ఆమె కాలి అందెలసవ్వడి ముందు తలవొంచిన కేన్సర్‌ !!

కేన్సర్‌ మహమ్మారిని జయించిన కళాకారిణి--అటు రైల్వే ఉద్యోగిగా.. ఇటు డాన్సర్‌ గా--సంగీత కళామతల్లికి నిత్యనృత్యాభిషేకం--

2nd Dec 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఆశ- కేన్సర్ ఉన్నవాణ్ణి కూడా బతికిస్తుంది. భయం- అల్సర్ ఉన్నవాణ్ణి కూడా చంపేస్తుంది. ఓ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్. అంతేకదా మరి! మనసులో సంకల్పం గట్టిగా ఉండాలేగానీ.. ఏ పోరాటమైనా గెలుపు తీరాన్ని ముద్దాడి తీరాల్సిందే. చరిత్రలో అలాంటి విజయాలు అనేకం. డాన్సర్ ఆనంద స్టోరీ కూడా అలాంటిదే.

ఎందరికో ఆదర్శం

ఆర్ట్ నెవర్ డైస్‌! ఆర్టిస్టు కూడా! కళను నమ్ముకున్నవారు.. కళతో జీవితాన్ని పెనవేసుకున్నవారు.. కళను ఆరాధించేవారు- చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కేన్సర్ మహమ్మారి ఆవహించినా మొక్కవోని ఆత్మవిశ్వాసం ఆనందను అంత ఎత్తున నిలబట్టింది. ఓ ఆర్టిస్టుగా.. ఓ ఇల్లాలిగా.. ఓ అధికారిగా.. అన్నింటికీ మించి ప్రాణాంతక క్యాన్సర్ ను జయించిన వీరనారి ఆనంద శంకర్ జయంత్ ఎందరికో స్ఫూర్తి. భర్త జయంత్ ఇచ్చిన ఆత్మస్థైర్యం, మోముపై చెదరని చిరునవ్వు, ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన నృత్యం. ఇవే పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ విజయ రహస్యాలు. భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతుల్లో దేశం గర్వించదగిన డ్యాన్సర్లలో ఒకరిగా ఎదిగిన ఆనంద జీవితం ఎందరికో ఆదర్శం.

image


నాలుగేళ్లకే కాలికి గజ్జె

చెన్నైలో జన్మించిన ఆనంద- తల్లి ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసులో తొలిసారి కాలికి గజ్జె కట్టారు. చెన్నైలోని కళాక్షేత్రలో ఆరేళ్లపాటు శిక్షణ. భరతనాట్యంతోపాటు కర్నాటక సంగీతం, వీణ, కొరియోగ్రఫీ నేర్చుకున్నారు. తర్వాత పసుమర్తి రామలింగశాస్త్రి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు.శిక్షణ పూర్తయిన తర్వాత కొందరు విద్యార్థులకు భరతనాట్యం నేర్పుతూనే చదువుపై దృష్టి సారించారు. కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కంప్లీట్ అయింది. ఆర్ట్స్, హిస్టరీ, కల్చర్ లోనూ మాస్టర్స్ చదివారు.

image


తొలి మహిళా రైల్వేఆఫీసర్ గా..

పీజీ చదువుతున్న రోజుల్లోనే యూపీఎస్సీ పరీక్షలపై ఆసక్తి కలిగింది. అప్పటికే యూనివర్సిటీ టాపర్. ఆ పట్టుదలతోనే యూపీఎస్సీ పరీక్షల్లో పాసై సౌత్ సెంట్రల్ రైల్వేలో తొలి మహిళా ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. మరి ఇటు డాన్స్ అటు ఉద్యోగం ఎలా సమన్వయం చేసుకోవాలి? పైగా జాబ్‌ రైల్వేలో! నాట్యానికి ఉద్యోగం అడ్డంకి కాదని గ్యారెంటీ ఏంటి? రైళ్ల తనిఖీలు, ప్రమాద ప్రాంతాలను సందర్శించడం, కంట్రోల్ రూమ్ డ్యూటీ. ఒక్కసారిగా ప్రపంచం మారిపోయింది. అమ్మకు మాత్రం మాటిచ్చారు. ప్రాణం పోయినా డ్యాన్స్ వదలనని. ఆ మాటైతే ఇచ్చారుగానీ ప్రాక్టికల్‌ గా సాధ్యం కాలేదు. డాన్సూ ఉద్యోగం ఒకే ట్రాక్ మీద నడవలేకపోయాయి. ఇవి రెండూ కావాలంటే ఫ్యామిలీతో గడపడానికి టైం దొరికేది కాదు. ఇలా అయితే లాభం లేదని డాన్స్ ఉద్యోగం- కుటుంబం- ఈ మూడింటినీ షెడ్యూల్ చేసుకున్నారు. ప్రాక్టీస్‌ కోసం మూడు గంటలు. వీకెండ్‌లో మాత్రమే డాన్స్ పెర్ఫామెన్స్‌. సమాజంలోని లింగ భేదాన్ని ప్రశ్నించేలా ఆమె రూపొందించిన వాట్ అబౌట్ మీ అనే నృత్యరూపకం ఎందరినో ఆలోచింపజేసింది. కళారంగంలో ఆమె చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు వరించాయి. 2007లో పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం.

image


ఊహించని షాక్

అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఊహించని కుదుపు. ముప్పయ్ ఏళ్ల నాట్యశిఖరం ఒక్కసారిగా కూలిపోతుందా అనిపించింది. 2008. అమెరికా టూరు ఫిక్సయింది. అంతకు ముందు రోజునుంచే రొమ్ములో ఏదో గడ్డలాగా అనిపించింది. ఎందుకైనా మంచిదని మెమోగ్రామ్ టెస్టు చేశారు. రిపోర్టు రాకముందే ఆవిడ అమెరికా వెళ్లారు. రెండు వారాల తర్వాత తిరుగు ప్రయాణం. రిసీవ్ చేసుకోవడానికి భర్త ముంబై ఎయిర్ పోర్టుకి వచ్చారు. ఆయన వస్తారని ఆనంద ఊహించలేదు. ఆమెను చూడగానే గట్టిగా హత్తుకొన్నారు. ఆరోగ్యం జాగ్రత్త అని మాత్రమే అన్నారు. కేన్సర్ అని చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. కానీ ఆనంద ఊహించగలిగారు. ఆమె స్థానంలో మరొకరైతే పూర్తిగా కుంగిపోయేవారేమో. కానీ ఆమె ఆత్మస్థైర్యం ఏమాత్రం సడలలేదు. ఎందుకంటే ఆమె ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారు.

“ఎలాగూ తప్పించుకోలేనని తెలిసింది. అందుకే మూడు విషయాలు నాకు నేను చెప్పుకొన్నాను. ఒకటి- క్యాన్సర్ నా జీవితంలో ఒక పేజీ మాత్రమే అదే మొత్తం పుస్తకం కాదు. రెండు- నేను క్యాన్సర్ ను జయిస్తాను తప్ప.. అది నన్ను కబళిస్తుందని కుంగిపోను. మూడు- నాకే ఇలా ఎందుకు అని ఎప్పటికీ అనుకోను’ అంటూ తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నారు ఆనంద.

పాదం ఆగలేదు..

కీమోథెరపీ, రేడియాలజీ కారణంగా శరీరం మెత్తబడి నడవడానికే కష్టమవుతుందని డాక్టర్లన్నారు. డ్యాన్స్ ను కొంతకాలం పక్కనపెట్టక తప్పదని సూచించారు. కానీ ఆనంద వాళ్ల మాటలు పట్టించుకోలేదు. డాన్స్ కోసం ఎందాకైనా వెళ్లాలనుకున్నారు. ప్రాణం ఆగినా ఫరవాలేదు కానీ ప్రాణం ఆగొద్దనుకున్నారు.డ్యాన్స్ చేయకుండా నేను ఉండలేను అని కరాఖండిగా చెప్పేశారు ఆనంద. 2009, జులై 7న శస్త్రచికిత్స. ఆరోజు హాస్పిటల్‌కు వెళ్తున్నట్టు కాకుండా.. ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నట్లే భావించారు. పార్లర్ కు వెళ్లి మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకున్నారు. ఆపరేషన్ థియేటర్ ను ఆడిటోరియం ప్రాంగణంగా మనసులో అనుకున్నారు. సర్జరీ ముగిసింది. ఆపరేషన్ కాస్ట్యూమ్స్ తో కాకుండా వెంట తెచ్చుకున్న డ్రెస్ వేసుకొని, నుదుటన బొట్టు, లిప్ స్టిక్ పెట్టుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే – పెర్ఫామెన్స్ ఎలా వుంది డాక్టర్ అని రివర్స్‌ లో అడిగారు. అప్పుడు డాక్టర్లు ఆమె ఆత్మస్థయిర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు.

image


సంగీత కళామతల్లికి నిత్యాభిషేకం

సర్జరీ జరిగిన రెండురోజుల్లోనే కాలికి గజ్జె కట్టారు. ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం, పిల్లలకు నేర్పడం- పెర్ఫామెన్స్ కు సిద్ధమవడం ఇలా ఎప్పటిలాగే రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఆనంద దృష్టిలో కేన్సర్ అనేది జీవన్మరణ సమస్య కాదు. అదొక ఓ సాధారణ వ్యాధి. అదే విషయాన్ని ఆమె చెప్పాలనుకున్నారు. క్యాన్సర్ పై ఆనంద చేసిన టెడ్ (టెక్నాలజీ, ఎంటర్ టైన్ మెంట్, డిజైన్) టాక్ అత్యుత్తమ ప్రసంగంగా నిలవడం గమనార్హం. ఆ స్పీచ్‌ విన్న తర్వాత అందరూ ఆమెను కేన్సర్ బాధితురాలిగా కాకుండా.. ఓ మహమ్మారిని జయించిన వీరనారిగా గుర్తించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఒక ఆనంద సాధారణ జీవితం గడుపుతున్నారు. రైల్వే అధికారిగా ఉద్యోగం చేస్తూనే -ఇటు డాన్సర్‌గా సంగీత కళామతల్లికి నిత్య నృత్యాభిషేకం చేస్తున్నారు.

image


కళతో కేన్సర్ మహమ్మారిని జయించిన ఆనంద- హైదరాబాదీ కావడం తెలుగు వారందరూ గర్వించే విషయం. హ్యాట్సాఫ్ ఆనంద !!

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India