ఒక్క రంజాన్ మాసంలోనే హైదరాబాదులో హలీమ్ మార్కెట్ రూ. 500 కోట్లు

ఒక్క రంజాన్ మాసంలోనే హైదరాబాదులో హలీమ్ మార్కెట్ రూ. 500 కోట్లు

Tuesday June 20, 2017,

2 min Read

రంజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాదులో హలీమ్ ఘుమఘుమలు గల్లీగల్లీలో వ్యాపిస్తాయి. సాయంత్రం ఎక్కడ చూసినా వేడివేడి హలీమ్ బౌల్ లో వేసుకుని ఊదుకుంటూ, లొట్టలేసుసుకుంటే తినే దృశ్యాలే కనిపిస్తాయి అదంటే అంత క్రేజ్. కులం మతం ఆడ మగ చిన్న పెద్ద తేడాలేకుండా ఏకైక వంటకం. పుష్కలమైన పోషక విలువలున్న హలీమ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఏడాదిపొడవునా భాగ్యనగరంలో హలీమ్ దొరికినా, ఒక్క రంజాన్ మాసంలో మాత్రం ఏకంగా రూ. 500 కోట్ల బిజినెస్ చేస్తుందంటే నమ్మశక్యం కాదు.

image


ఏ ముస్లిం ఇంట పెళ్లిబాజా మోగినా, మెనూలో ఎన్ని వెరైటీలు ఉన్నా హలీమ్ లేకుంటే విందు పరిపూర్ణం కానట్టే. బిర్యానీ లేకున్నాసరే ఒక్క హలీమ్ పెట్టినా చాలు అన్నట్టు ఉంటారు. హోటల్స్ లోనూ హలీమ్ రెగ్యులర్ బిర్యానీలా ఏడాదంతా దొరుకుతుంది. ఇక రంజాన్ పండగొచ్చిందంటే కిచెన్ రూంలో ఉన్న బట్టీలు రోడ్డుమీదకొస్తాయి. పగలంతా హలీమ్ తయారీలో మునిగిపోతారు. దాదాపు 10-12 గంటలు పడుతుంది తయారు చేయడానికి. సాయంత్రానికి వంటకం రెడీ అయిపోతుంది. బట్టీమీదనే చాపలాంటిది పరిచి బాసంపట్లు వేసుకుని కూచుంటారు. నెత్తిమీద టోపీ పెట్టుకుని, ఒక చేత్తో గరిట, మరో చేత్తో బౌల్ పట్టుకుని రెడీగా ఉంటారు. గుండిగలోంచి వేడివేడిగా వడ్డించడానికి నేను రెడీ.. తినడానికి మీరు రెడీయా అన్నట్టు కనిపిస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో ఖవ్వాలి వినిపిస్తుంటుంది. రంగురంగుల సిరీస్ బల్బుల వెలుతురు చమ్కాయిస్తుంది. ఏ వీధిలో చూసినా బట్టీ చుట్టూ జంటలు జంటలుగా హలీమ్ లాగించే సీన్ కనిపిస్తుంది.

నిజానికి హలీమ్ అరబిక్ వంటకం. ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు పరిచయం అయింది. దీని మూలాలు వెతగ్గా, ఆరో శతాబ్దంలో పర్షియన్ రాజు ఖుస్రో హయాంలో బయటపడ్డాయి. హలీమ్‌ ని మొదటగా హరీస్ లేదా హరిస్సా అని అరబ్ దేశాల్లో పిలిచేవారు. నిజాం ఇంట్రస్ట్ తో యెమెన్ దేశానికి చెందిన చెఫ్ 1930లో హైదరాబాదీలకు రుచి చూపించారు. తయారీలో కొన్నికొన్ని మార్పులు చేశారు. నెయ్యి, జీడిపప్పు, బాదాం ఇతర సుగంధ ద్రవ్యాలను యాడ్ చేశారు.

రంజాన్ మాసంలో ఉపవాసాన్ని విరమించేందుకు ముస్లింలు ఎక్కువగా హలీమ్ ని ప్రిఫర్ చేస్తారు. బలమైన పోషక విలువలున్న ఈ వంటకం ఇఫ్తార్ విందులోనూ చవులూరిస్తుంది. గరంగరం షోర్బాతో జావగారుతున్నట్టుగా ఉండే హలీమ్ కాంబినేషన్ ఫర్ ఎవర్. పక్కనే నంజుకోడానికి ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలు ఉంటే స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నట్టే. మొదట్లో బీఫ్ తో చేసేవారు. చాలామటుకు పొట్టేలు మాసంతో చేస్తుంటారు. ఇవి కాకుండా చికెన్ హలీమ్ గురించి జనానికి తెలుసు. చేపలు, కూరగాయల హలీమ్ కూడా చేస్తున్నారు.

సిటీలో చాలా హోటళ్లు తమదైన టేస్ట్ తో హలీమ్ తయారు చేస్తున్నాయి. పాతబస్తీ మదీనా హోటల్, సర్వీ, పారడైజ్, పిస్తా హౌజ్ లాంటి హోటళ్లు రుచికరమైన హలీమ్ తయారీలో పోటీ పడుతున్నాయి. టేస్ట్ లోనే కాదు ఇన్నోవేటివ్, మార్కెటింగ్ లోనూ దేనికదే ప్రత్యేకతను చూపిస్తున్నాయి. ఒక్క హైదరాబాదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒమన్, దుబాయ్, అమెరికాలాంటి దేశాల్లో ఔట్ లెట్లను ఏర్పాటు చేశాయి.

నాన్ వెజిటేరియన్ వంటకంగా 2010లో హలీమ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ సంపాదించింది. ప్లేట్ హలీమ్ పిస్తా హౌజ్‌ లో రూ.160కు దొరుకుతుంది. మిగతా చోట్ల రూ. 225 ఉంది. పిస్తా హౌజ్ ఈసారి డైట్ హలీమ్, ఆర్గానిక్ హలీమ్ అనే ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చింది.