం పదిలం చేసుకుని.. అప్పుడు మెట్రో నగరాల్లోకి విస్తరించేలా వ్యూహం సిద్ధం చేసుకున్నామ”ని చెబ్తున్నారు అభినవ్.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags