సంకలనాలు
Telugu

అమెరికా నుంచి వచ్చాడు..! ఆపిల్ రైతుల ఆదాయాన్ని పెంచాడు..!!

కశ్మీర్ ఆపిల్ రైతుల జీవనప్రమాణాలు మెరుగుపరుస్తున్న ఖుర్రమ్ మీర్

SOWJANYA RAJ
28th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పంట చేతికొచ్చింది. మంచి రేటు కోసం రైతు ఆశగా ఎదురు చూస్తూంటారు. రోజులు గడిచేకొద్ది పంట కాస్తా పాడైపోయే పరిస్థితి కానీ. రేటు మాత్రం గిట్టుబాటు కానంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు.. తెగనమ్ముకుని నష్టాలతో రైతు కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. ఇది మామూలు ఆహార, వాణిజ్య పంటలు సాగుచేసే రైతుల దుస్థితి మాత్రమే కాదు. కశ్మీర్ లో ఆపిల్ రైతుల పరిస్థితి కూడా అంతే. ఇంకా చెప్పాలంటే మరింత దుర్భరం. కనీస మార్కెటింగ్, గిడ్డంగుల సౌకర్యం లేక ఆపిల్ రైతులు కష్టనష్టాల్లో ఉన్న సమయంలో వారి తలరాతను మార్చేందుకు అమెరికా నుంచి దిగవచ్చాడు ఖుర్రమ్ మీర్.

ఆపిల్.. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్

కశ్మీర్ ఆపిల్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. తియ్యగా, జ్యూసీగా, క్రిస్పిగా ఉండే కశ్మీర్ ఆపిల్ లోయకే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. కశ్మీర్ కు ప్రకృతి అందించిన గొప్ప వరాల్లో ఇది ఒకటి. ఇంకోరకంగా చెప్పాలంటే కశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో ఆపిల్ ది కీలకమైన స్థానం. గత ఏడాది 19.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆపిల్స్ దిగుబడిని కశ్మీర్ రైతులు సాధించారు. ఇది మొత్తం కశ్మీర్ హార్టికల్చర్ ఉత్పత్తుల్లో అరవై ఐదుశాతం. ఈ గణాంకాలు చాలు కశ్మీర్ గ్రామీణ ప్రాంత రైతులకు ఈ ఆపిల్ ఎంత ఆయువుపట్టుగా ఉందో తెలుసుకోవడానికి. ఇదంతా ఒక వైపు మాత్రమే. కశ్మీర్ యాపిల్ స్టోరీకి రెండోవైపు కూడా ఉంది.

మొత్తం ఆపిల్ దిగుబడుల్లో దాదాపు ఎనభై శాతం యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తూంటారు. కానీ నాణ్యత లేకపోవడంతో 35 శాతం యాపిల్ పండ్లను యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకోవడానికి తిరస్కరిస్తున్నాయి. మరో పది నుంచి పదిహేను శాతం కాయలు సరైన ప్రాసెసింగ్ సౌకర్యాలు, గిడ్డంగులు లేకపోవడం వల్ల వృధాగా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో వచ్చే ఐదేళ్లలో ఆపిల్ సాగును రూ.3 వేల కోట్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎగుమతులకు అనుగుణంగా యాపిల్స్ ను సాగు చేయడం, వేస్టేజీ లేకుండా స్టోర్ చేసుకోవడం అనేది దశాబ్దాలుగా కశ్మీర్ రైతులకు కలగా ఉన్న వ్యవహారం. ఈ పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనా..? కొంతకాలం వరకు అది అంచనాలే అనుకునేవారు. కానీ ఖుర్రమ్ మీర్ కశ్మీర్ కు వచ్చి కార్యచరణ ప్రారంభించిన తర్వాత అది సాధ్యమే అయింది.

దిగుబడిని పరిశీలిస్తే కశ్మీర్ యాపిల్ రైతు

దిగుబడిని పరిశీలిస్తే కశ్మీర్ యాపిల్ రైతు

కశ్మీర్ కుర్రాడు .. అమెరికా నుంచి తిరిగొచ్చాడు..!

34ఏళ్ల ఖుర్రమ్ మీర్ బాల్యం అంతా కశ్మీర్ లోనే గడిచింది. లెక్కలంటే అమితమైన ఆసక్తి చూపే ఖుర్రమ్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత అక్కడే మేనేజ్ మెంట్ డిగ్రీ చేసి.. ఓ కన్సల్టెన్సీలో ఉద్యోగంలో చేరిపోయాడు. ఐదేళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించినా... ఖుర్రమ్ కు జాబ్ అంతగా నచ్చలేదు. ఎప్పుడూ తనకి పుట్టిపెరిగిన ఊరే గుర్తుకు వచ్చింది. జన్మభూమి అభివృద్దికి ఏదైనా చేయాలనే తలంపుతో విపరీతంగా ఆలోచించేవాడు. మొదట ఎనర్జీ సెక్టర్లో ఉన్న అవకాశాలను పరిశీలించాడు. కానీ ఆహారం అంతకంటే ముఖ్యమమైన అంశమని నిర్ణయం మార్చుకున్నాడు. ఖుర్రమ్ భవిష్యత్ ప్రణాళికలు తెలుసుకున్న శ్రేయోభిలాషులు కూడా సొంతూరికి ఏదైనా చేయమని ప్రొత్సహించారు. ఓ లక్ష్యం మైండ్ లో ఫిక్సయిపోయింది. దాంతో అమెరికా నుంచి కశ్మీర్ కు తిరిగొచ్చేశాడు. కాన్ ఫ్లిక్ట్ జోన్ లో బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనేది మీర్ ఆశయం.

హర్షా నేచురల్స్ లో ఖుర్రమ్ మీర్

హర్షా నేచురల్స్ లో ఖుర్రమ్ మీర్

యాపిల్ స్టార్టప్ హర్షా నేచురల్స్

శ్రీనగర్ నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే లస్సిపురా అనే జిల్లా వస్తుంది. అదే ఖుర్రమ్ మీర్ స్వగ్రామం. వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడి ఆపిల్ సాగును పరిశీలించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఖుర్రమ్ తండ్రి యాపిల్ రైతు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న కూరగాయలు, పండ్ల వ్యాపారుల్లో ప్రముఖుడు. తండ్రి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం ద్వారా ఆపిల్ రైతులతో తరచుగా ఇంటరాక్ట్ అయ్యేవాడు ఖుర్రమ్. తద్వారా రైతుల ప్రధాన సమస్యను అర్థం చేసుకున్నాడు. గిడ్డంగి సదుపాయం లేకపోవడమే అతి పెద్ద సమస్యగా భావించాడు. గిడ్డంగి సమస్య వల్ల వెస్టేజీ శాతం పెరగడమే కాదు.. తక్కువ రేటున్నా సరే అమ్ముకోవడానికి రైతు సిద్ధపడిపోతున్నాడు.

" యాపిల్ ను చెట్టు నుంచి కోసిన తర్వాత వినియోగదారునికి చేరడానికి కనీసం 45 రోజులు పడుతోంది. దీనివల్ల ఆపిల్ లో ఉన్న కంటెంట్ అంతా 15నుంచి 20 శాతం తగ్గిపోతోంది. ఫలితంగా కశ్మీర్ ఆపిల్ అని చెపితేనే గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది- ఖుర్రమ్ మీర్

రైతుల ప్రధాన సమస్యను గుర్తంచిన ఖుర్రమ్.. దాన్ని సాల్వ్ చేసేందుకు హర్షా నేచురల్స్ ను ప్రారంభించాడు. 2008లో ప్రారంభమైన ఈ స్టార్టప్ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల ఆపిల్ ఉత్పత్తుల్ని నిల్వ చేయడానికి సరిపడే కోల్డ్ స్టోరేజీ గిడ్డంగిని నిర్మించారు. కశ్మీర్ ఆపిల్ పరిశ్రమలో ఇదే విస్త్రతమైన మార్పులకు కారణమయింది. రైతులు ఇప్పుడు తమకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ అతను నిర్మించిన కోల్డ్ స్టోరేజీలో ఆపిల్స్ ను నిల్వచేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ కంట్రోల్డ్ ఎట్మాస్పియర్ స్టోరేజీ వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి.

# చెట్టు నుంచి ఆపిల్ ను తెంపిన తర్వాత ఈ కోల్డ్ స్టోరేజీలోకి తీసుకువచ్చి నిల్వ చేస్తే ఏడెనిమిది నెలల పాటు ఆ పండు అదే విధంగా ఉంటుంది. అంటే ఏడు నెలల తర్వాత వినియోగదారుడు ఆ యాపిల్ ను తెంటే.. అప్పుడే కోసి తెచ్చినంత తాజాదనం, తియ్యదనం ఉంటుంది. వాటర్ అండ్ న్యూట్రిషన్ కంటెంట్ లో ఒక్కశాతం కూడా తగ్గుదల ఉండదు.

# రైతులు బలవంతంగా అమ్మేసుకునే పరిస్థితి ఈ కోల్డ్ స్టోరేజీవల్ల తగ్గిపోయింది. రాజకీయ అనిశ్చిత పరిస్థితులవల్లనో.. రవాణాకు ఇబ్బందులు ఏర్పడటం వల్లనో మార్కెట్లో సరైన ధర లేనప్పుడు రైతు కొన్నినెలల పాటు తన ఆపిల్స్ ను నిర్భయంగా నిల్వ చేసుకోవచ్చు.

హర్షా నేచురల్స్ ప్రాసెసింగ్ గిడ్డంగి

హర్షా నేచురల్స్ ప్రాసెసింగ్ గిడ్డంగి

రైతుల ప్రయోజనాలే ఫస్ట్

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ గిడ్డంగి సదుపాయాన్ని మొదట్లో కేవలం ఐదుగురు రైతులే ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపించారు. అది ఖుర్రమ్ ను తీవ్రంగా నిరాశపరిచినా వెనుదిరగాలనే ఆలోచన మాత్రం రానీయలేదు. తర్వాత మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ప్రారంభించాడు. హర్షా నేచరుల్స్ సర్వీసుల్నీ మరింత విస్త్రతం చేశాడు. తన గిడ్డంగిలోనే స్టోరేజీ ఫెసిలిటీతో పాటు ఆటోమేటిక్ సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ సౌకర్యాలను కల్పించాడు. ఇదంతా మిషనరీతోనే జరిగేలా వ్యవస్థను రూపొందించాడు. అలాగే యాపిల్ ను అమ్మకానికి సిద్ధం చేసే క్రమంలో శుభ్రం చేయాల్సిన యంత్రాలను కూడా దిగుమతి చేసుకున్నాడు. అందులో భాగంగానే పెద్ద పెద్ద రీటైలింగ్ కంపెనీలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రిలయన్స్ ఫ్రెష్ కు కూడా యాపిల్స్ ను ఇప్పుడు హర్షా నేచురల్స్ ద్వారా రైతులు సరఫరా చేస్తున్నది. దీని ద్వారా ఆపిల్ రైతులు మధ్యవర్తుల బాధను అధిగమించినట్లయింది.

కోల్డ్ స్టోరేజీతోనే ఆగిపోకుండా రైతులకు కొత్త కొత్త సేవలు అందించడం ద్వారా హర్ష నేచురల్స్ చాలా వేగంగా వృద్ధి సాధిస్తోంది. మొదట ఐదుగురు రైతులతో ప్రారంభమైన వీరి అనుబంధం.. ఇప్పుడు నాలుగు వేలకు చేరుకుంది. కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కూడా పదకొండు వేల టన్నులకు చేరింది. కంపెనీతో అనుబంధం ఏర్పరుచుకున్న రైతుల ఆదాయం గత ఏడేళ్లలో 15 నుంచి అరవై శాతం పెరిగింది. కశ్మీర్ ఆపిల్ సాగు, పరిశ్రమల్లో ఖుర్రమ్ ప్రయత్నం విప్లవాత్మక మార్పులనే తెచ్చింది.

రూట్ 2 ఫ్రూట్ లో కొత్త ఆపిల్ రకాల సృష్టి

రూట్ 2 ఫ్రూట్ లో కొత్త ఆపిల్ రకాల సృష్టి

రూట్2ఫ్రూట్ .. కొత్త ఆపిల్ రకాల సృష్టి

హర్షనేచురల్స్ కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఖుర్రమ్.. ఇంకా మూలాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రూట్2ఫ్రూట్ ను ప్రారంభించాడు. యాపిల్ సాగు అమాంతం పెరిగేలా.. దిగుబడి భారీగా పెరిగేలా చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాడు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపరేట్ హార్టికల్చర్ కు నేతృత్వం వహించిన మొట్టమొదటి కశ్మీర్ వ్యక్తి డాక్టర్ సోపితో చేతులు కలిపారు. డా.సోఫితో కలిసి ఇరవై మంది నిపుణుల్ని ఎంపిక చేసుకుని యూరప్ లో రెండేళ్ల పాటు యాపిల్ సాగును పరిశీలించారు. కొత్త కొత్త ఆపిల్ రకాల సృష్టి కోసం పరిశోధన చేశారు. కశ్మీర్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా కొత్త ఆపిల్స్ వృద్ధి కోసం కొత్త రకాలను కనిపెట్టారు. 2014లో రెండు హెక్టార్లలో ఎనిమిది విభిన్నరకాల యాపిల్ రకాల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు. వీరి కష్టం ఫలించింది. ఏడాదిన్నరలో తొలి దిగుబడి వచ్చింది. మామూలు పరిస్థితుల్లో ఆపిల్ చెట్లు పూర్తిగా ఎదిగి తొలి కాయలు కోతకు రావాలంటే కనీసం దశాబ్దం పట్టేది. ప్రస్తుతం రూట్2ఫ్రూట్ ద్వారా అద్భుతమైన నాణ్యత, అధిగ దిగుబడి సాధించేలా రైతులకు సహాయపడుతున్నారు. ప్రస్తుతం ఏడాదికి అరవై వేల ఆపిల్ మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నారు. ఏడాది పది కొత్త రకం ఆపిల్స్ ను కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ఫలితంగా రైతులు క్వాలిటీలో, దిగుబడి ప్రయజనాలను ఇప్పటికే పొందడం ప్రారంభించారు.

" దిగుబడి వచ్చిన తర్వాత చేసే పనులు చాలా చిన్నవి. అసలు ప్రీ హార్వెస్ట్ కు ముందు చేయాల్సిన పనులే ముఖ్యమైనవి. వీటిని సరిగ్గా చేస్తే కశ్మీర్ ఎకానమీ అనూహ్యంగా పెరుగుతుంది. అమెరికా, యూరప్ లతో పోలిస్తే మన ఆపిల్ దిగుబడి కేవలం ఆరో వంతు మాత్రమే ఉంటుంది" ఖుర్రమ్ మీర్

ఆపిల్ తోటలో కశ్మీర్ రైతు

ఆపిల్ తోటలో కశ్మీర్ రైతురైతు నుంచి వినియోగదారుని చేర్చే ఫార్మ్2యు

రైతులకు మరింత లాభం చేకూర్చాలంటే మార్కెటింగ్ నూ విభిన్నమైన వ్యూహాలు అమలుచేయాల్సిందే. అందుకే కశ్మీర్ రైతుల నుంచి నేరుగా వినియోగదారులకే చేర్చేందుకు ఫార్మ్2యు పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... అవినీతికి తావులేకుండా... అటు వినియోగదారులు.. ఇటు రైతు కూడా పూర్తి విశ్వాసంతో ఇక్కడ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపిల్స్ ను కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు రైతులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు ఇన్నో ఫైనాన్స్ సంస్థను కూడా ప్రారంభించాడు. ఇది ఓ రుణసంస్థలా కాకుండా.. రైతు, బ్యాంకు, ఇన్నోఫైనాన్స్ మధ్య వ్యవహారాలు నడుస్తాయి.

ఫార్మ్2యు ప్యాక్ తీసుకెళ్తున్న ఉద్యోగి

ఫార్మ్2యు ప్యాక్ తీసుకెళ్తున్న ఉద్యోగి

ఖుర్రమ్ ఆపిల్స్ కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు ప్రారంభించిన తర్వాత మరికొంత మంది కూడా ఆ రంగంలోకి వచ్చారు. మూడు భారీ గిడ్డంగులను కశ్మీర్ అంట్రప్రెన్యూర్లు నిర్మించారు. వీటి సామర్థ్యం ఇప్పుడు 22 వేల టన్నులు. అయితే ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇంకా చాలా రావాల్సి ఉందని ఖుర్రమ్ అంటున్నారు.

" అమెరికా లో తొంభై శాతం పండ్లు, కూరగాయలకు ప్రాసెసింగ్ సౌకర్యం ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ఒక్క శాతం కంటే తక్కువ ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉన్నాయి" ఖుర్రమ్ మీర్

అమెరికాలో కెరీర్ ను విడిచిపెట్టి వచ్చి అనిశ్చితితో ఎప్పుడూ ఊగిసలాడే ప్రాంతంలో ఖుర్రమ్ చేస్తున్న ప్రయత్నాలు ఓ విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నాయి. ఖుర్రమ్ ఆశించినంత కాకపోయినా కనీస మార్పు కనిపిస్తే అతని ప్రయత్నాలకు సార్థకత చేకూరినట్లే..! ఇది నెరవేడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags