క్యాన్సర్‌పై విజయం కార్పొరేట్ కంపెనీకి ఆద్యమైంది
ఇడ్లీ పిండి, దోశ పిండి ఇప్పుడిదో ట్రెండింగ్ బిజినెస్‌లా మారింది. ఎన్నో సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టి కార్పొరేట్ స్థాయికి ఎదుగుతున్నాయి. అయితే ఆరేళ్ల క్రితం ఓ మహిళ ఏర్పాటు చేసిన ఇలాంటి వ్యాపారం కూడా అనూహ్యమైన లాభాలను ఆర్జిస్తూ.. విలీనానికి సిద్ధమైంది.
చెన్నై చెఫ్.. ఇదో ఇడ్లి, దోశ పిండి తయారీ సంస్థ. అయితే వినూత్నమైన ప్యాకింగ్, నాణ్యత జనాలను ఆకర్షించింది. అయితే ఇడ్లి పిండిని సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో చేసేట్టు కాకుండా చెన్నై స్టైల్‌లో చేయడం వీళ్లకు కలిసొచ్చింది. ఆ యునిక్‌నెస్‌తో ప్రత్యేకత కనిపించడం చెన్నై చెఫ్ అసెట్. వీటికి తోడు ఇడ్లికీ ప్రత్యేకంగా, దోశకు ప్రత్యేకంగా పిండిని అమ్మడం మొదలుపెట్టారు. రసం పౌడర్, సాంబార్ పౌడర్‌కు చెన్నై స్టైల్‌లో చేస్తూ కస్టమర్లకు చేరువయ్యారు. ఇప్పటి వరకూ నెలకు సుమారు రూ. 11-12 లక్షల టర్నోవర్‌ను ఈ సంస్థ సాధిస్తూ వస్తోంది. అంటే ఏడాదికి కనీసం కోటిన్నర వరకూ సేల్స్ సాగిస్తున్నట్టు చెన్నై చెఫ్ టీం చెబ్తోంది.
ఇంతకీ ఎవరిదీ చెన్నై చెఫ్ - తమిళనాడుకు చెందిన క్రిష్ణకుమార్, ఉమ దంపతుల జంట ఈ చెన్నై చెఫ్ టీం వెనుక మాస్టర్ బ్రెయిన్. హైదరాబాద్‌లో వచ్చి స్థిరపడిన ఈ సంస్థ ఆరేళ్ల క్రితం ఈ సంస్థను మొదలుపెట్టింది. అయితే ఇది కూడా యాధృచ్చికంగా జరిగినదే. ఆరోగ్యం సహకరించని ఆ తల్లి తమ పిల్లలకు నాణ్యమైన ఇడ్లి పిండిని ఎవరైనా తయారు చేయించి ఇస్తే బాగుండేదనిపించింది. అయితే మార్కెట్లో దొరుకుతున్న వాటిల్లో అంత క్వాలిటీ లేదని బాధపడేవారు. మనమే ఈ వ్యాపారం మొదలుపెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అదే చెన్నై చెఫ్‌కు ఆరేళ్ల క్రితం సుఖశ్రీ ఆగ్రో ఫుడ్స్ పేరుతో సికింద్రాబాద్‌లో బీజం వేసింది.
క్యాన్సర్‌పై విజయం
చెన్నై చెఫ్ సిఈఓ ఉమ క్యాన్సర్ బాధితురాలు. తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి ఒక్కసారిగా కుదిపేసింది. వేడి నీళ్లకు చల్ల నీళ్లలా ఓ చిన్న ఉద్యోగంతో సాయపడ్తున్న ఆమె ఈ దెబ్బకు కుంగిపోయారు. వైద్యం కోసం లక్షలకు లక్షలు ఖర్చవడం ఓ సమస్యైతే.. ఆ కీమోథెరపీ మరింత ఇబ్బందిపెట్టింది.
ఈ క్యాన్సర్ నుంచి కోలుకున్న ఉమ.. తన భర్తతో కలిసి ఈ బ్యాటర్ బిజినెస్‌ను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఇంట్లో అనేక ప్రయోగాలు చేశారు. చివరకు తమకు కావాల్సిన, నాణ్యతలో రాజీపడని, ప్రిజర్వేటివ్స్ లేని తడిపిండిని రూపొందించుకున్నారు. బ్యాంకుల నుంచి వివిధ దశల్లో రూ. 50 లక్షల రుణం తీసుకుని చర్లపల్లిలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డా తర్వాత నిలదొక్కుకున్న ఈ సంస్థ.. ఆ తర్వాత ప్రగతిబాట పట్టింది. పిండిని ఇళ్ల దగ్గర కొద్ది మందికి ఇచ్చే స్థాయి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్లకు బల్క్‌గా ఇచ్చే లెవెల్‌కు వీళ్లు ఎదిగారు. ప్రస్తుతానికి రిటైల్ మార్కెట్లోనే రోజుకు 600-700 కిలోల పిండిని సరఫరా చేస్తున్నట్టు చెన్నై చెఫ్ ఎండి ఉమ వివరించారు.
మరింత విస్తృతంగా జనాల్లోకి వెళ్లేందుకు మార్కెటింగ్, బ్రాండింగ్‌పై దృష్టిసారించిన ఈ సంస్థ బోర్డులోకి క్రిష్ణకుమార్,ఉమ కూతురు శృతి కూడా చేరారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యను అభ్యసించిన శృతి మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్, ఆపరేషన్ వ్యవహారాలను చూసుకుంటున్నారు.
ఆరేళ్ల క్రితం అతి తక్కువ వ్యాపారంతో మొదలైన చెన్నై చెఫ్.. ఇప్పుడు మెరుగైన మార్కెట్ వాటాను కైవసం చేసుకుని హైదరాబాద్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరింత వృద్ధిని సాధిస్తున్న క్రమంలో ఆద్యా రెస్టారెంట్స్ (దోశ ప్లేస్) అనే సంస్థ చెన్నై చెఫ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇందులో 91 శాతం వాటాను లెక్కచెప్పని మొత్తానికి కొనుగోలు చేసినట్టు ప్రకటించింది.
'' మా సంస్థను ఆద్యా రెస్టారెంట్స్‌తో విలీనం చేశాం. వాళ్లకు మరింత ఎక్స్‌పోజర్ ఉంది. వాళ్లతో కలిసి మరిన్ని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు చూస్తున్నాం. కొత్త ప్రోడక్టులు తీసుకువచ్చేందుకు ఆర్ అండ్ డి చేస్తున్నాం. తడి పిండి, రెడీ టు ఈట్ ఫుడ్‌కు చాలా మార్కెట్ ఉంది. దాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యం '' - కె. ఉమ, చెన్నైచెఫ్ ఎండి