సంకలనాలు
Telugu

హ‌స్త‌క‌ళ‌ల‌కు కొత్త జవసత్వాలు నింపుతున్న గాథా.కామ్

RAKESH
15th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


అందులోని ప్ర‌తీ వ‌స్తువు ఒక అంద‌మైన క‌థ వినిపిస్తుంది! ఒక్కో క‌ళాఖండం వెన‌క ఒక్కో గాథ ఉంటుంది! క‌ళాకారుడి రెక్క‌ల క‌ష్టం క‌ళ్లముందు క‌ద‌లాడుతుంది! అవ‌న్నీ చూస్తే క‌ళ‌ల‌కు వెల‌క‌ట్ట‌లేమ‌ని మ‌న‌సు ఘంటాప‌థంగా చెప్తుంది! అంప‌శ‌య్య‌పై ఉన్న భార‌తీయ హ‌స్త‌క‌ళ‌ల‌కు కొత్త ఊపిరిలూదుతున్న‌ గాథా డాట్ కామ్ విజ‌య‌గాథ మీరూ చ‌ద‌వండి!

మనం తొడుక్కునే చెప్పులు త‌యారు చేసిందెవ‌రో మనకు తెలుసా? ఒంటి మీది దుస్తుల‌కు దారాలు నేసిన నేత‌న్న ముఖం ఎప్పుడైనా చూశామా? చూడ్డానికి అందంగా క‌నిపించే క‌ళాఖండాల వెన‌క కార్మికుడి రెక్క‌లకష్టం గురించి ఆరా తీశామా? ఉలి చేసిన గాయాల తాలూకు స‌లుపు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశామా? కానీ ఆ ముగ్గురూ ప్ర‌య‌త్నించారు. నా భార‌తీయ క‌ళ‌కు ఏమైంద‌ని బాధ‌ప‌డ్డారు. మురికి వాడ‌ల్లో మ‌సిబారిన ముఖాల‌తో అన్నార్తులుగా మగ్గిపోతున్న క‌ళాకారుల దీనావస్థ చూసి చ‌లించిపోయారు. ఆలోచించారు! ప‌రిశోధించారు! చివ‌రికి ఒక మార్గం క‌నిపెట్టారు. అదే గాథా డాట్ కామ్! ఆ ముగ్గురే సుమిరన్ పాండే, శివానీ ధర్, హిమాన్షు ఖర్!

కళలకు వీరాభిమానులు

ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. అహ్మదాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో (ఎన్ఐడీ) లో బ్యాచ్ మేట్స్. చేతివృత్తుల‌న్నా, హ‌స్త‌క‌ళ‌ల‌న్నా ముగ్గురికీ వ‌ల్ల‌మాలిన అభిమానం! ఆ ఇష్టంతోనే హ‌స్త‌క‌ళ‌ల‌ రంగంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఉపాధి కోసం ఏటా వేలాది మంది కళాకారులు పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు వలస పోతున్నార‌ని తెలిసి బాధ‌ప‌డ్డారు. కళానైపుణ్యమంతా అర్బన్ స్లమ్ మురికిలో క‌ళావిహీనంగా మారిపోతున్న క్ష‌ణాల‌ను చూసి త‌ట్టుకోలేక‌పోయారు. అంత‌రించిపోతున్న భార‌తీయ హ‌స్త‌క‌ళ‌ల‌కు మ‌ళ్లీ జీవం పోయాల‌ని ముగ్గురూ అప్పుడే గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు.

అలా 2009 నవంబర్ లో గాథ ప్రాణం పోసుకుంది. ఆ త‌ర్వాత ముగ్గురూ క‌లిసి భారతీయ కళలు, సంస్కృతిపై పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా ఎంతో మంది కళాకారులతో మాట్లాడారు. వారి ద‌య‌నీయ‌మైన స్థితి గురించి తెలిసి బాధ‌ప‌డ్డారు. ఈ రంగంలో పరిశోధనలు మాత్రమే చేస్తే సరిపోదని, హస్తకళలకు పూర్వ వైభవం తెచ్చి మార్కెట్ కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. 2013 ఆగస్టులో గాథా డాట్ కామ్ పేరుతో ఈ-కామర్స్ పోర్టల్ ను ప్రారంభించారు.

image


ప్రపంచవ్యాప్తంగా ఉన్న క‌ళాభిమానుల‌కు కళాకారులను దగ్గర చేయడానికి గాథా డాట్ కామ్ ను ఒక వేదికగా మార్చాం. పోర్టల్ లో లభించే ప్రతీ కళాఖండం వెనక ఒక గాథ ఉంటుంది. ఇక్కడ మేం కేవలం వస్తువులను అమ్మడం లేదు. కళాకారుడికి, కస్టమర్ కు మధ్య మాటల వంతెన కడుతున్నాం. దీని ద్వారా మరిన్ని కొత్త ఆవిష్కరణలు, సమష్టి అభివృద్ధికి బాటలు పడతాయన్నదే మా విశ్వాసం- సుమిరన్

