పెళ్లి ఖర్చు 5లక్షలు దాటితే బ్యాండ్ మోగించాల్సిందే..

కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ ప్రైవేట్ మెంబర్ బిల్లు

పెళ్లి ఖర్చు 5లక్షలు దాటితే బ్యాండ్ మోగించాల్సిందే..

Saturday February 18, 2017,

2 min Read

మొన్ననే చూశాం గాలిజనార్దన్ రెడ్డి బిడ్డ పెళ్లి ఎలా జరిగిందో. నోట్ బందీ టైంలో కూడా అంత గ్రాండ్ గా మ్యారేజ్ చేశాడంటే మాటలు కాదు. అలాంటి పెళ్లిళ్లకు ఇండియాలో కొదవలేదు. శ్రీమంతుల ఇంట వివాహమంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు, విందులు వినోదాలు అతిథులు మర్యాదలు.. ఒకటా రెండా. పెళ్లికి ముందు సంగీత్ అనే కార్యక్రమమే దుమ్మురేపుతుంది. లక్షల ఖర్చు ఏనాడో దాటేసింది. ఇప్పుడంతా కోట్లలో నడుస్తోంది. ఒకరిని మించి ఒకరు. స్టేటస్ కొద్దీ పెళ్లి. సంపాదన కొద్దీ ఖర్చు. లేని ఆర్భాటాలకు వెళ్లి అప్పులపాలైనవాళ్లూ లేకపోలేదు.

image


కానీ, ఒక పూటలో జరిగే తతంగానికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? గంటలో వాడిపోయే పూల దగ్గర్నుంచి సాయంత్రానికి తీసేసే మంటపం దాకా ఏది మిగిలిపోతుంది? కనీసం తినే తిండైనా పనికొస్తుందా?దీనికి సమాధానం చెప్పడం కష్టం. లక్షల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతాయి. మరి వీటిని నియంత్రించే మార్గమే లేదా? ఇలాంటి విచ్చలవిడి ఖర్చులకు ఫుల్ స్టాప్ పడేదెలా?

కాంగ్రెస్ ఎంపీ, పప్పూ యాదవ్ భార్య రంజీత్ రంజన్ కు వచ్చిన ఆలోచనే ఇది. తన ఆలోచనలకు తగ్గట్టే లోక్ సభలో ఒక ప్రతిపాదన కూడా చేశారు.

పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే ఆ మొత్తంలో 10 శాతం పేద యువతుల వివాహానికి విరాళంగా అందజేయాలి. వివాహాల (నిర్బంధ రిజిస్ట్రేషన్ - అనవసరపు ఖర్చుల నియంత్రణ) బిల్లును ఆమె ప్రతిపాదించారు. పెళ్లిళ్లు ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరగాలని రంజీత్ రంజన్ బిల్లులో ప్రతిపాదించారు. ముఖ్యంగా పెళ్లింట వృధా అవుతున్న ఆహారం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆహ్వానించే అతిథుల సంఖ్యను పరిమితం చేయాలని, వంటకాలపైనా పరిమితులు విధించాలని ఆమె బిల్లు లో ప్రతిపాదించారు.

మనదేశంలో పెళ్లికోసం విపరీతంగా ఖర్చు చేయడం ఒక మాస్ హిస్టీరియాలా మారుతోంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై దేశంలో ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. ఎంతోమంది ఎన్నోరకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. అవేవీ అమలుకి నోచుకోలేదు. సరికదా ఎంగేజ్ మెంట్, సంగీత్, రిసెప్షన్లు అంటూ ఖర్చును విపరీతంగా పెంచారు. ఇలాంటి తరుణంలో ఎంపీ రంజీత్ రంజన్ ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఏమవుతుందో చూడాలి.