ఐఐఎం, ఐఐటియన్ల స్టార్టప్స్‌కే ఫండింగ్ వస్తుందా ?
ఐఐటి, ఐఐఎంలలో చదివితే వాళ్లకు తిరుగుండదా.. ? వాళ్లు చేసిన ఆలోచనలే ఆలోచనలా ? వారు చెప్పిందే, చేసిందే బిజినెస్ మోడలా ? ఇతరులకు అంత తెలివి ఉండదనా.. ? వెంచర్ క్యాపిటలిస్టులు, ఫండింగ్ సంస్థలన్నీ వాళ్ల వెంటే ఎందుకు పడ్తాయి.. ? ఇలాంటి ప్రశ్నలకు ఎన్నో ఎన్నెన్నో. ఏ ఇద్దరు స్టార్టప్ ఔత్సాహికులు కలిసినా దీనిపై ఏదో ఒక సందర్భంలో ప్రస్తావన వచ్చే ఉంటుంది.
ఇది ఎప్పటికీ ఓ హాట్ డిస్కషనే. ఎందుకు ఐఐటి, ఐఐఎంలలో చదివిన విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్‌లోనే నిధుల వరద పారుతోంది అని. అంతే కాదు మహిళల సంఖ్య కూడా ఎందుకు అంత తక్కువ సంఖ్యలో ఉంది ? అయితే ఈ పరిస్థితి కేవలం మన దేశంలోనే కాదు. విదేశాల్లో కూడా ఇలాంటి ట్రెండ్‌ను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
ఇందులో వాస్తవం ఎంత ఉందో అర్థం చేసుకునే ప్రయత్నాన్ని యువర్ స్టోరీ చేసింది. ఈ నేపధ్యంలో మూడేళ్లలో కుదిరిన ఒప్పందాలను ఓ సారి పరిశీలించింది. 2014లో ఓ సర్వే కూడా నిర్వహించాం. ఫలితాలు చాలా సుస్పష్టం. అత్యున్నత సంస్థల నుంచి వచ్చిన వారు స్థాపించిన కంపెనీలకే మూడొంతుల ఫండింగ్ అందింది. దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాదు ఇన్‌స్టామోజో సంస్థ వ్యవస్థాపకుడు సంపద్ స్వైన్ కొద్దికాలం క్రితం చేసిన ట్వీట్ .. చర్చోపచర్చలకు కారణమైంది. ఇదే అంశాన్ని ఆయన ట్వీట్ చేశారు.
మా గత స్టడీలో ప్రారంభ దశలో ఉన్న కొన్ని స్టార్టప్స్ - వాటి డీలింగ్స్‌ను పరిశీలించాము. 5 మిలియన్ డాలర్ల ఒప్పందాలను పరిశీలించాము. గత రెండు నెలల కాలంలో జరిగిన 25 డీల్స్ ను కూడా పరిశీలించాం. మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. కుదిరిన 25 కంపెనీల ఒప్పందాల్లో 60% ఐఐటిలు, ఐఐఎంలకు చెందినవారే వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంతే కాదు.. వీళ్లలో కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే మహిళ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
మా పరిశీలనలో తేలిన ఆసక్తికర విషయాలు
- 25 కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల ప్రొఫైల్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అదో హెల్తీ మిక్స్ అని చెప్పొచ్చు. అయితే వాళ్లంతా ఐఐటి, ఐఐఎం జనాలవైపే మొగ్గుచూపారు.
- మహిళ వ్యవస్థాపకురాలిగా ఉన్న సంస్థ ఒక్కటి కూడా లేదు. (రెండు కంపెనీల్లో మాత్రం మహిళలు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు).
- ఫండింగ్ వచ్చిన ఐఐఎం, ఐఐటి ఏతర కంపెనీలకు వ్యవస్థాపకులకు విశేషమైన అనుభవం ఉంది. ఈ రంగంలో కృషి చేసి ఓ స్టార్టప్ ఏర్పాటు చేయడమో, లేక ఈ డొమైన్‌లో సంపూర్ణ అనుభవం సాధించిన వారో ఉన్నారు. అలాంటి వాళ్లకే ఫండింగ్ వచ్చింది. అలాంటి సంస్థల్లో సెకోయా కొన్ని పెట్టుబడులు పెట్టింది.
- ఒకప్పుడు ఐఐఎంలు ఇలాంటి ఫండింగ్, స్టార్టప్స్ వ్యవహారంలో ముందంజలో ఉండేది.కానీ ఈ మధ్య ఐఐటిలు ఆ పొజిషన్‌ను గుంజుకున్నాయి. ఐఐటి - బాంబే, ఐఐటి - ఢిల్లీ, ఐఐటి - ఖరగ్‌పూర్.. ఈ విషయంలో చాలా ముందున్నాయి. పొవాయ్ వ్యాలీకి ఇప్పుడు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ఐఐటి - బాంబే కీలకపాత్ర పోషించింది.
ఏంటి వాటి ప్రత్యేకత
- పెట్టుడులు పెట్టే ఇన్వెస్టర్లు సేఫ్ గేమ్ అడుతున్నారు. మెరుగైన గత చరిత్ర ఉన్న యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక వేళ ఒకే కాన్సెప్ట్‌తో రెండు కంపెనీలు ముందుకు వచ్చాయని అనుకుందాం. వాటిల్లో ఏదైనా ఒక టీమ్‌కు నాణ్యమైన యూనివర్సిటీల నుంచి వచ్చిన చరిత్ర ఉంటే...వారికే అధిక ప్రాధాన్యం దక్కుతోంది.
- ఈ విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన వారికి ఉండే నెట్వర్కింగ్... ప్రారంభ దశలో కంపెనీ నిలదొక్కుకోవడానికి దోహదపడ్తుంది.
- అనేక రంగాల నుంచి వచ్చిన వాళ్లతో కలిసి పనిచేయడం, వాళ్ల అనుభవాలను వినడం, పంచుకోవడం ద్వారా వీళ్లకు బుద్ధివికాసం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ల మెచ్యూరిటీ లెవెల్స్ అధికం. అలాంటి వాళ్లు సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు పుష్కలం.
అన్నింటికంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. మహిళా ప్రాధాన్యం తక్కువగా ఉంది. ఈ బేధం నానాటికీ ఎక్కువవుతోంది. ఇలాంటి పరిస్థితులను తక్షణం చక్కదిద్దాల్సిన, చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. మేం అందుకే యువర్ స్టోరీలో హర్ స్టోరీని ఏర్పాటు చేశాం. మహిళలను ప్రోత్సహిస్తూ.. వారికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం.
మీరు కూడా ఈ సున్నితమైన అంశంపై చర్చించండి. కింద కామెంట్స్ రాయండి. రీసెర్చులు, లింక్స్ ఏవైనా ఉంటే షేర్ చేసుకోండి.
ఇంగ్లిష్‌లో ఈ ఆర్టికల్‌ను రాసింది జుబిన్ మెహతా. ఆయన చాలా కాలం నుంచి యువర్ స్టోరీలో అనేక స్టార్టప్స్‌పై కథనాలు రాస్తున్నారు.