గాథా డాట్ కామ్ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. సగటున నెలకు 450 నుంచి 600 వరకు ఆర్డర్ల వస్తుంటాయి. 3 వేల మంది క‌ళాకారులు 50 ర‌కాల వ‌స్తువుల‌ను త‌యారు చేస్తుంటారు. క‌ల‌ప‌, లెదర్, ఫైబ‌ర్, వెదురు బొంగులు, గ‌డ్డి, అర్బ‌న్ వేస్ట్, పేప‌ర్ ను ఉప‌యోగించి అద్భుత కళాఖండాల‌కు ప్రాణం పోస్తున్నారు. డైరీల దగ్గర్నుంచి చెక్క దువ్వెనలు, ఫ్యాషన్ ఐటెమ్స్, హోమ్ డెకార్స్, సిరామిక్ జుయెలరీ, సిల్కు దుపట్టాలు, మధుబని పెయింటింగ్స్ వరకు అన్ని చేనేత, హస్తకళా వస్తువులు గాథా డాట్ కామ్ లో దొరుకుతాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కశ్మీరీ చేనేత వృత్తులకు గాథా డాట్ కామ్ పుట్టిల్లు!

హ‌స్త క‌ళాకారులు కోల్పోయిన ప్రాభ‌వాన్ని, డ‌బ్బును తిరిగి వారికి అంద‌జేయాలి. చేతివృత్తుల ఉత్ప‌త్తులు మ‌ళ్లీ జ‌నానికి చేరువ చేయాలి. క‌ళ‌ల‌తో ముడిప‌డి ఉన్న క‌థ‌లు, సంప్ర‌దాయాలు, వాటి త‌యారీ ప్ర‌క్రియ గురించి ప్ర‌జ‌ల‌కు తెలియాలి. వాటి మీద స‌మాజంలో ఒక చ‌ర్చ జ‌ర‌గాలి. క‌ళాకారుల‌కు ఉపాధి క‌ల్పించి, వారి ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌ర‌చాలి. ఇదే మా లక్ష్యం- సుమిర‌న్

గాథా డాట్ కామ్ లోని ఒక్కో ప్రోడ‌క్ట్ వెన‌క ఒక్కో క‌థ ఉంటుంది. ప్ర‌తీ క‌ళాఖండం చ‌రిత్ర గురించి ఇందులో సమాచారం లభిస్తుంది. అద్భుత కళాఖండాలను ఎలా త‌యారు చేస్తారో ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. చేనేత వృత్తుల‌ను ఇష్ట‌పడే వారికి వెబ్ సైట్ లోని బ్లాగ్ స్టార్టింగ్ పాయింట్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది. వివిధ ర‌కాల హ‌స్త‌క‌ళ‌ల చ‌రిత్ర‌ గురించి ప్ర‌త్య‌క్షంగా తెలుసుకొని ఇష్ట‌మైతే వాటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇలాంటి వ‌స్తువుల‌ను విక్ర‌యించే వెబ్ సైట్లు లేవ‌ని కాదు. కానీ అవి కాపీ పేస్ట్ కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి. గాథా డాట్ కామ్ అలా కాదు. అందమైన క‌ళాఖండాల‌తో పాటు వాటికి సంబంధించిన కంటెంట్ కూడా వీళ్ల‌ ద‌గ్గ‌ర దొరుకుతుంది. ఏళ్ల త‌ర‌బ‌డి చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు ఫ‌లిత‌మ‌దంటారు సుమిర‌న్.

క‌ళాకారుల‌తో భాగ‌స్వామ్యం

ఇండియాలో ఏ మూల నుంచి ఆర్డ‌ర్ వ‌చ్చినా స‌రే ఐదు రోజుల్లో వాళ్ల‌కి ఆ వ‌స్తువును చేర‌వేస్తారు. అమెరికా, సింగ‌పూర్ లాంటి దేశాల‌కైతే వారం రోజుల్లో డెలివ‌రీ ఇస్తారు. ఈ మ‌ధ్య విదేశీ ఆర్డ‌ర్ల సంఖ్య పెరుగుతోంది. గాథా డాట్ కామ్ ఫేస్ బుక్ పేజీకి మంచి పాపులారిటీ ఉంది. ముగ్గురు ఫౌండ‌ర్లూ నిత్యం క‌ళాకారుల‌ను క‌లుస్తూనే ఉంటారు. కొత్త కొత్త ఉత్ప‌త్తుల‌ను త‌మ సైట్ లో అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేస్తుంటారు. వ‌స్తువుల ఫొటోగ్ర‌ఫీ ద‌గ్గ‌ర్నుంచి మార్కెటింగ్ దాకా అంతా నిర్వాహ‌కులే చూసుకుంటారు. కొన్ని వ‌స్తువుల త‌యారీలో సాయ‌ప‌డుతుంటారు కూడా! హ‌స్త‌క‌ళ‌ల నిపుణుల‌కు, వినియోగ‌దారుల‌కు మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేస్తున్న గాథా డాట్ కామ్ ఒక విజ‌య గాథ‌లా త‌యారు కావాలని ఆశిద్దాం!!

ఈ ఆర్టిక‌ల్ వెరిసైన్ స్పాన్సర్ చేస్తున్న సిటీ స్పార్క్స్ సిరీస్ లో ఒక భాగం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags